తెనాలి రామకృష్ణుని కవిత్వ వైచిత్రి

6
3

పద్య(శైలి)వైచిత్రి
ఈ ఘట్టంలో తెనాలి కవి పద్యాన్ని చూద్దాం.
సీ.
రాజాలయమునకు రాకపోకలుసేయు
          మాసిన చదువులు మరలఁ జదువు
నిన్నాళ్ళ నెచ్చెలు లెదురైనఁ దలవంచు
          కులవధూరత్నంబుఁ గుస్తరించు
నాచార్యజనముఁ బ్రత్యహము సంభావించు
          నర్చావళికి నుపహారమిచ్చు
నర్చించుఁ గుతపవేళాగతాతిథికోటిఁ
          బసినేదు దర్శించుఁ బైరుపచ్చఁ
గీ.
దండ్రి యుద్గమనీయంబుఁ దానె యుదుకు,
నత్తికాభర్తతో నవ్వు నల్పసరణి
గ్రామకార్యంబుఁ దీర్చు నంగడికి వచ్చి,
……………………………………………
(పా. 3.46)
తా: నిగమశర్మ అక్కమాటలు విన్నాడు. ఆపై ఆతడి ప్రవర్తన ఇలా ఉంది.

దివాణానికి వెళ్ళి పనులు చూస్తున్నాడు. మరచిపోయిన శాస్త్రాధ్యయనం తిరిగి మొదలెట్టినాడు. తనకు అదివరకు తెలిసిన నెచ్చెలులు ఎదురైతే తలవంచుకుని పక్కకు వెళుతున్నాడు. భార్యను ఊరడిస్తున్నాడు. గురువులను ప్రతిపొద్దూ గౌరవిస్తున్నాడు. పూజగదిలో నైవేద్యాలు పెడుతున్నాడు. మధ్యాహ్నం ఆకలిబారిని పడి వచ్చిన అతిథులను గమనించుకొంటున్నాడు. పశువుల ఆలనా పాలనా, గడ్డిగాదె పనులు చూస్తున్నాడు. నాన్న ధోవతిని ఉతుకుతున్నాడు. బావతో అప్పుడప్పుడూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. రచ్చపట్టులో గ్రామ సమస్యలలో తలదూరుస్తున్నాడు……..

ఇంతా చెప్పిన తర్వాత సీసపద్యం చిట్టచివరి పాదాన – ఇలా అంటాడు కవి.
తేనె పూసిన కత్తి ధాత్రీసురుండు.”

పద్యంలో చిట్టచివరి పాదం ద్వారా పద్యం తాత్పర్యం మొత్తాన్ని విషమంగా మార్చాడు రామకృష్ణుడు. పాఠకుడికి అతడు నిజంగానే, తన దుర్లక్షణాలను వదిలించుకుని, మారిపోయినట్లు ఆతని కార్యాల ద్వారా సుదీర్ఘమైన వివరణ యిచ్చి, చిట్టచివరన మొత్తంగా విరుద్ధమైన అర్థాన్ని చెబుతున్నాడు. నిగమశర్మ తాలూకు మొత్తం కాపట్యాన్ని దర్శింపజేస్తాడు. పాఠకుడికి కథ చెబుతూ చెబుతూ ఓ మారు సాచి లెంపకాయ కొట్టినట్టు ఉంటుంది ఈ వ్యవహారం.

ఇది విలక్షణత్వం. ఇటువంటి పద్ధతిలో ఒక పాత్రను నిర్మించి ఆతని స్వభావాన్ని ఉద్యోతించటం – కావ్యాలలో చాలా అరుదు.
(పద్యం మొత్తంగా – స్వభావోక్తి అలంకారం. )

పాత్రకు సంబంధించి కాకపోయినా, సీసపద్యాన్ని తుదివరకు నిర్వహించి చిట్టచివరన పూర్తీగా వ్యతిరేకార్థాన్ని ప్రతిపాదించే పద్యాలను ఈ కవి రచించినాడు. ఉద్భటారాధ్యచరిత్రంలో ఈ పద్యం గమనించండి.

సీ.
వకుళపున్నాగ చంపకపాటలావనీ
          రుహవాటికలఁ గలవిహరణంబు
కలహంసకులపక్షచలితవీచీఘటా
          కులసరోహముల జలకమాట
అమృతనిష్యందమోహన చంద్రికా ధౌత
          మానితహర్మ్యంబులోని యునికి
కమలరాగోపలఘటితనూతనకేళి
          శైలికూటములపై వ్రాలుకడఁక
గీ.
విరులు సొమ్ములు పూఁత లంబరము లమిత
భక్ష్యభోజ్యాదు లొనరిన పనులకెల్ల
నింపు సమకొల్పు తన వల్పు నిందువదనఁ
గలసి వర్తింపలేకున్న నిలువు సున్న.
(ఉ. 2.175)
తా: పొగడ, పున్నాగ, సంపెంగ, కలిగొట్టు – వంటి పువ్వులు పూచిన తోటలో స్వేచ్ఛా విహారము;
రాయంచల రెక్కలతో రేగిన అలలు కలిగిన చక్కని సరోవరాలలో జలకాలాట;

అమృతము స్రవించు మన్మథుని బాణము వలే ప్రకాశించు వెన్నెలతో అలంకరింపబడిన పాలరాతి మేడలో నివాసము; (సూర్యుని కిరణములు జాలువారుచూ , ఇంపైన చంద్రుని వెన్నెలతో కూడిన తెల్లని పాలరాతి మేడలో నివాసము;)

తామరపువ్వు వలె ఎఱ్ఱనైన ఱాలు (పద్మరాగమణులను పోలినవి) కలిగిన నవ్యమైన కొండగుట్టలలో నడయాడే ప్రయత్నము;
పూలు, సొమ్ములు, మైపూతలు, చక్కని దుస్తులు, పంచభక్ష్యపరమాన్నాలు;
పై వన్నీ సమకూరిన దానికన్నా;
తనకు అనుగుణంగా నడుచుకునే ప్రియమైన వలపుకత్తెను కలిసి క్రీడించటం మెఱుగు. ఈ క్రీడ లేకపోతే పైన చెప్పిన “చిట్టా” అంతా నిలువు సున్న తో సమానము. ఇది విషమాలంకారం.

ఇలాంటి భావానికి సమాంతరంగా ప్రసిద్ధమైన పోతన పద్యం ఉన్నది. “మందార మాధుర్య మకరందమున” – ఈ పద్యానికి, రామకృష్ణుని పద్యానికి మధ్య శైలి భేదం గమనార్హం.

(అమృతము = ఒకానొక సూర్యకిరణము.,ఉపల = ఱాయి., కడఁక = యత్నము.)

అంత జాబితా చెప్పి, చిట్టచివరన ఆ చిట్టా అంతా చెలికత్తెతో విహారం లేనిదే నిలువు సున్న అని తేల్చి పారేస్తాడు కవి. “చెలికత్తె లేనిదే అంతా వ్యర్థం” అని చెప్పడానికి ఆ చిట్టా ఎందుకు? ఇక్కడే రామకృష్ణకవి సహృదయునిలో ఆలోచనలు రేకెత్తిస్తాడు. పద్యంలో చెప్పిన “లిస్టులోని సరంజామా” అంతా భౌతికమైనది, ప్రాపంచిక సౌఖ్యాలకు చెందినదీనూ. ఆ ప్రాపంచిక సుఖాలలోకి – ఇంపైన చెలికత్తెతో పొందు ఉత్తమమైనదని “మదాలసుడు” భావిస్తాడు. దరిమిలా ఈ భౌతిక సుఖాలకు వ్యతిరిక్తమైన సుఖమో, శాంతియో మరొకటున్నదని పరోక్షంగా కవి సూచిస్తున్నట్టు ఓ భావం ఏర్పడుతున్నది. మదాలసుడనే పేరు కూడా గమనార్హం. (మదాలసుడు = మాత్సర్యము చేత ఉన్మత్తుడైనవాడు).

ఉద్భటారాధ్య చరిత్రము లోనే కాశీని, గంగను గురించి కవి వ్రాసిన పద్యాలలో కొంత హాస్య ధోరణి కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
గీ.
తనకుఁ బలె స్వచ్ఛమై యొప్పు తనువొసంగి
తనదు నొక పాయ మల్లెపూదండఁ జేసి
వాని సిగ నిడు దేహావసాన వేళ
స్నాతపైఁ గాశి గంగ కెంత కనికరమొ. (ఉ. 2.92)

తా: కాశీలో గంగలో స్నానం చేసినవాడి యొక్క దేహావసాన సమయంలో, గంగ తనవలే స్వచ్ఛమైన తనువును అతనికి ఇస్తుందట. తన పాయను ఒకదాన్ని మల్లెపూదండగా చేసి వాడి సిగలో తురుముతుందట. స్నాతపై కాశి గంగకు ఎంత కనికరమో!” అని కవి తీర్పు. చివరి పాదం – సాభిప్రాయమో, వ్యంగ్యమో అర్థమవదు.

గీ.
కాశిలోఁ బట్టతలవాఁడు గంగ మునిఁగి
జడముడి ధరించు దానిపై సవదరించు
ఫణిఫణారత్నరుచి దానిపై వహించు
మొలక జాబిలి జాజిపూ మొగ్గ వోలె. (ఉ. 2.94)

తా: ఓ బట్టతల వాడు కాశీలోని గంగలో మునిగితే, ఆతనికి నిడుపాటి జడ వస్తుంది. ఆ జడపై ఆతడు కాంతులు చిందే మణులను ధరిస్తాడు. (ఫణిఫణారత్నరుచి = పాము పడగపై ఉన్న మణి యొక్క కాంతి). దానిపై అతడు మొలక జాబిలి ని జాజిపువ్వు మొగ్గలా ధరిస్తాడు. (అనగా ఈశ్వరుడై పోతాడు.)

ఇక్కడ బట్టతలవాని ప్రసక్తి కొంటెతనంగానే అగుపిస్తుంది.
గీ.
ఈ భవమ్మున ఫలమున కేమి గాని
రాఁగల భవమ్ము మొదలంట రాచినాఁడు
గంగలో వారణాసి మునుంగువాఁడు
తొంటి భవమునఁ బుణ్యంబుఁ దొడికినాఁడు. (ఉ. 2.96)

తా: కాశీలో, గంగా, వారణ, అసి నదులలో మునిగినవాడు, ఈ జన్మంలో చేసిన కర్మలకు ఫలం అనుభవించినా అనుభవింపకపోయినా, రాబోయే జన్మలో పాపాన్ని మాత్రం మొదలంటా రాచివేసినాడు. మొదటి జన్మలోనే పుణ్యము సంపాదించుకున్నాడు.

తెనాలి వాని కవిత్వంలో విలక్షణత్వానికి, వికటత్వానికి మరింత స్పష్టమైన ఉదాహరణ పాండురంగ మహాత్మ్యములోని క్రింది పద్యం. పుండరీకుడనే భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షమయినాడు. ఆ సందర్భాన పుండరీకుడు భగవంతుని దశావతారాలను ప్రస్తుతిస్తున్నాడు. అందులో బుద్ధావతారపు వర్ణన యిది.

.
ప్రతిదిన కేశలుంచనపు రాయిడి నెట్టన బట్టకట్టి పైఁ
బుతపుత మంచు నున్న కుఱుబోడతలన్ ధరియింప నోడియున్
సతమగు సొమ్ము గాన విడజాలవుగా శిఖిపింఛవల్లి సౌ
గతమతధుర్య! దానిఁ గటిఁ గట్టుము పుట్టము మిన్న కేటికిన్.

తా: ప్రతిదినము శిరోజములను పీకివేయుటవలన పుతపుతలాడే బోడితలపై నెమలిపింఛము ధరించటం కుదరదు కదా! కానీ ఆ నెమలిపింఛము నీకు తప్పనిసరి ఆభరణం. దాన్ని విడువటం కుదరదు. కాబట్టి ఆ నెమలిపింఛాన్ని తలపై కాకుండా, నడుమున నున్న వస్త్రము బదులుగా ధరించుము.

బౌద్ధపరివ్రాజకులకు (ఒక శాఖ వారికి) మస్కలి, మక్ఖలి, మస్కరి అని పేర్లు. వారు నెమలిపింఛాన్ని ధరిస్తారు. ఆ ధారణను తెనాలి రామకృష్ణుడు వాడుకొన్నాడు.

ఈ వర్ణన వికటం. తనకు ప్రత్యక్షమైన భగవంతుణ్ణి గురించి భక్తుడే ఇలా పరిహాసం చెయ్యటం విపరీతం. ఈ ధోరణి కొంత నాచన సోమునిలో ఉన్నది. నాచన సోముని ఉత్తర హరివంశములోని ఈ వర్ణన చూడండి. నరకాసురుడు తన సైన్యంతో సహా, మహర్షుల ఆశ్రమాలపై దాడి చేసి వారిని బాధిస్తున్నాడు. ఆ సందర్భాన వారి అవస్థ యిలా ఉంది.

సీ.
….
జన్నిదంబులు కాలిసంకెల లై పడ్డఁ
          దెగఁ దన్ని మిన్నక తిరుగువారు;
ముందటి దిక్కూడి మొలత్రాడుఁ దవిలిన
          తోకగోచుల వెంటఁ దూలువారు;
…..
….
వల్కలంబులు దోఁచిన వంగు వారు

(.– 1.102)

పై పద్యంలో – మహర్షుల అవస్థ వర్ణించాడు. మహర్షుల గోచీలలో, మొలత్రాడుకు తగిలించుకున్న ముందరిభాగం ఊడింది. అలా ఊడిన గోచీ వెనుకభాగాన తోకలా వ్రేలాడుతోంది. వారి గోప్యభాగాలను దాచుకోలేక తూలుతున్నారు. అసురులు తమ వల్కలాలను లాగేస్తుంటే, నగ్నత్వాన్ని దాచుకోలేక వంగుతున్నారు.

ఈ పద్యం అశ్లీలమని రాళ్ళపల్లి వారు విమర్శించారు. నాచన సోమన వర్ణనల్లో పరిహాసానికి కొంత అశ్లీలం తోడయితే, రామకృష్ణుని విషయంలో మాత్రం పరిహాసమే ప్రధానమయింది.

****

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here