Site icon Sanchika

ఏది నిజం? ఏది కల? “ద జాబ్”

ఈ వారం మరో మంచి లఘు చిత్రం : “ద జాబ్”. ఒకే ఒక్క ఏక్టర్ : కల్కి కేక్లాఁ.

ఆఫీసు వాష్ రూం లోని వాష్ బేసిన్ దగ్గర ఓ జత చేతులు వొణుకుతూ కడుక్కుంటున్నాయి. తర్వాత నల్లా బంద్ చేస్తాయి. వొణుకు తగ్గలేదు. కాస్త లిక్విడ్ సోప్ తీసుకుని మళ్ళీ కడుక్కుంటాయి. Are they washing dirty hands? Are they washing hands off something? మరలా ఇంకొంత సోప్ తీసుకుని కడుక్కుంటాయి. ఏమైనా OCDనా? చేతులు ఇక్కడ ఒక పాత్రే. అందుకే వ్యక్తికి స్వతంత్రంగా వ్యవహరించాను వాటిని. కాసేపటికి కల్కి కేక్లాఁ (అప్పుడు చూపిస్తాడు ఆమె ముఖాన్ని) ఖాళీ గా వున్న ఆఫీసు గదిలో తన బల్ల దగ్గరికొచ్చి కూర్చుంటుంది. ఆఫీసులో స్టాఫంతా వెళ్ళిపోయారా? లేక ఆమె భావనా ప్రపంచంలో వుందా? కీ బోర్డు మీద ఓ మీట నొక్కిందో లేదో ఏదో తడబాటు, కాగితాలు కింద పడ్డాయి. వొంగి తీస్తుంది.ముఖంలో ఆదుర్ధా కాదు, భయమో బెంగో అర్థం కాని భావం. నటనలో లోపమా? లేక పాత్రకే తన స్థితి పట్ల అయోమయంగా వుందా? యాంత్రికంగా టైప్ చేస్తోంది. మేనేజర్ మాటలు వినబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనది, ఈ రాత్రికే డెడ్లైన్. నిర్లిప్తంగా చూస్తుంది ఆమె. ఎదుట మేనేజర్ కుర్చీ ఖాళీగా వుంది. గతాన్ని నెమరేసుకుందా? ఆ మాట వెంటాడుతోందా? మధ్య మధ్యలో చీకటి రోడ్డు మీద వెళ్తున్న కారు ఫ్లడ్ లైట్లు దారి మీద పడటం చూపిస్తాడు, punctuation marks లా. ఆమె ఉద్యోగం అలాంటిదా? చీకటితో మొదలై, చీకటితో ఇల్లు చేరేదాకా రోజూనా? మర్నాడు నిద్ర లేస్తుంది. ఎదుట అద్దం రెండు నిలువు చెక్క బద్దలతో మూడు భాగాలుగా. అద్దంలో మూడు ప్రతిబింబాలు? multiple personality disorder సూచనా? ఏమో? నిరుత్సాహంగా దినం ప్రారంభమయ్యింది. కాలుకు అడ్డం వచ్చిన పిల్లిని తక్కకుండా తమాయించుకుంది. అన్నట్టు పిల్లీ కనబడదు. ఆమెకు పాలు పోసిన గిన్నె పెడితే కేవలం చప్ చప్ మంటూ నాకే శబ్దం మాత్రం వినిపిస్తుంది. బట్టలు ఇస్త్రీ చేసుకుంటుంటే ఫోన్ మోగుతుంది. తీయదు. కాల్ రికార్డ్ అవుతుంది. మేడం, మీ క్రెడిట్ కార్డ్ మొత్తం చెల్లించలేదు, వడ్డీ పడకుండా వుండాలంటే గడువు లోపల మినిమం మొత్తం కట్టండి అని. ప్లేట్ లో ఏపిల్ ముక్కలు, వేసుకోవాల్సిన మాత్రలూ తీసుకుని కూర్చుంటుంది. ఏదో స్త్రీ గొంతు అంటుంది, అది కల. ఇది నిజం. నువ్వ్ ఈ ఉద్యోగాన్ని వదిలే అవకాశమే లేదు. ఫ్రాన్స్ లో లాగా ఇక్కడ social security కూడా లేదు. ఇక్కడ మందులు కూడా ఖరీదైనవే. ఈ సంభాషణంతా వేరే భాషలో. ఆమె ప్లేట్ అలా వదిలేసి వెళ్తుంది. కారు నడుపుతోంది. ఆలోచనలతో కిక్కిరిసిన మెదడు. అమాంతం కీచు మన్న శబ్దం తో కారు ఆగడం, ఎదుటి గ్లాసుమీద చిందిన రక్తాన్ని వైపర్లు తుడుస్తూ కొట్టుకోవడం కనిపిస్తుంది. ఆఫీసులో బాస్ బల్ల మీద గుండుసూదులున్న డబ్బా, ఎదుట బాస్ ఖాళీ కుర్చీ కోప్పడుతుంది, నిన్న పని కాలేదు, ఈ రాత్రికి అయ్యిందా సరే, లేదూ రేపు నువ్వు ఆఫీసుకు రానవసరం లేదు. ఆమె మరలా వాష్ బేసిన్ దగ్గరకు వొణుకుతున్న చేతులు కడుక్కోవడానికి వెళ్తుంది. జూం ఇన్ లో ఇప్పుడు నీళ్ళు పోయే ఆ సింక్ కంత కనబడుతోంది. నీళ్ళు పారుతున్నాయి. క్రమంగా ఆ నీళ్ళు ఎరుపెక్కుతాయి. ఆమె మరలా తన పనిలో నిమగ్నమవుతుంది. కంప్యూటర్ తెర మీద ఏదో భాషలో వున్న టెక్స్టు ను ఆమె ఇంగ్లీషులో తర్జుమా చేస్తూ వుంటుంది. కీ బోర్డు మీద కదులుతున్న ఆమె చేతికి గుండుసూదులు గుచ్చుకుని వుంటాయి. చేతులు రక్తసిక్తమై వున్నాయి.

బైటికి కనిపిస్తున్నంత డాబుసరిగా వుండవా మెట్రోలలోని ఇలాంటి ఉద్యోగాలు? ఓ సీ డీ, అంతర్గత సంఘర్షణ, నిస్సహాయతల నిలువెత్తు చిత్రంలా వుంటాయా? లేక అది కూడా ఒక అతిశయోక్తేనా? సమాధానం ఎవరికి తెలుసని?

ఈ లఘు చిత్రానికి రచయితా దర్శకుడూ సిద్దార్థ సిన్హా. అతనితో కలిసి మనకు కథను చెప్పేది చాయాగ్రహణం చేసిన సవితా సింఘ్, సౌండ్ దిజైనర్ సుస్మిత్ బాబ్ నాథ్. చాన్నాళ్ళకి చూసానొక చిత్రాన్ని, ఎందులోనైతే కథను చెప్పే బాధ్యత సౌండ్ డిజైనర్ భుజాన్నెత్తుకున్నాడు. ఆమె అంతర్ముఖి. కొంత ఆమె చేష్టలు, కొంత సంభాషణా చెప్పినా ఈ రెండూ కవర్ చేయలేనివి కవర్ చేసాడు సుస్మిత్. మొదటి నుంచి చివరి దాకా. ఆమె చేతులు కడుక్కుంటున్నప్పుడు ఆ నీటి చప్పుడు, చాలా తక్కువ వాల్యూం లో సంగీతం, ఇతర శబ్దాలు. ఆమె నడుస్తున్నప్పుడు పిల్లి ఏడుపు, ఆమె తడబాటు, పిల్లి పాలు తాగుతున్న చప్పుడు,ఆమె తన సీట్ లో కూర్చుని వున్నప్పుడు దూరంగా ఎక్కడో పరిగెడుతున్న రైలు శబ్దం (అది ఆమె మానసిక స్థితి కూడానూ), ఆ ట్రైన్ శబ్దం పెరగడం, ఏదో ఏంబులెన్స్ శబ్దం, ఏదో ఫోన్ వచ్చిన శబ్దం, ఆమె ఉలిక్కిపడి కీబోర్డ్ మీద మీటలు నొక్కడం, కింద పడ్డ కాగితాల చప్పుడు, ఇలా ఎన్నని చెబుతాను? యూట్యూబ్ లో వుంది సినిమా చూడండి. నా గట్టి రెకమెండేషన్.

Exit mobile version