[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]T[/dropcap]HE BESTSELLER SHE WROTE, 2015లో రవి సుబ్రహ్మణ్యన్ రాసిన ఇంగ్లీష్ నవల. హై సొసైటి జీవితాన్ని, ప్రస్తుతం మన దేశంలోని కార్పొరేట్ జీవితాన్ని వివరించే నవల ఇది. నేటి తరంలో ఆధునికత పేరుతో మానవ సంబంధాల పట్ల ఆలోచనలు చాలా మారుతున్నాయి. చాలా వేగంగా మన దేశంలో గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఎన్నో మార్పులు వచ్చాయి. నైతికత, ప్రేమ, ఆదర్శాల పట్ల ఆలోచనలలో చాలా తేడాలు చొచ్చుకు వచ్చాయి. ప్రస్తుతం కాంటేంపరరీ ఇంగ్లీష్ రచయితలు ఆ ఆధునిక ట్రెండ్ లోనే రచనలు సాగిస్తున్నారు. పాపులర్ అవుతున్నారు కూడా. చేతన్ భగత్, అమిష్ లాంటి కొందరు రచయితలు ఈ తరంలో అలాగే పుట్టుకువచ్చారు. వీరి కోవకే చెందుతారు రవి సుబ్రహ్మణ్యన్. ఇంగ్లీషు నవలలు చదివే యువతరానికి వీరి నవలలు బాగా నచ్చుతాయి. ఈ రచయితలందరిలో ఉన్న కామన్ పాయింట్ యువతను ఆకర్షించడం. వీరి శైలి సులభంగా, స్టైలిష్‌గా ఉంటూ పాత ఆలోచనలనుండి విముక్తి కలిగించే కథావస్తువుతో ముందుకు పోవడం వీరి పుస్తకాలు యువత ఇష్టపడడానికి మరో కారణం. అమిష్ చాలా వరకు పురాణాలను ఆధునీకరించే ప్రయత్నం చెసి యివతను ఆకర్షిస్తే, అనితా నాయర్, చేతన్ భగత్, దుర్జోయ్ దత్తా, సుదీప్ నాగర్కర్ లాంటి కొంత మంది ఆధునికత్వాన్ని జోడుస్తూ నవలా రచన చేస్తున్నారు. వీరి నవలలలో ప్రేమ, ఆధునిక యువతలోని మానవ సంబంధాల చర్చ ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ నవలలో కథనం చాలా బాగా నడిపించారు రచయిత. ఆదిత్య కపూర్ అనే ఒక నలభై సంవత్సరాల రచయిత ఈ నవలలో కథానాయకుడు. తాను చదివిన కాలేజీకి ఒక రచయితగా మాట్లాడడానికి వెళతాడు. బాంకింగ్ సెక్టర్‌లో పెద్ద ఉద్యోగం, రచయితగా గొప్ప పేరు ఇవన్నీ అతని పేరుకి గ్లామర్ తీసుకువచ్చిన అంశాలు. ఎక్కడా రాజీ పడని మనస్తత్వం ఇతనిది. ఓటమి ఒప్పుకోని తత్వం. ఎప్పుడూ నంబర్ వన్‌గా ఉండాలనే తాపత్రయం. ఇతని భార్య మాయ. వీరిది ప్రేమ వివాహం. వీరికి ఒక కోడుకు కూడా. అందమైన సంసారం. మాయ ఆదిత్య కెరియర్ కోసం, ఉన్నతి కోసం తన ఉద్యోగం వదిలి, కార్పోరేట్ ప్రపంచంలో ఇమడలేక ధీరూబాయ్ అంబాని ట్రస్ట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ ఉంటుంది. చాలా కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తి. భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ఎంతో ప్రేమ. భర్త మీద మాయకు విపరీతమైన నమ్మకం. ఆదిత్యకు వీటన్నిటి కారణంగా కాస్త గర్వం అహం కూడా ఎక్కువే. అయితే అతని సక్సెస్ కారణంగా ఈ లక్షణాలు కూడా అతనిని ఆరాధించే అభిమానులను పెంచాయే కాని తక్కువ చేయలేదు. ఆదిత్య తన పాత కాలేజీ ఐ.ఐ.ఎమ్. బెంగుళూరులో మాట్లాడుతున్నప్పుడూ శ్రేయ అనే ఒక అందమైన అమ్మాయిని కలుస్తాడు. శ్రేయ అతన్ని సభలో అందరి ముందు విమర్శిస్తుంది. అయితే కాలేజీ యజమాన్యం తనని తప్పు పట్టే లోపే ఆదిత్య నవలలు చదివి అతనితో స్నేహం చేస్తుంది. శ్రేయ అద్భుతమైన అందగత్తె. మంచి స్టూడెంట్. కాలేజీలో గోల్డ్ మెడల్ కోసం కష్టపడి చదువుతుంటుంది. ఆదిత్య కంపెనీ కాంపెస్ ప్లేస్‌మెంట్ల కోసం కాలేజీకి మరోసారి వచ్చినప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం ఇంకా పెరుగుతుంది. మొదటి రోజు ఇంటర్వ్యూలన్నిటినీ వదులుకుని తన పుస్తక ఆవిష్కరణ కోసం వచ్చిన శ్రేయ పట్ల ఆదిత్య ఆకర్షితుడవుతాడు. ఆదిత్య ప్రోద్బలంతోనే తమ బాంక్‌లో ఉద్యోగానికి శ్రేయను సెలెక్ట్ చేసుకుంటాడు అతని స్నేహితుడు సంజయ్.
శ్రేయ ఆదిత్య కంపెనీ లో జాయిన్ అవుతుంది. ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. శ్రేయ పట్ల ఆదిత్య ఆకర్షణ పెరుగుతుంది. ఇద్దరి మధ్య సంబంధం గట్టిపడుతుంది. ముందు ఆరోగ్యకరమైన ఆకర్షణ అని దాన్ని సమర్ధించుకున్నా ఇద్దరి మధ్య శారీరిక సంబంధం మొదలవుతుంది. క్రమంగా ఆదిత్య పై శ్రేయ కంట్రోల్ పెరుగుతుంది. తానొక నవల రాస్తున్నానని, దాన్ని పబ్లిష్ చేయడానికి సహాయం చేయమని శ్రేయ ఆదిత్యను కోరుతుంది. అప్పటికే ఒక గొప్ప రచయితగా పేరున్న ఆదిత్యకు అది కష్టమైన పని కాదు. కాని తన ఆకర్షణను మంత్రంగా మార్చి ఆదిత్యపై పూర్తి కంట్రోల్ సాధించి శ్రేయ తనకు కావలసినవిధంగా అతన్ని ఉపయోగించుకోవడం మొదలెడుతుంది. అతని సహకారంతో ఒక గొప్ప నవలా రచయితగా పేరు గడించాలని వ్యూహం రచిస్తుంది. ఆదిత్య కొత్త నవలా ప్రతిని అతని భార్య కంటే ముందుగా చదివి అందులో కొన్ని మార్పులు అవసరం అని సూచిస్తుంది. అంతే కాకుండా కొన్ని మార్పులు చేస్తుంది. ఆదిత్య కొత్త పుస్తకం ప్రింట్ అయ్యాక శ్రేయ పుస్తకాన్ని పబ్లిషర్‌కు పంపిస్తాడు ఆదిత్య.
మాయను మోసం చేసి ఆదిత్య సాగించే ఈ ప్రేమ అతన్ని ఎన్నో కష్టాలకు గురి చెస్తుంది. మాయ ఒక ఫారెన్ ట్రిప్ కు వెళ్ళీ అక్కడ ఒక వైరస్ బారిన పడి ఇండియా వచ్చాక చాలా జబ్బు పడుతుంది. అప్పుడే ఆమెకు తన భర్త చేసిన మోసం గురించి కూడా తెలుస్తుంది. ఆదిత్య శ్రేయతో తన సంబంధాన్ని ముగిద్దామనుకునేంతలో అతన్నిశ్రేయ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలెడుతుంది. ఆదిత్య నవలలో ఆమె చేయించిన మార్పులు కొన్ని పాత నవలలలోని ముఖ్య వాక్యాల కాపీ అని అది బైట పెడితే రచయితగా అతని కెరీయర్ సమాప్తమవుతుందని బెదిరిస్తుంది. తన నవలకు అతను ముందు మాట రాయాలని, నవల అతని ద్వారానే బైటకు రావాలని బెదిరిస్తుంది. మాయ ఆదిత్య నుండి విడిపోతుంది. ఇద్దరి మధ్య విడాకుల ప్రసక్తి కూడా వస్తుంది. ఆదిత్య సంజయ్ గదిలో ఉంటూ శ్రేయకు కావలసిన పనులు చేసి పెడుతూ ఆమె నుండి తనను తాను రక్షించుకోవడం గురించి ఆలోచిస్తుంటాడు. శ్రేయ గతంలో కూడా తన ఉన్నతికి అడ్డు వచ్చిన వారిని ఎలా ఒదిలించుకుందో ఎలా మానిప్యులేట్ చేయగలదో తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. తన బలహీనతకు తాను ఎంతలా నష్టపోయాడో అర్ధం చేసుకుంటాడు. చివరకు అతి కష్టం మీద శ్రేయ ప్రభావం నుండి తప్పించుకుని భార్యను క్షమాపణ కోరి తిరిగి పాత జీవితానికి చేరడం నవల ముగింపు.
అయితే తన జీవితాన్ని ఇంతగా గందరగోళ పరిచిన వారిలో శ్రేయతో పాటు తన స్నేహితుడు కూడా ఉండడం ఆదిత్యను ఆశ్చర్యపరుస్తుంది. స్త్రీ విషయంలో బలహీనపడితే ఒక మనిషి ఎంతటి అధఃపాతాళానికి తొక్కివేయబడతాడో, సరదా అనుకుని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామని అనుకుంటూ సాగించే వివాహేతర సంబంధాలు మనిషిని ఎంత నిర్వీర్యం చేయగలవో ఆదిత్య పాత్ర ద్వారా రచయిత చెప్పే ప్రయత్నం చేసారు. ఎంతో గర్వంగా ఎవరి ముందు తలవంచక బ్రతికే ఆదిత్య చివరకు శ్రేయ చేతిలో బొమ్మగా మారడం, క్షణం క్షణం భయంతో అభద్రతా భావంతో బ్రతకడం, రచయిత చూపించిన విధానం బావుంది. వివాహేతర సంబంధాలు మొదట ఆకర్షణీయంగా కనిపించినా వాటి వలన జరిగే వ్యక్తిత్వ నష్టం, మానసికంగా మనిషి పడే వేదన, ఇవన్నీ పరస్పర ఆకర్షణలో అర్ధం కావు. అయితే ఆకర్షణ స్థాయి తగ్గి అవసరాలు పెరిగి ఎవరో ఒకరు ఆ బంధంలో కూడా రాజీ పడవలసి వచ్చినప్పుడూ వారు ప్రేమ అనుకున్నది అంతా వారిని వారు మోసం చేసుకుంటున్న విధానం అని అర్థం అయి దాన్ని అంగీకరించడానికి అహం అడ్డు వచ్చి, పరిస్థితులు చేజారి పోయాక అప్పుడు వారికి కనువిప్పు కలిగినా ఆ ఊబి నుండి బయటకు రావడం ఎవరికీ అంత సులువు కాదు.
ఇందులో శ్రేయ పాత్రను రచయిత మలచిన విధానం బావుంది. ఒక అమాకమైన కాలేజీ అమ్మాయిగా ఆమెను పరిచయం చెసి చివరకు ఆమెలోని ఎన్నో రంగులను ఒక్కొక్కటిగా రచయిత చూపిస్తూ వెళతారు. ఈ 390 పేజీల నవలలో శ్రేయ పాత్రను రచయిత ప్రతి అధ్యాయంలో కొత్తగా పరిచయం చేసుకుంటూ వెళతారు. ఆ శైలి ఈ నవలకు ఒక మంచి థ్రిల్లర్ ఫీల్‌ను ఇస్తుంది. అందుకే ఈ నవల పాఠకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఇందులో చివరకు ఆదిత్య తన తప్పును ఒప్పుకుని తన జీవితంలోని వైఫల్యాలకు ఇతరులను నిందించకుండా తన బలహీతనలే తన పరిస్థితికి కారణం అని తాను నేర్చుకున్న పాఠాన్ని హుందాగా భార్య దగ్గర ప్రస్తావించడం బావుంది.
పేరు ప్రఖ్యాతల మీద మోజుతో చాలా త్వరగా నలుగురు మధ్య వెలిగిపోవాలని, సక్సెస్‌ను షార్ట్‌కట్లలో సంపాదించాలనుకునే యువతరానికి ఈ నవల గొప్ప పాఠం కాగలదు. శ్రేయ లాంటి వ్యక్తులు, చాలా మంది ఈ కొత్త తరాలలో కనిపిస్తుంటారు. కారణం నైతికత పట్ల మారుతున్న అభిప్రాయాలు జీవితమంటే సక్సెసే అన్న ఒక అర్థం లేని అభిప్రాయం. ఏ దారిలో నడిచాం అన్నది ముఖ్యం కాదని గమ్యాన్ని చేరుకోవడమే ముఖ్యమని దాని కోసం ఎన్ని మోసాలన్నా చేయవచ్చని, ఇతరుల బలహీనతలను మన ఉన్నతికి మార్గాలుగా మార్చుకోవాలని ఏం చేసినా ముందుకు వెళ్ళడమే ముఖ్యమని నమ్మె ఈ పరుగుల ప్రపంచపు ప్రతినిధులకు జీవితం గెలుపు ఓటముల మీద ఆధారపడదని, మానసిక ప్రశాంతత అన్నిటికన్నా ముఖ్యమని, దాని కోసం జీవితంలో కొన్ని సార్లు ఓటమిని ఒప్పుకోవడం తప్పు కాదని, అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ నవల. రచయిత కథనం కూడా చాలా బావుంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ నడుస్తుంది కాబట్టి నవల చివరి దాకా హాయిగా చదువుకోవచ్చు.