హృద్యమైన పదలయతో ఆంగ్లంలో హనుమాన్ చాలీసా

0
2

[ప్రముఖ రచయిత విక్రమ్ సేథ్ ఆంగ్లంలో అనువదించిన ‘ది హనుమాన్ చాలీసా’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు సునీత పొత్తూరి.]

[dropcap]వి[/dropcap]క్రమ్ సేథ్ పేరు వినగానే ముందు ఎవరికైనా గుర్తుకు వచ్చేది, ఆయన రాసిన ‘ది గోల్డెన్ గేట్’ అనే ‘ప్రోజ్-పోయెట్రీ’ లో రాసిన నవల. ఈ నవలకు ఈయనకి కేంద్ర ‘సాహిత్య అకాడమీ’ పురస్కారం కూడా లభించింది.  ప్రపంచ రచయితల జాబితాలో మంచి పేరూ సంపాదించి పెట్టింది ఈ ఇండో-ఆంగ్లియన్ రచయితకు.

విక్రమ్ సేథ్ మేథో రచయితగా గుర్తింపు వున్న రచయిత – ‘డూన్ స్కూల్’ ప్రాడక్ట్ మరి! ఇక అప్పట్లో ఈ పుస్తకాలు కొనడమంటే.. చినిగిన చొక్కాల జేబులూ పట్టని మూల్యం చెల్లించగలగాలి –  ఇది ఒకప్పుడు.  ఇవాళ ఆయన అనువదించిన పుస్తకం – చిన్నదే అనుకోండి, నా చేతిలో ఉంది. అయినా కాస్త రేటు ఎక్కువే.

దేశీయ ఛందస్సు అయిన చౌపాయి, దోహాల తోను – సులభంగాను, సరళంగాను బోధపడే – సంస్కృత తత్సమ శబ్దాలతో.. ఉన్న హనుమాన్ చాలీసాను హృదయానికి హత్తుకోని రామభక్తులు ఎవరైనా ఉంటారా?

మూల రచనలో ఉన్న ఆత్మని పట్టుకుని అనువాదం చేయగలగడం అనేది అనువాద ప్రక్రియకు ప్రాణం వంటిది. ఎక్కువగా కాల్పనిక రచనల అనువాదాలను ఉద్దేశించి అంటారీ మాట-

మరి భక్తి కవిత్వానికి అదెలా వర్తిస్తుంది? ఛందస్సు, ప్రాసలతో కూడిన అక్షర కవిత్వమే కాదు, ‘భగవత్ తత్వాన్ని’ కూడా ఆవిష్కరించ గలగాలి కదా?

మనకి శ్రీ ఎం. ఎస్. రామారావు గారు తెలుగులో అనువదించి, హృద్యంగా గానం చేసిన హనుమాన్ చాలీసా తెలుసును. అది ఆయనకి ఎంత పేరు తెచ్చిపెట్టిందీ అంటే, ఈ రచన, గానమూ వారిని కష్టాల నుండి గట్టెక్కించిందనీ చెప్పుకుంటారు. అదీ రామభక్తి సామ్రాజ్యము.. తథ్యంగా!

అయితే, హనుమాన్ చాలీసాకి విక్రమ్ సేథ్ ఎటువంటి శైలిని, ఛందస్సునీ అనుసరించారూ అన్నవిషయంతో పాటు, హనుమ ప్రతిభనూ, శౌర్యాన్ని, గుణగణాలనూ వర్ణిస్తూ మూల భాషలో ఉన్నంత హృద్యంగా, రసాత్మకంగా ఉందా అనే కుతూహలం కూడా కలుగుతుంది ఆసక్తి వున్న ఎవరికైనా.

మాతృకలో ఉన్న రైమ్‌ని, ఛందస్సుని అనుసరించి రాశాను అని తన ముందు మాట చెబుతూ, “This translation includes a phonetic transliteration but no notes.” అన్నారు.

“Rhythm of Hanuman Chsalisa is a falling rhythm- which is rare in English (usually the rising rhythm)” అంటారు విక్రమ్ సేథ్.

విక్రమ్ సేథ్ తన పుస్తకంలో హనుమాన్ చాలీసా మూలం – దేవనాగరి లిపిలో, ఇంగ్లీషు లిపిలో (transliterated) చెబుతూ – ఎదురుగా వున్న పేజీలో తన ఇంగ్లీషు అనువాదం ఇచ్చారు. దేవనాగరి లిపి చదవలేని వాళ్లకి మూలంలో ఉన్న హనుమాన్ చాలీసా చదువుకోడానికి అనువుగా ఉంది.

ఆంగ్లానువాదం అంత్యప్రాసతో సహజంగా ఉంది.

ఉదాహరణకు,

“జయ హనుమాన జ్ఞాన గుణ సాగర

జయ కపీశ తిహు లోక ఉజాగర”

“Hail Hanuman, great wisdom ocean-

The three worlds glow with your light and devotion.”

ఈ విధమైన rhyming అసాంతం కొనసాగించారు.  అంత్య ప్రాసతో పాటు.. పద్య నడకలోని లయ తూగు – బావున్నాయి.

“ప్రభు చరిత్ర సునిబే కో రసియా

రామ లఖన, సీతా మన బసియా”

శ్రీహనుమ రామ చరితను ఆసక్తితో వినడం వలన కలిగిన తన్మయత్వంతో రామలక్ష్మణసీతా మూర్తులను తన హృదయం లోనే నిలుపుకున్నాడట..!

మాతృకలో ఉన్న ‘రసియా’ అన్న పదంలో ఆర్తీ, తన్మయత్వం రెండూ కలిసిన రసవాదం తోస్తుంది నాకు ఎప్పుడు చదివినా. ఈ ఆల్కెమీ అలానే కంటిన్యూ చేస్తూ – హృద్యమైన పదలయతో ఇలా చెప్పారు.

“Avid to hear his tale in the telling

–Ram, Lakshman, Sita

within your heart dwelling;”

“యుగ సహస్ర యోజన పర భానూ। లీల్యో తాహి మధుర ఫల జానూ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।జలధి లాంఘి గయే అచరజ నాహీ॥ 19 ॥”

“Far in the distance, the Sun burned so brightly-

Like a sweet fruit, you just swallowed it lightly.

Ram ring in your mouth, you leapt over the ocean!

Who’d be surprised by your strength and devotion?”

‘యుగ సహస్ర యోజన’ – అన్నది ఓ విశేషం.  అది భూమి నుండి సూర్యుడి వున్న దూరం. ఇటీవల  NASA ప్రకటించిన దూరం కూడా అదే. కాని అనువాదంలో ఈ ‘సహస్ర యోజన’ ప్రస్తావన లేదు.

రైమ్‌ని అనుసరించే ప్రక్రియలో అర్థవంతమైన పదాలను వాడలేదు అన్న విమర్శా చదివాను. ఇక్కడే అనువాద కవికి మీమాంస మొదలౌతుంది అనుకుంటాను. అర్థాలంకారమా? శబ్దాలంకారమా? అంటే శబ్దాలంకరానికే మొగ్గు చూపడానికి కారణం, మాతృకలో ఉన్నట్టుగా ఒక లయగా.. హాయిగా చదువుకోడానికే!

ఈ అనువాదం పది సంవత్సరాల కిందటే చేశారుట. ఈ పుస్తక ప్రయోజనం నలుగురికీ అందాలనే సన్నిహితుల సలహాను అనుసరించి తానీ పుస్తకాన్ని ఇప్పుడు ముద్రించానని చెప్పారు ఒకచోట.

ఈయన రాసిన మరో నవల the Suitable Boy. సినిమా కూడా వచ్చింది. అయితే, ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, 1993లో రాసిన the Suitable Boy నవలలో కల్పిత పాత్ర అయిన, ‘భాస్కర్’ అనే తొమ్మిదేళ్ల కుర్రవాడికి తన ‘హనుమాన్ చాలీసా’ ఆంగ్లానువాదం  అంకితం ఇవ్వడం. భాస్కర్ అయిదేళ్ళ వయసు నుండే హనుమాన్ చాలీసా కంఠతా వచ్చిన వాడని, హనుమాన్ భక్తుడూ అని; ఇప్పుడతడు పెరిగి పెద్దవాడై అందరిలాగే, తన విశ్వాశాలకూ, దేశంలో ఇతరంగా పెరుగుతున్న అసహనానికి మధ్య సంఘర్షణ పడుతూ ఉంటాడని ఊహిస్తూ అంకితం ఇచ్చారు.

సంకటమోచన అయిన హనుమని కీర్తిస్తూ రాసిన ఈ ‘హనుమాన్ చాలీసా’ భక్తీ శ్రద్ధలతో చదివిన వారిని అనుగ్రహిస్తారని – ఫలశ్రుతి ఉంది. ఇది సాధించే ప్రయత్నమే ఈ అనువాద ప్రయోజనం అనవచ్చు.

***

The Hanuman Chalisa
Translator: Vikram Seth
Publisher: Speaking Tiger
Pages: 100
Price: ₹ 399
Online:
https://www.amazon.in/Hanuman-Chalisa-Vikram-Seth/dp/935447859X

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here