Site icon Sanchika

తెనాలి రామకృష్ణుని కవిత్వ వైచిత్రి

[box type=’note’ fontsize=’16’] “రామకృష్ణుని తత్వం నిగూఢమైనది. బహు సూక్ష్మమైనది, నివృత్తి పరమైనది. స్థూలంగా కావ్యధోరణులకు అతీతమైనది. ఆలంకారిక పద్ధతులకు లొంగనిది. ఈ కవిని అనుశీలించాలంటే – పాఠకుడు ఆయన దారిని వెళ్ళాలి” అని వివరిస్తున్నారు రవి ఇ.ఎన్.వి. ‘తెనాలి రామకృష్ణుని కవిత్వ వైచిత్రి’ అనే వ్యాసంలో. [/box]

[dropcap]T[/dropcap]ruth is the highest form of negative understanding – J. Krishnamurthy.

****

సాధారణంగా ఒక దర్శనాన్ని లేదా తాత్విక చింతనను మూలంగా స్వీకరించి ఒక కావ్యాన్ని నిర్మిస్తే – ఆ కావ్యానికి చెందిన కవిత్వం పరోక్షపద్ధతిలో (Objective poetry) ఉండటం మనకు తెలుస్తుంది. ఉపనిషత్తులు, అష్టావక్రసంహిత ఇత్యాది రచనలు ఆ కోవకు చెందినవి.

చిన్న ఉదాహరణ: –
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే

(అదీ పూర్ణమే, ఇదీ పూర్ణమే, ఆ పూర్ణం నుండి ఈ పూర్ణం పుడుతోంది.అందులోంచి యిది తీసేస్తే,మిగిలేదీ పూర్ణమే)

ఈ శ్లోకంలో సబ్జెక్టివ్ గా చెప్పబడే ’వస్తువు’ ఏదీ లేదు. కవి ’దేన్నో’ పరోక్షంగా సూచిస్తున్నాడు. అందుకని దీన్ని objective poetry అని అంటున్నాం, అవసరానికి.

హిందూ దర్శనాదులే కాక, సూఫీ, బౌద్ధ, జెన్ ఇత్యాది హైందవేతర చింతనాసారస్వతంలో కూడా ఈ పద్ధతి కనిపిస్తుంది. అలా ఉంటే, మొత్తంగా కాకపోయినా కథల ద్వారానో, కావ్యపు మధ్యలో ప్రాస్తావికంగా వచ్చే కథల చివరనో – సత్యదృష్టిని, పారమార్థికాన్వేషణనూ, ఆముష్మిక సంబంధమైన విషయాదులను అక్కడక్కడా పరోక్షంగా ప్రస్తావించటం – పురాణకవిత్వపు ధోరణి.

ప్రబంధకావ్యాల్లో కూడా ఇటువంటి ప్రయత్నం అంతో ఇంతో లేకపోలేదు. ఈ ధోరణికి పెద్దపీట వేసిన కవులలో అగ్రగణ్యులు ఇద్దరు. – శ్రీకృష్ణదేవరాయల వారు, తెనాలి రామకృష్ణుడు. ఈ ఇద్దరు కవులలో రాయల వారి ధోరణి – పాజిటివ్ ధోరణి. ప్రరోచన. రాయల వారి ఆముక్తమాల్యద గ్రంథం యొక్క మూల ఉద్దేశ్యమే శ్రీవైష్ణవతత్వాన్ని, విశిష్టాద్వైతాన్ని గురించి వివరించుట. ఆముక్తమాల్యదలో కవి వ్రాసిన ఐదు కథలకున్నూ మూల ఉద్దేశ్యం అది. రాయలవారి ధోరణి అది అయితే, తెనాలి రామకృష్ణుని ధోరణి తద్భిన్నంగా కనిపిస్తుంది. మనిషి జీవితంలో నశ్వరత్వాన్ని, మొత్తంగా కనిపించే అబద్ధాన్ని, మాయను గురించి ప్రరోచనార్థంలో కాక, వికటంగా, విలక్షణంగా చెప్పటానికి మహాకవి తెనాలి రామకృష్ణుడు ప్రయత్నించినట్లు ఆయన కావ్యాలలో కనిపిస్తుంది.

కవిత్వపు లక్షణాలు

సాధారణంగా కవిత్వం అంటే – శైలి, శిల్పం, రసోత్పత్తి తదనూచానమైన మూల తత్వం – వీటి సమాహారం.

ఈ శైలి, శిల్పం ఇత్యాదులకు ఇబ్బడి ముబ్బడిగా నిర్వచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యాసానికి సంబంధించి, వీటినిలా నిర్వచించుకుందాం.

శైలి – వస్తువును పాఠకునికి/సహృదయునికి చేరవేసే పద్ధతి.

శిల్పం – వస్తువు యొక్క నిర్వహణ.

రసజ్ఞత – శైలిని, శిల్పాన్ని కేవలం నిర్వహించటమే కాక తీర్చిదిద్దే తీరు.

మూలతత్వం – కవి మౌలికంగా కావ్యం ఎందుకు వ్రాసినాడో ఆ ఆలోచన, దాని పరిధి.

పై నిర్వచనాలు కవిపరమైనవి. పాఠకుని పరంగా అయితే (పద్య) కవిత్వంలో

శైలిని గ్రహించటానికి శయ్య, పాకం, ధారాశుద్ధి, శబ్ద, అర్థగుణాలు ఇత్యాది విషయాలపై అవగాహన ఉపకరిస్తుంది.

శిల్పాన్ని గ్రహించటానికి – పాఠకుడి యొక్క ఆసక్తి, బహుముఖీన అనుశీలన, సంధి సంధ్యంగాలపై అవగాహన ఇత్యాదులు తోడ్పడుతాయి.

రసజ్ఞత – దీనిని గ్రహించటానికి పాఠకుడికి కొంతమేర కవిహృదయం కావాలి. శైలి, శిల్పం బాహ్య విషయాలైతే, రసజ్ఞత – పాఠకుని అంతఃకరణాన్ని అనుసరించినది.

మూలతత్వం – దీన్ని గ్రహించటానికి సూక్ష్మత, వివిధవిషయసంగ్రహం తోడ్పడుతుంది.

ప్రబంధకవిత్వానికి సంబంధించి ఈ విషయాలను అనుశీలించి చూస్తే,

అల్లసాని పెద్దన స్వారోచిషమనుసంభవం, నంది తిమ్మన పారిజాతాపహరణం – ఈ రెండు ప్రబంధాలలో శైలి, శిల్పం కాస్తో కూస్తో సులువుగా తెలియదగినవి. ఈ రెండు కావ్యాలలో రసజ్ఞత, మూల తత్వం సూక్ష్మస్థాయిని నిర్మితమైనవి. ఇవి పాఠకుని అభిరుచికి తెలియదగినవి.

భట్టుమూర్తి వసుచరిత్ర, కృష్ణరాయల ఆముక్తమాల్యద – ఈ రెండున్నూ శైలి పరంగా సంక్లిష్టమైనవి. కానీ శైలిని దాటుకుని వెళ్ళగలిగితే, శిల్పమూ, ఇతర విషయాలలో ఈ ప్రబంధాలు రెండున్నూ అపూర్వమైన కావ్యాలు.

పింగళి సూరన కళాపూర్ణోదయం – శిల్ప పరంగా భిన్నమైనది.

అయితే శైలి, శిల్పం, మూలసూత్రం (లేదా మూల తత్వం) – ఈ మూడు విషయాలలోనూ సంక్లిష్టమైనవి తెనాలి రామకృష్ణకవి కావ్యాలు. ఈ కవి రచించిన కావ్యాలలో మూడు కావ్యాలు నేడు లభిస్తున్నవి. ఉద్భటారాధ్యచరిత్రము, ఘటికాచలమహాత్మ్యము, పాండురంగ మహాత్మ్యము. ఇంకా ఆయన కందర్పకేతువిలాసము,హరిలీలావిలాసము అన్న గ్రంథాలు రచించినాడని తెలుస్తూంది కానీ ఆ గ్రంథాలు అలభ్యం. ఆయన కావ్యాల్లోప్రముఖమైనది – పరిణత వయస్కుడై, పరిణతమనస్కుడైన తరువాత రచించిన పాండురంగమహత్మ్యము కావ్యం .

తెనాలి రామకృష్ణకవి మహాపండితుడు. గొప్ప రసజ్ఞుడు, భాషావేత్త కూడాను. ఇతర ప్రబంధకవులలా కాక, ఈయన సహృదయులకు, అనుశీలకులకు కొంచెం పరిశ్రమ కలుగజేస్తాడు. ఈ సంక్లిష్టతలో భాగంగా, పద్యాన్ని, ఘట్టాన్ని, ఓ ఉపాఖ్యానాన్ని, కథానిర్మాణాన్ని కూడా తెనాలి కవి సాధారణమైన ధోరణికి భిన్నంగా నిర్వహించటమే కాక, పాఠకునికి అక్కడక్కడా కొంత సందిగ్ధమైన స్థితిని కలుగజేస్తాడు. దరిమిలా, ఈ మహాకవిని అనుశీలించటానికి సాధారణమైన ఆలంకారిక పద్ధతులు పూర్తిగా ఉపయోగపడవు.

రాళ్ళపల్లి వారి ప్రసిద్ధమైన వ్యాసం “నిగమశర్మ అక్క” లో ఈ క్రింది వాక్యాలు గమనార్హం.

సంపూర్ణ వస్తు నిర్మాణమునకు అతనియందు లేనిది నేర్పుగాదు, ఓర్పు. వేళాకోళపుఁ గందువలను, పరిహాసపు పట్టులను వెదకుట యతని స్వభావము. గావున ఒక వస్తువు నాద్యంత పుష్టిగా పరీక్షించులోపల చూపు వేఱొక చోటికి పారును. మొదటిదానియెడ శ్రద్ధ తగ్గును. పరిహాస కుశలత తెలివికి, చురుకుదనమునకు గుర్తు. అది గలచోట సామాన్యముగ సోమరితనమును, అశ్రద్ధయు నుండును….. “

(తెనాలి రామకృష్ణుడు కనుక పొరబాటున అసంబద్ధ సాహిత్యం, అస్తిత్వ సాహిత్యపు కాలంలో గనక పుట్టిఉంటే, ఎంత గొప్పగా రాణించి ఉండేవాడో! ఎంత గొప్ప సాహిత్యసృజన జరిగి యుండేదో!)

ప్రబంధయుగంలో ప్రముఖ కవుల కవితావిలాసం రాజాంతఃపురానికి, ఆ కాలానికి చెందిన కొంతమంది పాఠకవర్గానికి పరిమితమైనది. ఆ బాటను విడచి, కొంతలో కొంత సమాజగతిని అనుసరించినది తెనాలి వాడే. ఈయన సామాన్య పామరజన భాషను, అచ్చపు తెనుగును మాత్రమే కాక జనపదాలను, జానపదుల ఆచార వ్యవహారాలను కూడా అక్కడక్కడా వర్ణించినాడు. అది కూడా నవీన మార్గంలో భాగమై ఉంది.

ఈ కవి హాస్య ప్రియుడు. నవరసములలో హాస్య రసానికి కొంత విశిష్టత ఉన్నది. కొన్ని రసముల స్థాయీభావాలు – ప్రత్యక్షంగా చతుర్విధపురుషార్థాలతో అనుసంధానమై ఉన్నవి. ఉదాహరణకు – రతి (శృంగారం), కామానికి, అర్థానికి ముడివడి ఉంటుంది. ఉత్సాహము (వీరరసము) – ధర్మానికి ముడివడినది. శమము (శాంతము) – మోక్షమునకు అనుసంధానమైనది. అంతే కాక అవి ఉత్తమపాత్రలకు అన్వయింపగలవి. మనకున్న అనేకానేకమైన ఉదాత్త కావ్యాలలో సాధారణంగా నాయకుడు శృంగార, వీరరస పోషకుడు. కొండొకచో శాంతరసప్రధానుడు (నాగానందం నాటిక). అయితే హాసము (శోక, భయ, జుగుప్స, విస్మయములతో కూడి) ప్రత్యక్షంగా ఏ పురుషార్థసాధనకూ ఉపకరించదు. అందువలన ఈ స్థాయీభావాలు, సామాన్య ప్రకృతులకు కూడా చెందినవి. కావ్యాలలో అతి సామాన్యులయందూ, సాధారణమైన పాత్రల విషయంలోనూ ఈ స్థాయీభావాలు (హాస, శోక, భయ, జుగుప్స, విస్మయములు) ఏర్పడవచ్చు. ఇవి ఏర్పడడానికి పాత్రలు ఉదాత్తమైనవో, దైవాంశకు చెందినవో కానక్కర లేదు. రామకృష్ణుని దృష్టి – సామాన్యులమీద అవడంతో ఈయన ప్రాధాన్యత కూడానూ హాస్యరసం అవడం గమనార్హం.

తెనాలి రామకృష్ణుని కవిత్వంలో పద్యము, ఘట్టమూ, ఉపాఖ్యానము – వీటి నిర్వహణలో అసాధారణ(త)త్వాన్ని కొంతమేరకు అనుశీలించే ప్రయత్నమే ఈ వ్యాసం. ఈ వ్యాసానికి ఆధారం పాండురంగ మహాత్మ్యము కావ్యంలోని నిగమశర్మోపాఖ్యానం. ఈ వ్రాయబోయే విషయాలు ఇదివరకే కూలంకషంగా మహామహులైన విమర్శకులు వివరించి యున్నారు. కాబట్టి చర్వితచర్వణం కావచ్చు. అయితే ఆధునిక పాఠకులకు కొంతమేరకు తెనాలి వాని కవిత్వపు ధోరణి తోడ్పడగలదన్న ఆకాంక్షతో ఉపక్రమిస్తున్నాను.

ఇది సాహసమే. బహుశా దుస్సాహసం కూడా. ఈ వ్యాసం యెడారిలో ఆముదపుచెట్టు! కావ్యజ్ఞులు దోషాలు మన్నించాలి. వ్యాసమే దుష్టమైతే క్షమించాలి.

****

పాండురంగ మహత్మ్యము – ఈ కావ్యంలో మొత్తం తొమ్మిది ఉపాఖ్యానాలలో ముఖ్యమైనది నిగమశర్మ ఉపాఖ్యానం. నిగమశర్మ వంటి పాత్ర తెలుగు సాహిత్యాన లేదు. ఆ ఘట్టంలోని ఇతర పాత్రలున్నూ జీవచైతన్యంతో తొణికిసలాడే తెలుగింటి పాత్రలు. కథాగమనం గొప్ప ఒరవడితో కూడుకొని ఉంటుంది. ఈ నిగమశర్మ కథ – శ్రీనాథుని కాశీఖండంలో గుణనిధి కథను, శివరాత్రి మహాత్మ్యములో సుకుమారుని పాత్రను పోలి ఉంటుంది. (హరిభట్టు అనే కవి రచించిన నారసింహపురాణ కావ్యంలో మందేహోపాఖ్యానం అన్నది నిగమశర్మ కథకు మూలమని కొందరు పరిశోధకులు) నిజానికి తెనాలి రామకృష్ణుడే, తన పూర్వకావ్యమైన ఉద్భటారాధ్య చరిత్రము లో మదాలసుడనే వాడి కథను గుణనిధి ఉదంతాన్ని అనుకరించి యున్నాడు. తను రచించిన మదాలసుని కథను పోలిన మరొక కథను కవి ఈ సారి – మానవ ప్రవృత్తిలోని అసహజత్వాన్ని నిరూపిస్తూ నవ్యంగా రచించినాడు.

కళింగదేశం, పీఠికాపురంలో వేదవేదాంగవేత్త అయిన సభాపతి అనే బ్రాహ్మణోత్తముని ఇంట నిగమశర్మ జన్మించినాడు. నిగమము – అంటే వేదము. కాని ఈ నిగమశర్మ – నేతిబీరకాయలో నేయి వంటివాడు. ఈతడు ’వనితామానససూనసాయకుడు’. (వనితల మానసమునకు మన్మథుని వంటి వాడు); అంతే కాక ’నూనూఁగు మీసాల లేకొమరుం బ్రాయపున్ తేజుకూన’ అయిన ఈ నిగమశర్మ తన తండ్రి ఆస్తులను హరింపజేస్తూ, పొలాలను కుదువబెడుతూ, పోకిరియై, వారవనితలకు దాసోహమై సంచరిస్తున్నాడు. అతనికి బుద్ధి గరపటానికి అతని అక్క మెట్టినింటి నుంచి వచ్చింది. ఆమె అతడికి సుద్దులు చెప్పింది. భార్యను, ఇంటిని, ఆస్తులను, ముసలి తలిదండ్రులను చూచుకొమ్మంది. నిగమశర్మ – తన అక్క మాట వింటున్నట్టే ఉంది.


పద్య(శైలి)వైచిత్రి
ఈ ఘట్టంలో తెనాలి కవి పద్యాన్ని చూద్దాం.
సీ.
రాజాలయమునకు రాకపోకలుసేయు
          మాసిన చదువులు మరలఁ జదువు
నిన్నాళ్ళ నెచ్చెలు లెదురైనఁ దలవంచు
          కులవధూరత్నంబుఁ గుస్తరించు
నాచార్యజనముఁ బ్రత్యహము సంభావించు
          నర్చావళికి నుపహారమిచ్చు
నర్చించుఁ గుతపవేళాగతాతిథికోటిఁ
          బసినేదు దర్శించుఁ బైరుపచ్చఁ
గీ.
దండ్రి యుద్గమనీయంబుఁ దానె యుదుకు,
నత్తికాభర్తతో నవ్వు నల్పసరణి
గ్రామకార్యంబుఁ దీర్చు నంగడికి వచ్చి,
……………………………………………
(పా. 3.46)
తా: నిగమశర్మ అక్కమాటలు విన్నాడు. ఆపై ఆతడి ప్రవర్తన ఇలా ఉంది.

దివాణానికి వెళ్ళి పనులు చూస్తున్నాడు. మరచిపోయిన శాస్త్రాధ్యయనం తిరిగి మొదలెట్టినాడు. తనకు అదివరకు తెలిసిన నెచ్చెలులు ఎదురైతే తలవంచుకుని పక్కకు వెళుతున్నాడు. భార్యను ఊరడిస్తున్నాడు. గురువులను ప్రతిపొద్దూ గౌరవిస్తున్నాడు. పూజగదిలో నైవేద్యాలు పెడుతున్నాడు. మధ్యాహ్నం ఆకలిబారిని పడి వచ్చిన అతిథులను గమనించుకొంటున్నాడు. పశువుల ఆలనా పాలనా, గడ్డిగాదె పనులు చూస్తున్నాడు. నాన్న ధోవతిని ఉతుకుతున్నాడు. బావతో అప్పుడప్పుడూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు. రచ్చపట్టులో గ్రామ సమస్యలలో తలదూరుస్తున్నాడు……..

ఇంతా చెప్పిన తర్వాత సీసపద్యం చిట్టచివరి పాదాన – ఇలా అంటాడు కవి.
తేనె పూసిన కత్తి ధాత్రీసురుండు.”

పద్యంలో చిట్టచివరి పాదం ద్వారా పద్యం తాత్పర్యం మొత్తాన్ని విషమంగా మార్చాడు రామకృష్ణుడు. పాఠకుడికి అతడు నిజంగానే, తన దుర్లక్షణాలను వదిలించుకుని, మారిపోయినట్లు ఆతని కార్యాల ద్వారా సుదీర్ఘమైన వివరణ యిచ్చి, చిట్టచివరన మొత్తంగా విరుద్ధమైన అర్థాన్ని చెబుతున్నాడు. నిగమశర్మ తాలూకు మొత్తం కాపట్యాన్ని దర్శింపజేస్తాడు. పాఠకుడికి కథ చెబుతూ చెబుతూ ఓ మారు సాచి లెంపకాయ కొట్టినట్టు ఉంటుంది ఈ వ్యవహారం.

ఇది విలక్షణత్వం. ఇటువంటి పద్ధతిలో ఒక పాత్రను నిర్మించి ఆతని స్వభావాన్ని ఉద్యోతించటం – కావ్యాలలో చాలా అరుదు.
(పద్యం మొత్తంగా – స్వభావోక్తి అలంకారం. )

పాత్రకు సంబంధించి కాకపోయినా, సీసపద్యాన్ని తుదివరకు నిర్వహించి చిట్టచివరన పూర్తీగా వ్యతిరేకార్థాన్ని ప్రతిపాదించే పద్యాలను ఈ కవి రచించినాడు. ఉద్భటారాధ్యచరిత్రంలో ఈ పద్యం గమనించండి.

సీ.
వకుళపున్నాగ చంపకపాటలావనీ
          రుహవాటికలఁ గలవిహరణంబు
కలహంసకులపక్షచలితవీచీఘటా
          కులసరోహముల జలకమాట
అమృతనిష్యందమోహన చంద్రికా ధౌత
          మానితహర్మ్యంబులోని యునికి
కమలరాగోపలఘటితనూతనకేళి
          శైలికూటములపై వ్రాలుకడఁక
గీ.
విరులు సొమ్ములు పూఁత లంబరము లమిత
భక్ష్యభోజ్యాదు లొనరిన పనులకెల్ల
నింపు సమకొల్పు తన వల్పు నిందువదనఁ
గలసి వర్తింపలేకున్న నిలువు సున్న.
(ఉ. 2.175)
తా: పొగడ, పున్నాగ, సంపెంగ, కలిగొట్టు – వంటి పువ్వులు పూచిన తోటలో స్వేచ్ఛా విహారము;
రాయంచల రెక్కలతో రేగిన అలలు కలిగిన చక్కని సరోవరాలలో జలకాలాట;

అమృతము స్రవించు మన్మథుని బాణము వలే ప్రకాశించు వెన్నెలతో అలంకరింపబడిన పాలరాతి మేడలో నివాసము; (సూర్యుని కిరణములు జాలువారుచూ , ఇంపైన చంద్రుని వెన్నెలతో కూడిన తెల్లని పాలరాతి మేడలో నివాసము;)

తామరపువ్వు వలె ఎఱ్ఱనైన ఱాలు (పద్మరాగమణులను పోలినవి) కలిగిన నవ్యమైన కొండగుట్టలలో నడయాడే ప్రయత్నము;
పూలు, సొమ్ములు, మైపూతలు, చక్కని దుస్తులు, పంచభక్ష్యపరమాన్నాలు;
పై వన్నీ సమకూరిన దానికన్నా;
తనకు అనుగుణంగా నడుచుకునే ప్రియమైన వలపుకత్తెను కలిసి క్రీడించటం మెఱుగు. ఈ క్రీడ లేకపోతే పైన చెప్పిన “చిట్టా” అంతా నిలువు సున్న తో సమానము. ఇది విషమాలంకారం.

ఇలాంటి భావానికి సమాంతరంగా ప్రసిద్ధమైన పోతన పద్యం ఉన్నది. “మందార మాధుర్య మకరందమున” – ఈ పద్యానికి, రామకృష్ణుని పద్యానికి మధ్య శైలి భేదం గమనార్హం.

(అమృతము = ఒకానొక సూర్యకిరణము.,ఉపల = ఱాయి., కడఁక = యత్నము.)

అంత జాబితా చెప్పి, చిట్టచివరన ఆ చిట్టా అంతా చెలికత్తెతో విహారం లేనిదే నిలువు సున్న అని తేల్చి పారేస్తాడు కవి. “చెలికత్తె లేనిదే అంతా వ్యర్థం” అని చెప్పడానికి ఆ చిట్టా ఎందుకు? ఇక్కడే రామకృష్ణకవి సహృదయునిలో ఆలోచనలు రేకెత్తిస్తాడు. పద్యంలో చెప్పిన “లిస్టులోని సరంజామా” అంతా భౌతికమైనది, ప్రాపంచిక సౌఖ్యాలకు చెందినదీనూ. ఆ ప్రాపంచిక సుఖాలలోకి – ఇంపైన చెలికత్తెతో పొందు ఉత్తమమైనదని “మదాలసుడు” భావిస్తాడు. దరిమిలా ఈ భౌతిక సుఖాలకు వ్యతిరిక్తమైన సుఖమో, శాంతియో మరొకటున్నదని పరోక్షంగా కవి సూచిస్తున్నట్టు ఓ భావం ఏర్పడుతున్నది. మదాలసుడనే పేరు కూడా గమనార్హం. (మదాలసుడు = మాత్సర్యము చేత ఉన్మత్తుడైనవాడు).

ఉద్భటారాధ్య చరిత్రము లోనే కాశీని, గంగను గురించి కవి వ్రాసిన పద్యాలలో కొంత హాస్య ధోరణి కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు.
గీ.
తనకుఁ బలె స్వచ్ఛమై యొప్పు తనువొసంగి
తనదు నొక పాయ మల్లెపూదండఁ జేసి
వాని సిగ నిడు దేహావసాన వేళ
స్నాతపైఁ గాశి గంగ కెంత కనికరమొ. (ఉ. 2.92)

తా: కాశీలో గంగలో స్నానం చేసినవాడి యొక్క దేహావసాన సమయంలో, గంగ తనవలే స్వచ్ఛమైన తనువును అతనికి ఇస్తుందట. తన పాయను ఒకదాన్ని మల్లెపూదండగా చేసి వాడి సిగలో తురుముతుందట. స్నాతపై కాశి గంగకు ఎంత కనికరమో!” అని కవి తీర్పు. చివరి పాదం – సాభిప్రాయమో, వ్యంగ్యమో అర్థమవదు.

గీ.
కాశిలోఁ బట్టతలవాఁడు గంగ మునిఁగి
జడముడి ధరించు దానిపై సవదరించు
ఫణిఫణారత్నరుచి దానిపై వహించు
మొలక జాబిలి జాజిపూ మొగ్గ వోలె. (ఉ. 2.94)

తా: ఓ బట్టతల వాడు కాశీలోని గంగలో మునిగితే, ఆతనికి నిడుపాటి జడ వస్తుంది. ఆ జడపై ఆతడు కాంతులు చిందే మణులను ధరిస్తాడు. (ఫణిఫణారత్నరుచి = పాము పడగపై ఉన్న మణి యొక్క కాంతి). దానిపై అతడు మొలక జాబిలి ని జాజిపువ్వు మొగ్గలా ధరిస్తాడు. (అనగా ఈశ్వరుడై పోతాడు.)

ఇక్కడ బట్టతలవాని ప్రసక్తి కొంటెతనంగానే అగుపిస్తుంది.
గీ.
ఈ భవమ్మున ఫలమున కేమి గాని
రాఁగల భవమ్ము మొదలంట రాచినాఁడు
గంగలో వారణాసి మునుంగువాఁడు
తొంటి భవమునఁ బుణ్యంబుఁ దొడికినాఁడు. (ఉ. 2.96)

తా: కాశీలో, గంగా, వారణ, అసి నదులలో మునిగినవాడు, ఈ జన్మంలో చేసిన కర్మలకు ఫలం అనుభవించినా అనుభవింపకపోయినా, రాబోయే జన్మలో పాపాన్ని మాత్రం మొదలంటా రాచివేసినాడు. మొదటి జన్మలోనే పుణ్యము సంపాదించుకున్నాడు.

తెనాలి వాని కవిత్వంలో విలక్షణత్వానికి, వికటత్వానికి మరింత స్పష్టమైన ఉదాహరణ పాండురంగ మహాత్మ్యములోని క్రింది పద్యం. పుండరీకుడనే భక్తుడికి భగవంతుడు ప్రత్యక్షమయినాడు. ఆ సందర్భాన పుండరీకుడు భగవంతుని దశావతారాలను ప్రస్తుతిస్తున్నాడు. అందులో బుద్ధావతారపు వర్ణన యిది.

.
ప్రతిదిన కేశలుంచనపు రాయిడి నెట్టన బట్టకట్టి పైఁ
బుతపుత మంచు నున్న కుఱుబోడతలన్ ధరియింప నోడియున్
సతమగు సొమ్ము గాన విడజాలవుగా శిఖిపింఛవల్లి సౌ
గతమతధుర్య! దానిఁ గటిఁ గట్టుము పుట్టము మిన్న కేటికిన్.

తా: ప్రతిదినము శిరోజములను పీకివేయుటవలన పుతపుతలాడే బోడితలపై నెమలిపింఛము ధరించటం కుదరదు కదా! కానీ ఆ నెమలిపింఛము నీకు తప్పనిసరి ఆభరణం. దాన్ని విడువటం కుదరదు. కాబట్టి ఆ నెమలిపింఛాన్ని తలపై కాకుండా, నడుమున నున్న వస్త్రము బదులుగా ధరించుము.

బౌద్ధపరివ్రాజకులకు (ఒక శాఖ వారికి) మస్కలి, మక్ఖలి, మస్కరి అని పేర్లు. వారు నెమలిపింఛాన్ని ధరిస్తారు. ఆ ధారణను తెనాలి రామకృష్ణుడు వాడుకొన్నాడు.

ఈ వర్ణన వికటం. తనకు ప్రత్యక్షమైన భగవంతుణ్ణి గురించి భక్తుడే ఇలా పరిహాసం చెయ్యటం విపరీతం. ఈ ధోరణి కొంత నాచన సోమునిలో ఉన్నది. నాచన సోముని ఉత్తర హరివంశములోని ఈ వర్ణన చూడండి. నరకాసురుడు తన సైన్యంతో సహా, మహర్షుల ఆశ్రమాలపై దాడి చేసి వారిని బాధిస్తున్నాడు. ఆ సందర్భాన వారి అవస్థ యిలా ఉంది.

సీ.
….
జన్నిదంబులు కాలిసంకెల లై పడ్డఁ
          దెగఁ దన్ని మిన్నక తిరుగువారు;
ముందటి దిక్కూడి మొలత్రాడుఁ దవిలిన
          తోకగోచుల వెంటఁ దూలువారు;
…..
….
వల్కలంబులు దోఁచిన వంగు వారు

(.– 1.102)

పై పద్యంలో – మహర్షుల అవస్థ వర్ణించాడు. మహర్షుల గోచీలలో, మొలత్రాడుకు తగిలించుకున్న ముందరిభాగం ఊడింది. అలా ఊడిన గోచీ వెనుకభాగాన తోకలా వ్రేలాడుతోంది. వారి గోప్యభాగాలను దాచుకోలేక తూలుతున్నారు. అసురులు తమ వల్కలాలను లాగేస్తుంటే, నగ్నత్వాన్ని దాచుకోలేక వంగుతున్నారు.

ఈ పద్యం అశ్లీలమని రాళ్ళపల్లి వారు విమర్శించారు. నాచన సోమన వర్ణనల్లో పరిహాసానికి కొంత అశ్లీలం తోడయితే, రామకృష్ణుని విషయంలో మాత్రం పరిహాసమే ప్రధానమయింది.

****


పక్కదారి నుంచి మళ్ళీ రహదారికి వద్దాం.

****

స్వభావచిత్రణ (శిల్ప) వైచిత్రి.

ఇలా నిగమశర్మ అక్క సుద్దులు చెప్పిన తర్వాత మారిపోయినట్టు నటిస్తూ, అదను చూచి ఓ నాటి రాత్రి, సొమ్ములు మొత్తం అపహరించాడు. ఆ సొమ్ముల చిట్టా పెద్దదే.

సీ.
గోమేధికాపలాంకుర మానితంబులు
          పుష్యరాగచ్ఛటాపుంఖితములు;
వైఢూర్యసంధాన వర్ణనీయంబులు
          హరినీలకీలనాభ్యంచితములు;
కురువిందసందర్భగురుతరంబులు
          చతుర్విధవజ్రదళసమావేలితములు;
మహనీయతర హరిన్మణి పరీతంబులు
          నకలుష స్థూలమౌక్తికయుతములు;
గీ.
పద్మరాగపరీరంభభాస్వరములు,
దంతవిద్రుమకృత సముద్గక భృతములు
మాతృభూషలు నత్తికా మండనములు
నిజయువతి దాల్చు సొమ్ములన్నియు హరించి.
(పా. 3.38)

ఈ జాబితా నవరత్నాలది. సాధారణంగా ఆస్తుల వివరాలు కథ ఆరంభంలో చెప్పటం కథా సంవిధానంలోని “డీఫాల్టు” ప్రక్రియ. తెనాలి రామకృష్ణునికి ఆ అవసరం పట్టలేదు. కథ మంచి రసపట్టులో ఉండగా – కథానాయకుడు దొంగిలించిన సొమ్ముల చిట్టా చదువుతాడు కవి. నిజానికి ఆ సొమ్ములే కాదు. నిగమశర్మ దొంగిలించిన సొమ్ములు మరిన్ని. (ఇది తర్వాతి పద్యంలో తెలుస్తుంది. ఆ పద్యం ద్వారా కూడా పాఠకుడు, నిగమశర్మ చోరకౌశలాన్ని కొంత ఊహించుకోవలె.)

కథానిర్వహణలో ఒక ఘట్టాన్ని సుదీర్ఘంగా, మరొక ఉదంతాన్ని క్లుప్తంగా నిర్వహించటం – అల్లసాని పెద్దన మనుచరిత్రలోనూ ఉంది. మనుచరిత్రలో చిట్టచివరన స్వారోచిషుని ఉదంతం చాలా తొందరగా గడిచిపోతుంది. అయితే తెనాలి రామకృష్ణుని కవిత్వంలో ఈ ఛాయలు ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఒకచోట నిడుపాటి వర్ణన, మరొక చోట క్లుప్తంగా కథ చెబుతూ వెళ్ళిపోవడం – కవి రచనలో సకృత్తుగా కనిపించే అంశాలు.

ఆ నవరత్నాలను, ఆ పద్యంలో చిట్టచివరన పేర్కొన్న భార్య సొమ్ములు కూడా మూటగట్టి, నిగమశర్మ “ఒకనాటి రాత్రి పడుకున్న పడుకకు చెప్పక” ఊరు దాటి, ఉడాయించినాడు.

అప్పుడు ఇంట్లో వాళ్లందరూ దుఃఖ పూరితులయినారు. (ఇక్కడ కవి తన కంటితో ఆ దృశ్యాన్ని చూచి వర్ణిస్తున్నట్టు భావించవలె.)
సీ.
శోకించు వృద్ధభూసురుఁ డాత్మ పితృదత్త
          దర్భముద్రికకుఁ జిత్తంబు గలఁగి
నత్తగా రిచ్చిన హరిసుదర్శనపుఁబే
          రునకు ముత్తయిదువ వనటఁ బొందుఁ
గ్రొత్తగాఁ జేయించు కొన్న ముక్కరకు
          నై యడలు దుర్వారయై యాఁడు బిడ్డ
జామాత వెతఁబొందు వ్యామోహియై నవ
          గ్రహకర్ణ వేష్టన భ్రంశమునకు
గీ.
నెంత దుర్బుద్ధి యెంత దుర్భ్రాంతి యహహ!
సర్వధనములు నద్దురాచారశీలుఁ
డూచ ముట్టుగ నిలుదోఁచి యుఱికి చనుట
యెఱుఁగరో గాక నవ్వేళ యెఱుక గలదె!
(పా. 3.50)
నిగమశర్మ ఇంటినుంచి సొమ్ములతో పారిపోగా, ఇంట్లో వాళ్ళు దుఃఖిస్తున్నారు. ఎందుకు?

తా: మా నాయన ఇచ్చిన బంగారు పవిత్రం పోయిందే, అని చిత్తము కకావికలై వయసు మీరిన తండ్రి యేడుపు. మెట్టినింటివాళ్ళు చేయించిన ముత్యాలదండ ఎత్తుకుపోయాడే అని ముత్తయిదువ (అమ్మ) శోకము. ఈ మధ్యనే చేయించిన ముక్కుపుడక కోసం తట్టుకోలేక కుమిలిపోతోంది ఇంటి ఆడుబిడ్డ (నిగమశర్మ అక్క). తొమ్మిది రకాల రాళ్ళు పొదిగిన చెవిపోగు పోయిందని వ్యామోహంతో ఇంటల్లుడి (నిగమశర్మ బావ) పరితాపం.

ఎంత దుర్బుద్ధి! ఎంత దుర్భ్రాంతి! అహహ! అని కవి నవ్వు. మొత్తం సొమ్ములన్నీ ఏ మాత్రం ఒక్కటీ మిగల్చకుండా ఆ దురాచారశీలుడు దోచేసుకుని పోవడం ఊహించలేదా, లేదా లేక ఆ ఎఱుక లేదా!

(ఆత్మ పితృదత్త దర్భముద్రిక – తండ్రి చేయించిన బంగారు పవిత్రము. రాయలసీమ మాండలికం లో దీన్ని “కూర్చి” అని అంటారు. నిత్యనైమిత్తిక కర్మాచరణ కోసం ఆత్మీయులకు, గురువులకు, పురోహితులకు ఇలా కనకంతో పవిత్రం చేయించి దానం చేయటం ఒక ఆచారం. ఈ ఆచారం రాయలసీమలో ఇప్పటికీ ఉంది. ఇది ఆభరణం. ఆభరణం కాబట్టే నిగమశర్మ దీన్ని దోచినాడు.)

ఈ సందర్భాన పుట్టపర్తి నారాయణాచార్యుల వారి వ్యాఖ్యానం రమణీయం.

ఇంతటి చిక్కని హాస్యము మన కావ్యముల యందుఁ జాల యఱుదు. వారి ప్రవర్తనములను జూచి రామలింగడు “ఎంత దుర్బుద్ధి! యెంత దుర్భ్రాంతి! యహహ! యని నవ్వుచున్నాడు. ఈ నవ్వు నవ్వుకాదు. ఆ పాత్రల నాతఁడు పొడుచు బాకుపోటులు. ఆ మాటలతో నాతడు వారిని వెక్కిరించుచున్నాడు. వారి బుద్ధి దుర్బుద్ధియట! వారి భ్రాంతి దుర్భ్రాంతియట! దుర్బుద్ధి యెందున్నది? – సర్వనాశనమైనందు కేడ్వక తమతమ వస్తువులకై కుందుటలో నున్నది. దుర్భ్రాంతి యెందున్నది? అల్పవస్తువుల మీది యభిమానముతో దమ సర్వనాశమును గుర్తింప లేకపోవుటలో నున్నది.

ఈ హాస్యముత్తమము. …ఈ దుర్బుద్ధి, దుర్భ్రాంతులీ పాత్రలకు మాత్రమే యున్నవా? లోకమున నందరికి నున్నవి. దేశకాలభేదము లేక యందరు మానవులకు నిట్టి అల్పగుణములు సహజములు.”

తెనాలి రామకృష్ణుని వికటత్వానికి, ఆయన సూక్ష్మ మనస్తత్వపరిశీలనకు, లోకంలో మనుషుల లౌల్యపు చిత్రీకరణకు, ఈ పద్యం మచ్చుతునక. ఆయన చెప్పదలుచుకున్న భౌతిక విలువల నశ్వరత్వానికి ఇది పరాకాష్ట!

నిజానికి ఓ తల్లి కూడా – కన్నకొడుకు కోసం కాక, ముత్యాలదండ కోసం ఏడుస్తుందా? అన్నది పాఠకుడు ఊహకు అందని విషయం. “కుపుత్రో జాయేత, క్వచిదపి కుమాతా న భవతి” (చెడ్డ కొడుకు ఉంటాడు కానీ, ఎక్కడా చెడ్డ తల్లి ఉండదు) అని కదా, ఆదిశంకరులు ఉటంకించినది!

అయితే ఇందాక రాళ్ళపల్లి వారి రచనలోని ఉటంకింపు లో చెప్పినట్టు – సంపూర్ణ వస్తు నిర్మాణమునకు అతనియందు లేనిది నేర్పుగాదు, ఓర్పు.” రామకృష్ణకవి – చెప్పదలుచుకున్నది అమ్మ (తనం) లోని దుష్టత్వాన్ని కాదు, మానవ సహజమైన మానసిక దౌర్బల్యాన్ని, సుఖలాలసను. ఇది స్పష్టంగా చెప్పక, ఓ సన్నివేశాన్ని సృష్టించి, ఆ సన్నివేశంలో పాఠకుణ్ణి నిమగ్నం చేసి, ఆతడు లీనమైన క్షణాన సాచి లెంపకాయ కొట్టటం ఈయన పద్ధతి.

రాళ్ళపల్లి వారి వ్యాసం లంకె యిది.

ఆ వ్యాసం చివరన పరిహాసము పవిత్రవస్తువును కూడా గమనింపదేమో!” అని రాళ్ళపల్లి వారన్నారు. (అయితే ఆడుబిడ్డ – ముక్కెర కోసం ఏడవలేదని, తన సౌభాగ్యచిహ్నమైన ముక్కెర పోయింది కాబట్టి, ఆ వేదనతో ఏడ్చిందని వేదాల వేంగళాచార్యులు అనే విమర్శకులు నిరూపించే ప్రయత్నం చేశారట. కానీ అది అంత తర్కానికి నిలువదని ఇతరులు పేర్కొన్నారు.)

గమనార్హమేమంటే – నిలువునా (తమ) సొమ్ములన్నీ నిగమశర్మ దోచిపెట్టేశాడు కాబట్టి దురాచారపరుడైనాడు. అంటే – అయిన వారికి కావలసినది అతడు నిజంగా అనాచారవర్తనుడై, దురాచారపరుడవటం కాదు, తమ ప్రతిష్ఠకు, కీర్తికి, సొమ్ములకు ఆపత్తి వచ్చినప్పుడు ఎదుటి వాడు నిజంగా పరమ దురాచారవర్తనుడు అని కవి సూచిస్తున్నట్టు ఉన్నది. ఇదీ రామకృష్ణుడు ప్రదర్శించిన లోకపు తీరు!

ఈ ఘట్టాన్ని, పద్యాన్ని – ఆలంకారికంగా కూడా చూడాలి. పైని పద్యం – హాస్య రసావిష్కరణకు చక్కని, చిక్కని ఉదాహరణ. హాస్యరసం హాస స్థాయీభావాత్మకము. ఇక్కడ లౌల్యము విభావం. లౌల్యము – అంటే విషయములలో అనియతత్వము. (ఒకే విధమైన ప్రాధాన్యత లేని తత్వము). శోకంతో జనించిన స్వేదము మొదలైనవి (శోకంబు, అడలు, వనటఁబొందు) అనుభావములు. మోహము (వ్యామోహియై, చిత్తంబు చెలగి, దుర్వారయై ) – వ్యభిచరీభావం. హాస్యంలో ఆత్మస్థ, పరస్థ అని రెండు రకాలు. ఇక్కడ ఆత్మస్థము. కారణం ప్రత్యక్షమైతే ఆత్మస్థము (అభినవగుప్తుడు). హాసము 6 విధాలని భరతముని. స్మితము, హసితము, విహసితము, ఉపహసితము, అపహసితము, అతిహసితము – ఈ ఆరుభేదాలు. ఇందులో ఈ పద్యాన ఉన్నది అపహసితము. అపహసితము అన్నది అస్థానహసితము – అంటే అనువు కాని చోట, శోకవిషయములలో వచ్చునది. హాస్యరసం స్త్రీలలోనూ, సామాన్యపాత్రలలోనూ ఈ హాస్య రసం కద్దు. ’స్త్రీనీచప్రకృతావేషం భూయిష్ఠం దృశ్యతో రసః’ – అని భరతుడు. ఇక్కడ నీచ శబ్దానికి – కావ్యంలో అప్రధానమైన, సాధారణమైన పాత్ర అని అర్థం.

రామకృష్ణుడు రచించిన మరొక కావ్యం “ఘటికాచల మహాత్మ్యము”. ఆ కావ్యంలో కూడా రామకృష్ణుని ఒకానొక అనౌచిత్యఘట్టాన్ని గూర్చి కేతవరపు రామకోటిశాస్త్రి అనే విమర్శకులు ఇలా అంటారు.

శతశృంగమున తపమాచరించు సప్తర్షులకు భంగపాటొనరించుటకు నింద్రుడు రంభా మేనకాద్యప్సరసలను పంపినాడు. అప్సరల ప్రయత్నము వృథాయైనది. ఈ వ్యర్థప్రయత్నమంతయు 77 గద్యపద్యములలో వర్ణితము. ఇంత దీర్ఘముగా వర్ణించి కవి సాధించిన ప్రయోజనము లేదు…”

****

మరొకసారి మెయిన్ ట్రాక్ కు.

****

(ఉపాఖ్యానపు) మూలతత్వపు వైచిత్రి.

అడవిని పడి పోతున్న నిగమశర్మను దొంగలు ఆటకాయించి, ఛావగొట్టి సొమ్ములు మొత్తాన్ని దోచుకున్నారు. కదలలేక పడి ఉన్న అతణ్ణి ఒక కాపు రక్షించి తన యింటికి తీసుకెళ్ళినాడు. ఆ ఇంటివారి పరిచర్యలతో నిగమశర్మ మెల్లగా కోలుకున్నాడు. ఆ ఇంటి కోడలు నిగమశర్మపై మరులు గొన్నది. ఆ ఇంటి వారి వల్లనే తాను కోలుకున్నా, కృతఘ్నుడై, ఆ కోడలైన కాపు పడతిని నిగమశర్మ ఒకనాడు లేవదీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన నిగమశర్మ బోయజాతితో కూడి కిరాతుడై, వేటాడి ఆహారం సంపాదించసాగినాడు. కొన్నాళ్ళకా కాపు అమ్మాయి మరణించింది. పిదప నిగమశర్మ మరొక బోయయువతిని పెళ్ళాడి, ఆమెతో బిడ్డలను కూడా కన్నాడు. ఓ నాడు నిగమశర్మ వేటకు వెళ్ళి వచ్చే సమయానికి ఆతని గుడిసె మంటల్లో చిక్కుకున్నది. ఆతని భార్యాబిడ్డలు మరణించినారు. ఆ ఘటనకు పిచ్చివాడైపోయినాడు నిగమశర్మ.

’ఇలన్ చతికిలబడి పలుమఱు తల దోర్చుచు వికృతమగు వదనమున లాలాజలములు తీగెలు సాగగా’ – ఆతడు ఆలిని గూర్చి పరిపరివిధాలుగా దీనాతిదీనంగా తలపోశాడు. నిద్రాహారాలు మానేసి పరిభ్రమించసాగినాడు. ఇలా తిరుగుతూ చివరకు ఒకానొక నరసింహక్షేత్రంలో వచ్చి పడినాడు.

ఈ సందర్భాన తెలుగు సాహిత్యంలో ఒక అపూర్వమైన సీసపద్యాన్ని తెనాలి రామకృష్ణకవి రచించినాడు.
తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన సీసపద్యం.
సీ.
ఒక యింత ఱెప్పవేయక చూచుఁ బెఱవారిఁ
          దలకొట్టుకొని దుఃఖజలధి మునుఁగు
బిలము తెఱువుమంచు బృథివిలోఁ జొరఁబాఱు
          సమధికస్తంభోద్భవము గమించుఁ
దిరియువాఁడును బోలె దెసలకుఁ జెయి చాఁచుఁ
          దొరఁగు నస్రాంబుధి దొప్పదోఁగు
హా! పోయితే యనియఱచు భార్యగుఱించి
          బహువిధిరాసక్తి భ్రాంతిఁ బొందుఁ
గీ.
జేరఁగారాని దర్శనస్థితి వహించు,
బాడబస్ఫూర్తి లోఁగొన్న పగిదినుండు
దానవారాతి కాఁబూని తదవతార
దశకమును మున్నె తాల్చెనా ధరణిసురుఁడు.
(పా. 3.102)
ఈ పద్యంలో నిగమశర్మ చేష్టలను విష్ణువు యొక్క దశావతారాలతో కవి పోల్చినాడు.
బ్రాహ్మణుడైన నిగమశర్మ విష్ణువు రూపును పొందదలచి, ఆ అవతార దశకాన్ని తాల్చెనా అన్నట్టు ఉన్నాడు. ఆతని చేష్టలు ఇవి.
కొంచెం కూడా ఱెప్ప కదల్చకుండా అందరినీ చూస్తున్నాడు. (మత్స్యావతారం)
తలబాదుకుంటూ దుఃఖసముద్రంలో మునుగుతున్నాడు. (కూర్మావతారం)
చనిపోయిన భార్యబిడ్డలను తలచి బిలము తెరువు మని సణుగుతూ నేలలో ప్రవేశింపజూస్తున్నాడు. (వరాహావతారము)
కొయ్యబారిన స్థితిని పొందుతున్నాడు. స్తంభోద్భవము (నారసింహావతారం)
బిచ్చగాడిలా నలుదిశలూ చేయి చాస్తున్నాడు. (వామనావతారం)
అస్రాంబుధి లో మునుగుతున్నాడు. అసృక్ అంటే రక్తము. అస్రాంబుధి అంటే రక్తపుటేరు (పరశురామావతారం)
హా! వెళ్ళిపోయినావా అని భార్య గురించి చింతిస్తున్నాడు. (రామావతారం)
బహువిధ ఇర ఆసక్తి = పెక్కు విధములైన దాహములు(మద్యపానములు) తో భ్రాంతి పొందుతున్నాడు (బలరామ అవతారం)

చేరకూడని దర్శనము (బౌద్ధము) యొక్క రూపాన్ని పొందాడు (బౌద్ధావతారం). (ఇక్కడ చేరరాని స్థితి – అంటే కృష్ణుని విశ్వరూపదర్శన యోగము అన్న అర్థం కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ పక్షంలో కృష్ణావతారం)

బడబాగ్ని కడుపులో దాచుకొంటున్నట్టున్నాడు. (బాడబము అంటే గుర్రము – కల్కి అవతారం)

ఈ పద్యంలో శ్లేష అలవోకగా సాగింది. నిగమశర్మ దుఃఖపు విషయం నుంచి, శ్లేష ద్వారా ఉద్యోతించిన దశావతార వర్ణనలు ప్రత్యేకమై, దూరంగా జరిగినట్టుగా లేదు. ఆతని దుఃఖం, దశావతారాలు రెండూ ఒకదానిని మరొకటి అంటి ముడివడినట్టు యున్నవి. ఇది చాలా విలక్షణమైన, విశిష్టమైన ప్రతిభ.

*****

అలా పరిభ్రమిస్తూ, కృశించిపోయి ఆ నారసింహక్షేత్రంలో నిగమశర్మ తన తనువును చాలించినాడు.

మరణించిన నిగమశర్మను యమదూతలు తోడుకొని పోతుంటే, విష్ణుదూతలు వారిని అడ్డగించినారు. అప్పుడు యమదూతలు – నిగమశర్మ చేసిన పాపాల ’జాబితా’ వినిపించినారు. కానీ నారసింహ క్షేత్రాన మరణించిన మాత్రాన, విష్ణుదూతలు, ఆతని రక్షించి, సగౌరవంగా శ్వేతద్వీపములోని పరమపదానికి తోడుకొని పోయినారు.

భూలోకాన పరమపాతకుడైనా నరసింహక్షేత్రాన మరణించిన కారణమాత్రమున అతడు ఉత్తమోత్తమపదమును పొందినాడు!
ఈ ఆఖ్యానాన్ని పరమశివుడు నారదుడికి వినిపించాడు.

****

ఇక్కడ ఉపాఖ్యానపు చివరన కూడా రామకృష్ణుడి తత్వం నిగూఢంగా ఉంది. భూలోకంలో ఎన్ని పాపపు పనులు చేసినప్పటికీ, జీవి యొక్క పరిధిలో లేని కారణమాత్రమైన ’సుక్షేత్రంలో మరణప్రాప్తి’ ద్వారా పరమపదాన్ని పొందటాన్ని రామకృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ కవి – నిజంగా క్షేత్రప్రాశస్త్యాన్ని గురించి చెబుతున్నాడా? లేక పైకి క్షేత్రప్రాశస్త్యాన్ని ప్రశంసిస్తూ, పరోక్షంగా మానవుని ఆలోచనాతీరులో డొల్లతనాన్ని పరిహసిస్తున్నట్టా?

సహృదయులకు ప్రజాకవి వేమన కొంత గుర్తుకు వస్తాడు ఇక్కడ.
.వె.
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!
మిథ్యాచారాలను వేమన స్పష్టంగా కడిగిపారేశాడు. ఆయనది స్పష్టత అయితే రామకృష్ణుడిది గోప్యం.

ఉద్భటారాధ్య చరిత్రములోని మదాలస చరిత్రములో కూడా మదాలసుడు కావలసినన్ని పాపాలు చేస్తాడు. తుదకు యమభటులు మదాలసుని పాపాల చిట్టాను విశ్వనాథుని ముందు విప్పి చెబుతారు. ఇటువంటి ఖలుడు పరమేశ్వరుని చేరుకొనుట చోద్యము కాదా, అని వారు విశ్వేశ్వరునితో వాదిస్తారు.

కం.
ఇఁక నేల ధర్మసంగతి
యిఁకనేల? పరోపకార హేలా విభవం
బిఁకనేల విధినిషేధము
లిఁక నేల వివేక మాత్మ నెఱుఁగు తలంపుల్. (. 2.275)

తా: ఇలా అయితే, ధర్మప్రస్తావన ఎందుకు? పరోపకారముతో వచ్చే వైభవమెందుకు? నీతినియమాలెందుకు? వివేకమెందుకు? ఆత్మ జ్ఞానమనే మాట యెందుకు?

కం.
వలసిన లాగులు గ్రుమ్మరి
బలహీనుల వెఱపు లేక పరిమార్చి తుదన్
జలనంబు లేని నిన్నున్
గలయుట పనిగాదె తలఁపఁగా దేహులకున్. (. 2.276)

తా: తన చిత్తానకు వచ్చినట్టు తిరిగి, ఏ మాత్రం సంకోచం లేక బలహీనులను చంపి, చివరకు చలనము లేని నిన్ను పొందటము దేహులకు తగునా! (పరమేశ్వరునికి స్థాణువు అని పేరు. స్థాణువు అంటే చలనము లేని వాడు. అంత నిష్టగా తనలో తాను తపస్సుయందు లీనమై యుండువాడు.)

పై పద్యాల ద్వారా కవి, కొంత తన మనస్సు లోని ప్రశ్నలనే కావ్యం ద్వారా పాఠకులకు సంధించినట్లు తోస్తుంది.

(ఇలా ప్రశ్నించిన వారికి విశ్వనాథుడు సమాధానం వివరిస్తాడు – కాశీలో మరణించినవాడు సిద్దరసం సాయంతో ’ఇనుము కాంచనంబైన కైవడి’ ముక్తినందుతాడు.)

ఎన్ని పాపాలు చేసినా, కాశీలోనో, నారసింహ క్షేత్రంలోనో మరణిస్తే చాలు!

ఇంత సులభముగా మోక్షము లభించునట్లు మనము కూడా నిగమశర్మకంటే రెండాకులెక్కువ చదువి చావువేళకే క్షేత్రమునో, తీర్థములో చేరికొనవచ్చును. ” – అని పుట్టపర్తి నారాయణాచార్యుల వారు వ్యాఖ్యానిస్తారు.

ఇదివరకు శైలి వైచిత్రిలోనూ, శిల్పవైచిత్రి లోనూ కవి చూచాయగా, భౌతికవాదపు నశ్వరత్వాన్ని, డంబాచారాలను, లోకపుతీరులోని బండవాళాన్ని బయటపెట్టినాడు. అయితే – ఈ మూలతత్వ వైచిత్రి విషయంలో మాత్రం ఆయన మరీ అంత స్పష్టంగా బయటపడలేదు. దుర్భాగ్యవశాత్తూ ఏ కాలంలో అయినా కవికి కొంత లౌక్యం తప్పనిసరి. బహుశా నాటి కాలమానపరిస్థితులను అనుసరించి, ఆయన ఆ గుంభన ను పాటించినాడేమో!

ఏది ఏమైనా రామకృష్ణుని తత్వం నిగూఢమైనది. బహు సూక్ష్మమైనది, నివృత్తి పరమైనది. స్థూలంగా కావ్యధోరణులకు అతీతమైనది. ఆలంకారిక పద్ధతులకు లొంగనిది. ఈ కవిని అనుశీలించాలంటే – పాఠకుడు ఆయన దారిని వెళ్ళాలి. అందుకు బహుశా ఆ పాఠకుడూ కొంత రామకృష్ణుని తీరును వంటబట్టించుకుని ఉండవలె. అలా అని ఈ కవి సాధారణ కావ్యానుశీలకులకు, సహృదయులకు అందడా? అంటే అందడని చెప్ప వీలు లేదు. “పాండురంగవిభుని పదగుంఫనము” అన్న పేరు తెనాలి రామకృష్ణునకు ఉన్న ప్రశస్తి. ఆ “పదగుంఫనము” గురించి మరెప్పుడైనా విచారిద్దాం.

ముగింపు.

ఒకప్పటి విజయనగరం, నేటి ’హాడుపట్టణ’ (హంపి) లో ఒకానొక గుట్టపై ఓ చిన్న శిథిల మంటపం కనిపిస్తుంది. ఆ మంటపం పేరు – ’తెనాలి రామన మంటప’. ఈ మంటపం చాలా దూరంగా, ఎత్తుగా, ప్రత్యేకంగా, ఏకాంతంగా అగుపిస్తుంది. విజయనగరం ప్రాభవంగా ఉన్న రోజులలో తెనాలి రామకృష్ణుడు ఆ మంటపాన ఏకాంతంగా కూర్చుని తనలో తాను లీనమై, తోచినది వ్రాసుకుంటూ ఉండేవాడట!

(తెనాలి రాముని మంటపం, హంపి.)

ఆ మంటపము తెనాలి వాని లానే ప్రత్యేకమై, ఉన్నతంగా అగుపిస్తుంది. ఆ ఉన్నతి, విశిష్టత, ప్రత్యేకత ఆయనకే తగు!

****

ఉపకరణములు.
ఆరుద్ర – సమగ్రాంధ్రసాహిత్యం లో “తెనాలి రామకృష్ణుడు” వ్యాసం.
తెనాలి రామకృష్ణుని తెలుగు కవిత, రామకృష్ణుని రచనావైఖరి – పుట్టపర్తి నారాయణాచార్యులు.
నిగమశర్మ అక్క వ్యాసము – రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
పాండురంగ మహాత్మ్యము – బులుసు వేంకటరమణయ్య గారి లఘుటీకతో – వావిళ్ళ ప్రెస్.
ఉద్భటారాధ్య చరిత్రము – నిడదవోలు వేంకటరావు గారి విపులపీఠికతో – లోటస్ పబ్లిషర్స్ తెనాలి.
ఘటికాచల మహాత్మ్యము – కేతవరపు వేంకటరామకోటి శాస్త్రి గారి వ్యాసం – 1955 భారతి.
ఇతర అలంకారిక గ్రంథాలు, ప్రబంధ గ్రంథాలూ.

Exit mobile version