[dropcap]ఈ[/dropcap] సారి మూడు నిముషాల లఘు చిత్రం The last day. ఇద్దరే నటులు నమిత్ దాస్, తాహిర్ రాజ్ భాసిన్. ఒకే గదిలో షూట్.
గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ ఆ రూం ని షేర్ చేసుకుంటున్నారు. ఈ రోజు తాహిర్ రూం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు, గాల్ ఫ్రెండ్ రియా తో.
చివరి రోజు ఇద్దరి మధ్య సంభాషణ ఈ చిత్రం. సంభాషణలు అన్నీ మామూలువే. దాని బట్టి తెలుస్తుంది తాహిర్ ఇదివరకు కూడా ఇలా వెళ్ళిపోయాడని. నీ షేవింగ్ కిట్, నీ చార్జెర్ తీసుకెళ్ళు, పోయినసారి కూడా మరచిపోయావు అంటాడు నమిత్. ఆ సన్నీ గాడిని నీ రూం మేట్ గా తీసుకోమని సలహా ఇస్తాడు తాహిర్. నా 2 టి బి డ్రైవ్ పాడైపోయింది, అందులోని పోర్న్ అంతా మటాష్, నీ దగ్గర ఏమన్నా వున్నాయా అంటాడు తాహిర్. రేయ్ నీ ఇలాంటి జోకులే నిన్ను మరచిపోనివ్వవు అంటాడు నమిత్.
తర్వాత తాహిర్ వెళ్ళిపోతాడు.
తాహిర్, నమిత్ ఇద్దరూ బాగా చేసారు. ఇందులో కథ ఏముంది అంటారా? మానవ సంవేదన. ఇద్దరు మిత్రుల మధ్య వున్న అనుబంధం. కొంత మంది వ్యక్త పరచలేక పోవడం, దాన్ని వాళ్ళ మాటలూ, చేష్టలూ బయట పెట్టడం అన్నది చాలా సటల్ గా చూపించాడు దర్శకుడు అధిరాజ్ బోస్. ఇదివరకు ఇతనిదే Interior cafe గురించి అనుకున్నాము. అందులో నసీరుద్దిన్ షా, షెర్నాజ్ పటేల్ లు దృష్టిని ఆకర్షిస్తే, ఇందులో వీళ్ళిద్దరు. నిడివి లో ఇది కేవలం మూడు నిముషాలే కాబట్టి దీన్నే గొప్ప ఫీట్ అనుకోవచ్చు. రెంటిలోనూ మూలం వ్యక్తం చేయని మానవ హృదయ సంవేదనలే. పాతికేళ్ళుంటాయేమో, నసీర్ ని డైరెక్ట్ చేసాడు, ఇంత గొప్పగా ఈ చిత్రాన్ని కూడా తీసాడు. ఇతని నుంచి మంచి చిత్రాలు ఆశించవచ్చు.
ఇది యూట్యూబ్ లో వుంది. తప్పక చూడమని అంటాను.
https://youtu.be/czkIAM6wYEY