Site icon Sanchika

తెంగ్లీష్ తెగులు

[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ కౌండిన్య భోగరాజు రచించిన ‘తెంగ్లీష్ తెగులు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]“గ్రాం[/dropcap]డ్ పా! గ్రాండ్ పా! లూక్ ఎట్ దిస్!”

ఐదేళ్ల వాడి జీవితంలో మొట్టమొదటిసారి గొంగళి పురుగును చూస్తున్న ఆశ్చర్యాన్ని తాతయ్యతో పంచుకుంటున్నాడు ‘యో’.

తాత పంతంపట్టి ‘పతివాడ యోగానంద నాయుడు’ అని పేరు పెడితే, ఆ ముచ్చట బారసాల వరకే మిగిలిపోయింది. పాతకాలం పేరని, ఇప్పటి పిల్లలు పలకలేరని ఏవేవో కారణాలు చెప్పి మొత్తానికి యోగానందని కాస్త ‘యో’ చేసేసారు కొడుకు కోడలు.

“గ్రాండ్ పా! గ్రాండ్ పా!” అంటూ గొంగళీని చూసి గోల చేస్తున్న యోగాడిని పట్టుకొని

“ఒరేయ్ ముద్ద తింటూ చూడు నాన్న!” అంటూ గోరుముద్దలు కలిపి పెడుతోంది నాన్నమ్మ. కొడుకు కోడలు వైపు చూస్తూ

“ఏరా సెల్‌ఫోన్ చూపిస్తే కానీ తినడన్నావ్? ఇప్పుడు ఎలా తింటున్నాడు?” మనవడి దురలవాటును తప్పించానన్న విజయ గర్వంతో అన్నారు రామకృష్ణ గారు.

రామకృష్ణ గారిగా కన్నా తెలుగు మేషారుగా విజయనగరంలో పేరుగాంచిన రామకృష్ణ గారు తెలుగు ఉపాధ్యాయునిగా పదవీ విరమణ చేశారు. ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి ఒక్కడే కొడుకు. కొడుకు దీపక్, కోడలు సౌమ్య. ఇద్దరివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే. బెంగళూరులో ఉంటారు. దగ్గర అంటే దగ్గరే మరి. అర్ధరాత్రి అవసరం పడితే తెల్లారే సరికల్లా వచ్చేంత దగ్గర పండక్కో, పబ్బానికో తప్ప రాలేనంత దూరం. ఎప్పుడు వచ్చినా రాకపోయినా ఉగాదికి మాత్రం కొడుకు, కోడలు మనవడితో సహా రావాల్సిందే. ఎంత కాదన్నా తెలుగు మేషారు కదా తెలుగన్నా, తెలుగు వాళ్ళన్నా తెలుగు సంస్కృతన్నా ప్రాణమిస్తారు. ఉగాది అంటే మరో సెలవు దినం అయిపోయిన రోజుల్లో సోమవారం నాడు పడితే బాగున్ను మరో సెలవు కలిసి వస్తుంది అనుకునే మనుషుల మధ్య రామకృష్ణ మేషారుకి మాత్రం ఉగాది అంటే ఇప్పటికీ కొత్త సంవత్సరానికి ప్రారంభమే. మామిడి తోరణాలు, కోయిల కూతలు, పచ్చడి రుచులు, కవితల పోటీలు, పంచాంగ శ్రవణం మరో సంవత్సరానికి స్వాగతం ఇది మేషారు లాంటి పాతకాలం వాళ్ళ ఉగాది నిర్వచనం. అందుకే కొడుకు, కోడలు కూడా ఏది ఏమైనా ఉగాదికి మాత్రం విజయనగరం వచ్చి తీరుతారు.

ప్రతిసారి లాగే ఈసారి వచ్చారు. ప్రతిసారిలాగా ఈసారి కూడా ‘యో’ గాడు తెలుగుతనానికి మరింత దూరం అవడం గమనించారు మేషారు. తెలుగు మాట మాట్లాడడు, తెలుగు బట్ట కట్టడు, తెలుగు తిండి అసలే తినడు. ‘యో’గాడికి మాటలు వచ్చాయి అని తెలిసిన వెంటనే “తాతయ్య!” అని పిలిపించుకుందాం అనుకున్న మేషారికి ‘గ్రాండ్ పా’యే దక్కింది.

పండగ కదా అని పులిహోర, పరమాన్నం, బూరెలు, గారెలు చేసింది నాన్నమ్మ. సరే ఇవి నచ్చలేదేమో అని మర్నాడు కమ్మటి కోడికూర కూడా చేసి పెట్టింది కానీ ఎక్కడ! మన ‘యో’గాడికి పిజ్జా అనబడే సాగే మైదా ముక్కలే ఇష్టం. ఈ వేషాలకి తోడు ఈసారి మరో వెధవ్వేషం అలవాటు చేసుకున్నాడు. ఆరు నూరైనా, ఆకాశం విరిగిపడినా, నేల ముక్కలైపోయినా వాడి ముందు సెల్‌ఫోన్ పెట్టి, ఎవరికీ అర్థం కాని ఆంగ్ల పద్యాలు పెడితేనే తింటాడు. లేకపోతే అది పిజ్జా అయినా, పరమాన్నమైన, ఆఖరికి అమృతమైన ముట్టుకోడు.

ఆరోజు సాయంత్రం, ‘యో’ గాడి భోజన సమయమైంది, అంతా సిద్ధం చేశాక ఉన్నట్లుండి నెట్టు పోయింది, సిగ్నల్ రావడం లేదు దాంతో ‘యో’గాడి పేచీ పతాక స్థాయికి చేరింది. బతిమాలి బామాలి బుజ్జగించినా ముద్ద కాదు కదా మెతుకు కూడా ముట్టుకోడు, గయ్యిమని ఏడుస్తూ గోల గోల చేస్తున్నాడు. నెట్ లేక, సిగ్నల్ రాక, వీడు మాట వినక విసుగెత్తి వేసారి పోయారు కొడుకు, కోడలు. ఇలా కాదని గంజాయీ నల్లమందుకి అలవాటు పడ్డ వాళ్ళని తలపిస్తున్న ఆ యోగాడిని ఎత్తుకొని పెరట్లోకి తీసుకువెళ్లారు నాన్నమ్మ, తాతయ్య. మొక్క, మొగ్గ, పురుగు, పుట్ర చూసి,

‘వాట్ ఇస్ దట్’ ‘వాట్ ఇస్ దిస్’

అని ఆంగ్లంలో ఆరా తీస్తున్న ‘యో’గాడికి ఆకలి తీరి, పొట్ట బయటకు వచ్చేదాకా తినిపించి, మూతి కడిగి, మూడుసార్లు కంచం తిప్పి దిష్టి కూడా తీసింది నాన్నమ్మ. ఆకలి తీరాక ‘యో’గాడు వేసే వేషాలు చూస్తూ నవ్వుకుంటున్నారు నలుగురు. మనవడి దురలవాటు మాన్పించానని గర్వపడుతున్నారు మేషారు.

సరిగ్గా అదే సమయానికి వచ్చాడు మేషారి కొడుకు దీపక్ మిత్రుడు చందు. ‘వీడిప్పుడు ఎందుకొచ్చాడ్రా బాబు’ అని దీపక్, సౌమ్యలు అనుకుంటుండగానే తలుపు తీసుకొని పెరట్లోకి వచ్చాడు. “మీ లాఫ్స్ స్ట్రీట్ ఎండ్ దాకా వినిపిస్తున్నాయి, ఇమీడియట్‌గా అనుకున్నా – మీరు వచ్చి ఉంటారని, హలో అంకుల్! హాయ్ ఆంటీ!” అంటూ పలకరించాడు చందు.

ఈ రకం భాష వింటేనే చిర్రెత్తుకొస్తుంది మేషారికి. ఆంగ్లాన్ని అవసరానికి మించి అతిగా, అనవసరంగా వాడి, తెలుగుని ‘తెంగ్లీష్’ గా మారుస్తున్న చందు లాంటి వాళ్ళంటే పరమ అసహ్యం మేషారికి.

చందు ఇంకా మాట్లాడితే మేషారు ఏదైనా అని, స్వతహాగా నోటి దురుసుతనం ఉన్న చందు దానికి ఏదో సమాధానం ఇచ్చి, అనవసరంగా వాదించుకుంటారని తెలిసిన దీపక్

“ప్రతి ఉగాదికి వస్తాం కదరా! ఈసారి మనోళ్ళని కలవడం అవ్వలేదంతే” అంటూ చందూని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ‘యో’ గాన్ని చూసి

“రేయ్! యో!” అంటూ వాన్ని ఎత్తుకుని, ఆడిస్తున్నాడు చందు. చందు ఏదైనా అనే లోపే “సరే ఒక్క నిమిషంలో వస్తా, అలా వెళ్దాం” అంటూ బట్టలు మార్చుకునేందుకు లోపలికి వెళ్ళాడు దీపక్ కాస్త చూసుకో అన్నట్లు భార్యకి సైగ చేస్తూ.

మేషారి భార్య చందుకి టీ ఇచ్చి, కుశల ప్రశ్నలు వేసి, అప్పుడప్పుడు కనిపిస్తుండమని చెప్తూ “ఇంతకీ ఎటెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు” అని అడిగారు. దానికి చందు

“ఈవినింగ్ విండ్ బాగుంది, క్లైమేట్ నైస్‍గా ఉందని, అలా ఫ్రెండ్స‌‍ని మీట్ అవడానికి స్టార్ట్ అయ్యాను ఆంటీ! ఆన్ ద వే యే కదా వీడు కూడా టాగ్ అలాంగ్ అవుతాడని, మీ లాఫ్స్ విని, ఎంటర్ అయ్యాను, ఒక టూ అవర్స్ లో వచ్చేస్తాం” అని తెంగ్లీషులో సమాధానం ఇచ్చేసరికి చిరాకు ముదిరి కోపంగా మారింది మేషారికి.

“రాష్ గా డ్రైవ్ చేసి రోడ్ రాష్ చేసుకోకండి రా, స్లోగా వెళ్లి సేఫ్‌గా రండి” వెటకరించారు మేషారు. తల దించుకొని నవ్వాపుకుంటున్న ఆంటీని, సౌమ్యని చూసిన చందూకి విషయం అర్థమైంది. ఏదో అనే లోపే “హంగ్రీ వేస్తే, అవుట్ సైడ్ ఫుడ్ ఈట్ చేయకండిరా, హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఆంటీ ఎలానూ కుక్ చేస్తుంది వచ్చి ఈట్ చేయండి” కొనసాగించారు మేషారు.

ఈ మాటలు విన్న భార్యకి కోడలికి నవ్వాగక ఫక్కున నవ్వారు. అదే సమయానికి దీపక్ వచ్చాడు చందూకి తలకొట్టేసినట్లయింది.

“సరే పదరా” అంటూ దీపక్ చందూని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించినా, మేషారి వెటకారం చందూ ఆహాన్ని దెబ్బతీసింది.

“ఓకే, అండర్‌స్టుడ్. నన్నే టీజ్ చేసారు, అసలు నా లాంగ్వేజ్‌లో రాంగ్ ఏంటి అంకుల్” కాస్త కోపంగానే అన్నాడు చందు.

“పెద్దగా ఏం లేదు, అండర్‌స్టుడ్ కాదు ‘అర్థమైంది’; టీజ్ కాదు ‘వెక్కిరింత’; లాంగ్వేజ్ కాదు ‘భాష’; రాంగ్ కాదు ‘తప్పు’. ఇంకా చెప్పాలంటే అంకుల్ కాదు ‘మావయ్య లేక బాబాయ్’. నీ తెలుగుకి తెంగ్లీష్ సోకింది నాయనా! తెలుగు పదాలు ఎక్కువ మాట్లాడుతుంటే త్వరలోనే తగ్గిపోతుంది” కొట్టినట్టు చెప్పారు మేషారు.

“ఏ వర్డ్ యూస్ చేస్తే ఏంటి, మీనింగ్ కన్వే అవుతుంది కదా” వాదన ఆపే దీపక్ ప్రయత్నాన్ని పట్టించుకోకుండా అన్నాడు చందు.

“భాషని బ్రతికించేవి దాని పదాలే, పదాలు వాడకపోతే పదాలు తగ్గిపోతాయి, పదాలు తగ్గితే భాష ఆయుష్షు తగ్గిపోతుంది, నువ్వు వాడే ప్రతి అనవసరపు ఆంగ్ల పదం తెలుగు ఆరోగ్యానికి హానికరం” వివరించారు మేషారు.

“అలాంటప్పుడు ఇంగ్లీషులోలా వర్డ్స్ ఈజీగానైనా ఉండాలి, లేదూ ఒక గ్రేట్ వరల్డ్ లాంగ్వేజ్ అయినా అవ్వాలి, ఇంగ్లీష్ లేకుండా డైలీ వర్క్స్ అవ్వవు, సో తెలుగు తగ్గిపోతుంది, దానికి ఏం చేయలేం కదా” వితండవాదం మొదలు పెట్టాడు చందు.

తల్లినంటే బిడ్డకు వచ్చినంత కోపం వచ్చింది మేషారుకి. తెలుగు గొప్పతనం, ప్రస్తుత పరిస్థితి గల చారిత్రక, రాజకీయ కారణాలు చెప్పగలిగి కూడా అతని కోపం చందుని మందలించమనే చెప్పింది.

“ఏ భాష అయినా ఎంత గొప్పదంటే, ఆ జాతి ఆ భాషను ఎంత ప్రేమిస్తే అంత గొప్పది. ఆత్మగౌరవం లేని ఆంధ్రులుగా మారాం, ఇక భాషాభిమానం ఎక్కడ వస్తుంది, అయినా కంప్యూటర్‍ని తెలుగులో కంప్యూటర్ అనవద్దు అనడం లేదు, కానీ ‘అమ్మ’ ని మమ్మీ అని, ‘అన్నా’న్ని రైస్ అని, ‘ఆకలి’ని హంగ్రీ అని, ‘భోజనాన్ని’ మీల్స్ అని అనే దౌర్భాగ్యం అక్కర్లేదు” మేషారి గొంతులో బాధ కోపం కాక నిరాశ, నిస్పృహ వినిపించాయి.

పరిస్థితి చేయి దాటిపోతోందని తెలిసి దీపక్ బలవంతంగా చంద్రుని అక్కడినుంచి తీసుకువెళ్లాడు. “అయితే ‘యో’గాడికి సరిగ్గా నేర్పించండి కొత్త జనరేషన్ గుడ్ తెలుగు మాట్లాడేలా చేయండి” వెళుతూ వెళుతూ చందు అన్న మాటలు మాత్రం మేషారిని ఆలోచింపజేశాయి.

తెంగ్లీషులో అన్నా తెలివిగానే అన్నాడు అనుకున్నారు మేషారు. చిన్న పిల్లలకి సరైన భాష నేర్పకపోతే వాళ్లు పెద్దవారై తెంగ్లీషులో కాక తేట తెలుగులో మాట్లాడరు కదా, మొక్కగా ఉన్నప్పుడే వంచాలన్నది నిజమే కానీ ఎలా వంచాలో మాత్రం అంతు పట్టలేదు. మర్నాడు దీపక్ కుటుంబం బెంగళూరు బయలుదేరుతుంటే, అల్లరి చేస్తున్న ‘యో’గాడిని ఒక దగ్గర కూర్చో పెట్టేందుకు, సౌమ్య వాడికి సెల్‌ఫోన్ ఇచ్చింది. అప్పుడు తట్టింది మాస్టారికి ఒక ఆలోచన. అర్థం కాని ఆంగ్ల పద్యాలు చూపించే బదులు అదే కార్టూన్లతో తెలుగు పద్యాలు, ఇంకా చెప్పాలంటే సులభమైన శతక పద్యాలు ఎందుకు చెప్పకూడదు? అని. బెంగళూరు వెళ్ళాక కొడుకు కోడలుతో ఈ ఆలోచన చెప్పారు.

దీపక్ “ఇప్పుడు అవన్నీ ఎందుకు?” అని మొదలుపెట్టి ఒక వీడియో చేయడంలో ఉన్న కష్టాలన్నీ చెప్పినా, సౌమ్య మాత్రం మామగారి వేదనని అర్థం చేసుకుంది. ఈ పని తెలిసిన, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న, తన స్నేహితుడు పవన్‌ని మేషారికి పరిచయం చేసింది. బాగా ఆలోచించి, పవన్‌తో సంప్రదించాక, మేషారు, అతను కలిసి శతక పద్యాలు అన్నింటినీ ఒక్కో పద్యానికి ఒక్క వీడియో చొప్పున వంద వీడియోలుగా చేసి, వంద రోజులు ఒక్కొక్కటిగా యూట్యూబ్‍లో విడుదల చేయాలనుకున్నారు. అందుకు ఛానల్ పేరు ‘శతకం’ అనే పెట్టారు. అందరికీ తెలిసిన, సులభమైన వేమన శతకాన్ని ఎన్నుకున్నారు.

ప్రతి 10 రోజులకి సరిపడా పద్యాల్ని, వాటి అర్థాల్ని మేషారు రికార్డ్ చేసి పంపితే, వాటికి పవన్ బొమ్మలు రూపం ఇచ్చి, వీడియో చేసి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. ఇదీ ఒప్పందం.

మేషారి దగ్గర అప్పటికే లాప్‌టాప్ ఉండడంతో, సౌమ్య పద్యాలు రికార్డ్ చేసేందుకు ఒక మైక్ కొనిచ్చింది. దాన్ని ఉపయోగించటం నేర్చుకోవడం, నమూనాలు చేసి పవన్‍కి పంపడం, వాటి మీద సంప్రదింపులు, మరికొన్ని ఆలోచనలు ఇలా మేషారి శతక పద్యాల ఆలోచన ఆచరణలోకి వచ్చేసరికి దసరా వచ్చింది.

దసరా నాడే మొదటి పద్యం అప్లోడ్ చేశారు. అప్పటికి యూట్యూబ్‌కి సంబంధించిన వ్యూస్, లైక్స్, కామెంట్స్ గురించి మేషారికి సౌమ్య వివరించి ఉండడంతో, అప్‌లోడ్ అయిందని పవన్ లింక్ ఇచ్చిన వెంటనే, దాన్ని తెలిసిన వాళ్ళందరికీ పంచారు. స్టేటస్‌గా పెట్టుకున్నారు. మొదటి రోజు మొదటి వీడియోని రెండొందల మంది చూశారని తేలింది. అంత ఎక్కువ మంది కాకపోయినా ఇంకా ఒక్కరోజే అయిందనీ, మెల్లగా అందరికీ తెలుస్తుంది అన్న ఆశతో ముందుకెళ్లారు.

రోజులు గడిచాయి. అనుకున్నట్లుగానే ప్రతి పది రోజులకి సరిపడా పద్యాల్ని రికార్డు చేసి మేషారు పంపుతున్నారు. పవన్ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాడు. మొదటి రోజే నయం రెండొందలైనా వచ్చాయి. ఇప్పుడు పంపిన పాతిక, ముప్ఫై మంది తప్పితే ఎవరూ చూస్తున్నట్టు లేదనిపించింది.

సౌమ్య హేష్ టాగులు పెడదామంది. # శతకం అని, # తెలుగు అని పెట్టారు. మేషారు మరింత చక్కగా పద్యాలను వివరించారు. పవన్ కూడా తనవంతు కృషి చేశాడు. కానీ డెబ్బై పద్యాలు అయ్యేసరికి పంపిన వాళ్లు కూడా చూడటం లేదనిపించింది.

ఆంగ్ల పద్యాలకి వచ్చినంత కాకపోయినా, తెలుగు శతక పద్యాల్ని కనీసం ఒక వెయ్యి మంది పిల్లలు అయినా చూడరా? అని బాధపడ్డారు మేషారు. ‘యో’గాడు కూడా పాపం సౌమ్య బలవంతం వలన చూస్తున్నాడనిపించింది. మేషారు డీలాపడడంతో అతని భార్యకి కూడా బాధనిపించింది.

“ఒక్కసారిగా మారాలంటే ఎలా, నెమ్మదిగా అందరూ చూస్తారు లెండి, మీకు వ్యూస్, లైక్స్ వస్తాయి” అంటూ పూటకో సారి ధైర్యాన్ని ఇచ్చారు.

అలా శతక పద్యాలన్నీ పూర్తయ్యాయి. శతకం పూర్తయింది అన్న ఆనందం కన్నా అనుకున్నంత మార్పు తేలేదన్న నిరాశే మిగిలింది మేషారిలో.

తెలియకుండానే నెలలు గడిచిపోయాయి. మరో ఉగాది వచ్చింది. ‘యో’ గాడిని మాషారింటికి తెచ్చింది.

“ఐ విల్ సే ఇట్, ఐ విల్ సే ఇట్” అంటూ గెంతుకుంటూ ఇంట్లోకి వచ్చాడు యోగాడు. ఏంట్రా, ఏమైంది, అంటున్న నాన్నమ్మ, తాతయ్యల ముందు నిల్చుని చెప్పనా అన్నట్లు అమ్మానాన్నల వైపు చూసి, చెప్పమని దీపక్ తలూపగానే

“ఉగాది శుభాకాంక్షలు నానమ్మ తాతయ్య”

అంటూ ముద్దు ముద్దుగా స్వచ్ఛమైన తెలుగులో అన్నాడు ‘యో’గాడు.

ఎన్నాళ్ళ నుండో మేషారి వైపైనా చూడని చిరునవ్వు, అతని పెదాలను ఒక్కసారి పలకరించింది. “ఎంత బాగా చెప్పాడో! బంగారు కొండ!” అంటూ నాన్నమ్మ ఎత్తుకు ముద్దులాడింది. “ఇంత తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది వీడికి” ఆశ్చర్యంగా అడిగిందామె.

“నాన్నగారి వల్లే” మేషారి వైపు చూస్తూ అన్నాడు దీపక్.

“మొదట్లో చాదస్తం అనిపించినా ఆలోచిస్తే కరెక్టే అనిపించింది, సరైనదనిపించింది” దీపక్‌ని సౌమ్యంగా సరిదిద్దింది సౌమ్య. “అదేలే, వీడికి భోజనమప్పుడు మీ పద్యాలే చూపెడుతున్నాం. అది సరిపోదని ఆఫీసు పనులకు తప్ప ఇంట్లో మేము ఎంత వీలైతే అంత తెలుగే మాట్లాడుతున్నాం. సౌమ్య అయితే దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుంది” నాన్నమ్మ చంక దిగి పెరటి వైపు పరిగెడుతున్న ‘యో’గాడి వెంట వెళ్తూ చెప్పాడు దీపక్.

“వీడి చేత తాతయ్య అనిపించటానికి ఒక ఉగాది పట్టింది” తన కష్టాన్ని చెప్పకనే చెప్పింది సౌమ్య.

“ఈ తరం తెలుగులో మాట్లాడతారంటే వేయి ఉగాదులైనా ఎదురు చూస్తానమ్మా” ఆశతో అన్నారు మేషారు.

మర్నాటి ఉదయం ‘యో’గాన్ని ఒళ్ళో పొదుపుకుంటూ

“ఈసారి సుమతి శతకం చేద్దామోయ్” అని పవన్‌కి ఫోన్లో చెబుతున్న మేషారిని చూస్తూ “సరిపోయింది! తాతా మనవలకు” అంటూ మురిసి పోయారు రామకృష్ణ మేషారి భార్య.

Exit mobile version