బెర్లిన్ గోడ నేపథ్యంలో నడిచిన విషాద ప్రేమ కథ – ‘ది మూమెంట్’

4
1

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]‘ది[/dropcap] మూమెంట్’ అన్నది డగ్లస్ కెనడీ రాసిన నవల. ఇది ఒక ప్రేమ కథ. బెర్లిన్ నగరంలో జరిగిన ఒక కథ. కోల్డ్ వార్ సమయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య బలపడిన సంబంధం ఈ కథకు మూల వస్తువు. సాధారణ ప్రేమ కథలకు చాలా భిన్నంగా ఉండే కథ ఇది. కథ కన్నా కథనం ఈ రచన పట్ల ఆసక్తిని కలగజేస్తుంది. మన జీవితాలలో ఎందరినో కలుస్తాం, కొన్ని సంబంధాలను ఆనందిస్తాం, కొన్నిటిని వదులుకుంటాం, కొన్నిటిని మరచిపోతాం. కాని ప్రతి బంధం మన మనసుపై ఏదో ఒక ముద్ర తప్పకుండా వేస్తుంది అన్నది మనకే అర్థం కాని సత్యం. మరచిపోయాం అనుకున్న అనుభవాలు కూడా మన మనసుపై పని చేస్తూనే ఉంటాయని, భవిష్యత్ జీవితంపై వాటి ప్రభావం ఉండి తీరుతుంది అని ఒప్పుకోవడానికి కొన్ని సార్లు మన అహం అడ్డువస్తూ ఉంటుంది. 488 పేజీల ఈ నవలలో ముఖ్య పాత్రలు రెండు కూడా తమ మధ్య ఏర్పడిన బంధాన్ని మర్చిపోవాలని ప్రయత్నించి విఫలమయి చివరకు అదే ప్రేమ అని అర్థం చేసుకోవడం కనిపిస్తుంది. మనసుతో ఏర్పడ్డ అనుబంధం జీవితంలో అతి తక్కువ సమయం నిలిచి ఉన్నా కాని దాని ప్రభావం నుండి మనిషి కోలుకోలేడు. తన చుట్టూ నిత్యం తనతో ప్రయాణించే మనుష్యులు ఎందరున్నా కాని వారితో మానసిక అనుభంధం ఏర్పడనప్పుడు వారితో ఎన్ని సంవత్సరాలు జీవితాన్ని గడిపినా అది నిరర్ధకరంగానే ఉండిపోతుంది. ఎన్ని రోజులు కలిసి ఉన్నామని కాదు ఎంతగా ఒకరితో ఒకరం మమేకమయి ఉండగలిగామన్నదే అనుబంధాన్ని గట్టిపరిచేది. కొంతమంది సంవత్సరాల పాటు మనతో ఉన్నా మనసుకు దగ్గర కారు. కాని కొన్ని రోజుల సంబంధాలు కూడా మనసును ఆ మనిషి వదిలి వెళ్ళిపోయినా వెంటాడుతూనే ఉంటాయి. అందుకే మానవ సంబంధాలను అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. చాలా సార్లు మనకే అర్థం కాని మనం మిగిలిపోతూ ఉంటాం జీవితంలో ఒంటరిగా… మనసుకు దగ్గరయిన అనుబంధాలను వదిలి వెళ్ళిపోయాక ఆ ఒంటరితనం నిరంతరం వేధిస్తూనే ఉంటుంది. జీవితంలో ఎన్నిఉన్నా ఎందరున్నా గానీ ఆ లోటూ మనసుకు తెలుస్తూనే ఉంటుంది. గుల్జార్ రాసినట్లు “ తేరే బినా జిందగీ సె కోయీ షికవా తో నహీ,,, తేరె బినా జిందగీ భి లేకిన్ జిందగీ థో నహీ’ ఈ గీతానికి నిర్వచనం ఈ నవల, దానిలోని కథావస్తువు. ది మూమెంట్ అంటే ఆ క్షణం. నిజంగా మనసును కదిలించినా ఆ క్షణం కోసం జీవితంలో నిరంతరం మళ్ళీ మళ్ళీ ఎదురు చూస్తూనే ఉంటాం. ఆ క్షణాన్ని మించినదేదీ జీవితంలో మరొటి ఉండదని అర్థం చేసుకోవడంలో జీవితాన్ని గడిపేస్తాం.

థామస్ నెస్బిట్ అనే రచయిత పెత్రా ను బెర్లిన్‌లో మొదటి సారి కలుసుకుంటాడు. అప్పుడు సివిల్ వార్ నడుస్తూ ఉంటుంది. పెత్రా తూర్పు జర్మని నుండి శరణార్థిగా బెర్లిన్ చేరుతుంది. ఒక పత్రికాఫీసులో ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నప్పుడే ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణ ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి జీవించడం మొదలెడతారు. పెత్రా జీవితంలో చాలా విషాదం ఉంటుంది. దేశ రాజకీయాలు, ఆమె కుటుంబ జీవనం అన్నీ ఆమెకు అశాంతినే మిగులుస్తాయి. థామస్ అమెరికా పౌరుడు. ఒక చిన్న ప్రాజెక్ట్ కోసం బెర్లిన్ వస్తాడు. ఆతను దేవుడు తన స్వాతంత్ర్యం కోసం పంపిన దూతగా పెత్రా భావిస్తుంది. కాని ఆమె ద్వంద్వ జీవితం, ఆమె గతం ఆమెను అతనికి పూర్తిగా దగ్గర చేయలేకపోతుంది. రాజకీయంగా ఒక వర్గం ఆమెను వాడుకుంటూ ఉంటుంది, వారి లాభం కోసం థామస్‌ను వాడుకోవడానికి పెత్రాను ఉపయోగించుకుంటుంది ఆ వర్గం. పెత్రాను పూర్తిగా నమ్మిన థామస్ ఆమె చేయమన్న పనులు ఎంత ప్రాణ సంకటమైనవైనా చేస్తాడు. బర్లిన్ గోడ దాటి అవతలకు చేరి పెత్రా కోసం అపాయాన్ని కొనితెచ్చుకుంటాడు. కాని ఆమె తనను ఉపయోగించుకుంటుందని తెలుసుకున్నాక ఆమెను క్షమించలేకపోతాడు. ఆమెను పోలీసులకు పట్టి ఇవ్వడంలో సహాయపడతాడు. ఆమె తనను మోసం చేస్తుందని పూర్తిగా అర్థం చేసుకున్నాకే ఆమెను వదిలి తనను తాను రక్షించుకుని ఆ దేశం శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాడు. పెత్రా అతని జీవితం నుండి అలా నిష్క్రమిస్తుంది.

ఈ నవల రచయిత థామస్ భార్య నుండి విడిపోయి ఒంటరిగా బ్రతికడానికి నిర్ణయించుకున్నప్పటి అతని మానసిక స్థితితో మొదలేడతారు. ఎవ్వరినీ కలవకుండా ఒంటరిగా జీవిస్తున్న థామస్‌కు ఒక రోజు బెర్లిన్‌లో పెత్రా నుండి రెండు పుస్తకాలు వస్తాయి. థామస్ గతంలోకి వెళ్ళి పెత్రాతో తన పరిచయం గుర్తు చేస్తుకుంటాడు. ఇరవై ఆరు సంవత్సరాల తరువాత కూడా తను మరచిపోలేని ఆ గాయం అతన్ని బాధపెడుతూనే ఉంటుంది. పెత్రా తరువాత అతను ఎంత ప్రయత్నించినా మరో స్త్రీ తో మానసికంగా కలసి ఉండలేక పోతాడు. పెళ్ళి చేసుకుని ఒక కూతురు పుట్టిన తరువాత కూడా భార్యను పూర్తిగా ప్రేమించలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా ప్రేమరాహిత్యపు జీవితం అతన్ని వీధిస్తూనే ఉంటుంది. చివరకు భార్యతో విడాకులు తీసుకోవలసి వస్తుంది.

ఒంటరిగా బ్రతుకుతున్న అతనికి పెత్రా పంపిన పుస్తకాల కారణంగా మరో సారి బెర్లిన్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ పెత్రా దుర్బర జీవితం, ఆమె గతం, ఆమె అతన్ని ప్రెమించినా రాజకీయంగా అతన్ని వాడుకోవలసిన అవసరం అన్ని అర్థం అవుతాయి. తన చిన్న బిడ్డను తమ స్వాధీనంలో ఉంచుకుని ఆమెను ఆ వర్గం ఉపయోగించుకుందని, తల్లిగా అ బిడ్డను తిరిగి పోందడానికి థామస్‌ను మనస్పూర్తిగా ప్రేమించినా ఆమె కొన్ని పనులు చేయక తప్పలేదని అర్థం అవుతుంది. ఆమెను పోలీసులు పట్టుకెళ్ళిన తరువాత ఆమెను జైలులో క్రూరంగా హింసించినప్పుడు వాళ్ళు ఉపయోగించిన రేడియోషన్ల కారణంగా కొన్ని సంవత్సరాల తరువాత ఆమెకు కేన్సర్ రావడం, ఆ జబ్బుతోనే ఆమె మరణించడం జరిగిందని అతను తెలుసుకుంటాడు. పుట్టిన్నప్పటినుండే శత్రువుల చేతికి చిక్కి భయంకరమైన పరిస్థితులలో బాల్యాన్ని గడిపిన తన కొడుకు మానసికంగా దెబ్బ తిని ఉండడం వలన అతన్ని ఒంటరిగా ప్రపంచంలో వదిలి వెళ్ళడం తప్పదని పెత్రాకి అర్థం అయి ఆ కొడుకు భాద్యతను థామస్‌కు అప్పగిస్తుంది. అతని జీవితంలో ఒక తోడుగా, ఒక పెద్దగా నిలవమని థామస్ ని అభ్యర్ధిస్తుంది తన చివరి ఉత్తరంలో.

ఇన్ని సంవత్సరాలుగా పెత్రా తనని మరచిపోలేదని, తననే ప్రేమిస్తూ తాను రాసిన ప్రతి ఒక్క వాక్యం చదువుతూ, తన కష్టార్జితాన్ని అమెరికన్ మాగజీన్లు, పుస్తకాలను కొని చదువుకుంటూ థామస్‌ను తలచుకుంటూ అతని గురించి కనుక్కుంటూ ఆమె గడిపిందని థామస్ అర్థం చేసుకూంటాడు, ఒక పాత్రికేయుడిగా, రచయితగా అతను రాసిన ప్రతి పేజీనీ దాచుకుని అవి మాత్రమే మిగుల్చుకున్న ఆమె మూగ ప్రేమను తెలుసుకుని బాధపడతాడు. ఆమె లేని లోటే తన జీవితంలో ఆనందం లేకుండా చేసిందని, అ నిరంతర ఒంటరితనం, వెలితి తోనే తన జీవితం ముగుస్తుందని అతను అర్థం చేసుకుంటాడు. ఆమె బిడ్డకు తాను బ్రతికి ఉన్నంత వరకు అండగా ఉంటానని భరోసా ఇస్తాడు.

చాలా విషాదంతో ముగిసే కథ ఇది. కాని ఇందులో పాత్రల మధ్య అనుబంధాన్ని రచయిత్ర రాసిన తీరు వారి మధ్య ఉన్న ఆ కొన్ని నెలల పరిచయం వారి జీవితాలని ఆక్రమించుకుని మరొకరిని ప్రేమించలేనంతగా వారిని ఒకరొకొరకుగా మలచిన విధానాన్ని ఆయన వర్ణించిన తీరు చాలా బావుంది. ఎన్నో ప్రేమ కథలు చదివినా, ఇది ఇంకా గుర్తుండిపోయింది. యుద్ద వాతావరణంలో, ఆర్థిక, రాజకీయ సంక్షోబాల నడుమ ప్రజల జీవితాలు ఎలా ఛిద్రం అవుతాయో చెప్పిన కథ ఇది. బెర్లిన్‌తో థామస్ అద్దెకున్న ఒక చిత్రకారుడు జీవితం, అతని జీవన స్థితి గతుల ద్వారా కూడా ఆ విషాద వాతావరణాన్ని పాఠకులకు అర్థం అయే రీతిలో తెలిపే ప్రయత్నం చేసారు రచయిత. రచయిత శైలి బావుంటే పుస్తకం ఎంత పెద్దదయినా చదవడంలో ఆనందం ఉంటుంది అని మరోసారి రుజువు చేసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం చాలా షాపుల్లో దొరుకుతుంది. కాబట్టి చదువుకోవచ్చు. విషాద భరితమైన ఈ ప్రేమ కథ లోని ఉన్నతమైన సంస్కారాన్ని ఆస్వాదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here