Site icon Sanchika

అహంకారపు భర్తతో జీవించడానికి రాజీ పడిన ఒక భార్య కథ ఆర్. కే. నారాయణ్ ‘ది డార్క్ రూమ్’

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]ఆర్.[/dropcap] కే నారాయణ్ భారతదేశం గర్వించదగ్గ రచయిత. వీరు రాసినదంతా ఇంగ్లీషు భాషలోనే. కాని భారతీయ ఆత్మను, ఆధ్యాత్మికతను, జీవితాన్ని తన రచనలతో ప్రపంచానికి పరిచయం చేసిన భారతీయ రచయితగా మనం వీరిని గుర్తించాలి. దక్షిణ భారతీయ జీవితాన్ని వీరి నవలలు చిత్రీకరిస్తాయి. ఎన్నో విషయాలపై వీరు రాసిన నవలలు భారతీయులకంటే విదేశీయులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. మాల్గుడి వీరు సృష్టించిన ఒక కాల్పనిక పట్టణం. వీరి నవలలు, కథలు ఎక్కువగా ఈ పట్టణంతో సంబంధం ఉన్న కథావస్తువులే. వీరి నవలలలో చాలా మందికి తెలియని ఎక్కువగా ప్రస్తావనకు రాని నవల ‘ది డార్క్ రూమ్’. దీన్ని 1938 లో వీరు రాసారు. ఇందులో కథ కూడా మాల్గుడి లోనే నడుస్తుంది.

భర్తల చేతిలో హింసకు గురవుతున్న మధ్యతరగతి స్త్రీలు మౌనంగా తమ నిరాదరణను భర్తలపై తమ కోపాన్ని ఎలా ప్రదర్శించారో, ఎలా ఎదుర్కున్నారో, దానికి కారణాలు ఏంటో వివరించి చెప్పే కథ ఇది. స్త్రీలు పరిస్థితుల కారణంగా మౌనంగా ఉన్నా అంతరంగంలో వారి కోపాన్ని వారు ప్రదర్శించవలసిన విధంగా ఎప్పుడూ చూపుతూనే ఉన్నారని. దానికి ఎంతో ధైర్యం, నిబ్బరం కావాలని. అది భారతీయ స్త్రీలలో ఎక్కువ అని, తమ బాధని పెదవి దాటనివ్వకుండా బ్రతకడం నేర్చుకున్న స్త్రీలలోమరో కోణాన్నిచూపే ప్రయత్నం చేసిన నవల ఇది.

ఈ నవలలో ముఖ్య పాత్ర సావిత్రి. ముగ్గురు పిల్లల తల్లి ఆమె. ఆమె భర్త రమణి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. అహంకారి, అహంభావి. ఇంటి యజమానిగా తన హక్కులను సాధించుకుని తీరే మనిషి. ఆడదాన్ని అదుపాజ్ఞలలో పెట్టుకోవడమే పురుష హక్కు అని నమ్మే భర్త అతను. అతనిపై సావిత్రి ఎంతో నమ్మకాన్ని, ప్రేమను పెంచుకుంటుంది. అతనికి కావల్సినవన్ని అమర్చడమే తన జీవితం అని నమ్ముతుంది. కాని ఆమెను మనిషిలా కూడా చూడడు రమణి. ఒక చిన్న మంచి మాట, ఒక ప్రశంస అతని నుండి రాదు. భర్తగా, తండ్రిగా కుడా అధికారాన్నే ప్రదర్శిస్తాడు తప్ప ప్రేమ గురించి తెలియని బండరాయి అతను. తన అవసరాలు, తన కోరికలు, తన జీవితం ఇవి మాత్రమే ముఖ్యం అని భార్యా పిల్లలకు వాటి మధ్య స్థానం లేదని నమ్మి అలాగే జీవించే వ్యక్తి అతను. సావిత్రి భార్యగా తనకు అణిగి మణిగి ఉండాలి అన్నది అతని అభిప్రాయం. తాను ఇంటికి యజమానిని అని తనను సంతోషపెట్టడం భార్యగా ఆమె కర్తవ్యం అని చెబుతూ ఉంటాడు. సావిత్రికి తనకంటూ కొన్నిసొంత అభిప్రాయాలు కూడా ఉండకూడదని, ఆమెకంటూ మరో జీవితం ఆలోచన తను కాకుండా మరొకటి ఉండకూడదని అతని వాదన. ఇంటి పనులు కూడా తన ఇష్టప్రకారమే ఆమె చేయాలని అతని షరతు. ఇంట్లో ప్రతి పనిని, ప్రతి వ్యక్తిని తనకు అనుకూలంగా ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. సావిత్రీ అతని ప్రతి విషయానికి సహకరిస్తుంది. అతనికి అనుకూలంగా ఇష్టపూర్వకంగా మారిపోతుంది.

రమణి తన ఆఫీసులో శాంతాబాయి అనే స్త్రీకి ఉద్యోగం ఇస్తాడు. శాంతాబాయి భర్త నుండి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న స్త్రీ. రమణి ఆమె ఆకర్షణలో పడిపోతాడు. ఆమె పై అతనికున్న ఆకర్షణను ఆఫీసులో ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. శాంతా బాయికి ఆఫీసులో అన్ని సౌకర్యాలు సమకూర్చుతాడు రమణి. అలాగే ఆమెకు ఒక ఇల్లు చూపించి తన ఇంటి నుండి ఫర్నీచరును ఆమె ఇంటికి మారుస్తాడు. సావిత్రికి తన ఇంటి వస్తువులు మరో చోటుకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా భర్త కోసం తన అయిష్టతను తనలో దాచుకుంటుంది. రమణి శాంతాబాయి కలిసి తిరగడం ఊరంతా గమనిస్తారు. సావిత్రి భర్తను ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు అతను ఆమెను అవమానిస్తాడు. తనను ప్రశ్నించే అధికారం ఆమెకు భార్యగా లేదని తన ఇష్టం వచ్చినట్లు తాను ఉంటానని చెబుతాడు. అవమానంతో సావిత్రి ఒక రాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. సావిత్రి పిల్లలను తనతో తీసుకుని వెళ్ళడానికి రమణి ఒప్పుకోడు. పిల్లలు తన ఆస్తి అని వారిపై సావిత్రికి ఎటువంటి హక్కు లేదని గట్టిగా చెబుతాడు. సావిత్రీ ఈ మాటలతో గాయపడుతుంది. నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కాని ఆ ఊరి లోని ఒక తక్కువ కులం పనివాడు ఆమెని కాపాడతాడు. అతని తాళాలు బాగు చేస్తూ బ్రతుకుతున్న ఒక పేదవాడు. ఆమెను రక్షించి తన ఇంటికి తీసుకునివెళతాడు. అతను అతని భార్య ఆమెకు కావల్సినవన్నీ అమర్చుతారు. తమ శక్తికి మించి ఆమెకు సహాయపడతారు. సావిత్రి పెద్ద కులం స్త్రీ కాబట్టి తమ ఇంట్లో పెట్టుకోవడంతో సమస్యలు వస్తాయని ఆమెకు ఒక గుడిలో పని చూస్తారు. తమ లాంటి అంటరానివారితో కలిసి బ్రతికితే ఆమె భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆలోచించి ఆమెకు అండగా ఉంటూనే ఆమె ను తమకు దూరంగా ఒక గుడిలో పనికి కుదురుస్తారు.

మొదటి సారి ఇంటి నుండి దూరంగా గుడిలో కష్టపడి పని చేసి వండుకున్న అన్నం తింటున్నప్పుడు సావిత్రికి తనపై తనకు నమ్మకం కలుగుతుంది. అందులో ఒక తృప్తి కనిపిస్తుంది. తను మరొకరి పంచన లేనని, తన కష్టంతో బ్రతుకుతున్నానని, బ్రతకగలనని తెలుసుకుని గర్వపడుతుంది. కాని తల్లిగా అమెకు పిల్లలు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ఉంటారు. పిల్లలను భర్త పట్టించుకోడని, ఏ తప్పూ చేయని తన పిల్లలు ఎందుకు శిక్ష అనుభవించాలని బాధపడుతుంది. పిల్లల కోసం తిరిగి భర్త ఇంటికి చేరుతుంది. ఆమె ఇల్లు చేరగానే రమణి తానే ఆమెపై గెలిచినట్లు ఆడదానిగా ఆమెను తన అదుపులోకి తీసుకు వచ్చానని గర్వపడతాడు. శాంతాబాయిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తాడు. మనసు చనిపోయి అతనితో భార్యగా సావిత్రి తిరిగి జీవితం ప్రారంభిస్తుంది.

‘ది డార్క్ రూమ్’ అన్న పేరు ఈ నవలకి పెడుతూ సావిత్రి భర్త మీద కోపం వచ్చినపుడు విడిగా ఉండే ఆ ఇంటీ స్టోర్ రూమ్‌ను చూపుతారు రచయిత. ఆ గదిలో తన కోపం తీరే దాకా తిండి నీరు ముట్టకుండా కొంత సమయం ఉండిపోవడం సావిత్రికి అలవాటూ. తన కన్నీళ్ళూ కారిపోయాక, బాధ, ఆలోచనలు వదిలించుకుని తిరిగి మళ్ళీ జీవితంలోకి ప్రవేశించేదాకా ఆ గదిలో ఉండిపోవడం ఆమె జీవితంలో ఒక భాగం. చాలా మధ్యతరగతి ఇల్లలో ఇటువంటి ఒక గది స్త్రీలకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. ఆ గది గోడలకు వారి కన్నీళ్ళూ, కోపం, అసహాయత అన్నీ పరిచయమే. తమ అనుకునే ఇంటి వారెవ్వరూ తమని అర్థం చేసుకోనప్పుడు ఒంటరితనంతో ఎందరో స్త్రీలు ఇలా చీకటిగదులను ఆశ్రయించిన వారే.

భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని తెలిసి సావిత్రి ముందు తాను భర్తకు అందంగా కనిపించలేనందుకు బాధపడుతుంది. అతన్ని ఆకర్షించలేకపోవడం తన తప్పని అనుకుంటుంది. తాను సంసార జంజాటనలో పడి సరిగ్గా తయారవ్వలేకపోవడం తన తప్పని అనుకుంటుంది. అందువలనే తన భర్త కొన్ని సంవత్సరాలుగా తనను కనీసం సరిగ్గా తెరిపార చూడను కూడా చూడట్లేదని, అది తన చేతకానితనమే అని అనుకోవడం మొదలెడుతుంది. అందుకని అతని పట్ల ఎంతో ప్రేమను ప్రదర్శిస్తుంది. కొద్దిగా తయారవ్వడం మొదలెడుతుంది. కాని దాన్ని ఆమె బలహీనతగా తన విజయంగా భర్త భావిస్తాడు. ఆమె ఎప్పటికీ ఒక మగవాడి చూపు కోసం వెర్రిగా ఎదురు చూడవలసిన స్త్రీ, ఆధారపడవలసిన ప్రాణి మాత్రమే అని అంటూ ఆమెను బాహాటంగా అవమానిస్తాడు. తన అభిమానం గాయపడి ఆమె ఇల్లు వదిలి వెల్లిపోతుంది. కాని తల్లిగా తన బాధ్యత గుర్తుకు వచ్చి తిరిగి ఆ మగాడి దగ్గరకే వచ్చి చేరుతుంది.

గుడిలో తన తిండి తాను తిని ఆ తృప్తి అనుభవించినా ఆమె చివరకు మనసు చచ్చి, ఆత్మ కోల్పోయి తన అహంకారపు భర్తతో ఉండడానికి రాజీ పడుతుంది. కాని ఈ జీవితంలో తనను తాను కోల్పోయానని గ్రహిస్తుంది. భర్తపై మునుపటి గౌరవం ఉందదు. తాను ఒంటరిగా బ్రతకగలనని తెలుసు, ఏదో కాయకష్టం చేసుకునే దారులు ఉంటాయనీ తెలుసు కాని తన అభిమానం కన్నా పిల్లల భవిష్యత్తు ఆమెను ఆలోచింపజేస్తుంది. తన మనసులోనే ఒక చీకటి గదిని ఏర్పరుచుకుంటుంది. అందులో తన భర్త పై కోపాన్ని, అసహ్యాన్ని దాచుకుంటుంది. తన బాధ్యతలను మౌనంగా నెరవేర్చడం నేర్చుకుంటుంది. తన భావాలు, ఆలోచనలు తన వరకు పరిమితం చేసుకుంటుంది.

ప్రతి స్త్రీ మనసులో ఇలాంటి ఒక చీకటీ గది ఉంటుంది. ఉండకపోతే ఆమె జీవించి ఉండలేదు, ఆ చీకటి గదికి ఎన్ని సత్యాలు తెలుసో, ఎంత కోపాన్నిఆ స్త్రీ భరించిందో ఆ గదికే తెలుసు. తన బాధ్యతలను నెరవేర్చడానికి ఆ గది నుండి బైటికి వచ్చి తిరిగి ఒంటరిగా అ గదిలోకి చేరడం స్త్రీ జీవితం లోని ఒక పెద్ద నిజం. ఆ గది బైట ఆమె గౌరవానికి, ఆమె అభిప్రాయాలకు, ఆమె ఆలోచనలకు ఎట్టి ప్రాధాన్యత లేదని ఆమెకు తెలుసు. కాని ఆమె ఆ గది బైటికి లోపలికి ప్రయాణిస్తూ జీవితం గడిపేయాలని నిశ్చయించుకుంటుంది.

నవల ఆఖరి అధ్యాయంలో ఒక రోజు ఆమెను కాపాడిన పనివాడు తాళాలు బాగు చేస్తానని అరుచుకుంటూ ఆమె వీధిలోకి వస్తాడు. అతను ఆమె బాగు కనుక్కోవడానికి ఆ వీధికి వచ్చాడని అతను అతని భార్య తన నిజమైన శ్రేయోభిలాషులని ఆమెకు తెలిసినా, అతన్ని కలిసి గుర్తుపట్టి మాట్లాడడం వలన తన భర్తకు చెడ్డపేరు వస్తుందని ఆమె ఆ పని చేయదు. అతను మానవత్వం ఉన్న మంచి మనిషి అని తెలిసినా అతనితో తన లాంటి సంసార స్త్రీ మాట్లాడం తప్పుగా ఎంచబడుతుందని, తన భర్త గౌరవం పోతుందని తెలిసి బాధ్యతగా మౌనాన్ని ఆశ్రయిస్తుంది. తన కుటుంబ గౌరవం తన భాద్యత అని నమ్ముతుంది. అతనిపై తనకున్న అభిమానాన్ని చంపుకుని ఒక అనుకూలవతి అయిన భార్యగా ఉండిపోతుంది. తన బాధ్యత అని అనుకున్నప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఒక స్త్రీ ఎన్ని విషయాలను వదులుకోగలదో సావిత్రి పాత్ర ద్వారా రచయిత చెప్పే ప్రయత్నం చ్రేసారు.

సావిత్రి పతివ్రత అనో గొప్ప భార్య అనో చెప్పడం ఇక్కడ రచయిత ఉద్దేశం కాదు. స్త్రీలు చేతకాక భర్తల అధీనంలో ఉండరని, భార్యగా కన్నా తల్లులుగా వారు తమ జీవితాన్ని భాద్యతగా నిర్వహిస్తారని, దానికి ఎంతో మనోనిబ్బరం, ధైర్యం అవసరమని, దాన్ని గుర్తించమని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక చీకటి గదిలో తమ కోరికలను సమాధి చేసుకుని తమ కోపాన్ని మింగి దాచుకుని బాధ్యత లేని మగవారి ప్రవర్తనకు తాము కన్న పిల్లలు బలి కాకుండా ఆ బాధ్యతా రాహిత్యాపు దారిలో తాము పడి దానికి పిల్లలను సమిధలుగా చేయకుండా ప్రతి క్షణం కాలిపోతూ బిడ్డల కోసం ఎంతో విషాన్ని మింగే ఆ స్త్రీలు ఇల్లల్లో మగ్గిపోవడానికి కారణం భర్తలు చేసే తప్పు తాము చేయకూడదనే ఒక్క గొప్ప ఆలోచనతో మాత్రమే. తమను హింసించే భర్తలపై వారికి ప్రేమ లేదు. ఉండదు, కాని ప్రతికూల పరిస్థితులలోకూడా బాధ్యతా రహిత ప్రవర్తనను వారు స్వాగతించకపోవడం తల్లులుగా వారు ఎంచుకున్న మార్గం, ఇక్కడ పతిపై ప్రేమ కన్నా పిల్లల పై బాధ్యత వారిని ఆ ఇంటికి బందీని చేస్తుంది. ఆ పిల్లల కోసమే భర్త గౌరవానికి భంగం రాకుండా నడుచుకుంటారు సావిత్రి లాంటి స్త్రీలు. ఆ భర్త పేరుతో జీవించే ఆ పిల్లల భవిష్యత్తు పాడు కాకుండా ఉండాలని తపిస్తారు. ఆ స్త్రీల గొప్పతనం, దూరదృష్టి మాత్రమే ఎన్నో జీవితాలను ఈ లోకంలో ఛిన్నాభిన్నం కాకుండా కాపాడింది, కాపాడుతుంది అన్నది నిజం.

ఇది చిన్న నవల, విషాదం మూర్తీభవించిన కథ కాని ఎన్నో జీవితాలను అర్థం చేసుకునే అవకాశం ఈ నవల ఇస్తుంది. 30 లలో ఈ విషయం పై నారాయణ్ రాసిన ఈ నవల వారి అత్యున్నత సృష్టి అన్నది మాత్రం నిజం.

Exit mobile version