ద బ్రాండ్

1
2

రిలయన్స్ ట్రెండ్స్‌లో లేత గులాబీ రంగు మీద ఆకుపచ్చని చిన్న ఆకుల ప్రింట్‌తో, అంబ్రెల్లా కట్ టాప్ ఇష్టంగా ఎంచుకుని బిల్ పే చేసి తెచ్చుకుంది వీణ.

ఆ టాప్ ఇవాళ వేసుకుంది. బస్టాప్‌లో ఒకరు, క్రీమ్ స్టోన్‌లో ఇంకొకరు, అదే టాప్‍౬లో కనపడ్డారు.”ఐ హర్ట్” అంటూ బాధపడుతోంది.

“పర్లేదు. వదిలేయ్. సిల్లీ థింగ్. ఇంకోటి కొందాం” ఆమెను, బాయ్ ఫ్రెండ్ మధు ఓదారుస్తున్నాడు.

“హాయ్! ఏం చేస్తున్నారు? ‘జోకర్’ సినిమాకి మళ్ళీ వెళ్ళాలనుంది. వస్తారా?” అన్నాడు అప్పుడే వచ్చిన వీరేన్.

‘‘ఉండు బ్రో! ఇక్కడసలే వీణ బాధ పడుతోంది. తన డ్రెస్ ట్వైస్ రిపీటెడ్!” అన్నాడు మధు.

“ఇలాంటివి నాకు చెప్పకు! కొనేది రిలయన్స్ ట్రెండ్స్‌లో. యునీక్ పీస్ కావాలంటే ఎలా? బ్రేండెడ్ గానీ, డిజైనర్ పీస్ గానీ కొనాలంటే పైసలుండాలి, టేస్ట్ ఉండాలి, అలాంటి షాప్‌కే వెళ్ళాలి. నేను చూడు ‘మేన్ ఈ’ కెళ్ళి, ‘సీజర్ కట్’ చేయించుకున్నా”.

“అందరూ నీలా రిచ్ కాదు వీరేన్. ఇంతకీ నీ ధనలక్ష్మి రహస్యమేంటి? ఒక కటింగ్ డబ్బుతో మూడు మూవీస్‌కి వెళ్ళచ్చు బాబూ!” వీణ అడిగింది.

“అలాంటివి అడక్కూడదు. మూవీకి వస్తారా, రారా?’

“మళ్ళీ ఎందుకు రా, వీరా?”

“ఆ థియేటర్ లోనే ‘కలర్స్’ కనబడుతున్నాయని టాక్. నీ దగ్గర కాష్ ఉందా?”

 “ఏంటి? అరువా,అప్పా? ఇంతకూ, ఆస్కార్ మూవీ కదా అది. ఈజ్ ఇట్ ఫన్నీ?”

“వీరేన్ వద్దులే, కొంచం టైట్‌గా ఉంది!”మధు ఇబ్బందిగా చెప్పాడు.

“సర్లే, నేను క్రిష్ణ రూమ్‌కి వెళ్తా” వీరేన్ బయటకు దారి తీసాడు.

“రూమ్ కాదుగా, పెంట్ హౌస్ కదా?” వీణ మెడలో పూసల్ని తిప్పుతూ అడిగింది.

“ఔను. ఈ జీడిమెట్ల గాలి నా ఊపిరితిత్తుల్లో గింగిరాలు తిరుగుతోంది. రేపో, మాపో యశోదాలో ఐసియుకి పోయేలా ఉన్నాను. అందుకే, ఏసీ థియేటర్ కెళ్ళాలి, లేదా వాడి గదిలో నైట్ స్టే. అసలే డబ్బుల్లేవు. మీ దగ్గర కూడా లేనట్టున్నాయి” వీరేన్ అన్నాడు.

“చేతిలో పైసా లేదు, నిన్ను యశోదాలో అడుగు పెట్టనిస్తారా? రోగం వచ్చినా పోష్‌గా ఆలోచిస్తావు.”

“అందుకే మధూ, క్రిష్ణ రూమ్‌కి “

“క్రిష్ణ దగ్గర డివైసెస్ చూడకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు – ఇలాంటి వింత రూల్స్ ఉంటాయి, నేను రాను” మధు విసుగ్గా అన్నాడు.

“కావచ్చుకానీ, ఇంకెక్కడా ఫ్రీ ఏసీ, గ్రీన్ పేచ్ ఉండవు. వాడొక అమ్మాయి లాటోడు. మొక్కలు, పుస్తకాలు, స్కెచెస్ వాడూనూ… ”

“వీరేన్ !ఇది చాలా అన్యాయం. మరి నేనో?! అమ్మాయిని కానా?”

“ఓ! వీణా! ఐ మీన్… దిల్ సే, వాడు ఒరిజినల్! నువ్వు మోడ్రన్” నవ్వుతూ అన్నాడు వీరేన్.

“అబ్బా, ఈవ్ టీజింగ్ కేస్ పెడతా, నీ మీద” వీణ నవ్వింది. ముగ్గురూ నవ్వుకున్నారు.

వీణ, మధు, వీరేన్ ఉరఫ్ వీరబాబు xxx ఇంజనీరింగ్ కాలేజిలో చదువుకుంటున్నారు. వీరేన్ ఫాషన్ ఫ్రీక్. వీణ, మధు క్లోజ్. క్రిష్ణ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్. నెలలో ఐదారు థీమటిక్ పెయింటింగ్స్ వేయగలడు.

సినిమా వాళ్లకి కూడా అప్పుడపుడు పనిచేస్తాడు.

ఎప్పుడో ‘కర్రీస్’ రెస్టారెంట్లో, గోడల మీద పెయింటింగ్స్ చూసి, వీణ-మధు, క్రిష్ణకి ఫ్యాన్స్ అయిపోయారు. వాళ్లు చూసింది ‘ఫ్రమ్ బిహైండ్’ అనే సబ్జెక్టు. తల మీద నీళ్ళకుండలతో పల్లెటూరి ఆడవాళ్ళు, తెల్లవారు ఝాము సైకిల్ తొక్కుతున్న యువకుల సమూహం, గుడి ఎదుట పూలమ్ముకునే వాళ్లు, పార్కులో యోగా చేసుకుంటున్న కొందరు… ఇలా రోజూ మన కళ్ళముందు కనబడే చిత్రాలు. వెనుక నుంచి దించాడు. పెయింటింగ్స్‌లో ఎక్కువ మంది మనుషులున్నా, డీటెయిలింగ్ చక్కగా చేయడం కృష్ణ స్పెషాలిటీ.

వీరేన్, క్రిష్ణ ఇద్దరిదీ ఒకే ఊరు, చుట్టరికం కూడా ఉంది. మిత్రులు క్రిష్ణ గదికి చేరారు. తాళం వేసి ఉంది.

ఆకాశంలో రంగుల ఫౌంటెన్‌లా ఒక విమానం, పిన్ గుచ్చుకుంటే అరిచే మనిషి గొంతులా, కీచుగా చప్పుడు చేస్తూ వెళ్ళింది.

“నేనూ అలా ఎగిరిపోతూ ఆస్ట్రేలియా టూర్ కెళ్ళాలని కోరిక రా” అన్నాడు వీరేన్.

“ముందు బ్యాక్‌లాగ్స్ అవగొట్టి, జాబ్ సంపాదించరా” అన్నాడు మధు, వీరేన్ చెవిలో.

కాసేపయాక దగ్గరున్న బండి నుంచి మంచూరియా 4 ప్లేట్లు, దానికి కాంబినేషన్ రెండు లీటర్ల థమ్సప్ తెచ్చాడు మధు. అందరూ కానిచ్చారు, కబుర్లాడుతూ. రాత్రి 9 అయాక క్రిష్ణ వచ్చాడు.

“జోకర్ మూవీ కెళ్దామా… అనుకుని, నీ రూమ్ కొచ్చి పడ్డాం” వీరేన్ పలకరింపు.

“హాయ్ ఆల్! ఏరా జోక్ చేస్తున్నావా బావా? ” అన్నాడు క్రిష్ణ.

“క్రిష్ణా! నువ్వెలా జోకర్ అయ్యావో నాకు తెలియాలి. తెలియాలంతే !” అంది వీణ.

 “ఎందుకో ఎక్సైటెడ్‌గా ఉన్నావు?”

“బాధ, క్రిష్ణా! అచ్చం నాకున్నలాటి టాప్‌లో అప్పుడే ఇద్దరు కనిపించారు.”

“మళ్ళా మొదలు” విసుక్కున్నాడు వీరేన్.

రూమ్ లాక్ తీసి, డోర్ తెరిచి, క్రిష్ణ పవర్ స్విచ్ ఆన్ చేసాడు.

“వీణా! బోలెడు రిటైల్ స్టోర్స్, పదికి పైగా బ్రాండ్ పోర్టుఫోలియోస్. ఒక్కో టాప్‌కి స్మాల్, మీడియం,లార్జ్ .. అంటూ 5 రకాల సైజెస్. కాబట్టి నీలా ఆలోచించే వాళ్ళందరూ తీసుకుంటారు కదా! ఒక స్టడీ ప్రకారం ఎనీ టైమ్ ఒక మిలియన్ మంది నీలాగే ఆలోచించే అవకాశం ఉంది. తెలుసా?”

“వీణా! వాడిని కదపకు. ఇలాగే ఉంటుంది. ప్యూర్ మేథ్. రేయ్ క్రిష్ణా! బుర్రకి కాస్త రెస్టిచ్చి, డిన్నర్ సంగతి చూసుకో. మేమాల్రెడీ తినేసాం” వీరేన్ నేలమీద బెడ్ వేస్తూ అన్నాడు.

“ఓకే! డన్!” అంటూ క్రిష్ణ రెండు ఆమ్లెట్లు వేసుకుని,టోమాటో కర్రీ కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు.

“ఏంటి? ఇంత రాత్రైనా సొంత వంటా?”

“వాళ్ళ అమ్మకి వాడిచ్చిన ప్రామిస్! మానడు” వీరేన్ చెప్పాడు.

“యు ఆర్ గ్రేట్ భయ్యా! నేల మీద, షూ మీద కాదు చెప్పిన మాట మీద నిలబడతావు” మధు అన్నాడు పక్క మీద వాలిపోతూ.

“ప్రతి వారికీ ఒక స్టోరీ ఉంటుంది” తిన్న ప్లేట్ కడుగుతూ అన్నాడు క్రిష్ణ.

“భలే చెప్పావు! వీణా వీడు ఎలా ‘జోకర్’? అన్నావు కదా! ఆ మూవీ హీరోలా, బోలెడు స్టేట్మెంట్స్ ఇస్తూంటాడు” వీరేన్ చెప్పాడు.

“నేనూ ఒప్పుకుంటాను, ప్రతీ వాడి లైఫ్ ఒకో స్టోరీ.”

మధు విజిల్ వేశాడు.

“అదే యునీక్” అంటూ క్రిష్ణ తన డెస్క్‌టాప్ ముందు కూర్చున్నాడు.

ఫ్రెండ్స్ ముగ్గురూ గుసగుసల కబుర్లతో నిద్రకి ప్రయత్నిస్తున్నారు.

ఇదో ఏంబియన్స్! బెడ్ లాంప్, కిటికీ దగ్గర మట్టి ఛైమ్స్, కుండీలో జాజి తీగ. పువ్వుల బెడ్ షీట్స్, ‘చంపా’ అగరువత్తి పరిమళం. క్రిష్ణ రూమ్ అంటే ఒక రిట్రీట్ టు హోమ్!

రఫ్ స్కెచెస్ వేసుకుంటున్నాడు క్రిష్ణ.

ఫ్రెండ్స్ నిద్రలోకి జారుకున్నారు. సర్దు మణిగింది.

***

ఒక వారం తరువాత, మధ్యాహ్నం 3 గంటలకు ఆఫీస్‌లో ఉండగా, క్రిష్ణ ఫోన్ మోగింది .’వీణ కాలింగ్’ అని చూసుకొని వెంటనే ఎత్తాడు. మరో గంటలో పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడు.

“మాస్టర్! మీ మేలు మరువలేను” తన పక్కనున్న షరాయి, లాల్చీ వేసుకున్న మనిషితో వినయంగా చెప్పాడు. అలా అంటూ ఉండగానే, ఆ వచ్చిన పెద్దమనిషి, క్రిష్ణకు హ్యాండ్ షేక్ ఇచ్చి, కళ్ళలోకి లోతుగా చూస్తూ తల ఆడించాడు. “ఐ నో మాస్టర్, అనదర్ త్రీ మంత్స్” అన్నాడు క్రిష్ణ.

అందరూ రూమ్‌కి వచ్చేసరికి రాత్రి పదైంది.

క్రిష్ణ స్నానం చేయడానికి వెళ్ళాడు. వీణ టీ పెడుతోంటే, మధు రూమ్ క్లీన్ చేస్తున్నాడు.

“ఆ రిషి గాడు, మోసం చేశాడ్రా! వాడు చేసిన పనికి నేను బుక్ అయ్యాను” అసహనంగా అరిచాడు వీరేన్. ఎవరూ సమాధానం ఇవ్వలేదు. బీన్ బ్యాగ్ మీద కూలబడ్డాడు,“నేను వీకెండ్స్ జొమాటోకి పని చేస్తాను.”

“అంత అవసరమేంటి?” వీణ నిలదీసింది.

“బాక్‌లాగ్స్, బ్యూటిఫుల్ లైఫ్ రెండూ బాలన్స్ చెయ్యాలంటే, పై సంపాదన అవసరం”మధు ఎగతాళిగా అన్నాడు.

“ఆ రిషి బేచ్ రెండు, మూడు సార్లు డ్రంక్ ఎండ్ డ్రైవ్‌లో ఎంటరయారు. నీకు వాళ్ళతో వద్దని చెప్పాను కదా!” అప్పుడే వచ్చిన క్రిష్ణ, తల తుడుచుకుంటూ.

“చెప్పావులే. కానీ వాళ్ళ కంపెనీలో కిక్ ఉంటుంది, ట్రెండీ ఫెలోస్. ఇవాళ నేను హోం డెలివరీకెళ్ళేసరికి, ఆ ఫ్లాట్స్ దగ్గర బస్టాప్‌లో చైన్ స్నాచ్ చేస్తూ రిషి దొరికి పోయాడట!”

“ఓ! మై గాష్!” వీణ నిట్టూర్చింది.

“అది తెలీక నేను మామూలుగా, ‘హలో! రిషి ఏమైందిరా?’ అన్నాను. అంతే! వాడు వెంటనే, ‘ఇదిగో మేమిద్దరం xxx ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్! వీడికి ఎమర్జెన్సీ డబ్బు అవసరం వచ్చింది. వాడు జొమాటోలో వర్క్ చేస్తున్నాడు. నేను, వాడు కలిసి చిన్న ప్లాన్ వేశాం” అన్నాడు. మమ్మల్నిద్దరిని తోడు దొంగలని స్టేషన్‌లో పెట్టారు” వీరేన్ ముగించాడు.

వీణ అందరికీ టీ ఇచ్చింది.

“క్రిష్ణ మరో 3 నెలలు కమిట్ అయ్యాడు, నేను విన్నాను” అంది బాధగా.

“సో! ఎంతంటావ్?” విసుగ్గా అన్నాడు వీరేన్.

“మినిమం 20 కె. అదొక్కటేనా? వాడి టేలంట్ అమ్ముకోవాలి.”

“ఫర్లేదు వీణా! నా బాధ అది కాదు. నువ్ నా ఊరోడివి. నా కజిన్ వి.ఫోన్ రాగానే నాకు… ఇదొక్కటే అనిపించింది, తెల్సా?” ఛైర్ మీద నుంచి లేచాడు క్రిష్ణ.

అప్పుడు బ్రేక్ అయాడు వీరేన్. “నాన్న కి తెలిస్తే …?” అంటూ భోరుమన్నాడు .

“బావా! రిలాక్స్!” వీరేన్‌ని హగ్ చేసుకున్నాడు క్రిష్ణ,

“రెండేళ్ళగా ఏదో కథ చెప్తూ వచ్చావు. నీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఈ క్షణం చాలా ముఖ్యం. గోడ మీద ఉన్నావు. ఇటైతే మేమున్నాం. అటైతే నీ బ్రాండ్ లైఫ్. బాగున్నట్టే ఉంటుంది. కానీ, నీ వ్యక్తిత్వం ఒకోసారి నీ ప్రాణం పెట్టి కొనాలి దాన్ని. ప్రపంచం అంతా ముందుకి వెళ్ళాక, వయసు మీద పడి ఒంటరిగా ఉండిపోతావ్. నువ్వే తేల్చుకో” అన్నాడు.

“అయినా సెల్ లోకి మొదటి సారి వెళ్ళినప్పుడే రియాలిటీ తెలుస్తుంది. ఆ తర్వాత….” మధు ఏదో చెప్పబోయాడు.

“అంతకంతకూ అలవాటైపోయే ప్రమాదం ఉంది” వీణ పూర్తి చేసింది.

“వీణా! యు ఆర్ అమేజింగ్ టుడే. బ్రాండ్ డ్రస్ నుంచి, నువ్వే బ్రాండ్ అవగల అండర్‍స్టాండింగ్‌కి వచ్చేశావు. సరే, నూడుల్స్ చేసుకుందామా?” అంటూ ముందుకు కదిలాడు క్రిష్ణ.

అందరూ నవ్వారు.

ఇక, వీరేన్! బ్రాండ్ ఔతాడో? ఆ ఇమేజ్‌లో ఉండిపోతాడో?!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here