మనల్ని మనకి చూపించే కథల సంపుటి ‘తల్లివేరు’

0
2

[శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారి ‘తల్లివేరు’ కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[dropcap]శ్రీ[/dropcap]మతి నెల్లుట్ల రమాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి. బ్యాంక్ మేనేజర్‍గా పదవీ విరమణ చేసిన రమాదేవి కవయిత్రి, రచయిత్రి, కార్టూనిస్ట్, చక్కని వక్త, సభానిర్వహకురాలు. గతంలో ‘మనసు భాష’ అనే కవితా సంపుటి, ‘రమణీయం’ అనే స్వీయ కార్టూన్ సంపుటి, ‘మనసుకూ మనసుకూ మధ్య’ అనే కథాసంపుటి వెలువరించారు.18 కథలున్న ‘తల్లివేరు’ వారి రెండవ కథాసంపుటి.

~

కఠిన జీవితవాస్తవాలను కరుణపూరితంగా చెబుతూ, ఆశావహ దృష్టిని అందిస్తూ, మనుషుల బలహీనతలను హాస్యంగా చెబుతూ చేసిన సామాజిక వ్యాఖ్యానాలీ కథలు” అన్నారు శ్రీమతి ఓల్గా తమ ముందుమాటలో.

సరళమైన మామూలు భాషలో, చక్కని శైలితో, విభిన్నమైన ఇతివృత్తాలతో, చదివింపజేసే, ఆలోచింపజేసే చక్కని కథలివి” అని వ్యాఖ్యానించారు డా. ముదిగంటి సుజాతా రెడ్డి తమ ముందుమాటలో.

~

కొన్ని బంధాలను అవసరాలే కాపాడుతాయనే కఠిన వాస్తవాన్ని చెప్తుంది ‘అవసరం’ కథ. అత్తగారిని కంటికి రెప్పలా చూసుకునే కోడలి ఆంతర్యం తెలిసినప్పుడు, మొదట విస్తుపోయినా, ఆమె ఆలోచనలో తప్పేమీ లేదని, అత్తగారి పట్ల ఆమె చూపించే ప్రేమలో అవసరం ఉంది కానీ, ఆ ప్రేమ నటన కాదని, బాధ్యతకు నిలువెత్తు నిదర్శనమమని పాఠకులు గ్రహిస్తారు.

కరోనా ప్రభావంతో ఉద్యోగం పోగొట్టుకుని సొంతూరికి తిరిగొచ్చిన సురేష్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి – నిరంతరం కష్టపడే తల్లిదండ్రులు, వృద్ధాప్యలోనూ శ్రమించే బాపమ్మ, ఆటో నడుపుకుంటూ ఉపాధి కల్పించుకున్న కజిన్ మధు అతన్ని భవిష్యత్తుని నిర్ణయించుకునేలా చేస్తారు. ‘ఎటు వైపు’ వెళ్ళాలో అవగాహన కల్పిస్తారు ఈ కథలో.

తరతరాలుగా కుటుంబాలలో ఇంటిపెద్ద అంటే ఇలానే ఉండాలి అనే మగవారిపై రుద్దబడిన ఓ కనబడని టెంప్లేట్‌లో చిక్కుకుపోయిన రాఘవ – భార్య జానకి ఆరునెలల పాటు కూతురు దగ్గరకి అమెరికా వెళ్తోందంటే తట్టుకోలేకపోతాడు. భార్యని నిశితంగా గమనిస్తాడు. ఆమెలో ఉన్నవేమిటో, తాను అలవర్చుకోలేకపోయినవేవిటో గ్రహిస్తాడు. మారాలని నిశ్చయించుకుంటాడు. అదే విషయన్ని భార్యకి ‘మొదటి ప్రేమలేఖ’లో రాస్తాడు. జానకికి అన్వయిస్తూ కొందరు స్త్రీల గురించి రాఘవ వెల్లడించిన కొన్ని అభిప్రాయాలు త్రోసిపుచ్చలేని నిజాలు. కొద్దిమంది మగవాళ్ళు ఈ టెంప్లేట్‍ను బ్రేక్ చేసి కొత్త పద్ధతిలో జీవించడం మొదలుపెట్టారన్నదీ వాస్తవమే. చక్కని కథ!

ఎంత చేరువో.. అంత దూరమూ’ కథలో నీలిమ – తోడు కావల్సిన ఓ స్త్రీగా ఆలోచించకుండా, ఓ లెక్చరర్‍గా.. ఓ తల్లిగా ఆలోచించి, తనకి దగ్గరవ్వాలని ప్రయత్నించిన ఓ కొత్త బంధాన్ని వద్దనుకుంటుంది. అందుకు తను చెప్పిన కారణమూ సహేతుకమైనదే. ఈ కథ ప్రారంభం, ముగింపు ఒకే రకమైన సన్నివేశంతో ఉంటాయి. కాని పాత్రల భావాలలో ఎంతో మార్పు! “అతను వెళ్ళిపోతూ అనుకున్నాడు ‘ప్రేమలో ఇంత మాధుర్యం ఉందా’ అని”; “అతను వెళ్ళిపోతూ అనుకున్నాడు ‘ప్రేమలో ఇంత విషాదం ఉందా’ అని.” ఇతివృత్తాన్ని కళ్ళకి కట్టి, కథా గమనాన్ని తెలిపిన వాక్యాలివి.

చెడిపోయిన మనిషి’ కథ ఒకనాటి తెలంగాణా ప్రజల వ్యథని దృశ్యమానం చేస్తుంది. కొన్ని దశాబ్దాల వెనుకటి కథాకాలపు ఇతివృత్తంలో అల్లిన కథ. గ్రామాల్లోని దేవిడీ నిర్మాణం, మోతుబరులు, గ్రామ పెద్దల ఆహార్యం వంటి వివరణ పాఠకులని మరో లోకం లోకి తీసుకెళ్తుంది. సంచార దొంగల ముఠా అఘాయిత్యానికి బలైన కృష్ణమ్మ అనే ఓ వితంతువు ‘చెడిపోయిన మనిషి’ కాదని ఈ కథ నిరూపిస్తుంది. పంచాయితీ పెట్టి కృష్ణమ్మను వెలివేయాలని గ్రామ పెద్దలు తీర్పు చెప్పినప్పుడు ఆమె మరిది ‘ఆమె ఎట్లా చెడిపోయింది మామా’ అని ప్రశ్నిస్తాడు – తీర్మానం చేసిన వ్యక్తిని. దివాన్ ఖానాలో వాదనలు జరిగాకా, “ఇంతకూ ఎవరు చెడిపోయిన్రు, ఆమెనా, మనమా?” అని అడుగుతాడు. మాండలికం/యాస కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇది.

తల్లిగా మారిన క్షణం నుంచి తమ బిడ్డల మేలు కోసం తాపత్రయపడతారు స్త్రీలు. వ్యక్తిగతంగా తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా, తమ బిడ్డలు బాగుండాలని కోరుకుంటారు. జీవన పోరాటంలో తాము నలిగిపోతున్నా, బిడ్డలు చల్లగా ఉండాలని తపిస్తారు. ఆ క్రమంలో చాలామంది చివరి రోజుల కోసం తమకంటూ ఏమీ మిగుల్చుకోకుండా పూర్తిగా పిల్లలపైనే ఆధారపడిపోతారు. తమ కోసం అమ్మ పడ్డ కష్టాలను గుర్తించుకున్న పిల్లలు వృద్ధాప్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లి ప్రేమని ఫర్ గ్రాంటెడ్‍గా తీసుకున్న పిల్లలు వృద్ధాప్యంలో నిరాదరిస్తారు. అటువంటి సందర్భాల కోసం తమకంటూ కొంత డబ్బు ఉండాలని ఓ పాత్ర ‘తల్లివేరు’ కథలోని తల్లి సుశీలకు హితవు చెప్తుంది. కరోనా కాలపు వెతలను మరోసారి పాఠకుల ముందుకు తెస్తుందీ కథ. ‘కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి’ అన్న శ్లోకం గుర్తొచ్చింది ఈ కథ చదివాకా.

కరోనా కష్టాలలోనూ – ఏదో ఓ రకంగా జీవితాన్ని నెగ్గుకురావడానికి ఎందరెందరో తమదైన పద్ధతులలో ప్రయత్నించారు. ఆ కాలంలో ప్రజలు భయం, అపోహలు, మానసిక ఆందోళన వల్ల సాటి మనుషుల పట్ల దయారాహిత్యంతో ప్రవర్తించిన ఘటనలను చాలా కథలు నెగటివ్‍గా ప్రదర్శించాయి. కానీ అంతటి కష్టకాలంలోనూ కరోనా బాధితులకు అండగా నిలిచిన మంచి వ్యక్తుల కథ ‘మనసుంటే మార్గం’.

వ్యవసాయంలోని కష్టాలను, తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలోనూ రేపు బాగుంటుందేమో అన్న నమ్మకంతో అప్పులు చేసి మరీ సాగు చేసే రైతుల మనో వ్యథను చాటిన కథ ‘ఆశల విత్తనం’. తన తండ్రిని మోసం చేసింది ప్రకృతి కాదనీ, నకిలీ విత్తనాలని తెలుసుకున్న వేణు – ఆ విత్తనాలమ్మిన కొట్టుపై న్యాయపోరాటం చేసి, నష్ట పరిహారం రాబట్టగలుగుతాడు. సగం చచ్చిన మనిషిలా మారిన తండ్రికి ఆనందం కలగజేస్తాడు. ‘మీ నాయనలా మరెవరూ మోసపోకూదంటూ మిగతా వారికి దారి చూప’మంటాడు తాత కొమురయ్య. తాత మాటలతో ఏకీభవిస్తూ, “ఊరికె అన్నిటికి ఏడ్చి రంధి పడకుండ, కొత్తబాటలో నడవాలె” అంటాడు వేణు. స్ఫూర్తిదాయకమైన కథ.

పేరు’ విభిన్నమైన కథ. పెళ్ళయ్యాకా, ఆడవాళ్ళు ఇంటి పేరు మార్చుకునే సందర్భంలో చట్టపరమైన అన్ని డాక్యుమెంట్లలోనూ పేరుని మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ కథ చెబుతుంది. పోటీ పరీక్షలకి హాజరయ్యే వివాహితలు – హాల్ టికెట్‍లలో ఒక పేరు, ప్రూఫ్ సర్టిఫికెట్‍లో మరో పేరు ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారో ఈ కథ చెబుతుంది. ఈ కథ నుంచి ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్న ఓల్గా గారి అభిప్రాయాన్ని కాదనలేము.

అసలైన భక్తి అంటే ఏమిటో ‘దర్శనం’ కథ చెబుతుంది. ఎన్నో ఏళ్ళుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకోవాలన్న కోరిక ఉన్న గంగకి – అనుకోకుండా తమ ఊరి వాళ్ళ బృందంతో యాత్రలు చేసే అవకాశం వస్తుంది. కాలినడకన కొండెక్కి, చివరి వరకూ సర్వదర్శనం క్యూలో నిలుచున్న గంగ ఎందుకని గుడిలోకి వెళ్ళలేకపోయింది? అయినా గంగకి అనిర్వచనీయమైన సంతృప్తి ఎలా కలిగిందో ఈ కథ చెబుతుంది. తోటి మనిషిలోనే దైవాన్ని చూడాలన్న – మానవసేవే మాధవసేవ అనే నానుడికి బలం చేకూరుస్తుందీ కథ.

రోటీ కపడా ఔర్ కపడా’ వ్యంగ్య కథ. అతిగా చీరలు కొనే అలవాటున్న ఉన్న కొందరు స్త్రీల బలహీనత, వారి కొనుగోళ్ళను వెటకారం చేసే భర్తలు! సరదా సంభాషణల రూపంలో హాస్యధోరణిలో సాగిన ఈ కథలో చీరల కొట్ల లోని సేల్స్‌మెన్ మాటల గారడీని చక్కగా చెప్తారు రచయిత్రి. మార్కెట్ మాయాజాలం ఎంతలా ప్రభావితం చేస్తుందో ఈ కథ చెబుతుంది. మార్కెట్ డైనమిక్స్‌ అందరికీ అర్థం కావు.

సంపాదన ఉన్నప్పటికీ ఆర్థిక స్వేచ్ఛ లేని ఉద్యోగినుల సమస్యలను ఓ లేడీ కండక్టర్ పాత్ర ద్వారా వెల్లడిస్తారు ‘కాలం మారినా’ కథలో. తనకి బొటాబొటీ ఆదాయం ఉండో లేదా ఏ పని చేయకుండా కాలం గడిపే మొగుడు – తనకన్నా ఎక్కువ ఆదాయం వచ్చే  లేదా ఉద్యోగం ఉన్న భార్యపై పురుషాధిక్య భావంతో ఎలా జులుం చేస్తాడో ఈ కథలో కనబడుతుంది.

స్థూలకాయులంటే ప్రతీ ఒక్కరికీ లోకువే. అధిక బరువు, లావు ఉన్న వ్యక్తులను నిజజీవితంలోనే కాక, సినిమాల్లోనూ ఎగతాళి చేయడం, వాళ్ళ మీద జోక్స్ వేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. ‘పెరుగుట.. పెరుగుట కొరకే’ కథలో వసంత ఇలాంటి సమస్యలనే ఎదుర్కుంటుంది. ఈ కథలో రచయిత్రి ప్రయోగించిన ఉపమానాలు నవ్వు తెప్పిస్తాయి. పైకి హాస్య కథగా అనిపించినా, ఒబేసిటీతో బాధ పడుతున్న వారి మనసులోని వ్యథను చాటుతుంది. ఏదైనా డైట్ కోర్స్ లాంటిది చేయాలంటే కుటుంబ సభ్యుల సహకారం ఎంత అవసరమో ఈ కథ చెబుతుంది.

హెచ్.ఐ.వి, ఎయిడ్స్ బాధితుల కోణం నుండి అల్లిన కథ ‘కాంతిరేఖ’. ఓ స్త్రీకి ఎయిడ్స్ సోకిందంటే – ఎలా వచ్చిందో తెలుసుకోకుండా – ఆమె ఎందరితో తిరిగిందో అని నిందలేసి, జీవచ్ఛవాన్ని చేసే సమాజంలో, ఆసరా ఇచ్చి, ఆశ్రయం ఇచ్చి మామూలు మనుషులను చేసే డా. రేఖ వంటి వ్యక్తులు ఆశాదీపాలు.

భార్యకి దగ్గరవ్వాలంటే మనసు తెలిసి ఆమె మనసు తెలుసుకుని మసలుకోవడం ముఖ్యమని చెప్తుంది ‘మనసుకు దారి’ కథ.

అడ్డూ అదుపు లేని యువత ఆశలకి – పాత ఇంటితోనూ, ఆ ఇంట్లో ఎదిగిన చెట్టుతో ఇంటి యజమానికి ఉన్న అనుబంధం పట్టదు. డబ్బే ప్రధానమయిపోయి, చెట్టు కొట్టించేసి ఇంటిని స్థలంతో సహా బిల్డర్‍కి అమ్మేయాలన్న కొడుకుల ఒత్తిడికి చెట్టు కూలుతుంది, తండ్రీ గతిస్తాడు ‘చెట్టు కూలింది’ కథలో. ప్రస్తుత సమాజంలో బలపడిపోయిన ఓ పెడధోరణికి ఈ కథ నిదర్శనం.

“పని చేయకుండ సుకంగా ఎట్లుంటం కొడుకా? అసలు ఎట్లుంటాం? లేని రోగాలొస్తయి” అని తల్లి సుగుణ, పొలం అమ్మేసి ఆ డబ్బుని తనకిచ్చేయమన్న కొడుకుతో అంటుంది ‘పొద్దుగుంకక ముందే’ కథలో. తల్లికి ఏమీ తెలియదని, ఆమెను మాయ చేసి పొలం అమ్మించవచ్చు ఆశపడ్డ కొడుకు భంగపడతాడు. అదే ఆలోచనతో వచ్చిన చిన్న కొడుకుకీ సమాధానమిస్తుంది. ఆశలు వదులుకోని కొడుకులిద్దరూ కలిసి వచ్చి అమ్మని ఒప్పించాలని మరోసారి ప్రయత్నించడానికి ఊరికి వచ్చినప్పుడు తల్లి ఓ చిన్న హోటల్ నడుపుతూండడం చూస్తారు. ఆ జంక్షన్‍లో త్వరలో ఓ పెద్ద హోటల్ వస్తోందని, అప్పుడు నీ హోటల్ ఏమవుతోందో అని కొడుకంటే – సుగుణ చక్కని జవాబు చెబుతుంది. సాయంత్రమయ్యాకా, కొడుకులని బయల్దేరమని చెబుతూ “పొద్దు గుంకుతాంది, శీకటయితే తొవ్వ కనబడదు. పయిలం” అంటూ జాగ్రత్తలు చెబుతుంది. మామూలు చీకటికి దారి కనబడకపోవచ్చు, మనసుకి చీకటి పడితే, బతుకే అంధకారమవుతుందన్న సూచన ఈ కథలో ఉంది.

నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ పడ్డాకా, భూముల విలువ పెరిగి, అయిన కాడికి అమ్మేసుకుని సొమ్ము చేసుకోవాలని కొందరు, నయానో భయానో జనాలని ఒప్పించి, భూములు సొంతం చేసుకుని వెంచర్లు వేసుకుని ప్లాట్స్ అమ్ముకుని లాభాలు కళ్ళజూడాలనుకునే రియల్ ఎస్టేట్ కంపెనీలను, ఆ యా కంపెనీల మార్కెటింగ్ ప్రలోభాలను ‘నేల గంధం’ కథ వ్యక్తం చేస్తుంది. తమ భూమిని కూడా అమ్మేయాలని పట్టుబట్టిన కొడుకు తాను రియల్ ఎస్టేట్ సంస్థ ఉద్యోగి అయినా, ఆలస్యంగా వాస్తవం గ్రహించి, భూమిని అమ్మొద్దని తండ్రికి చెప్తాడు.

***

ఈ కథలన్నింటిలోనూ రచయిత్రి పరిశీలన, గమనింపులు గొప్పగా ఉంటాయి. బ్యాంకు అధికారిగా బ్యాంకు కస్టమర్లను గమనిస్తూ, కొందరి జీవితాలని సన్నిహితంగా పరిశీలించి రాసిన కథ, బ్యాంక్ ఉద్యోగాలకై పోటీ పరీక్షల నిర్వహణలో విధులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు అభ్యర్థులను, వారి స్వభావాలను దగ్గరగా గమనించి అల్లిన కథ, ఓ స్త్రీగా మహిళా కండక్టర్ సమస్యలను తెలుసుకుని అల్లిన కథ ఇందుకు చక్కని ఉదాహరణలు.

చాలా కథల్లో మనకి మనమే కనిపిస్తాము. ఏదో ఒక పాత్రతో మనమూ ఐడింటిఫై అవుతాము. అందుకే ఈ కథల మన కథలే అనిపిస్తాయి.

ఈ రచయిత్రి మనసుకి కళ్ళున్నాయి! అవి ‘రెండు’ కాదండోయ్! ఒకే మారు నలుదిశలా చూడగలిగే ‘ఎన్నో’ కళ్ళూ!” అంటారు డా. అమృతలత. రచయిత్రి లోచూపుని పట్టిచ్చిన కథలివి.

ఈ సంపుటి లోని కథలు పఠితల్ని ఏ కొంచెమైనా ఆలోచింపజేయగలిగితే, ఈ పుస్తకం ప్రయోజనం నెరవేరిందని భావిస్తాను” అన్నారు రచయిత్రి తమ ముందుమాటలో. సంపూర్ణంగా నెరవేరిందని నేను భావిస్తున్నాను.

***

తల్లివేరు (కథాసంపుటి)
రచన: నెల్లుట్ల రమాదేవి
ప్రచురణ: అపురూప పబ్లిషర్స్,
పేజీలు:197
వెల: ₹ 200/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడ, హైదరాబాద్. ఫోన్: 9000413413
అచ్చంగా తెలుగు: 85588 99478
అపురూప పబ్లిషర్స్: 9848868068
ఆన్‍లైన్‍లో:
https://www.telugubooks.in/products/thalliveru
https://books.acchamgatelugu.com/products/talli-veru?sku_id=27366918

 

~

శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-nellutla-ramadevi/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here