[box type=’note’ fontsize=’16’] వాడుకలో ఉన్న కొన్ని పదాలకి సరదా నిర్వచనాలిస్తున్నారు రచయితా, కార్టూనిస్ట్ జె. ఎన్. మూర్తి. [/box]
- స్నేహితుడు: సహాయ పడేటప్పుడు ప్రాణ స్నేహితుడు గానూ, ఎంజాయ్ చేసేటప్పుడు పాన స్నేహితుడుగానూ పాత్రలు పోషించేవాడు.
- అప్పిచ్చువాడు: తీసుకున్నవాడి క్షేమం కోరేవాడు.
- అప్పుతీసుకున్నవాడు: ఇచ్చినవాడి కీడు కోరుకునే వాడు(ట).
- ప్రాణం: మనం వున్నప్పుడు దూరంగా ఉంటుంది. పోయినప్పుడుమొహం చూడదు.
- కలలు: తీరందాటకుండా ఆగిపోయే అలలు లాంటివి.
- సొంతకొడుకు: సొంత గొడుగు లాంటివాడు.
- నేటి కోడళ్ళు: అవసరమైనప్పుడు కొరడాలు.
- ఇప్పటి డాక్టర్లు: పల్స్ చూడమంటే పర్స్ వైపు చూసేవారు.
- పూరిల్లు: పూర్ + ఇల్లు
- పర్సనాలిటీ: “పర్సు” నాలిటీ ముందు పనికి రానిది
- ధూమపానం: దుమ్ము పానంచేసే వాళ్ళని చూసి చాలా గ్రేట్‌గా ఫీలయ్యేది.
- కళ్ళడాక్టర్: విద్యావేత్తల చేత కూడా abcd లు చదివించ గలిగే సత్తా వున్నవాడు.
- మేక, పులి: ఒకటి కూర జంతువు, ఇంకొకటి క్రూర జంతువు
- స్త్రీకి, సిగరెట్టుకు ఉన్న పోలిక: ఆస్వాదించటం లేదని తెలిసాక రెండూ ఆరి చల్లగా అయిపోతాయి.
- కేలరీస్: శాలరీస్ ఉంటేనే పెరిగేవి.
- గోల్డ్‌మెడల్స్: ఆడవాళ్ళ మెడలు.
- మంచి: మైకులో చెప్పదగ్గది.
- చెడు: చెవిలో మాత్రమే చెప్పదగ్గది.
- యువతరం: లవ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవాళ్ళు
- ఉద్యోగం: రాకుంటే హృద్రోగం
- వృద్దులు: వ్యర్థులుగా చూడబడేవాళ్ళు
- ఎమోషనల్ బ్లాక్‌మెయిల్: స్త్రీలు పెళ్లి విషయంలోనూ, పురుషులు డబ్బు విషయంలోనూ చేసేది.
- చీమ: నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కాలర్లో దూరి ఏడిపించేది
- మైకులు: అబద్దాలను, నిజాలను ఒకే విధంగా వినిపించేవి.
- అనుభవం: ఉద్యోగానికి కావాల్సింది, పెళ్ళికి అక్కరలేనిది.
- అపార్ట్మెంట్లు: మేడమీద గూళ్ళు
- వ్యక్తిత్వం: అవతలి వ్యక్తుల వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోకపోవడం.
- ఎదుగుదల: ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, ఉన్నతస్థితినుండి మహోన్నత స్థితికి ఎదగడం.
- మరణం: మనిషిని కష్టాల నుండి విముక్తి చేసేది.
- పూర్వ గురువులు: అజ్ఞానులను అంధకారం నుంచి దూరంచేసి వారిలో జ్ఞానజ్యోతిని వెలిగించేవాళ్ళు.
- గుణపాఠాలు: వైఫల్యాల నుండి నేర్చుకునేవి.
- నిజాలు: అబద్ధాన్ని నమ్మినంతగా నమ్మించలేనివి
- పురుషులు: పేరులోనే ఋషులు.
- వార్తాపత్రిక: వార్త అబద్ధం పత్రిక నిజం.
- రాజకీయం: వంశపారంపర్యంగా వచ్చేది.
- దొంగ: తనది కానిది అనుభవించాలనుకునే వాడు.
- కవిత్వం: హృదయాన్ని రసమయంగా స్పందింపచేసేది.
- సేవకుడు: ఒక్కడికి సేవ చేస్తే అనేది…
- నాయకుడు: పదిమందికి సేవ చేస్తే అనేది.
- మతము: బుద్దిని శుద్ధి చేసేది.
- జీవితం: రాజీపడేది.
- భక్తుడు: దేవుడితో బేరాలాడేవాడు
- విమర్శకుడు: అసలు సబ్జెక్టును వదిలేసి వ్రాసిన వాడిని విమర్శించేవాడు.
- దెయ్యం: తెలియని దేవుడికన్నా నయమైనది
- అభివృద్ధి: కొన్ని చోట్ల ఎస్కలేటర్ మీద మరి కొన్ని చోట్ల వెంటిలేటర్ మీద ఉండేది
- కాపీ: ఒక పుస్తకంలోంచి కొడితే గ్రంథచౌర్యం ఎక్కువ పుస్తకాలనుండి కొడితే పరిశోధన
- సాయం: కొందరికి మాట సాయం కావాలి మరి కొందరికి మూట సాయం కావాలి.
- మాతృభాష/పరభాష: మాతృభాష కళ్ళు వంటిది పరభాష కళ్ళజోడు లాంటిది
జె. ఎన్. మూర్తి