తెనాలి రామకృష్ణుని కవిత్వ వైచిత్రి

6
4

పక్కదారి నుంచి మళ్ళీ రహదారికి వద్దాం.

****

స్వభావచిత్రణ (శిల్ప) వైచిత్రి.

ఇలా నిగమశర్మ అక్క సుద్దులు చెప్పిన తర్వాత మారిపోయినట్టు నటిస్తూ, అదను చూచి ఓ నాటి రాత్రి, సొమ్ములు మొత్తం అపహరించాడు. ఆ సొమ్ముల చిట్టా పెద్దదే.

సీ.
గోమేధికాపలాంకుర మానితంబులు
          పుష్యరాగచ్ఛటాపుంఖితములు;
వైఢూర్యసంధాన వర్ణనీయంబులు
          హరినీలకీలనాభ్యంచితములు;
కురువిందసందర్భగురుతరంబులు
          చతుర్విధవజ్రదళసమావేలితములు;
మహనీయతర హరిన్మణి పరీతంబులు
          నకలుష స్థూలమౌక్తికయుతములు;
గీ.
పద్మరాగపరీరంభభాస్వరములు,
దంతవిద్రుమకృత సముద్గక భృతములు
మాతృభూషలు నత్తికా మండనములు
నిజయువతి దాల్చు సొమ్ములన్నియు హరించి.
(పా. 3.38)

ఈ జాబితా నవరత్నాలది. సాధారణంగా ఆస్తుల వివరాలు కథ ఆరంభంలో చెప్పటం కథా సంవిధానంలోని “డీఫాల్టు” ప్రక్రియ. తెనాలి రామకృష్ణునికి ఆ అవసరం పట్టలేదు. కథ మంచి రసపట్టులో ఉండగా – కథానాయకుడు దొంగిలించిన సొమ్ముల చిట్టా చదువుతాడు కవి. నిజానికి ఆ సొమ్ములే కాదు. నిగమశర్మ దొంగిలించిన సొమ్ములు మరిన్ని. (ఇది తర్వాతి పద్యంలో తెలుస్తుంది. ఆ పద్యం ద్వారా కూడా పాఠకుడు, నిగమశర్మ చోరకౌశలాన్ని కొంత ఊహించుకోవలె.)

కథానిర్వహణలో ఒక ఘట్టాన్ని సుదీర్ఘంగా, మరొక ఉదంతాన్ని క్లుప్తంగా నిర్వహించటం – అల్లసాని పెద్దన మనుచరిత్రలోనూ ఉంది. మనుచరిత్రలో చిట్టచివరన స్వారోచిషుని ఉదంతం చాలా తొందరగా గడిచిపోతుంది. అయితే తెనాలి రామకృష్ణుని కవిత్వంలో ఈ ఛాయలు ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకచోట నిడుపాటి వర్ణన, మరొక చోట క్లుప్తంగా కథ చెబుతూ వెళ్ళిపోవడం – కవి రచనలో సకృత్తుగా కనిపించే అంశాలు.

ఆ నవరత్నాలను, ఆ పద్యంలో చిట్టచివరన పేర్కొన్న భార్య సొమ్ములు కూడా మూటగట్టి, నిగమశర్మ “ఒకనాటి రాత్రి పడుకున్న పడుకకు చెప్పక” ఊరు దాటి, ఉడాయించినాడు.

అప్పుడు ఇంట్లో వాళ్లందరూ దుఃఖ పూరితులయినారు. (ఇక్కడ కవి తన కంటితో ఆ దృశ్యాన్ని చూచి వర్ణిస్తున్నట్టు భావించవలె.)
సీ.
శోకించు వృద్ధభూసురుఁ డాత్మ పితృదత్త
          దర్భముద్రికకుఁ జిత్తంబు గలఁగి
నత్తగా రిచ్చిన హరిసుదర్శనపుఁబే
          రునకు ముత్తయిదువ వనటఁ బొందుఁ
గ్రొత్తగాఁ జేయించు కొన్న ముక్కరకు
          నై యడలు దుర్వారయై యాఁడు బిడ్డ
జామాత వెతఁబొందు వ్యామోహియై నవ
          గ్రహకర్ణ వేష్టన భ్రంశమునకు
గీ.
నెంత దుర్బుద్ధి యెంత దుర్భ్రాంతి యహహ!
సర్వధనములు నద్దురాచారశీలుఁ
డూచ ముట్టుగ నిలుదోఁచి యుఱికి చనుట
యెఱుఁగరో గాక నవ్వేళ యెఱుక గలదె!
(పా. 3.50)
నిగమశర్మ ఇంటినుంచి సొమ్ములతో పారిపోగా, ఇంట్లో వాళ్ళు దుఃఖిస్తున్నారు. ఎందుకు?

తా: మా నాయన ఇచ్చిన బంగారు పవిత్రం పోయిందే, అని చిత్తము కకావికలై వయసు మీరిన తండ్రి యేడుపు. మెట్టినింటివాళ్ళు చేయించిన ముత్యాలదండ ఎత్తుకుపోయాడే అని ముత్తయిదువ (అమ్మ) శోకము. ఈ మధ్యనే చేయించిన ముక్కుపుడక కోసం తట్టుకోలేక కుమిలిపోతోంది ఇంటి ఆడుబిడ్డ (నిగమశర్మ అక్క). తొమ్మిది రకాల రాళ్ళు పొదిగిన చెవిపోగు పోయిందని వ్యామోహంతో ఇంటల్లుడి (నిగమశర్మ బావ) పరితాపం.

ఎంత దుర్బుద్ధి! ఎంత దుర్భ్రాంతి! అహహ! అని కవి నవ్వు. మొత్తం సొమ్ములన్నీ ఏ మాత్రం ఒక్కటీ మిగల్చకుండా ఆ దురాచారశీలుడు దోచేసుకుని పోవడం ఊహించలేదా, లేదా లేక ఆ ఎఱుక లేదా!

(ఆత్మ పితృదత్త దర్భముద్రిక – తండ్రి చేయించిన బంగారు పవిత్రము. రాయలసీమ మాండలికం లో దీన్ని “కూర్చి” అని అంటారు. నిత్యనైమిత్తిక కర్మాచరణ కోసం ఆత్మీయులకు, గురువులకు, పురోహితులకు ఇలా కనకంతో పవిత్రం చేయించి దానం చేయటం ఒక ఆచారం. ఈ ఆచారం రాయలసీమలో ఇప్పటికీ ఉంది. ఇది ఆభరణం. ఆభరణం కాబట్టే నిగమశర్మ దీన్ని దోచినాడు.)

ఈ సందర్భాన పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాఖ్యానం రమణీయం.

ఇంతటి చిక్కని హాస్యము మన కావ్యముల యందుఁ జాల యఱుదు. వారి ప్రవర్తనములను జూచి రామలింగడు “ఎంత దుర్బుద్ధి! యెంత దుర్భ్రాంతి! యహహ! యని నవ్వుచున్నాడు. ఈ నవ్వు నవ్వుకాదు. ఆ పాత్రల నాతఁడు పొడుచు బాకుపోటులు. ఆ మాటలతో నాతడు వారిని వెక్కిరించుచున్నాడు. వారి బుద్ధి దుర్బుద్ధియట! వారి భ్రాంతి దుర్భ్రాంతియట! దుర్బుద్ధి యెందున్నది? – సర్వనాశనమైనందు కేడ్వక తమతమ వస్తువులకై కుందుటలో నున్నది. దుర్భ్రాంతి యెందున్నది? అల్పవస్తువుల మీది యభిమానముతో దమ సర్వనాశమును గుర్తింప లేకపోవుటలో నున్నది.

ఈ హాస్యముత్తమము. …ఈ దుర్బుద్ధి, దుర్భ్రాంతులీ పాత్రలకు మాత్రమే యున్నవా? లోకమున నందరికి నున్నవి. దేశకాలభేదము లేక యందరు మానవులకు నిట్టి అల్పగుణములు సహజములు.”

తెనాలి రామకృష్ణుని వికటత్వానికి, ఆయన సూక్ష్మ మనస్తత్వపరిశీలనకు, లోకంలో మనుషుల లౌల్యపు చిత్రీకరణకు, ఈ పద్యం మచ్చుతునక. ఆయన చెప్పదలుచుకున్న భౌతిక విలువల నశ్వరత్వానికి ఇది పరాకాష్ట!

నిజానికి ఓ తల్లి కూడా – కన్నకొడుకు కోసం కాక, ముత్యాలదండ కోసం ఏడుస్తుందా? అన్నది పాఠకుడు ఊహకు అందని విషయం. “కుపుత్రో జాయేత, క్వచిదపి కుమాతా న భవతి” (చెడ్డ కొడుకు ఉంటాడు కానీ, ఎక్కడా చెడ్డ తల్లి ఉండదు) అని కదా, ఆదిశంకరులు ఉటంకించినది!

అయితే ఇందాక రాళ్ళపల్లి వారి రచనలోని ఉటంకింపు లో చెప్పినట్టు – సంపూర్ణ వస్తు నిర్మాణమునకు అతనియందు లేనిది నేర్పుగాదు, ఓర్పు.” రామకృష్ణకవి – చెప్పదలుచుకున్నది అమ్మ (తనం) లోని దుష్టత్వాన్ని కాదు, మానవ సహజమైన మానసిక దౌర్బల్యాన్ని, సుఖలాలసను. ఇది స్పష్టంగా చెప్పక, ఓ సన్నివేశాన్ని సృష్టించి, ఆ సన్నివేశంలో పాఠకుణ్ణి నిమగ్నం చేసి, ఆతడు లీనమైన క్షణాన సాచి లెంపకాయ కొట్టటం ఈయన పద్ధతి.

రాళ్ళపల్లి వారి వ్యాసం లంకె యిది.

ఆ వ్యాసం చివరన పరిహాసము పవిత్రవస్తువును కూడా గమనింపదేమో!” అని రాళ్ళపల్లి వారన్నారు. (అయితే ఆడుబిడ్డ – ముక్కెర కోసం ఏడవలేదని, తన సౌభాగ్యచిహ్నమైన ముక్కెర పోయింది కాబట్టి, ఆ వేదనతో ఏడ్చిందని వేదాల వేంగళాచార్యులు అనే విమర్శకులు నిరూపించే ప్రయత్నం చేశారట. కానీ అది అంత తర్కానికి నిలువదని ఇతరులు పేర్కొన్నారు.)

గమనార్హమేమంటే – నిలువునా (తమ) సొమ్ములన్నీ నిగమశర్మ దోచిపెట్టేశాడు కాబట్టి దురాచారపరుడైనాడు. అంటే – అయిన వారికి కావలసినది అతడు నిజంగా అనాచారవర్తనుడై, దురాచారపరుడవటం కాదు, తమ ప్రతిష్ఠకు, కీర్తికి, సొమ్ములకు ఆపత్తి వచ్చినప్పుడు ఎదుటి వాడు నిజంగా పరమ దురాచారవర్తనుడు అని కవి సూచిస్తున్నట్టు ఉన్నది. ఇదీ రామకృష్ణుడు ప్రదర్శించిన లోకపు తీరు!

ఈ ఘట్టాన్ని, పద్యాన్ని – ఆలంకారికంగా కూడా చూడాలి. పైని పద్యం – హాస్య రసావిష్కరణకు చక్కని, చిక్కని ఉదాహరణ. హాస్యరసం హాస స్థాయీభావాత్మకము. ఇక్కడ లౌల్యము విభావం. లౌల్యము – అంటే విషయములలో అనియతత్వము. (ఒకే విధమైన ప్రాధాన్యత లేని తత్వము). శోకంతో జనించిన స్వేదము మొదలైనవి (శోకంబు, అడలు, వనటఁబొందు) అనుభావములు. మోహము (వ్యామోహియై, చిత్తంబు చెలగి, దుర్వారయై ) – వ్యభిచరీభావం. హాస్యంలో ఆత్మస్థ, పరస్థ అని రెండు రకాలు. ఇక్కడ ఆత్మస్థము. కారణం ప్రత్యక్షమైతే ఆత్మస్థము (అభినవగుప్తుడు). హాసము 6 విధాలని భరతముని. స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అపహసితము, అతిహసితము – ఈ ఆరుభేదాలు. ఇందులో ఈ పద్యాన ఉన్నది అపహసితము. అపహసితము అన్నది అస్థానహసితము – అంటే అనువు కాని చోట, శోకవిషయములలో వచ్చునది. హాస్యరసం స్త్రీలలోనూ, సామాన్యపాత్రలలోనూ ఈ హాస్య రసం కద్దు. ’స్త్రీనీచప్రకృతావేషం భూయిష్ఠం దృశ్యతో రసః’ – అని భరతుడు. ఇక్కడ నీచ శబ్దానికి – కావ్యంలో అప్రధానమైన, సాధారణమైన పాత్ర అని అర్థం.

రామకృష్ణుడు రచించిన మరొక కావ్యం “ఘటికాచల మహాత్మ్యము”. ఆ కావ్యంలో కూడా రామకృష్ణుని ఒకానొక అనౌచిత్యఘట్టాన్ని గూర్చి కేతవరపు రామకోటిశాస్త్రి అనే విమర్శకులు ఇలా అంటారు.

శతశృంగమున తపమాచరించు సప్తర్షులకు భంగపాటొనరించుటకు నింద్రుడు రంభా మేనకాద్యప్సరసలను పంపినాడు. అప్సరల ప్రయత్నము వృథాయైనది. ఈ వ్యర్థప్రయత్నమంతయు 77 గద్యపద్యములలో వర్ణితము. ఇంత దీర్ఘముగా వర్ణించి కవి సాధించిన ప్రయోజనము లేదు…”

****

మరొకసారి మెయిన్ ట్రాక్ కు.

****

(ఉపాఖ్యానపు) మూలతత్వపు వైచిత్రి.

అడవిని పడి పోతున్న నిగమశర్మను దొంగలు ఆటకాయించి, ఛావగొట్టి సొమ్ములు మొత్తాన్ని దోచుకున్నారు. కదలలేక పడి ఉన్న అతణ్ణి ఒక కాపు రక్షించి తన యింటికి తీసుకెళ్ళినాడు. ఆ ఇంటివారి పరిచర్యలతో నిగమశర్మ మెల్లగా కోలుకున్నాడు. ఆ ఇంటి కోడలు నిగమశర్మపై మరులు గొన్నది. ఆ ఇంటి వారి వల్లనే తాను కోలుకున్నా, కృతఘ్నుడై, ఆ కోడలైన కాపు పడతిని నిగమశర్మ ఒకనాడు లేవదీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన నిగమశర్మ బోయజాతితో కూడి కిరాతుడై, వేటాడి ఆహారం సంపాదించసాగినాడు. కొన్నాళ్ళకా కాపు అమ్మాయి మరణించింది. పిదప నిగమశర్మ మరొక బోయయువతిని పెళ్ళాడి, ఆమెతో బిడ్డలను కూడా కన్నాడు. ఓ నాడు నిగమశర్మ వేటకు వెళ్ళి వచ్చే సమయానికి ఆతని గుడిసె మంటల్లో చిక్కుకున్నది. ఆతని భార్యాబిడ్డలు మరణించినారు. ఆ ఘటనకు పిచ్చివాడైపోయినాడు నిగమశర్మ.

’ఇలన్ చతికిలబడి పలుమఱు తల దోర్చుచు వికృతమగు వదనమున లాలాజలములు తీగెలు సాగగా’ – ఆతడు ఆలిని గూర్చి పరిపరివిధాలుగా దీనాతిదీనంగా తలపోశాడు. నిద్రాహారాలు మానేసి పరిభ్రమించసాగినాడు. ఇలా తిరుగుతూ చివరకు ఒకానొక నరసింహక్షేత్రంలో వచ్చి పడినాడు.

ఈ సందర్భాన తెలుగు సాహిత్యంలో ఒక అపూర్వమైన సీసపద్యాన్ని తెనాలి రామకృష్ణకవి రచించినాడు.
తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన సీసపద్యం.
సీ.
ఒక యింత ఱెప్పవేయక చూచుఁ బెఱవారిఁ
          దలకొట్టుకొని దుఃఖజలధి మునుఁగు
బిలము తెఱువుమంచు బృథివిలోఁ జొరఁబాఱు
          సమధికస్తంభోద్భవము గమించుఁ
దిరియువాఁడును బోలె దెసలకుఁ జెయి చాఁచుఁ
          దొరఁగు నస్రాంబుధి దొప్పదోఁగు
హా! పోయితే యనియఱచు భార్యగుఱించి
          బహువిధిరాసక్తి భ్రాంతిఁ బొందుఁ
గీ.
జేరఁగారాని దర్శనస్థితి వహించు,
బాడబస్ఫూర్తి లోఁగొన్న పగిదినుండు
దానవారాతి కాఁబూని తదవతార
దశకమును మున్నె తాల్చెనా ధరణిసురుఁడు.
(పా. 3.102)
ఈ పద్యంలో నిగమశర్మ చేష్టలను విష్ణువు యొక్క దశావతారాలతో కవి పోల్చినాడు.
బ్రాహ్మణుడైన నిగమశర్మ విష్ణువు రూపును పొందదలచి, ఆ అవతార దశకాన్ని తాల్చెనా అన్నట్టు ఉన్నాడు. ఆతని చేష్టలు ఇవి.
కొంచెం కూడా ఱెప్ప కదల్చకుండా అందరినీ చూస్తున్నాడు. (మత్స్యావతారం)
తలబాదుకుంటూ దుఃఖసముద్రంలో మునుగుతున్నాడు. (కూర్మావతారం)
చనిపోయిన భార్యబిడ్డలను తలచి బిలము తెరువు మని సణుగుతూ నేలలో ప్రవేశింపజూస్తున్నాడు. (వరాహావతారము)
కొయ్యబారిన స్థితిని పొందుతున్నాడు. స్తంభోద్భవము (నారసింహావతారం)
బిచ్చగాడిలా నలుదిశలూ చేయి చాస్తున్నాడు. (వామనావతారం)
అస్రాంబుధి లో మునుగుతున్నాడు. అసృక్ అంటే రక్తము. అస్రాంబుధి అంటే రక్తపుటేరు (పరశురామావతారం)
హా! వెళ్ళిపోయినావా అని భార్య గురించి చింతిస్తున్నాడు. (రామావతారం)
బహువిధ ఇర ఆసక్తి = పెక్కు విధములైన దాహములు(మద్యపానములు) తో భ్రాంతి పొందుతున్నాడు (బలరామ అవతారం)

చేరకూడని దర్శనము (బౌద్ధము) యొక్క రూపాన్ని పొందాడు (బౌద్ధావతారం). (ఇక్కడ చేరరాని స్థితి – అంటే కృష్ణుని విశ్వరూపదర్శన యోగము అన్న అర్థం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ పక్షంలో కృష్ణావతారం)

బడబాగ్ని కడుపులో దాచుకొంటున్నట్టున్నాడు. (బాడబము అంటే గుర్రము – కల్కి అవతారం)

ఈ పద్యంలో శ్లేష అలవోకగా సాగింది. నిగమశర్మ దుఃఖపు విషయం నుంచి, శ్లేష ద్వారా ఉద్యోతించిన దశావతార వర్ణనలు ప్రత్యేకమై, దూరంగా జరిగినట్టుగా లేదు. ఆతని దుఃఖం, దశావతారాలు రెండూ ఒకదానిని మరొకటి అంటి ముడివడినట్టు యున్నవి. ఇది చాలా విలక్షణమైన, విశిష్టమైన ప్రతిభ.

*****

అలా పరిభ్రమిస్తూ, కృశించిపోయి ఆ నారసింహక్షేత్రంలో నిగమశర్మ తన తనువును చాలించినాడు.

మరణించిన నిగమశర్మను యమదూతలు తోడుకొని పోతుంటే, విష్ణుదూతలు వారిని అడ్డగించినారు. అప్పుడు యమదూతలు – నిగమశర్మ చేసిన పాపాల ’జాబితా’ వినిపించినారు. కానీ నారసింహ క్షేత్రాన మరణించిన మాత్రాన, విష్ణుదూతలు, ఆతని రక్షించి, సగౌరవంగా శ్వేతద్వీపములోని పరమపదానికి తోడుకొని పోయినారు.

భూలోకాన పరమపాతకుడైనా నరసింహక్షేత్రాన మరణించిన కారణమాత్రమున అతడు ఉత్తమోత్తమపదమును పొందినాడు!
ఈ ఆఖ్యానాన్ని పరమశివుడు నారదుడికి వినిపించాడు.

****

ఇక్కడ ఉపాఖ్యానపు చివరన కూడా రామకృష్ణుడి తత్వం నిగూఢంగా ఉంది. భూలోకంలో ఎన్ని పాపపు పనులు చేసినప్పటికీ, జీవి యొక్క పరిధిలో లేని కారణమాత్రమైన ’సుక్షేత్రంలో మరణప్రాప్తి’ ద్వారా పరమపదాన్ని పొందటాన్ని రామకృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ కవి – నిజంగా క్షేత్రప్రాశస్త్యాన్ని గురించి చెబుతున్నాడా? లేక పైకి క్షేత్రప్రాశస్త్యాన్ని ప్రశంసిస్తూ, పరోక్షంగా మానవుని ఆలోచనాతీరులో డొల్లతనాన్ని పరిహసిస్తున్నట్టా?

సహృదయులకు ప్రజాకవి వేమన కొంత గుర్తుకు వస్తాడు ఇక్కడ.
.వె.
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
మిథ్యాచారాలను వేమన స్పష్టంగా కడిగిపారేశాడు. ఆయనది స్పష్టత అయితే రామకృష్ణుడిది గోప్యం.

ఉద్భటారాధ్య చరిత్రములోని మదాలస చరిత్రములో కూడా మదాలసుడు కావలసినన్ని పాపాలు చేస్తాడు. తుదకు యమభటులు మదాలసుని పాపాల చిట్టాను విశ్వనాథుని ముందు విప్పి చెబుతారు. ఇటువంటి ఖలుడు పరమేశ్వరుని చేరుకొనుట చోద్యము కాదా, అని వారు విశ్వేశ్వరునితో వాదిస్తారు.

కం.
ఇఁక నేల ధర్మసంగతి
యిఁకనేల? పరోపకార హేలా విభవం
బిఁకనేల విధినిషేధము
లిఁక నేల వివేక మాత్మ నెఱుఁగు తలంపుల్. (. 2.275)

తా: ఇలా అయితే, ధర్మప్రస్తావన ఎందుకు? పరోపకారముతో వచ్చే వైభవమెందుకు? నీతినియమాలెందుకు? వివేకమెందుకు? ఆత్మ జ్ఞానమనే మాట యెందుకు?

కం.
వలసిన లాగులు గ్రుమ్మరి
బలహీనుల వెఱపు లేక పరిమార్చి తుదన్
జలనంబు లేని నిన్నున్
గలయుట పనిగాదె తలఁపఁగా దేహులకున్. (. 2.276)

తా: తన చిత్తానకు వచ్చినట్టు తిరిగి, ఏ మాత్రం సంకోచం లేక బలహీనులను చంపి, చివరకు చలనము లేని నిన్ను పొందటము దేహులకు తగునా! (పరమేశ్వరునికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే చలనము లేని వాడు. అంత నిష్టగా తనలో తాను తపస్సుయందు లీనమై యుండువాడు.)

పై పద్యాల ద్వారా కవి, కొంత తన మనస్సు లోని ప్రశ్నలనే కావ్యం ద్వారా పాఠకులకు సంధించినట్లు తోస్తుంది.

(ఇలా ప్రశ్నించిన వారికి విశ్వనాథుడు సమాధానం వివరిస్తాడు – కాశీలో మరణించినవాడు సిద్దరసం సాయంతో ’ఇనుము కాంచనంబైన కైవడి’ ముక్తినందుతాడు.)

ఎన్ని పాపాలు చేసినా, కాశీలోనో, నారసింహ క్షేత్రంలోనో మరణిస్తే చాలు!

ఇంత సులభముగా మోక్షము లభించునట్లు మనము కూడా నిగమశర్మకంటే రెండాకులెక్కువ చదువి చావువేళకే క్షేత్రమునో, తీర్థములో చేరికొనవచ్చును. ” – అని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు వ్యాఖ్యానిస్తారు.

ఇదివరకు శైలి వైచిత్రిలోనూ, శిల్పవైచిత్రి లోనూ కవి చూచాయగా, భౌతికవాదపు నశ్వరత్వాన్ని, డంబాచారాలను, లోకపుతీరులోని బండవాళాన్ని బయటపెట్టినాడు. అయితే – ఈ మూలతత్వ వైచిత్రి విషయంలో మాత్రం ఆయన మరీ అంత స్పష్టంగా బయటపడలేదు. దుర్భాగ్యవశాత్తూ ఏ కాలంలో అయినా కవికి కొంత లౌక్యం తప్పనిసరి. బహుశా నాటి కాలమానపరిస్థితులను అనుసరించి, ఆయన ఆ గుంభన ను పాటించినాడేమో!

ఏది ఏమైనా రామకృష్ణుని తత్వం నిగూఢమైనది. బహు సూక్ష్మమైనది, నివృత్తి పరమైనది. స్థూలంగా కావ్యధోరణులకు అతీతమైనది. ఆలంకారిక పద్ధతులకు లొంగనిది. ఈ కవిని అనుశీలించాలంటే – పాఠకుడు ఆయన దారిని వెళ్ళాలి. అందుకు బహుశా ఆ పాఠకుడూ కొంత రామకృష్ణుని తీరును వంటబట్టించుకుని ఉండవలె. అలా అని ఈ కవి సాధారణ కావ్యానుశీలకులకు, సహృదయులకు అందడా? అంటే అందడని చెప్ప వీలు లేదు. “పాండురంగవిభుని పదగుంఫనము” అన్న పేరు తెనాలి రామకృష్ణునకు ఉన్న ప్రశస్తి. ఆ “పదగుంఫనము” గురించి మరెప్పుడైనా విచారిద్దాం.

ముగింపు.

ఒకప్పటి విజయనగరం, నేటి ’హాడుపట్టణ’ (హంపి) లో ఒకానొక గుట్టపై ఓ చిన్న శిథిల మంటపం కనిపిస్తుంది. ఆ మంటపం పేరు – ’తెనాలి రామన మంటప’. ఈ మంటపం చాలా దూరంగా, ఎత్తుగా, ప్రత్యేకంగా, ఏకాంతంగా అగుపిస్తుంది. విజయనగరం ప్రాభవంగా ఉన్న రోజులలో తెనాలి రామకృష్ణుడు ఆ మంటపాన ఏకాంతంగా కూర్చుని తనలో తాను లీనమై, తోచినది వ్రాసుకుంటూ ఉండేవాడట!

(తెనాలి రాముని మంటపం, హంపి.)

ఆ మంటపము తెనాలి వాని లానే ప్రత్యేకమై, ఉన్నతంగా అగుపిస్తుంది. ఆ ఉన్నతి, విశిష్టత, ప్రత్యేకత ఆయనకే తగు!

****

ఉపకరణములు.
ఆరుద్ర – సమగ్రాంధ్రసాహిత్యం లో “తెనాలి రామకృష్ణుడు” వ్యాసం.
తెనాలి రామకృష్ణుని తెలుగు కవిత, రామకృష్ణుని రచనావైఖరి – పుట్టపర్తి నారాయణాచార్యులు.
నిగమశర్మ అక్క వ్యాసము – రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
పాండురంగ మహాత్మ్యము – బులుసు వేంకటరమణయ్య గారి లఘుటీకతో – వావిళ్ళ ప్రెస్.
ఉద్భటారాధ్య చరిత్రము – నిడదవోలు వేంకటరావు గారి విపులపీఠికతో – లోటస్ పబ్లిషర్స్ తెనాలి.
ఘటికాచల మహాత్మ్యము – కేతవరపు వేంకటరామకోటి శాస్త్రి గారి వ్యాసం – 1955 భారతి.
ఇతర అలంకారిక గ్రంథాలు, ప్రబంధ గ్రంథాలూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here