Site icon Sanchika

గురుదత్ కథ అతని మిత్రుడు అబ్రర్ ఆల్వీ మాటల్లో TEN YEARS WITH GURU DUTT

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]‘గు[/dropcap]రుదత్’ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. కొందరిపై ఇష్టానికి కారణాలు చెప్పాలంటే భాష సరిపోదు. గురుదత్, సాహిర్ ఈ ఇద్దరి వ్యక్తుల ప్రభావం నాపై చాలా ఉంది అని చాలా సార్లు, చాలా సందర్భాలలో చెప్పాను. ఒక్క ‘ప్యాసా’ సినిమా చాలు గురుదత్ గురించి చెప్పడానికి. కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్న గురుదత్‌ని ప్రపంచం మరణించిన తరువాత గుర్తించింది. అతనిపై కొన్ని బయోగ్రఫీలు వచ్చాయి. కాని అందులో తప్పకుండా చదవాల్సిన పుస్తకం గురుదత్‌తో పది సంవత్సరాలు స్నేహం చేసి అతని జీవితంలో అన్ని కోణాలను చూసి అతను జీవించి ఉన్న ఆఖరి ఘడియల్లో అతనితోఉన్న మిత్రుడు అబ్రర్ అల్వి సహాయంతో రాయబడిన TEN YEARS WITH GURU DUTT ABRAR ALVI’S JOURNERY.  ఈ పుస్తక రచయిత సత్యా సారన్. ఈ పుస్తకం ముందు 2008లో పబ్లిష్ అయింది. తరువాత మళ్ళీ 2011లో పబ్లిష్ అయి మళ్ళీ  2020లో మూడవ సారు ప్రచురించబడిన పుస్తకం ఇది. అంటే ఈ రోజుల్లో కూడా గురుదత్ గురించి తెలుసుకోవలనుకుంటున్న వారు ఉన్నారనే అర్థం. ఈ మూడు ప్రచురణలను సేకరించి మళ్ళీ చదివే నా లాంటి వారు ఇంకా ఉన్నారు అందుకే ఈ బయోగ్రఫీని ఇవాళ సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నాను.

భారతీయ సినిమాలో పాత్రల స్వభావాన్ని బట్టి సంభాషణలు, యాస, ప్రాసలతో రాయడం మొదలయింది గురుదత్ తీసిన ఆర్ పార్ సినిమాతో. అంతకు ముందు సినిమాలలో సంభాషణలన్నీ నాటకీయంగా ఉండేవి. ఆ మూసను పడగొట్టి సినిమా సంభాషణలను సామాన్య మానవుల భాషలో తీసుకువచ్చి ప్రజలకు చేరువ చేసిన దర్శకుడు గురుదత్. అలాగే కాగజ్ కే ఫూల్ భారతదేశంలో వచ్చిన మొదటి  70 mm సినిమా స్కోప్ సినిమా. టైమ్ మాగజిన్ ప్రకటించిన గొప్ప ప్రపంచ సినిమా లిస్టులో చేర్చబడిన భారతీయ సినిమా ప్యాసా. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన మొదటి భారతీయ చిత్రం సాహెబ్ బీవీ ఔర్ గులామ్. ఇంత చేసి గురుదత్ దర్శకత్వం వహించిన సినిమాలు కేవలం ఎనిమిది. అతని పేరు కనిపించే సినిమాలు ఒక ఇరవై మించి ఉండవు. కాని ఈ రోజుకూ గురుదత్ సినిమాల పై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సినిమా ప్రేమికులు అతని దర్శకత్వం గురించి, అతని సినిమాలలోని లైటింగ్, సౌండ్ టెక్నిక్‌ల గురించి, అతని పాటల చిత్రీకరణ గురించీ చెప్పుకుంటూనే ఉంటారు.

మాంగలూర్‌లో కొంకిణీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వసంత్ గురుదత్ పదుకోణే  బొంబాయిలో మొదట ప్రభాత్ స్టూడియోస్‌లో పని చేసారు. అబ్రర్ అల్వి ఈ పుస్తకంలో మొదట గురుదత్‌తో అతని పరిచయం చెప్పుకుంటూ తరువాత తన మీద నమ్మకంతో తనను గురుదత్ రచయితను చేయడం, ఆర్టిస్టుకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి అతనిలోని ప్రతిభను వెలికి తేవడం గురించి చెప్పుకొస్తారు. ఈగోలకు స్వార్థాలకు అతీతంగా ఆర్టిస్టుని గౌరవించి అతనికి క్రియోటివ్ స్పేస్ ఇస్తూ కమర్షియాలిటికి గురుదత్ చాలా దూరంగా ఉండేవారు. తన సినిమాల నిర్మాణంలో ఎటువంటీ కాంప్రమైజ్‌లకు ఒప్పుకోని దర్శకుడు. అందుకే అతనితో పని చేయడం కొందరికి కష్టంగా కూడా ఉండేది. తాను నిర్మించి, దర్శకత్వం వహించి నటిస్తున్న సినిమా కూడా తాను అనుకున్నట్లు రావట్లేదని మధ్యలో వదిలేసి డబ్బు నష్టపోవడానికి సిద్దపడ్డ ఆర్టిస్ట్ అతను. భార్యతో గౌరీ అనే సినిమా మొదలెట్టి తాను అనుకుంటున్నట్లు సినిమా రావట్లేదని దాన్ని కూడ మధ్యలో వదిలేసారట. తాను ఆశించిన ఎఫెక్ట్ రాకపోతే ఎవరున్న సినిమా నయినా మధ్యలో ఒదిలేయటానికి సిద్దపడే ఆర్టిస్టు కాబట్టే అతని సినిమాలు పర్ఫెక్షన్‌కు మారుపేరుగా నిలుస్తాయి.  తనకు సంతృప్తి కలిగించని సినిమాను ప్రేక్షకుల పైన రుద్దడానికి ఎప్పుడూ ఇష్టపడని దర్శకుడు. అబ్రర్ ఆల్వి, రాజ్ ఖోస్లా, వీ. కే మూర్తి, గురుదత్ నమ్మిన వ్యక్తులు. అందరికీ దర్శకులుగా మారడానికి అవకాశం ఇచ్చి తనతో పాటు వారు ఎదుగుదల కోసం పాటు బడిన వ్యక్తి. ఈ పుస్తకంలో గురుదత్ పని తీరు, ప్రతి సీన్‌లో పర్‌ఫెక్షన్ కోసం అతని తాపత్రయం, తనకు కావల్సిన ఎఫెక్టు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడని అతని నైజమ్ గురించి అబ్రర్ చెప్పుకొస్తారు.

అబ్రర్‌కి తెలిసిన ఒక వేశ్య గులాబో. ఆమె మరణించిన తరువాత ఆమె వ్యక్తిత్వంతో ప్రభావితమై ఉన్న అబ్రర్ ప్యాసా సినిమా కథ కోసం గులాబో పాత్రను సృష్టించారు. ప్యాసా సినిమాకు సాహిర్, గురుదత్ ఇద్దరు ఆత్మలు. సాహిర్ కవిత్వం, గురుదత్ దర్శకత్వం ఆ సినిమాను ఒక మాస్టర్ పీస్‌గా మలచాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా ఈ సినిమా నిలిచే ఉంటుంది అనడానికి ఈ మధ్య కాలంలో గురుదత్ గురించి వస్తున్న వ్యాసాలు నిదర్శనం. జీవితంలో ప్రేమ కోసం నిరంతరం తపించిన గురుదత్ వైవాహిక జీవితంలో అసంతృప్తి, తరువాత వహిదాతో అతని స్నేహం, అది తన వివాహ బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని ఆ స్నేహాన్ని వదిలి పెట్టి ఒంటరితనంతో బాధపడిన అతనిలోని సున్నిత మనస్కుడు ఈ పుస్తకంలో కనిపిస్తాడు. తన భర్త తన చేతి నుండి జారిపోతాడని గీతాదత్ చూపిన అభద్రతా భావం వీరి మధ్య దూరం పెంచితే, గీతాదత్ హై సొసైటీ స్నేహితులు కూడా ఆ భార్యాభర్తల మధ్య దూరానికి కారణం అయ్యారు. చివరికి ఇద్దరి జీవితాలు కూడా విషాదంగానే ముగిసాయి.

అబ్రర్ అల్వీ గురుదత్‌ని కలవక ముందు పెద్దగా రచనలేమీ చేయలేదు. కాని అతని చదువు, కథా రచన పట్ల కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు గురుదత్‌ను కదిలించాయి. అప్పటి గొప్ప రచయితలైన మజరూహ్, బేడీలతో సమానంగా అబ్రర్‌ని గురుదత్ గౌరవించి అతనితో ఆర్ పార్ సినిమాకు సంభాషణలు రాయించుకున్నాడు. అతనిలో శ్రమించే గుణాన్ని, నిజాయితీని గుర్తించి అతనితో అన్ని సినిమాలకు పని చేయించుకున్నాడు. గురుదత్ మరణం తరువాత అబ్రర్‌లో రచయిత కూడ మరణించాడు. సాహబ్ బీవి ఔర్ గులామ్ సినిమాకు పూర్తిగా తానే దర్శకత్వం వహించానని , కేవలం పాటలకు మాత్రమే గురుదత్ దర్శకత్వం వహించారని అయినా తనకు పూర్తి స్థాయి దర్శకుడిగా ఎవరూ గుర్తించలేదని అబ్రర్ ఆవేదన. గురుదత్ బ్రతికి ఉన్నన్ని రోజులు తనకు లభించిన గౌరవం తరువాత ఇప్పుడు సాహెబ్ బీవి ఔర్ గులామ్‌ను క్లాసిక్‌గా గుర్తిస్తున్న కొత్త తరం ఆ సినిమాను పూర్తిగా గురుదత్ ఖాతాలో చేర్చడం, నిజం తెలిసిన వారు కూడా నోరు విప్పక పోవడం పై అతనికి ఒక అర్టిస్టుగా చాలా బాధ ఉంది. అయినా అది సిని మాయాలోకం నైజం గా చూస్తారే తప్ప ఈ లోకంలో లేని తన మిత్రునిపై నింద వేయరు. ఒక ఆర్టిస్టుగా తాను చేసిన పనికి తనకు గుర్తింపు రాలేదన్న బాధను ఈ పుస్తకంలో ప్రకటిస్తారు అబ్రర్.

గురుదత్ జీవితంలోని ఆఖరి ఘడియలను వర్ణిస్తూ అంతకు ముందు రెండు సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసిన గురుదత్ ఆ రోజు మరణిస్తాడని తనకు తెలిస్తే అతన్ని వదిలి వెళ్ళీవాడినే కానని చెప్పి బాధపడతారు. కాని తన మిత్రుడు ప్రాణాలను ఎలా వదలాలో చాలా సార్లు తనతో చర్చించారని, తనతో చెప్పిన విధంగానే మాత్రలను తీసుకుని చనిపోయాడని, అది తనకు ఆశ్చర్యం కలిగించకపోగా అంతులేని ఆవేదనను మిగిలించిందని, గురుదత్‌తో తనకున్న అనుబంధం అతని మరణం ఆలానే జరుగుతుంది అన్న నిజాన్ని ఒప్పుకునేలా చేసింది అన్న ఆవేదన వారి మాటలలో కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అంతులేని నిజాయితీ ఆశించి, డబ్బు, సక్సెస్ కన్నా మనిషిని మనిషిలా చూడగలెగే ప్రపంచం కోసం తపించి అది దొరకదని తెలిసి నిరాశతో జీవితాన్ని ముగించుకున్న గురుదత్ ఒక సున్నితమైన ఆర్టిస్టుగా ఈ ప్రపంచం మిగిల్చిన నిరాశను స్వీకరించలేకపోయినట్లు అబ్రర్ చెప్పిన విషయాలతో అర్థం అవుతుంది. ఈ పుస్తకం గురుదత్‌ను ఒక వ్యక్తిగా, ఒక ఆర్టిస్టుగా ఒక దర్శకుడిగా పని చేస్తూ, అతనిలోని కళాతృష్ణను తెలియపరుస్తుంది. గురుదత్‌ను ప్రేమించే వారందరికీ చేరవలసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో ప్రతి అద్యాయం గురుదత్ సినిమాలలోని పాటలలోని వాక్యాలతో మొదలవుతూ ఒక్కసారి గురుదత్ సినిమాలన్నిటినీ పరిచయం చేస్తుంది.

Exit mobile version