Site icon Sanchika

కథలో పట్టు అదృశ్యమైన ‘ద ఇన్విజిబుల్ మాన్’

[box type=’note’ fontsize=’16’] “స్త్రీ పడ్డ ఘర్షణ ఎక్కువగా ముందుకు వస్తే రెండవ గంటలో ఎందరి గుండెల్లోనో గంటలు మ్రోగేవి. అలా జరగలేదు” అంటున్నారు వేదాంతం శ్రీపతిశర్మ ‘ద ఇన్విజిబుల్ మాన్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

‘ద ఇన్విజిబుల్ మాన్’ సినిమా సమీక్ష

[dropcap]“ద[/dropcap] ఇన్విజిబుల్ మాన్” అనే నవల హెచ్.జి.వెల్స్ వ్రాసింది అందరికీ సుపరిచితమే. కాకపోతే దానిని చలన చిత్రంగా మార్చటానికి, దాదాపు పుష్కరకాలం క్రితమే పూనుకోన్నప్పటికీ ఈ సంవత్సరం 2020లో సాధ్యమైంది. దీనికి చాలా కారణాలున్నాయి. సైన్స్ ఫిక్షన్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా సీరియల్స్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందటం, మానవ సంబంధాల నేపథ్యానికీ, సామాజిక పరమైన అంశాలకూ కథనం అనేది బాగా దూరం అయిపోవటం వలన కేవలం సాంకేతిక పరమైన విషయాలు ఎక్కువగా వెండితెర మీద కనిపించాలి అనే సంకల్పంతో ఒక మూసలోకి ఇవన్నీ చేరిపోయాయి. గమనించవలసిన విషయం ఏమిటంటే హాలీవుడ్‌లో కూడా ఒక కాలపరిమితి దాటిన తరువాత ప్రేక్షకులు కథ, కథనం, వాటి కోసం ఎక్కువగా నిరీక్షించటం మనం చూసాం. ‘స్పీసీస్’, ‘జురాసిక్ పార్క్’ లాంటివి చూసిన వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి వెళ్లి ‘జాస్’ లాంటి గుర్తు తెచ్చుకుని సైన్స్ ఫిక్షన్‌ను ఒక వర్గంలోకి చేర్చారు. చలన చిత్రరంగంలో హారర్, థ్రిల్లర్ వంటివి దీని ప్రక్కన వచ్చిన కూర్చోవటం ఒక విషయం అయితే కథ, నటన, ఇతర సాంకేతికపరమైన అంశాలు సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో ప్రేక్షకుడిని ఆలోచింపజేయగలవా అనే అంశం ముందుకు వస్తోంది. ఇది అంత తేలిక కాదు. కారణం ఏమిటంటే కథకు కల్పనకు గల చారిత్రాత్మకమైన ముద్రలు ప్రేక్షకుల మనోఫలకం మీద నుండి చెరిపివేయటం ఎంతో నేర్పు ఉంటే తప్ప సాధ్యం కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక పాత్రను ఆధారంగా ఎంచుకుని మిగతావన్నీ కలబోసి వివిధ దృక్కోణాలలో సమపాళ్లలో తెరకెక్కించటం ఒక ప్రొఫెషనల్ విద్య. అది కలకాలం నిలచిపోయేది. యూనివర్సల్ పిక్చర్స్ వారు ఈ ప్రక్రియకే తిరిగి రావటం ఈ చిత్రం ద్వారా మనం చూస్తున్నాం. ఈ తరహా గురించి చర్చిచుకున్నప్పుడే మనకి సెమియాలజీ, సబ్జెక్టివిటీ వంటివి ప్రాణం పోసుకుంటాయి. ప్రేక్షకులు-తెర అనుభందం అనేది ఈ రెండు ప్ర్రక్తియలకూ ఎంతో ప్రధానమైనది. ఆ కోవలో తీసుకున్న లీడ్ ఒక్కసారిన పలుచనైపోయి తిరిగి సైన్స్ ఫిక్షన్‌కు చెందిన సాంకేతికపరమైన విషయాలకు పరిమితం కాగానే ప్రధానమైన పాత్రలో నటింటిన అభినేత్రి నేను ఇందుకు నటించానా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు సమాధానం దొరకదు.

వాస్తవానికి ‘ద ఇన్విజిబుల్ మాన్’ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించిన ఎలిజబెత్ మోస్ వలన ఇది చాలా సేపు సైన్స్ ఫిక్షన్ కాదు (కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు) అనిపిస్తుంది. రెండవ గంటలో దర్శకుడు ట్రీట్‌మెంటు మార్చినా చివరి క్షణాలలో ఆమె మరల సైకో అనాలసిస్ లోకి బండిని లాగెయ్యటం వలన ఒక్కింత జర్మన్ మూస ముందుకు వచ్చిన మెచ్చుకునేలా చేసింది. చిత్రం యొక్క విజయనికి కారణం ఈమె నటనే అని చెప్పాల్సి ఉంది. చాలా టెలివిజన్ సీరియల్స్‌లో నటించిన ఈ ఆమెరికన్ నటి రెండు ప్రైమ్ టైం రెమ్మి అవార్డులు, రెండు గోల్టెన్ గ్లోబ్ అవార్డులు చేజిక్కించుకుంది. ఈమెకు ‘క్వీన్ ఆఫ్ పీక్ టి.వి’ అనే టైటిల్ కూడా ఉన్నది.

సెసిల్లా కాస్ (మోస్) ఒక క్రూర స్వాభావం గల వైజ్ఞానికునితో సంబంధం గలది. ఒకనొక రాత్రి అతన్ని వదిలేసి తన సోదరి సహాయంతో తన చిన్ననాటి స్నేహితుని ఇంటికి చేరుకుంటుంది. తన మాజీ భర్త ఆత్మహత్య చేసుకున్నాడనీ, తనకి సంపాదనలో పెద్ద భాగాన్ని వ్రాసాడనీ తెలుసుకుంటుంది, అతని సోదరుడు టామ్ ఒక కోటు (భర్త తయారు చేసింది) దొంగిలించి అదృశ్యంగా తనను వేధించటం ప్రారంభిస్తాడు. ఇలా జరుగుతోందని చెప్పినప్పుడు ఈమెను పూర్తి స్తిమితం లేని వ్యక్తిగా చికిత్సకు గురి చేస్తారు. ఇలా ఎవరో చేస్తున్నారు, అలా చెయ్యగలరు అన్నది ఆమెకు మాత్రమే తెలుసు. ఆసుపత్రిలో ఒకే వ్యక్తి అటూ ఇటూ తిరిగి నిలుచున్న ఒక పోస్టర్‌ను చూసి దాని క్రింద వ్రాసి ఉన్న కాప్షన్ ‘ఫేస్ లోవర్ సెల్ఫ్…’ అనేది చదివి ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ దృశ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడి నుండి ఆమె ఈ అజ్ఞాత వ్యక్తిని టార్గెట్ చెయ్యటం దర్శకుడు లీయ్ వానెల్ కళ్లు చెదరేలా చూపించాడు. సెసిల్లా తన స్నేహితుడి (కాప్) ఇంట్లో అజ్ఞాత (అదృశ్య) వ్యక్తి దూరి అతని చిన్న కుమార్తెను చంపబోయే సమయంలో షూట్ చేసి చంపేస్తుంది. మాస్క్ తీసాక తన భర్త సోదరడు టామ్ అని తెలిపోతుంది. ఈ టామ్ సెసిల్లా సోదరిని అదృశ్యంగా చంపి కత్తి సెసిల్లా చేతిలో పెట్టటం వలన నాటకీయంగా మారుతుంది. పోలీసులు తన భర్తను కట్టి పరేసిన ప్రదేశాన్ని కనిపెట్టి విడిపిస్తారు. సెసిల్లా తన స్నేహితుడి (కాప్)తో కలసి అక్కటికి వెళ్లి వీడియో ఫెసిలిటీ పెట్టి భర్తతో డైనింగ్ టేబిల్ మందు కూర్చొని ఇప్పుడే వస్తానని చెప్పి అదృశ్యంగా తిరిగి వస్తుంది. కత్తి అతని చేతిలో పెట్టి అతని చేతితోనే గొంతు కోయస్తుంది. ఇదంతా వీడియోలో కనిపిస్తుంది. ఆమె ఇవతలకి వచ్చినప్పుడు సంచీలో ఆ కోటు ఉంటుంది.

ఈ చిత్రంలోని నేపథ్య సంగీతం ఎంతగానో ఆకట్టుకుంది. బెంజమిన్ వాల్ల్‌ఫిచ్ నటి హావభావాలకు, సన్నివేశాలకూ తగ్గట్లు ఎంతో నేర్పుతో ధ్వనిని సమకూర్చాడు. స్టిఫాన్ డ్యూసియో కెమెరా పనితనం కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నది. సుముద్రం ఒడ్డున లొకేషన్లో షాట్స్ కథలోని అంశానికి బలం చేకూర్చాయి.

చాలా చోట్ల సైన్స్ ఫిక్షన్‌ని, ఫాంటసీని ఒకే వర్గంలోకి చేర్చి చూస్తారు (ఫ్రాన్స్‌లో తప్ప). వాస్తవానికి, వాటిని విడిగానే వర్గీకరించాలి. జూల్స్ వెర్న్, హెచ్.జి.వెల్స్ పరస్పరం వైరుధ్యం గల పద్ధతులలో సైన్స్ ఫిక్షన్ వ్రాసారు. కాకపోతే ఇద్దరి దృక్పథం ఒకటే. అసంభవం అనుకున్నది విజ్ఞానం సంభవం అని అనిపిస్తుంది. ఆ మాట కొస్తే చలన చిత్రం అనేదే ఊహించలేని దాన్ని ఇదిగో చూసుకోమని తెర ముందుకు తెర ముందుకు తెచ్చే ఒక అద్భుతమైన సాధనం. అదృశ్యంగా ఉన్న దాన్ని దర్శింపజేయటం అయితే ఈ కోవకు చెందిన చిత్రాలు ప్రారంభమైనప్పుడు (జార్జ్ మెలియస్) ట్రీట్‌మెంట్ కోసం ఎటువంటి పునాది ఉంది అనే దాని మీద చాలా ఇబ్బందులకు గురైనాయి (వాయేజెస్ టు ద మూన్, జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్…) స్పీల్‌బర్గ్ ఒక గ్రామర్ ఇచ్చాడు. ఎన్ని చెప్పినా సాంకేతికం అనేది పట్టున్న కథాంశానికి మరింత బలాన్ని చేకూర్చేదవ్వాల్సిందే తప్ప అదొక్కటే తెరమీద పెడతామనటం సరైన పద్ధతి కాదు. 1950లో ఎంచుకున్న పద్ధతులకు, 1990లలో చూపించినవీ తిరగేస్తే సాంఘికపరమైన మార్పులను ఇవి గుర్తించాయా అంటే ఏం లేదని అనిపిస్తుంది.

సైన్స్ ఫిక్షన్ కూడా నెరెటివ్ అనేది ఒక ఘర్షణ, ఒక పోరాటం, విజయం వంటి స్ఫూర్తిదాయకమైన అంశాలతో ఉన్నప్పుడు ‘స్ట్రక్చెరలిసమ్’ లోకి చేరి చక్కని సృజనాత్మకతతో ముందుంటాయి. మనోవిజ్ఞానానికి చెందిన అంశం – ఒక వైజ్ఞానికుడు ఒక అద్భుతాన్ని సృజించినప్పటికీ భార్యను కేవలం బొమ్మలా వాడుకుని సమాజానికి హాని తల పెట్టడాని ఎంచుకున్న విషయం ‘ఇన్విజిబుల్ మాన్’లో తక్కువ కనపడి స్త్రీ పడ్డ ఘర్షణ ఎక్కువగా ముందుకు వస్తే రెండవ గంటలో ఎందరి గుండెల్లోనో గంటలు మ్రోగేవి. అలా జరగలేదు.

ఒక పాత్రను ఎంచుకుని ఆ పాత్ర దృక్కోణం నుండి సైన్స్ ఫిక్షన్‌ను తెర మీద ఆవిష్కరింపజేసే ప్రక్రియకు యీనివర్సల్ పిక్చర్స్ వారు వచ్చారని సంతోషించినప్పుటికీ ‘వైస్-అన్-సీన్’ – వాస్తవికత, స్త్రీ సబ్జెక్టివిటీని అందుకుని ఆలోచింపజేస్తుంది అనలేని పరిస్థితి కనిపిస్తుంది. సైకో అనాలసిస్ ‘ద వుమన్ ఇన్ ద విండో’ (1944), ‘గిల్డా’ (1946), ‘కిస్ మీ డెడ్లీ’ (1955) నుండి మరో స్థాయికి సైన్స్ ఫిక్షన్ ద్వారా చేరాలనే ఆశ అయితే ఇంకా మిగిలి ఉన్నది.

రేటింగ్ 3/5

Exit mobile version