Site icon Sanchika

ఆత్మిక బంధాల అందమైన అనునాదం అతడు – ఆమె

[box type=’note’ fontsize=’16’] పరేశ్ దోషి రచించిన తేరే బినా జిందగీ పుస్తకానికి ప్రముఖ సినీగేయ రచయిత చైతన్య ప్రసాద్ వ్రాసిన ముందుమాట ఇది. [/box]

[dropcap]అ[/dropcap]నువాదం ఒక కష్టమైన ప్రక్రియ. అది ఏ భాష నుంచైనా, వచనమైనా, పద్యమైనా దేని కష్టం దానిదే. అనువాద విద్యలో విశేష అనుభవమున్న రాచమల్లు రామచంద్రారెడ్డి [రారా] గారు ఈ ప్రక్రియ లోని సాధక బాధకాలను చమత్కారంగా వివరిస్తూ ‘అనువాద సమస్యలు’ పేరుతో ఒక పుస్తకమే రాశారు. ముప్పయ్ ఏళ్ళ క్రితం వచ్చిన ఆ పుస్తకం అప్పట్లో ఒక సంచలనం. విశేష పాఠకాదరణతో పాటు కొందరి విమర్శలకు కూడా పాత్రమైంది. అదలా ఉంచితే… రారా గారు ప్రస్తావించని కొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తుంటాయి కాలం గడిచే కొద్దీ.

ప్రతీ భాషకూ, ఆ భాషా సాహిత్యానికీ, ప్రయోగాలకూ, సంస్కృతికీ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తెలుగు శబ్ద ప్రధానమైనది. హిందీ అర్థ ప్రధానమైనది. హిందీలో ఏకాక్షర పదాలు చాలా ఎక్కువ. అలాగే హిందీ చిత్రాల్లో ఉత్తరాది సంస్కృతీ సంప్రదాయాలు ప్రధానంగా ఉంటాయి. అవి తెలుగు లాంటి దక్షిణాది భాషల్లోకి అనువదించేటప్పుడు కృత్రిమంగా ఉంటాయి. అక్కడ అనువాదకుని విచక్షణ అవసరమవుతుంది.

పరేశ్ దోశీ గారు సంకల్పించి, సాధించిన ఈ ‘అతడు – ఆమె’ డబ్బింగ్ పాటలకు భిన్నమైనది. బాణీని, పెదవుల కదలికలనీ అనుసరించాలన్న నియమం నుంచి ఆయనకు మినహాయింపు ఉంది. ఆ రెండూ తప్ప మిగిలిన అనువాద సమస్యలన్నీ ఆయనకూ వర్తిస్తాయి. పైగా డబ్బింగ్ పాటల్లో మాకు సంగీతం, బాణీ, గాత్రం అండగా ఉండి, అనువాద రచనల్లో కొన్ని లోటుపాట్లూ, పొరపాట్లూ ఏవైనా ఉంటే వాటిని మరుగుపరుస్తాయి. దోశీ గారికి ఆ సౌకర్యం లేదు. పైగా ఆయన తన అనువాదాలకు ఏ గేయ పద్ధతినో కాకుండా వచన కవితా ప్రక్రియను ఎంచుకున్నారు. పాటను వచనం గానో, వచన కవిత గానో రాసినప్పుడు పేలవంగా తేలిపోయే ప్రమాదముంది. పరేశ్ దోశీ గారు ఆ సవాలును స్వీకరించి, సమర్థంగా నెరవేర్చడం నన్ను అబ్బురపరిచింది. ఎందుకంటే ఆయన చేసిన ఈ అనువాదాలు తీయగా ఉన్నాయి. అందుకు ఆయనను మనసారా అభినందిస్తున్నాను.

దోశీ గారు తన అనువాదాలను పుస్తకంగా తేవడానికి… హిందీ పాటల్లో ‘స్త్రీ పురుష సంబంధాలు’ అని ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకున్నారు. ఆ పరిధి లోకి వచ్చే పాతిక పాటలను ఎంపిక చేసుకున్నారు. అనువాదకుని గానే కాకుండా పరిశోధకునిగా కూడా మారి ద్విపాత్రల్ని పోషించారు. ఈ రెండు పాత్రల పోషణలో దేని కష్టం దానికి ఉంటుంది. నా దృష్టిలో రెండోది మరీ కష్టమైనది. పాటల అనువాదంతో పాటు వాటి పూర్వాపరాలూ, వాటిని సృజించిన వారి వివరాలూ, సందర్భాలూ, నేపధ్యాలూ ఇవన్నీ పరిశోధించి సాధికారికంగా చెప్పడం వెనుక ఉన్న అపార శ్రమ తెలుస్తూనే ఉంది. అందుకు కూడా పరేశ్ దోశీ గారిని అభినందిస్తున్నాను.

మొత్తంగా — ఇది ఒక హిందీ సినిమా పాటల ప్రేమికుడు తాను మెచ్చిన గీతాలను అందరికీ అందించడానికి చేసిన అందమైన, అర్థవంతమైన ప్రయత్నం.

– చైతన్య ప్రసాద్

Exit mobile version