Site icon Sanchika

ఒక లాండ్‌మార్క్ సినిమా – కశ్మీర్ ఫైల్స్

[dropcap]”శ[/dropcap]భాష్! ఈ చిత్రం లక్ష్యం నెరవేరింది.” అనుకున్నాను ఈ సంభాషణలు విన్నాక.

కశ్మీర్ ఫైల్స్ చిత్రం చూశాక, కార్ పార్కింగ్ వద్ద చెవిన బడ్డ యువకుల సంభాషణలు విన్నాక నాకు ఈ దేశం యువత మీద నమ్మకం కలిగింది.

యువతలో దేశభక్తికి కొదవలేదు. కానీ ఇన్నేళ్ళు వారికి దొరకనిదల్లా సరయినా దిశానిర్దేశనం మాత్రమే. ఒక సరయిన నాయకుడు వచ్చి వీరికి సరయిన మార్గదర్శనం చేస్తే మన యువత ఎవ్వరికీ తీసిపోరు అన్న ధైర్యంతో కారుని ముందుకు ఉరికించాను.
వారేం మాట్లాడుకున్నారో ముందు ముందు చెబుతాను. మొదట ఈ సినిమా కథ గూర్చి సంక్షిప్తంగా తెలుసుకుందాం.

***

మొదట ఈ సినిమా కథ చెబుతాను.

చర్విత చర్వణమే, అందరికీ తెలిసిందే అయినా, సూక్ష్మంగా ఈ సినిమా కథని చెప్పుకుందాం. ఈ కథని దర్శకుడు కాసేపు ఫ్లాష్‌బాక్ టెక్నిక్‌తో, కాసేపు నేరుగా చెప్పుకుంటూ వెళతాడు. అయినా ఎక్కడా ప్రేక్షకుడు గందరగోళానికి గురి కాడు.

నేను మాత్రం కథని ఒకే వరుసలో తిన్నగా చెబుతాను.

ప్రారంభ దృశ్యం:

జనవరి 19, 1990 సాయంత్రం

అందమైన కశ్మీరం.

అది ఓ సాయంత్రం. కొందరు చిన్న పిల్లలు మంచుతో నిండిన ఓ ప్లే గ్రౌండ్‌లో చిన్న బాట్ పట్టుకుని సరదాగా క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. ఓ అట్ట ముక్కని వికెట్ల స్థానంలో పెట్టుకుని, ఒక బాట్ పట్టుకుని, రనప్ సమయంలో అదే బాట్‍ని చేతులు మార్చుకుంటూ, అమాయకత్వంతో నిండిన ఆనందం అనుభవిస్తూ ఆడుకుంటు ఉంటారు. వారిలో హిందువులు ఉన్నారు, ఇస్లాం మతస్తులూ ఉన్నారు.

వారికి కాస్త దగ్గర్లో గడ్డాలు టోపీలు పెట్టుకుని ఉన్న కరడుగట్టిన పాక్ మద్దతుదారులు రేడియోలో పాకిస్తాన్, ఇండియా క్రికెట్ మాచ్ తాలుకు రన్నింగ్ కామెంటరీ ఆసక్తిగా వింటూ ఉంటారు. సచిన్ భారీ షాట్లు కొట్టినప్పుడల్లా ఆ గడ్డం వాళ్ళు ఉద్రేకపడుతుంటారు.

ఈ కుర్రాళ్ళలో శివ అనే కుర్రాడు బాటింగ్ చేస్తూ సచిన్ అనే పేరు వినిపించినప్పుడల్లా ఉత్సాహంగా పెద్ద పెద్ద షాట్లు కొడుతూ, సచిన్ సిక్సర్ కొట్టంగానే ’సచిన్ సచిన్’ అని పెద్దగా అరుస్తూ గంతులు వేస్తాడు.

అప్పుడు కామెంటరీ వింటున్న ఆ గడ్డం వాళ్ళు వచ్చి పసి పిల్లాడు అన్న విచక్షణ లేకుండా ఈ పిల్లాడిని చావగొడతారు. అబ్దుల్ అనే కుర్రాడు శివని ఎలాగో తప్పిస్తాడు వారి బారినుంచి. ఇద్దరూ బాట్ బాల్ అక్కడ పారేసి పరిగెత్తి పోతారు.

ఈ లోగా దగ్గర్లోని మసీదు నుంచి మైకుల్లో ప్రార్థన వస్తూ ఉంటుంది.

ఇంతలో దగ్గర్లోని ఓ భవంతిలో మతోన్మాద బృందం చేతుల్లో తుపాకులు పూని పెద్ద గొంతుకలతో ’రలీవ్-గలీవ్ యా ఛలీవ్’ అనే నినాదాలు చేస్తుంటుంది. ఆ నినాదాలకి అర్థం ఏమిటంటే, “ఇక్కడ ఉండాలి అంటే మా దేవుడే గొప్పవాడు అని నిత్యం మీరు నమ్మాలి. మా మతంలోకి మారండి, లేదా వయసులో ఉన్న మీ ఆడవారిని వదిలి వెళ్ళిపోండి, లేదా చావండి.”

ఆ క్రితం రోజు వరకు అక్కడ పరిస్థితులు కాస్తా మెరుగ్గానే ఉన్నాయని పాత్రల సంభాషణ బట్టి అర్థం అవుతుంది. కానీ ఒక్క సారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి అని మనకు అర్థం అయిపోతుంది.

ఆ కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాక్కొనే క్రమంలో అనేక ఘటనలని చూస్తారు. ఓ స్త్రీ జ్వరంతో బాధపడుతున్న తన పది పన్నెండేళ్ళ కూతుర్ని తీస్కుని ఆసుపత్రికి అని బయలు దేరుతుంది. ఇంతలో ఓ మతోన్మాద యువకుడు ఆసుపత్రికి వెళుతున్న ఆ స్త్రీని ఆపి ’నీ బిడ్డను పెళ్ళి(నిఖా) చేసుకుంటా అని చౌకబారుగా మాట్లాడతాడు. ఆమె నిరసిస్తుంది. అంతే అతను ఆమెని అతి దారుణంగా తుపాకి తో కాల్చి చంపేస్తాడు. ఆ చిన్నపిల్ల రోదనకి అంతం ఉండదు.

ఇలా సూటిగా విషయంలోకి దిగిపోతాడు దర్శకుడు. ఎక్కడా నాన్చుడు ఉండదు.

సీన్ మారిస్తే, అదే సాయంత్రం ఇంకో వీధిలో ఈ కుర్రాడి తాతగారు పుష్కర్ నాథ్ (అనుపమ్ ఖేర్) కనిపిస్తాడు. ఆయన వృత్తిరీత్యా టీచర్. ఆ రోజు సాయంత్రం ఓ ఆడిటోరియం తాలూకు గ్రీన్ రూంలో ఓ పౌరాణిక నాటకంలో నటించడానికి శివుడి వేషంలో తయారవుతుంటాడు. ప్రతి శివరాత్రి ఆయనకి అది ఆనవాయితీ అని మాటల్లో చెపుతాడు ఆయనే.

వినాయకుడి పాత్రధారి ’ఈ సంవత్సరం మనం నాటకం వేయగలమా’ అని సందేహం వెలిబుచ్చుతాడు. ఇంతలో ఆయన భయపడినట్టే ఆ నాటక సమాజం భవనాన్ని మతోన్మాదులు చుట్టుముట్టి శివుడి బొమ్మ ఉన్న హోర్డింగ్స్‌ని తగలబెట్టేస్తారు. నాటకం రద్దవుతుంది. ప్రాణాలు అరచేత్తో పెట్టుకుని పరుగులు తీస్తాడు అనుపమ్ ఖేర్. ఈలోగా క్రికెట్ ఆడొచ్చిన మనవడు శివ కూడా వచ్చి కలుస్తాడు ఆయన్ని.

తాతా మనవళ్ళు ఇద్దరూ బజాజ్ స్కూటర్ ఎక్కి ఇంటికి పోతుండగా, ఆటుగా జీపులో వెళుతున్న పోలీసులు వారిని చూసి,

“ఓ అమాయకమైన పండితుడా! పరిస్థితులు బాగాలేవు, మా జీపు వెంబడి స్కూటర్లో రండి రక్షణ కల్పిస్తాం” అని జీపు బయలుదేరదీస్తారు. వారు అలా ఓ పదడుగుల దూరం ముందుకు వెళ్ళారో లేదో, అటుగా వచ్చిన టెర్రరిస్టులు అలవోకగా పోలీస్ జీపుని బాంబుతో పేల్చేసి వెళ్ళిపోతారు. పోలీసులతో సహా జీపు భస్మీపటలం అయిపోతుంది.

తాతా మనవడు నిర్ఘాంతపోయి చూస్తారు ఈ అమానుష దృశ్యాలని.

ఇంకో సీన్లో: ఇంటి దగ్గర శివ తల్లి, తన మామగారు, కొడుకు ఇంకా రాలేదే అని ఆందోళనగా ఎదురుచూస్తూ ఉంటుంది. నెలల వయస్సున్న రెండో కొడుకు కృష్ణని ఊయలలో వేసి ఊపుతూ, జోలపాడుతు ఆందోళనగా మామ గారికోసం, కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. వాళ్ళని వెదకమని ఆమె తన భర్తని పోరుతుంది. వారి పక్కింట్లో ఉంటున్న ఆయన మిత్రుడు ’ఎందుకైనా మంచిది మీరు ఈ ఊరు వదిలి పెట్టి వెళ్ళీపోండి పరిస్థితులు బాగాలేవు’ అని మొసలి కన్నీరు కారుస్తాడు.

ఇలా ఉత్కంఠని రేకెత్తిస్తూ ప్రారంభం అవుతుంది ఈ సినిమా.

***

ఊయలలో ఉన్న కృష్ణ ముపై ఏళ్ళ తర్వాత కథానాయకుడు కృష్ణ పండిట్ (దర్శన్ కుమార్) గా మన కళ్ళ ముందు నిలబడతాడు. అతను ఢిల్లీ లోని ఒక విశ్వవిద్యాలయంలో కశ్మీర్‍కి స్వేచ్ఛని ప్రసాదించాల్సిందిగా ఉద్యమం నడుపుతూ దేశద్రోహ నేరపు అభియోగాల్ని ఎదుర్కుంటూ ఉంటాడు. రాధికా మీనన్ (పల్లవి జోషి) అతనికి ఎప్పటికప్పుడు బ్రెయిన్ వాష్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనల్ని రేకెత్తిస్తూ ఉంటుంది. అతను కశ్మీర్ లో జరిగిన మారణకాండ అంతా కల్పితం అని నమ్ముతూ ఉంటాడు. మతోన్మాద శక్తులు కశ్మీర్ స్వాతంత్ర్యం కొరకు పోరాడుతున్న ఉన్నతశ్రేణి త్యాగమూర్తులు అని విశ్వసిస్తాడు. భారతదేశం కశ్మీర్ లోని ఆ వీరులకి అన్యాయం చేస్తోంది అని అనుకుంటు ఉంటాడు.

ఈ లోగా అతను కశ్మీర్ వెళ్ళాల్సి వస్తుంది.

అక్కడ తన తాతగారి మిత్రులు నలుగురిని కల్సుకోవటం, అతి ప్రయాస అనంతరం అతనికి కొన్ని చారిత్రక నిజాలు తెలుస్తాయి. ఆ తరువాత అతను తిరిగి ఢిల్లీ వచ్చి విద్యార్థులందరికీ విషయం చెప్పి కళ్ళు తెరిపించాలనుకోవడం స్థూలంగా ఇది కథ.

***

కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని మార్చ్ 20వ తారీఖున హైదరాబాద్ కొత్తపేట మహాలక్ష్మి లో చూశాను.

సినిమా చూసిన తర్వాత నాలో కలిగిన భావసంచలనానికి అక్షరరూపం ఈ వ్యాసం.

మార్చి 11న ఈ చిత్రం విడుదల అయినది లగాయతు, ఇది సృష్టిస్తున్న సంచలనాలు మీకు తెలిసిందే. నిన్న సాయంత్రానికి ఈ సినిమా వసూళ్ళు దాదాపు నూటా యాభై కోట్లు దాటాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాసం వ్రాస్తున్నాను.

కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని చూసిన కోందరి ప్రతిస్పందనలని ముందుగా గుర్తు చేసుకుంటున్నాను.

***

“ఐ హేట్ దిస్ కశ్మీరీ (ర్) ఫైల్స్” అని మొదలెట్టి ఈ సినిమా విజయాన్ని తనదైన బాణిలో పొగడ్తలతో ముంచెత్తాడు సంచలనాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ. అది కేవలం నిందా స్థుతి అని గమనించ ప్రార్థన. ఆ వీడియో ఆద్యంతం ఆర్జీవి ఈ సినిమాని కశ్మీర్ ఫైల్స్ అనే బదులు కశ్మీరీ ఫైల్స్ అని వ్యవహరించాడు. ఎందుకో.

తన వీడియో ప్రారంభంలో ఆయనే చెప్పినట్టు ఆయన ఇప్పటివరకు ఇలా ఏ చిత్రాన్ని విశ్లేషించింది లేదు.

’సినిమాలని ఆర్థికంగా ఎలా విజయవంతం చేయాలా అనే ఆలోచనతోనే నిర్మించి, దర్శకత్వం వహిస్తూ దాదాపు ముఫై నలభై ఏళ్ళు ప్రయాణం సాగించాను. ఈ చిత్రం నన్ను నా కళ్ళ ముందు నగ్నంగా నిలబెట్టింది. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నిజాయితీతో సినిమా తీస్తే ప్రేక్షకులు దాన్ని ఖచ్చితంగా సీరియస్‌గా తీస్కుంటారు. ఇది బాహుబలి కంటే కూడా పెద్ద హిట్ (రిటర్న్ ఆన్ ఇన్వెష్ట్‌మెంట్ అన్న లెక్కలలో తీస్కుంటే). ఇన్ని ఏళ్ళు చెత్త లెక్కలు వేసుకుంటూ సినిమాలు తీసినందుకు నేను సిగ్గు పడుతున్నాను. ఈ సినిమా నన్ను ఇంత ఆలోచనకి గురి చేసినందుకు ఈ సినిమాని ద్వేషిస్తున్నాను. కానీ వివేక్ అగ్నిహోత్రిని ప్రేమిస్తున్నాను. ఇకపై భారతదేశంలో సినిమా తీయబోయే దర్శకులందరూ ఈ సినిమా ప్రభావంతో మాత్రమే సినిమాలు తీయాల్సొస్తుంది. ప్రతి ఒక్కరూ తమని తాము రీ-ఇన్వెంట్ చేసుకోవాలి. ఇలాంటి పునరాలోచన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించిన ఈ చిత్రం నిజంగా ఒక బెంచ్ మార్క్ చిత్రంగా చరిత్రలో మిగిలిపోతుంది”

****

“అబ్బ పరమ బోర్ బాబు! ఈ చిత్రం ఒక డాక్యుమెంటరీ లాగా ఉంది”

కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తున్న నా స్టూడెంట్ ఒకావిడ వ్యాఖ్యానించింది.

నా మొఖంలో కనిపించిన ఆశ్చర్యాన్ని గమనించి ’మీరు రివ్యూ వ్రాయండి సార్! చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అని కొసమెరుపు ఒకటి తగిలించింది.

ఈమె ఏ వామపక్షవాదో, లేదా దేశ వ్యతిరేక భావాలు కలిగిన వ్యక్తో ఏమీ కాదు. ఒక సాధారణ గృహిణి, సాధారణ ఉద్యోగి. అదేదో సినిమాలో షాయాజీ షిండే చెబుతాడు చూడండి ’తిన్నామా పడుకున్నామా తెల్లారిందా’ అనే తరహా మనుషులకి అసలు సిసలు ఉదాహరణ ఈవిడ.

****

“ఈ చిత్రాన్ని అందరూ అవశ్యం చూడాలి. ఈ సినిమా నిజంగా ఒక చారిత్రక వాస్తవాల సంపుటి” ఈ మాటలు అన్నది మా దగ్గర బంధువలావిడ ఒకరు. ఈమె వాస్తవానికి వామపక్షభావాలతో, స్త్రీవాదం, స్త్రీ స్వేచ్ఛ అనే అంశాల గూర్చి వాదిస్తూ కాస్త అందర్నీ భయపెడుతూ ఉంటుంది. ఆవిడ కొన్నేళ్ళ క్రితం తన దేశ, విదేశ పర్యటనలలో భాగంగా కశ్మీర్‌ని, ముఖ్యంగా లాల్ చౌక్‌ని కూడా సందర్శించి వచ్చారు. ఆమె కశ్మీర్ పర్యటించినప్పటికి అక్కడ 370వ అధికరణాన్ని భారత ప్రభుత్వం ఇంకా తొలగించలేదు. అల్లరి మూకల రాళ్ళదాడులు, త్రివర్ణ పతాకం స్థానే అహంకారపూరిత ధోరణితో ఇతర పతాకాలు సగర్వంగా ఎగురుతున్న దశ అది, సైనికులు నిస్సహాయంగా రాళ్ళదాడులకు బలవుతున్న సందర్భంలో ఆమె సాహసోపేతంగా పర్యటించి వచ్చారు కశ్మీర్. ఆ పర్యటన తర్వాత ఆమె కశ్మీర్ విషయంలో వామపక్ష భావాలతో కాక చాలా తటస్థ వైఖరితో ఉన్నారు.

అప్పుడు ఆమె చెప్పిన మాటలు, “అక్కడి పరిస్థితులు చూశాక కన్నీళ్ళు వస్తున్నాయి. ఇన్నేసి కోట్లు తగలేసి మన ప్రభుత్వం ఎందుకు కాపాడాలి అక్కడి జనాలని, కృతజ్ఞతలేని ఆ పౌరులని మార్చలేము. కశ్మీర్ మన దేశంలో అంతర్భాగమే. కానీ ఇప్పటికే చాలా ఆలశ్యం అయిపోయింది. ఇక కశ్మీర్‍ని మనం పొందటం కల్ల. మోదీ కాదు, ఎవ్వరూ ఏమీ చేయలేరు” అప్పట్లో ఆమె అన్న మాటలివి.

మొన్న 370వ అధీకరణం సడలించిన నేపథ్యంలో , ఇటీవల ఆమె చాలా ఆనందంగా ఉంటున్నారు, ఆ ఉత్సాహంతో ఈ సినిమాని చూడండని అందర్నీ ఉత్సాహ పరుస్తున్నారు.

***

“ఇది బీజేపీ వారి రాజకీయ ఎత్తుగడ” మీకు తెలుసు ఈ మాటలు ఎవరంటున్నారో

***

“ఈ చిత్రం మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది” ఒక వర్గం వారు కోర్ట్‌కి విన్నవించుకున్నారు. కోర్ట్ చిరునవ్వుతో వారి దరఖాస్తును త్రోసిపుచ్చింది.

***

“ఇది సినిమా కాదు. ఒక విప్లవం” హిందూ మతపెద్దలు, మఠాధిపతులు ఈ చిత్రాన్ని చూస్తున్న వీడియో పెట్టి ఫేస్ బుక్ లో కొందరి వ్యాఖ్యానం.

***

“ఈ సినిమా గూర్చి ప్రచారం కల్పించను” కపిల్ శర్మ

***

“ఇది ఒక అద్బుతమైన చిత్రం. ఇలాంటి సినిమాలు మరిన్నిరావాలి. దేశవిభజన నాటి పరిణామాల్ని కూడా ఇలా తటస్థవైఖరీతో నిజాల్ని చూపుతూ సినిమాలు తీయాలి” భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోది గారు

***

“మామూలు సినిమాల్ని కపిల్ శర్మ ప్రమోట్ చేస్తాడు. ఇలాంటి సినిమాలని లెజెండ్స్ (ప్రధానమంత్రి అంతటి వాడు) ప్రచారం చేస్తారు.”

మోదిగారితో, వివేక్ అగ్నిహోత్రి దంపతులు ఉన్న ఫోటోతో సామాజిక మాధ్యమాలలో సరదాగా మీమ్స్

***

“మేము వినోదపన్ను రద్దు చేస్తున్నాం ఈ సినిమాకి” కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.

****

ఇలా ఇందరి చూపుల్ని తనవైపు తిప్పుకోగలిగినంత ఆకర్షణ ఏమి ఉంది ఈ సినిమాలో అన్న ఆసక్తి కలగడం సహజం ఎవ్వరికైనా.

నటీనటుల గూర్చి:

అనుపమ్ ఖేర్ నటన అద్భుతం. ఎంత వ్రాసినా తక్కువే అవుతుంది అతని నటన గూర్చి. చిన్నప్పుడు తన దగ్గర చదువుకున్న విద్యార్థే తన కుటుంబాన్ని మట్టుబెట్టే దానికి వచ్చిన ఉగ్రవాదిగా దర్శనం ఇచ్చేసరికి ఆయన పొందిన షాక్ మాటల్లో చెప్పలేనిది. ఈ సమస్యకంతటికీ మూలకారణం 370 అధికరణం అని ఆయనకి తెలుసు. దాన్ని తొలగించాలని జీవిత పర్యంతం పోరాటం చేస్తూనే ఉంటాడు. చివరికి అది రద్దయ్యేటప్పటికి ఆయనకి డిమెన్షియా (అర్లుమర్లు- చిత్త వైకల్యం) వ్యాధి ఆయన్ని కబళీస్తుంది. అదొక విషాదం. మానసిక వ్యాధిగ్రస్థుడిగా చేసిన నటన, నడివయస్సులో ఉన్నప్పుడు ధైర్యంగా దీటుగా ఉన్నప్పటి నటన, శరణార్థిగా దైన్యం మూర్తీభవించిన వ్యక్తిగా ఆయన నటన ఇలా ఎన్నో షేడ్స్ ఉన్నాయి ఆ పాత్రకి . ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు ఆ పాత్రని అన్న విధంగా జీవించాడు ఆ పాత్రలో.

కృష్ణ పండిట్ గా దర్శన్ కుమార్ కూడా అద్భుతంగా చేశాడు. చివర్లో అతను ఇచ్చిన ఉపన్యాసం నేటి యువతకి పెద్ద కనువిప్పు. జేఎన్‍యూ విద్యార్థి నాయకులని దృష్టిలో పెట్టుకుని ఈ పాత్రని రూపుదిద్దారనుకుంటా.

అదే విధంగా పల్లవి జోషి, మిధున్ చక్రవర్తి, పునీత్ ఇస్సార్ ఇలా అందరూ పోటీ పడి నటించారు.

బలమైన సంభాషణలు కొన్ని:

భూమ్మీద స్వర్గం ఇది. దీన్ని నరకంగా మార్చి స్వర్గానికి చేరుకోవాలనుకుంటోంది ఒక జాతి.

అబద్దపు ప్రచారాన్ని సాగించి దేశాన్ని విచ్చిన్నం చేయాలనుకునే వారి ఉంపుడుగత్తె మీడియా.

ఆజాది ఈజ్ ఎ సాంగ్ ఆఫ్ టెర్రరిజం

ఆజాది ఈజ్ ది అంథెమ్ ఆఫ్ ఫ్రీ కశ్మీర్ – సెక్యులర్ జన గణ మన

కశ్మీర్ పండితులు తమ స్వస్థానానికి నిర్భీతిగా వెళ్ళగలరా -అది జరిగిన రోజే నిజమైన జస్టిస్

కశ్మీర్ మంటల్లో పడి మండిపోతోంది – బాహాటంగా నిర్భీతిగా హిందువుల ఊచకోత జరుగుతోంది

సమస్యకి పరిష్కారం టెర్రరిజం అయితే, అసలు ఇప్పటి దాకా ఏ పండిత్ కూడా ఎందుకు తుపాకి ఎత్తలేదు?

దేశ భవిష్యత్తుని మార్చగల శక్తి రాజకీయంగా బలపడి ప్రభుత్వాన్ని నడిపించగలిగితేనే వస్తుంది

అది వలస కాదు – నరమేధం

మతం మారు – చావు -లేదా మీ ఆడవాళ్ళని వదిలి పారిపో (రలీవ్, గలీవ్ యా ఛలీవ్)

అబద్దపు వార్తలు ప్రచారం చెయ్యటం కన్నా ఘోరం ఏమిటి అంటే నిజాన్ని దాచేయ్యటం

ఏమిటి ఈ సినిమాలో అంత ప్రత్యేకత ?

ఎందుకంతగా జనాల్ని ఆకట్టుకొంటోంది?

అసలు ఈ సినిమాకి సబ్ టైటిల్స్ లేకుంటే బొటాబొటిగా హిందీ తెలిసిన వారికి కూడా అర్థం కాదు. ఎందుకంటే కథా ప్రవాహం వెంబడి ఆయా పాత్రలకి అక్కడి స్థానిక భాషలోనే సంభాషణలు పెట్టినట్టున్నారు. అవి అర్థం కావు. అదీ కాకుండా ప్రేక్షకుల నినాదాలు మిన్నునంటుతుంటాయి థియేటర్‌లో.

హిందీ, ఇంగ్లీష్ రాని సాధారణ గ్రామీణ ప్రేక్షకులకి ఎలా అర్థం అవుతొందో ఎందుకు ఇంత స్థాయిలో ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారో నాకు అసలు అంతుబట్టలేదు.

స్వాతంత్య్రం వచ్చిన వెంటనే తమ పెద్దలు ఎన్నుకున్న ప్రభుత్వం దేశాన్ని ఎలా అధోగతి పట్టించిందోనన్న విషయాల్ని తెలుసుకోవాలన్న తపన యువతలో కనిపిస్తోంది.

దేశభక్తులు, పెద్ద మనుషులు అనుకున్నవారు ఎలా దేశభద్రతని, ప్రజల ప్రాణాల్ని గాలికొదిలేశారో తెల్సుకోవాలనే ఆతృత యువతలో కనిపిస్తోంది. వారిలో పుట్టిన నైరాశ్యం నుంచి ఒక విధమైన ఉద్రేకం ఉబుకుతోంది. దాని ఫలితమే ఈ చిత్ర విజయం.

ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా హాస్య సన్నివేశం లేదు.

ఏ ఒక్క దృశ్యం కూడా నాటకీయంగా లేదు.

ప్రేక్షకులని ఆకట్టుకోవాలనే లక్ష్యంతో పకడ్బందీగా స్క్రిప్ట్ వ్రాసుకుని ముందుకు వెళాదం అనే తపన ఎక్కడా కూడా లేదు.

అలాగన్జెప్పి ఒక డాక్యుమెంటరీ లాగా బోర్ కొట్టదు.

పని కట్టుకుని సెంటిమెంట్ గుప్పించి కన్నీళ్ళు తెప్పించాలి ప్రేక్షకుల కళ్ళలో అనేలాంటి కుహనా ప్రయత్నాలు లేవు.

సినిమా యావత్తు యథార్థం. నిజం చెప్పాలంటే అక్కడ జరిగిన ఘోరాల్లో వెయ్యవవంతు కూడా చూపలేదు అని అక్కడి పరిస్థితులు చూసిన వారు చెబుతున్నారు.

మన రెగ్యులర్ తెలుగు హిందీ సినిమాలలో ఉన్న హింసతో పోలిస్తే ఇందులో హింస ఏమీ లేదు. పిల్లలతో సహ చూడవచ్చు. చివరి సీన్లలో నిజాలని చూపటానికి ఒకటి రెండు దృశ్యాలు ఒళ్ళు జలదరించేలా చూపించారు. అది చూస్తే కూడా దుఃఖం కలుగుతుందే కానీ జుగుప్స కలగలేదు.

వాస్తవవానికి ఇక్కడ హిందూ స్త్రీలపై జరిగిన మానభంగాలకి లెక్కలేదు. ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా మానభంగం చూపలేదు. గడ్డం సాహెబ్‌లు వెకిలిగా నవ్వుతూ ’నిఖా’ చేసుకుంటా అంటారు సింబాలిక్ గా.

ఈ చిత్రాన్ని పిల్లలకి చూపాలి. లేకుంటే వాళ్ళు నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని భ్రమపడుతుంటారు.

***

ఈ సినిమా ఎందుకు చూడాలి?

దేశ చరిత్ర తెలియకుంటే మనకు జాతీయభావన ఎలా కలుగుతుంది? కాబట్టి దేశ చరిత్ర తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

ఇలా నిజాల్ని నిర్భయంగా చెప్పే చిత్రాలు వచ్చినప్పుడు సహజంగా నేటి యువత చరిత్ర తెల్సుకోవటానికి ఆసక్తి చూపుతారు. శ్రీ ఎంవీఆర్ శాస్త్రి గారు వ్రాసిన ’కశ్మీర్ కథ’ ’కశ్మీర్ వ్యథ’ అనే గ్రంధాలు చదివితే మనకు సాధికారికంగా అక్కడి విషయాలు తెలుస్తాయి.

ఎవరి మీదనో ద్వేషం పెంచటానికో, మత విద్వేషాలు రెచ్చగొట్టటానికో కాదు ఈ సినిమా తీయబడింది. మన దేశానికి నిజమైన సేవ చేసిన నాయకులు ఎవరు, మన దేశానికి తీరని ద్రోహం చేసిన నాయకులు ఎవరు, జాతీయభావన ఎందుకు ముఖ్యం అన్న విషయాలని తెలుసుకోవాలి అనే అవగాహన కల్పిస్తుంది ఈ చిత్రం.

’ఎవ్వరి మీద నీవు దాడి చేయనక్కర లేదు. నీ శత్రువు నీ మీద కత్తులతో దాడి చేస్తుంటే నీ ఆడవాళ్ళని , ఇల్లు వాకిలిని వదిలి నిస్సహాయుడిలా నీవు పారిపోయే పరిస్థితి మాత్రం రాకుండా చూస్కోవాలి. నీ పక్కింట్లో ఉన్న స్నేహితుడైనా సరే తన మతం కన్నా దేశం ముఖ్యం అని విశ్వసించిన రోజే నీవు క్షేమం. నీ శత్రు దేశం క్రికెట్‌లో గెలిస్తే నీ పక్కింటి వాడు పండగ చేసుకుంటున్నాడా కాస్తా చూసుకో. వాడు రేప్పొద్దున కట్టుబట్టలతో నీ లారి ప్రయాణానికి నిన్ను సిద్ధం చేస్తున్నాడని అర్థం.

అయినా నా వెర్రి గానీ, నీకున్నది ఇది ఒక్కటే హిందూ రాజ్యం. లారీ ఎక్కి నీవెక్కడికని పారిపోగలవు?

***

అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఆరెస్సెస్ భావజాలం కలిగిన వాడేమి కాదు. ఒక నిజాయితి కలిగిన మామూలు వ్యక్తి. నిజానికి అతను వామపక్షభావాల వైపే మొగ్గు చూపుతాడట. అతనే చెప్పుకొచ్చాడు. అతను ఒక మామూలు సినిమా దర్శకుడు ఇది వరకు తీసిన సినిమాల లిస్ట్ చూస్తే మీరే అర్థం చేసుకుంటారు ఈ విషయం.

అతను ఇదివరకు తీసిన కొన్ని చిత్రాల పేర్లు కింద ఇస్తున్నాను.

“డర్టీ పిక్చర్ రిటర్న్స్”

“చాకోలేట్” (ఇమ్రాన్ హష్మీ, సునీల్ షెట్టీ)

“జిద్”

“హేట్ స్టోరి” (ముఖేష్ భట్ నిర్మాత)

“ధన్ ధనా ధన్ గోల్”

ఇటీవల అతను దర్శకత్వం వహించిన కింది చిత్రాలు చూస్తే అతని ఆలోచనల్లో పరిపక్వత మనకు అర్థం అవుతుంది.

“మొహమ్మద్ ఔర్ ఊర్వశి”

“బుద్ధ ఇన్ ట్రాఫిక్ జాం”

“తాష్కెంట్ ఫైల్స్”

అతను పరిపక్వత చెందిన దర్శకుడిగా నిజాయితితో కూడినఆలోచనాత్మక చిత్రాలు తీయాలనుకుంటున్నాడు అనితెలుసుకోవచ్చు అతను ఇటీవల తీస్తున్న చిత్రాలు చూస్తుంటే.

***

’నేను హిందువుని’ అని చెప్పుకోవడానికి హిందువు మొహమాటపడే పరిస్థితిని కల్పించారు మన ఇదివరకటి ప్రభుత్వాధినేతలు. బొట్టు పెట్టుకోవటానికి మొహమాటం, పండగలు ధైర్యంగా జరుపుకోవటానికి మొహమాటం.

మన గూర్చి మనం గర్వంగా చెప్పుకోవటానికి భయం, ఎదుటివాడు ఏమనుకుంటాడో అని.

హిందూ మతం ఎవర్నీ చంపమని చెప్పదు, అందర్నీ కలుపుకుని పొమ్మని చెబుతుంది. అతిథి దేవో భవ అనే చెబుతుంది. సర్వే జనా సుఖినోభవంతు అని చెపుతుంది. అయినా సరే ’నేను హిందువుని’ అని చెప్పుకోవటానికి మొహమాట పడతాం. అలా చెప్పుకుంటే ఎక్కడ మతోన్మాది అంటారో అని భయం.

నేను గొప్ప

నా మతం గొప్ప

నా మాతృ దేశం గొప్పది

నేను ఈ సంస్కృతికి వారసుడిని అయినందుకు గర్విస్తున్నాను అనే లాంటి మాటల్ని చెప్పుకోవటానికి సంకోచపడతాం.

సగర్వంగా ఆత్మ విశ్వాసంతో జీవించటానికి మొహమాటపడే లాంటి మానసిక స్థితిని కల్పించారు.

ఇలాంటి మానసిక స్థితిలో ఉన్న జాతిని శత్రువు సునాయాసంగా నిర్మూలించగలడు.

మరి ఏ లక్ష్యాలతో ఇలాంటి మానసిక స్థితిలోకి జాతిని నెట్టివేశారు మన ఇదివరకటి పాలకులు?

నెహ్రూ గారు పూనుకుని స్వంత ఆసక్తితో దేశంలోకి విలీనం చేయాలనుకున్న రెండు సంస్థానాలలో కశ్మీర్ ఒకటి. అది ఎంత సంబడంగా విలీనం చేశారో చూస్తూనే ఉన్నాం.

ఆ రకంగా తీస్కుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి ప్రాతః స్మరణీయుడు.

***

ఇక నేను థియేటర్ లో విన్న ప్రేక్షకుల సంభాషణలు.

’ఒరే నాయన! పటేల్ గనక సైనిక చర్య తీసుకోకపోయుంటే మన హైదరాబాద్ పరిస్థితి కూడా ఇలాగే ఉండేది రా. మన ప్రాణాల్ని తుపాకీ తూటాలతో గాల్లో కలిపేసేవారు, లేదూ కాస్త అదృష్టం కల్సి వస్తే మనం కూడా అలా లారీలో రాత్రికిరాత్రి కట్టుబట్టలతో పారిపోయుండే వారం” ఇంటర్వెల్ లో టీ త్రాగుతూ ఉన్న ఇద్దరు యువకుల సంభాషణ నా చెవుల్ని సోకింది.

“ఒరేయ్! మనం ఎవ్వర్నీ హింసించ్చొద్దు. కానీ గొర్రెలలా శాంతి శాంతి అని నిర్వీర్యంగా ఉండరాదు. మనం సింహాల్లా శక్తివంతంగా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదుగాక రాదు. ” ఇంకో యువకుడు అంటున్నాడు

“పాకిస్థాన్ వాళ్ళు ఇస్లాం మతప్రాతిపదిక మీద విడిపోయినప్పుడు, సహజంగా మిగిలి ఉన్న దేశం హిందూ దేశం. అప్పుడే ఇది హిందూ దేశం అని ప్రకటించటానికి ఏమి మొహమాటం వచ్చిందిరా. ఇక్కడ ఎవరైనా హాయిగా ఉండవచ్చు. అధికారిక మతం మాత్రం హిందూ మతమే ఉండేలాగా రాజ్యాంగం రాసుకుని ఉండాల్సింది. హిందూ మతంలోనే సెక్యులర్ భావనలు నిబిడీకృతమై ఉన్నాయి. అది పోనిచ్చి, మళ్ళీ ప్రత్యేకంగా సెక్యులర్ దేశం అని పిచ్చి నిర్ణయం తీసుకున్న వారిని…………..” అని ఓ చెడ్డ మాట అనేశాడు ఇంకో పెద్ద మనిషి కార్ పార్కింగ్ దగ్గర.

****

ఇంకా ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలి.

భావప్రకటనా స్వేచ్ఛ ఏ ఒక రాజకీయ వర్గానికో, మతానికో, ఒకఇజానికో పరిమతం కారాదు కద.

మహాత్మా గాంధీ గూర్చి అందరికీ తెలియని కోణాలు గూర్చి

మోప్లా జన హననం గూర్చి

వీరసావర్కర్ లా మరుగున పడిపోయిన ఎందరో నిఖార్సైన నాయకుల గూర్చి

నేతాజీ మరణం గూర్చి

హిందూ ముస్లింల మధ్య తొలి చిచ్చు రగిల్చిన ఖిలాఫత్ ఉద్యమం గూర్చి

టిప్పు సుల్తాన్ నిజ స్వరూపం గూర్చి

మొఘల్ చక్రవర్తుల నిజస్వరూపం గూర్చి

మాహారాణాప్రతాప్ పరాక్రమ గాధల గూర్చి

మాండ్య లో బ్రాహ్మలు ఎందుకు దీపావళి జరుపుకోరు అనే అంశం

బంగ్లాదేశ్ హిందువుల ఊచకోత

పాకిస్తాన్ లో హిందువుల ఊచకోత

ఇలా ఎన్నో అంశాల గూర్చి మన యువతకి నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి అంశాల గూర్చి నిజాయితిగా సినిమాలు తీసే దర్శకులు ముందుకు రావాలి

తారాగణం:

బ్రహ్మదత్ ఐఏఎస్‌గా మిథున్ చక్రవర్తి

పుష్కర్ నాథ్ పండిట్‌గా అనుపమ్ ఖేర్

కృష్ణ పండిట్‌గా దర్శన్ కుమార్

రాధికా మీనన్‌గా పల్లవి జోషి

ఫరూక్ అహ్మద్ దార్ (బిట్టా కరాటే) గా చిన్మయ్ మాండ్లేకర్

డాక్టర్ మహేష్ కుమార్ గా ప్రకాష్ బెలవాడి

డీజీపీ హరి నారాయణ్‌గా పునీత్ ఇస్సార్

శారదా పండిట్‌గా భాషా సంబ్లి

అఫ్జల్‌గా సౌరవ్ వర్మ

లక్ష్మీ దత్‌గా మృణాల్ కులకర్ణి

విష్ణు రామ్‌గా అటల్ శ్రీవాత్సవ

పృథ్వీరాజ్ సర్నాయక్

కరణ్ పండిట్‌గా అమన్ ఇక్బాల్

చివరిగా ఒక మాట.

మోది గారు ప్రచారం చెయ్యటం వల్ల, నాలుగు మంచి మాటలు మీడియాలో చెప్పటంవల్ల ఈ సినిమా హిట్ అయింది అని అనుకునే వారికి ఆర్జీవి సూటిగా ఒక ప్రశ్న అడిగాడు.

“మోదీ గారి పేరుకే అంత పవర్ ఉంటే, మరి మోదీ గారి గూర్చి వివేక్ ఒబెరాయ్ తనే ప్రధాన పాత్రధారిగా 2019 లో తీసిన మోదీ బయోపిక్ ఎందుకు ఫ్లాప్ అయింది?

ఇవన్నీ కాదండీ……….ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అని మనమందరం నిజాయితిగా ఆలోచించాలి” అని అంటాడు ఆర్జీవి.

అది ఎందుకు ఇంతలా హిట్ అయిందో, నేను అనుకుంటున్న కారణం వ్రాసి ముగిస్తాను ఇక.

1) నిజాయితితో పని మీద శ్రద్ద పెట్టి నిజాల్ని నిర్భయంగా సినిమాగా తీయగలిగితే భాష తెలియకున్నా, పెద్ద టెక్నికల్ విలువలు లేకున్నా జనాలు ఆదరిస్తారు.

ఒక కొసమెరుపు:

డెహ్రాడూన్ వాతావరణం, పరిసరాలు, కశ్మీర్‍ని పోలి ఉండటం వల్ల నిర్మాణ సౌలభ్యం కోసంఈ చిత్రాన్ని డెహ్రాడూన్ లో షూట్ చేశారట.

అక్కడ ప్రతి రోజు షూటింగ్ లో కథలో భాగంగా దేశ వ్యతిరేక నినాదాలు వినలేక స్థానిక ప్రజలు ఈ షూటింగ్ రద్దు చేసుకుని వెళ్ళిపొమ్మని గొడవ పెట్టుకున్నారట. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారట కూడా. ఈ సినిమా కథని వివరంగా చెప్పినా కూడా వారు అంగీకరించలేదట. ’పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినలేకపోతున్నాము అని వారు కన్నీళ్ళు పెట్టుకున్నారట.

అప్పుడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి , ప్రతి రోజూ షూటింగ్ ప్రారంభంలో, చివరలో ’భారత్ మాతా కీ జై’ అన్న నినాదాలు చేస్తాం అని వారిని ఒప్పించి సినిమా చిత్రీకరణ నిరాటంకంగా కొనసాగించారట.

****

చిత్రీకరణ సంధర్భంగానే కాదు, విడుదల అయినతర్వాత కూడా ప్రజల్లో జాతియతా భావనలని ఈ చిత్రం జాగృతం చేస్తూ ఉంది.

“శభాష్! ఈ చిత్రం లక్ష్యం నెరవేరింది”

Exit mobile version