[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]లి[/dropcap]యో టాల్‌స్టాయ్ నవలికల్లో ఎంతో మంది దార్శనికులను ఆకర్షించిన పుస్తకం The Death of Ivan Ilyich. దీన్ని టాల్‌స్టాయ్ 1886లో రాసారు. జీవితం, మృత్యువు గురించి చర్చించిన నవల ఇది. టాల్‌స్టాయ్ రచనలన్నిటిలో దీన్ని ప్రత్యేకంగా చెప్పుకుంటారు సాహితీ ప్రియులు. ఇందులో ప్రధాన పాత్ర పేరు ఇవాన్. సమాజంలో మంచి పేరు పరపతి ఉన్న వ్యక్తి అతను. హైకోర్ట్ జడ్జిగా పని చేస్తూ ఉంటాడు. తన వృత్తిలో గొప్ప పేరు, గౌరవాన్ని పొందిన వ్యక్తి అతను. అతని వైవాహిక జీవితం కూడా ప్రతి మర్యాదస్తుని జీవితం లానే సాఫీగా సాగిపోతుంటుంది. కొన్ని కలహాలు, కొన్ని సందర్భాలలో వాదనలు ఉన్నా, వారి సమాజంలో ఇవాన్‌ది అన్యోన్యమైన దాంపత్యం గానే చెప్పుకుంటుంటారు మిత్రులు. ఒక మర్యాదస్తునిగా, కుటుంబ పెద్దగా తాను నెరవేర్చాల్సిన బాధ్యతలను చాలా నిబద్దతతో నిరవేర్చిన వ్యక్తి ఇవాన్. కష్టపడి చదువుకున్నాడు, కష్టపడి పని చేసాడు, కుటుంబాన్ని ప్రేమించాడు, భార్య పట్ల నిజాయితీతో జీవించాడు. కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చాడు. కాబట్టి అతనిది పరిపూర్ణమైన జీవితం అని చెప్పవచ్చు.
తన కుటుంబం ఆనందంగా జీవించడానికి దగ్గర ఉండి ఒక ఇల్లు కట్టిస్తున్నాడు ఇవాన్. దానికి కావలసిన కర్టెన్లు స్వయంగా తొడుగుతూ జారి క్రింద పడి దెబ్బ తగిలించుకుంటాడు. అప్పుడు కొద్దిగా నొప్పి అనిపించినా తరువాత లేచి తన రోజువారి పనుల్లో పడిపోతాడు. అదో పెద్ద ప్రమాదమని, పట్టించుకోవలసిన విషయం అని అప్పుడు అతనికి అనిపించదు. కాని తరువాత మెల్లిగా శరీరంలో విపరీతమైన బాధ, నొప్పి మొదలవుతాయి. లేవలేని స్థితికి చేరుకుంటాడు ఇవాన్. మెల్లిగా మంచానికి పరిమితమవుతాడు. దీనితో పాటు అతని చుట్టు పక్కల వాళ్ల ప్రవర్తన కూడా అతన్ని చికాకుపెడుతుంది. తాను మృత్యువుకి దగ్గరవుతున్నానని, ఏ మందు తనను రక్షించలేదని ఇవాన్‌కి అర్థం అవుతుంది. అతని కుటుంబం, స్నేహితులు కూడా అతనికేం జరగనట్లు, అదో పెద్ద ప్రమాదం కాదని, పెద్ద విషయం కానట్లు ప్రవర్తించడం చూస్తే అతనికి వారిపై కోపం వస్తుంది. అతను చనిపోవట్లేదని చాలా కాలం జీవిస్తాడన్నట్లు వారు మాట్లాడే అబద్దాలు అతనికి విసుగు పుట్టిస్తాయి. కేవలం అతని పనివాడు జెరాసిమ్ మాత్రం అతని స్థితిని ఉన్నదున్నట్లుగా చూస్తాడు, అతని స్థితిని యథాతథంగా స్వీకరిస్తాడు. అది చాలా సాధారణమయిన విషయం అని, మరణం జీవితంలో ఒక భాగమని, దాన్ని గురించి ఆలోచించడం తప్పు కాదని అతి సహజంగా అతను తన యజమాని దగ్గర ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనిలోని నిజాయితీ మాత్రమే ఇవాన్‌కు సంతృప్తి నిస్తుంది. మిగతా వారి నటనలో కొంత స్వార్థం, కొంత పలాయనవాదం కనిపించి ఆ అబద్దపు సాంగత్యానికి దూరం జరగాలని ఇవాన్ మనసు కోరుకుంటూ ఉంటుంది.
మృత్యు శయ్యపై మొదటిసారి జీవితం గురించి, మరణం గురించి ఇవాన్ ఆలోచించడం మొదలెడతాడు. ఒక రోజు తాను చనిపోతానని తెలిసినా ఇంత తొందరగా తాను మృత్యు ముఖం వద్దకు చేరుకుంటానని అతను అనుకోలేదు. తాను సమాజం దృష్టిలో అదృష్టవంతుడినని, పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించానని తన వాళ్ళు అనుకుంటున్నారని అతనికి తెలిసినా, తాను అప్పటి దాకా జీవించిన జీవితంలో నిజం కన్నా నటన పాళ్ళు ఎక్కువ అని అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఒక మంచివాడిగా బాధ్యతతో జీవించిన తాను ఇలా ఇప్పుడు శారీరికంగా బాధ పడడం న్యాయం కాదని అతనికి అనిపిస్తూ ఉంటుంది. తానో మంచి కొడుకుగా, మంచి వ్యక్తిగా, మంచి భర్తగా బ్రతికానని అతని నమ్మకం. కాని ప్రస్తుతం తాను పడుతున్న బాధ చూస్తే మనిషి గడిపిన జీవితానికి, అతని అఖరి రోజులకు ఎటువంటి సంబంధం ఉండదని అతనికి అర్థం అవుతుంది. చుట్టూ ఉన్న వారి సపర్యలలో నటన జీర్ణించుకోవడం అతనికి కష్టం అవుతుంది. తన స్థితిని సహజంగా, జీవితపు వాస్తవంగా గుర్తించి, ఎటువంటి నాటకీయతకు తావివ్వకుండా తనను సహజంగా స్వీకరించి తనతో నిజాయితీగా మసలే ఆ నౌకరు సాంగత్యమే అతనికి ఆ ఆఖరి క్షణాలలో సాంత్వన ఇస్తుంది. అప్పటి దాకా సమాజం, బంధాలపై అతనికున్న నమ్మకాలలో మార్పు వస్తుంది.
జీవితంలో అత్యధిక శాతం నటన, అబద్దాలతో ముడిపడి ఉంటుందనే సత్యం అతనికి అప్పుడు అవగతం అవుతుంది. మరొకరిని తృప్తి పరచడానికి, నిరంతరం, మంచి వానిగా బ్రతకాలని, మంచివాడనిపించుకోవాలని తాను జీవితంలో చేసిన ప్రయత్నాలన్నీ కూడా అర్థం లేనివిగా అప్పుడు అనిపించడం మొదలవుతుంది. తాను తనకు కావలసినదేంటో తెలుసుకోలేక ఎప్పుడు ఇతరుల మెప్పు కోసం జీవితాన్ని గడిపానని, అందులో నిజం లేదని, ఉన్నదంతా తన కల్పన అని అతనికి తెలుస్తుంది. మనుష్యులను వారి నిజ రూపాలను ఒప్పుకోవడం మొదలెడతాడు. తనను మరణానికి మానసికంగా సిద్ధం చేసుకుంటాడు. అతని ఆఖరు క్షణాలలో చదువురాని ఆ పల్లెటూరి పనివాడే జీవితపు సారాన్ని తెలియజేస్తాడు. అంతే కాకుండా మరణాన్ని ఎలా స్వీకరించాలో నేర్పిస్తాడు. మోసపూరితమయిన బంధాల నుండి తనను తాను దూరం చేసుకోవడానికి ఈ సేవకుడు వద్ద నేర్చుకున్న పాఠాలు ఇవాన్‌కి ఉపయోగపడతాయి.
ఈ నవలిక చదువుతున్నంతసేపు ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. నైతిక జీవనం అంటే ఏంటి? జీవితానికి అర్థం ఏంటి? ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇవాన్ తన మృత్యు శయ్యపై వెతుక్కుంటాడు. తానింత కాలం జీవించిన జీవితమే అబద్ధమని, మోసపూరితమైనదని, కాని సమాజం దృష్టిలో అది నీతి గల జీవనమని, సమాజంలో నీతిమంతుడని అనిపించుకోవడానికే తాను జీవితాంతం తాపత్రయపడ్డానని, కాని ఆ జీవితం పట్ల తనకు నిజమైన కోరిక లేదని అతనికి అర్థం అవుతుంది. అతని చుట్టూ ఉన్నవారు అతను క్షణ క్షణం చావుకు దగ్గరవుతున్నాడని చెప్పకుండా అతని వద్ద నటిస్తూ అలా ఉండడమే నీతి అని నమ్ముతూ కనిపిస్తారు. మనిషి ఆఖరి క్షణాలలో కూడా నిజాన్ని కప్పి పెట్టి అతన్ని మభ్యపెట్టడమే ప్రేమ అని అందరూ నమ్ముతారు. ఒక్క మృత్యువు విషయంలోనే కాదు జీవితంలో ప్రతి నిముషం, వారు నిజాలను దాచి పెట్టి అవతలి వారిని మోసం చేయడమే ధర్మమని, ప్రేమ అని, నీతి అని అనుకుంటూ జీవించారు.
నౌకరు జెరాసిమ్ దగ్గర మాత్రమే ఇవాన్‌కు నిజాయితీ కనిపిస్తుంది. అసలు చనిపోవడం సహజం, దాన్ని సహజంగా స్వీకరించాలి అని జెరాసిమ్ తన ప్రవర్తన ద్వారా తెలియజేస్తాడు. ఇవాన్‌ను జాలిగా లేదా న్యూనతా భావంతో చూస్తూ అతని పట్ల ఔదార్యాన్ని ప్రకటిస్తూ, పాపం నువ్వు చనిపోతున్నావ్ కాని అది నీకు తెలియకుండా ఉంచుతూ నేను నీ కెంత ఉపకారం చేస్తున్నానో తెలుసా అన్నట్లుగా అతను ఎప్పుడూ ప్రవర్తించడు. అందుకే ఆ ఆఖరి ఘడియల్లో జెరాసిమ్‌తో ఉండడానికే ఇష్టపడతాడు ఇవాన్.
తన చుట్టూ ఉండి తనపై జాలి చూపుతున్న వ్యక్తులపై జాలి పడడం నేర్చుకుంటాడు ఇవాన్. వారి నటన చూసి బాధపడతాడు. వారిని, వారి మూర్ఖత్వపు మోసాన్ని, గుర్తించి క్షమిస్తాడు. ఒకానొక సమయంలో చావు తప్ప ప్రపంచంలో మరేదీ నిజం కాదని ఇవాన్‌కు బలంగా అనిపిస్తుంది. సమాజంలో నీతిమంతుడని అనిపించుకునే క్రమంలో తాను, తనలాంటి మర్యాదస్తులు ఆ నీతిని ఎప్పుడో వదిలి పెట్టేసామని అతనికి అర్థం అవుతుంది. తన జీవితం అంతా ఒక పెద్ద అబద్థం అని, అర్థం లేని ప్రయాణం అని తాను ఇప్పుడు ఎదురు చూస్తున్న మృత్యువొక్కటే తాను అనుభవిస్తున్న నిజం అని ఇవాన్‌కు స్పష్టంగా అర్థం అవుతుంది.
ఈ నవలను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇవాన్ మృత్యు ముఖం ముందు నేర్చుకున్నపాఠాలు అర్థం అవ్వాలంటే చాలా జీవితానుభవం కావాలి. మంచం పై అసహాయంగా పడి ఉండి మృత్యువు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులను నిశితంగా గమనించిన అనుభవం ఉండాలి. అప్పుడే ఇవాన్ మనసు మనకు అర్థం అవుతుంది. అసలు ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలిసినప్పుడు అతని చుట్టూ చేరిన వారిలో ఎంత నాటకీయత ఉంటుందో చూసి అనుభవిస్తే, ఇవాన్ ఒంటరితనం అర్థం అవుతుంది. మానవ సంబంధాలలోనే అనునిత్యం ఒక మోసం ఉంటుంది. అది వ్యక్తి చావుకు దగ్గరవుతున్నప్పుడు ఇంకాస్త ఎక్కువగా ప్రదర్శిస్తాం. మనం ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడితే సభ్యత అనిపించుకుంటుంది అంటూ చాలా అసహజంగా ప్రవర్తిస్తారు మర్యాదస్తులు. మనసులో అప్పుడు ఒక వ్యక్తి నిష్క్రమణ గురించి మనలో రగిలే ఆలోచనలను, కప్పిపుచ్చుకుని లేని మార్దవాన్ని, అనుబంధాన్ని, ప్రేమను చిలకరిస్తూ నటిస్తున్నప్పుడు, అది నటన అని చుట్టూ ఉన్నవారందరికీ అర్థం అవుతుంది. కాని ఆశ్చర్యంగా వారలా నటించాలి అని వారు కోరుకుంటారు, నటించకపోవడం తప్పని వాదిస్తారు. కాని ఈ నటన మంచం మీద ఉన్న వ్యక్తిని ఎలా బాధిస్తుంది అన్నది అర్థం కాదు. ఇంత సున్నిత విషయాన్ని విస్మరిస్తూ, ఆ వ్యక్తిని ప్రశాంతంగా ఉంచుతున్నామని తమని తాము మభ్యపెట్టుకునే కుటుంబీకులది ఎటువంటి నటన?
ఆ వ్యక్తి లేకుండా పోయినప్పుడు తమ జీవితం ప్రశాంతంగా సాగడానికి అన్ని రకాల ప్రయత్నాలు ఆ వ్యక్తి మంచంపై ఉండగానే మొదలవుతాయి. తమ భవిష్యత్తుని సురక్షితం చేసుకోవడానికి తామేం చేయాలో చేస్తూ మళ్ళీ ఆ వ్యక్తి వద్దకు చేరి వారు ప్రేమను ప్రదర్శిస్తూ నీకేం కాదు, బాగవుతావు అంటూ మాట్లాడుతునప్పుడు, ఇవన్నీ అర్థం అవుతూ, వారి ప్రయత్నాలను చుస్తూ, ఇంత కాలం వారి కోసం తాను చేసినవన్నీ ఎంత అనవసర ప్రయత్నాలో, తన పోరాటం ఎంత వృథా ప్రయాసో అర్థం అవుతూ ఆ వ్యక్తి చనిపోవడం కన్న మించిన శిక్ష, మనిషి మరో మనిషికి ఇవ్వలేడేమో. అప్పుడు ఆ స్థితిలో జీవితానికి అర్థం ఏంటి అంటే కనిపించే శూన్యం కన్నా మృత్యువు ఇచ్చేదే ఆనందం అనిపిస్తుంది. అదే నిజం అని అర్థం అవుతుంది.
మానవ సంబంధాలపై మన జీవితంలో అధిక భాగం వెచ్చిస్తాం, అవి చివరకు అందమైన అబద్ధాలని అర్థం అయే సమయానికి మనకంటూ మిగిలేది శూన్యం మాత్రమే. ప్రతి వ్యక్తికి అవసరాలు, కోరికలు ఉంటాయని, వాటి తరువాతే వారికి మిగతా బంధాలనీ, బంధాలనుండి వారికి వచ్చే ఆనందం తగ్గినప్పుడు వారి ప్రాముఖ్యతలు మారతాయని తెలుసుకోవడం చాలా బాధతో కూడిన విషయం. చాలా సహజంగా మనుష్యులు తమపై ప్రేమ చూపించిన వ్యక్తులు లేకుండా జీవించడానికి అలవాటు పడతారు. ఆ వ్యక్తి మృత్యు శయ్యపై ఉన్నప్పుడే ఆ ప్రయత్నాలు మొదలెడతారు. కాని తాము లేకపోతే పాపం వారేమవుతారు అన్న మిధ్యలో మనుషులు బ్రతికేసి చివరకు తాము పూర్తిగా లేకుండాపోకముందే తాము జీవితలను పణంగా పెట్టిన వ్యక్తులే తమను మర్చిపోవడానికి సంసిద్ధం అవుతూ పైకి అతి మామూలుగా నటించేటప్పుడు తన జీవితపు విలువలలో ఆ తారుమారు చూసి, సహించి మృత్యువుని స్వీకరించేటప్పుడు మనిషికి తాను అనుకున్నవన్నీ మిధ్యలే అని తెలియడం నొప్పిని కాదు ఒక నిర్లిప్తతను ఇస్తుంది. ఆ మృత్యువు ముందు మనిషిలో చేరే నిర్లిప్తతే ఈ నవలలో కనిపిస్తుంది. మనుషులను ఆలోచించమని ప్రేరేపిస్తుంది.
ఇది ఆనందంగా చదువుకునే పుస్తకం కాదు కాని పచ్చి నిజాలను చూపించిన పుస్తకం. వీటిని అంగీకరించడం కష్టం. కాని జీవితం ఉన్నప్పుడే ఈ వాస్తవాలను అంగీకరించడం అలవాటు చేసుకుంటే కొన్ని భ్రమలలోనుండి బైట పడి మన నటనను తగ్గించుకుని మనం అనుకున్నట్లుగా జీవించే అవకాశం కొందరికయినా కలగవచ్చు. కాని ఈ పుస్తకం చదివిన చాలా రోజుల దాకా ఒక నొప్పి మనసుకు అంటి పెట్టుకునే ఉంటుంది. నిజం ఆనందం తీసుకురాదు. కాని అది మనిషి జీవన వికాసానికి అవసరం. మన చుట్టూ ఉన్న భ్రాంతులనుండి మనలని మనం కాపాడుకోవడానికి ఈ పుస్తకం చదవాలి.