Site icon Sanchika

తన మరణానికి ముందు ఒక లెక్చరర్ చెప్పిన చివరి పాఠం – ది లాస్ట్ లెక్చర్

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

రాండి పాష్ రాసిన ‘ది లాస్ట్ లెక్చర్’ జీవితం పట్ల గొప్ప అవగాహన కలిగించే పుస్తకం. లక్షల కాపీలు అమ్ముడుపోయిన ఈ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులెందరో ఉన్నారు. కాలం, జీవితం పట్ల మనకు ఎన్నో ఆలోచనలు కలిగించే పుస్తకం ఇది. రాండి అనే ఒక కంప్యూటర్ సైన్స్ ఫ్రొఫెసర్‌కి ప్రాస్టేట్ కాన్సర్ వచ్చింది. వైద్యం చేసుకున్న తరువాత కొంత కాలం ఆరోగ్యంగానే ఉన్నా మళ్ళీ అది తిరగబెట్టి ఇక కేవలం మూడు లేదా ఆరు నెలలు మాత్రమే అతను జీవిస్తాడని డాక్టర్లు చెబుతారు. ఆ చివరి నెలల జీవితాన్ని తన కుటుంబానికి తన చివరి సందేశం ఇస్తూ తన శిష్యులకు, ప్రపంచానికి ఉపయోగపడేలా జీవించాలని రాండి నిర్ణయించుకుంటాడు.

తన నిర్ణయాన్ని గురించి వివరిస్తూ అతను ఈ పుస్తకంలో ఒక చోట ఇలా రాసుకున్నాడు. “నేను నన్ను నేను సంపూర్ణంగా ఒక సీసాలో బంధించుకోవాలని తలచాను. ఈ సీసా ఏదో ఒక రోజు బీచ్‌లో కొట్టుకువచ్చినట్లు, జీవితం అనే సముద్రంలో నా పిల్లలకు చేరాలని నా కోరిక. నేను చిత్రకారుడి నయితే వారి కోసం నేను చెప్పవలసినాదాన్ని నా అఖరి చిత్రంగా చిత్రించి వారికి అది అందించి, మరణించేవాడిని. కాని నేను ఒక లెక్చరర్‌ని. నాకు చేతనయింది కేవలం లెక్చర్ ఇవ్వడం. అదే నేను చేయదలచాను. వారి కోసం ఒక ఆఖరి లెక్చర్ ఇవ్వాలనుకున్నాను.” అలా వచ్చిందే ఈ ‘ది లాస్ట్ లెక్చర్’ అనే పుస్తకం. ఇదే వారిచ్చిన ఆఖరి లెక్చర్. కార్నిజ్ మెల్లన్‌లో సెప్టేంబర్ 18, 2007 లో వారు “మీ చిన్నతనపు కలలను సాధించుకోవడం ఎలా” అనే శీర్షికతో ఒక లెక్చర్ ఇచ్చారు. అదే తరువాత ఈ పుస్తక రూపంలో వచ్చి, ప్రపంచంలో లక్షలాది విద్యార్దులను, చదువరులను ఆకర్షించి, ఎంతో మందికి స్పూర్తిదాయకమైనది.

ఈ పుస్తకంలో జీవితం తనకు నేర్పిన పాఠాలను వీరు చెప్పుకున్నారు. తనకు జీవితంలో ప్రేరణ ఇచ్చిన వారిని తలచుకున్నారు. తనకు ప్రేమను అభిమానాన్నిపంచిన స్నేహితులను గుర్తుతెచ్చుకున్నారు. తన జీవిత లక్ష్యాన్ని గురించి చెప్పుకున్నారు. అలాగే మరణం పట్ల తన అభిప్రాయాలు చెబుతూ ఆ చివరి ప్రయాణానికి ప్రతి ఒక్కరూ ఎలా తమను తాము తయారు చేసుకోవాలో చెప్పారు. ఆ సందర్భంలో తన ఫుట్బాల్ కోచ్‌ని గుర్తు చేసుకుంటూ మొదటి రోజు కోచింగ్‌లో బాల్ లేకుండా ప్రాక్టీస్ చేయించడం గురించి చెబుతూ బాల్ కోసం ఎదురు చూస్తూ దాని కోసం మైదానంలో పరుగెత్తుతున్న ఆటగాడిలా తనను పరిగెత్తించడం గుర్తు చేసుకున్నారు. జీవితం అంటే అలా లక్ష్యం కోసం పరుగెత్తడమే అని తమను తాము ఆ కనిపించని, రాబోయే పరిణామాలకు సిద్ధం చేసుకోవడమే అని ఈ పుస్తకంలో పుట్బాల్ తనకు నేర్పిన జీవిత సందేశంగా చెప్పుకొచ్చారు. తాను జీవితంలో నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం గురించి చెబుతూ “నీవు జీవితంలో పొరపాట్లు చేస్తున్నప్పుడు ఎవరూ నీ పొరపాటును సరిదిద్దాలని ప్రయత్నించట్లేదంటే నీపై నమ్మకాన్ని, బంధాన్ని వాళ్ళు వదిలేసుకున్నారని అర్ధం. అది స్వేచ్ఛ కాదు. కారాదు. అలాంటి స్థితికి ఎవరూ రాకూడదు.” అంటారు. జీవితం వేసే ప్రశ్నలన్నిటికీ పాజిటివ్‌గా జవాబు చెప్పుకుంటూ ఆ పాజిటీవిటీని చూట్టూ పంచాలని అది ప్రతి మనిషి కర్తవ్యం అని మరో చోట చెప్తారు. జీవితంలో వచ్చే కష్టాల గురించి చెబుతూ, “ఇటుక గోడలు ఉండడం వెనుక ఒక కారణం ఉంది. మనకు కొన్ని విషయాలు ఎంత అవసరమో, వాటిని పొందడంపై ఎంత కోరిక ఉందో మనకు మనం తెలుసుకోవడానికే ఈ గోడలు మనకు మన లక్ష్యానికి మధ్య నిలిచి ఉంటాయి. లక్ష్యం వైపుకు వెళ్ళాలనే కోరిక మనలో బలంగా ఉంటే గోడలను చేధించడం కష్టం అనిపించదు.” అంటారు.

జీవితాన్ని అతి నిరాడంబరంగా బ్రతకాలని, శరీరానికి మనసుకు సంబంధించినంతవరకు తక్కువ లగేజీతోనే జీవితంలో ముందుకు సాగాలని చెప్తారు. “మనం పని చేసే పరికరాలకు రిపేర్ చేయం. మనసు, శరీరానికి పని కల్పించుకుని ముందుకు వెళుతూ వున్నంత వరకు వాటికి రిపేర్ అవసరం రాదు. ఆర్థికపరమైన డిసిప్లిన్ మనిషికి చాలా అవసరం అందుకే నిరాడంబరతను అలవర్చుకుంటే జీవితంలో చాలా సమస్యలు మన దరి చేరవు. “జీవితంలో చాలా సమస్యలు మనకు సమాధానం లేనివి ఎదురవుతూ ఉంటాయి. వాటికి లోంగి మన అస్థిత్వాన్ని కాపాడుకోవడం గురించి ప్రయత్నించాలి. సమస్యతో మొండిగా పోరాడడం అన్ని వేళలా మంచిది కాదు. మన జీవితంలో ప్రశాంతత అవసరం, దానికి కొన్ని సార్లు లొంగుబాటు తప్పదు. జీవితం మనకిచ్చే డెడ్‌లైన్లకు లొంగిపోవడం చాలా సార్లు ఉత్తమం”

ఆయన ఈ పుస్తకంలో ఆనందంగా జీవించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు.

“నీ శక్తిని నేరారోపణ చేస్తూ, ఇతరుల పై తప్పు నెడుతూ బ్రతకడం కోసం వృథా చేయడం మాని సమస్య పరిష్కారం కోసం వినియోగించు. అలా చేస్తే చాలా వరకు జీవితంలో ప్రశాంతంగా ఊండగలవు”

“ఇతరులు ఏం ఆలోచిస్తారు అన్న దాన్ని మరచిపో. దాని వలన ముప్పై శాతం జీవిత సమస్యలు దూరమవుతాయి.

“అదృష్టం కలసి వచ్చేది ప్రయత్నం, అవకాశం కలసినపుడే. కాబట్టి ప్రయత్నించడం మానకు”

“మనకు అవసరం ఉన్నది మనకు కావలసినది మనకు దొరకనప్పుడు, దానికి బదులుగా మనకు దొరికినదాన్నే అనుభవం (EXPERIENCE) అంటారు.

“లాభం, నష్టాలను బేరీజు వేసుకునే పద్దతులు అనేకం. ఒకోసారి మనం నష్టం అనుకున్న దానిలో లాభం కూడా ఉండి తీరుతుంది. మనం బేరీజు వేసుకునే పద్ధతులను మార్చుకుంటే ఆ అనుభవం మనకు ఎదురవుతుంది.”

“ఏ కష్టమూ, చాలేంజ్ లేని పెద్ద ఉద్యోగస్తుడిగా జీవించే కన్నా కష్టపడి నిష్ణాతుడైన చెత్త ఏరుకునే వాడిగా జీవించడంలో తృప్తి ఉంది. టాలెంట్‌ని మించిన ధనం మరొకటి సంపాదించలేం.”

“విపరీతమైన కోరిక ఉండి ఏదన్నా పొందాలనుకుంటే ప్రయత్నం ఎప్పూడు ఆపకూడదు”

ఈ పుస్తకంలో జిడ్డూ కృష్ణమూర్తి గారి ప్రస్తావన కూడా వస్తుంది. ఒక మిత్రుడు వారికి జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చెప్పారట. జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక చోట అన్నారట…. “మరణానికి చేరువగా ఉన్న వ్యక్తికి చెప్పండి అతని మరణంతో మీలోని ఓ భాగం కూడా మరణిస్తుందని, ఆ భాగం మరణం తరువాత ఆయన ఎక్కడికి చేరితే అక్కడ అతనితో పాటు వెళ్తుందని. అందువలన మరణించిన వ్యక్తితో మనం కూడా ఉంటాం. అతను ఒంటరి కాడు”… ఇది ఆయనకు ఎంతో ఊరటనిచ్చిన సత్యం అని చెప్తారు. తాను వెళ్ళిపోతున్నానంటే అలాంటి ఎన్నో భాగాలను తీసుకెళ్ళిపోవడం అన్నది తనకు బలాన్నిస్తుందని వారు రాసుకున్నారు. రాండికి ముగ్గురు పిల్లలు. అతను మరణించే సమయానికి మొదటి ఇద్దరు ఆరు, నాలుగు సంవత్సరాల వాళ్ళయితే చిన్నవాని వయసు పద్దెనిమిది నెలలు మాత్రమే, వారికి ఆఖరి సందేశంగా ఈ లెక్చర్ వారికి అంకితం చేసాడు రాండి. తన గుర్తులను, తన అనుభవాలను ప్రపంచానికి వదిలి పెట్టి వెళ్ళాలన్నది అతని ఆఖరి కోరిక. ఈ పుస్తకం ద్వారా ఎందరికో దగ్గర అయ్యారు ఆయన. జీవితాన్ని మరణాన్ని చూసే దృష్టికోణం మార్చగల చక్కని పుస్తకం ఇది. జీవితాన్ని ఆఖరి నిముషం దాకా ఎలా జీవించాలో చెప్పే పుస్తకం ఇది. జులై 28, 2008 వ సంవత్సరంలో రాండి జీవితాన్ని గెలిచిన వ్యక్తిగా మరణించాడు. చనిపోబోతున్న ఒక లెక్చరర్ నేర్పిన జీవిత పాఠం ఈ పుస్తకం. జీవితాన్ని అనవసరమైన, ప్రాధ్యాన్యత లేని విషయాల కోసం పాడు చేసుకునే వ్యక్తులకు జీవితం పట్ల అవగాహన కల్గించే ప్రయత్నం చేస్తుంది ఇది. అందువలన పాశ్చాత్య దేశాలలో పర్సనాలిటి డెవలెప్మెంట్ సంబంధించిన వివిధ లెక్చర్స్‌లో ఈ పుస్తక ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. మన దేశంలోని అన్ని పుస్తకాల ఔట్లెట్‌లలో దొరికే పాపులర్ పుస్తకం ఇది.

Exit mobile version