Site icon Sanchika

నాగరిక జీవితాన్ని వదిలి ఆదిమ తెగలతో జీవించిన పాల్ గాగిన్ జీవితం ఆధారంగా సోమర్సెట్ మామ్ రాసిన నవల THE MOON AND SIXPENCE

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]మ[/dropcap]నిషి తన జీవితాన్నినిర్మించుకునే క్రమంలో చాలా వరకు సమాజానికి ప్రభావితమవుతాడు. జీవితంలో అతను సాధించే విజయాలన్నీ కూడా సమాజం దృష్టిలో విజాయాలుగా చెలామణి అవుతున్నవే అయి ఉంటాయి. సాధారణంగా ప్రతి మనిషి తను చేసే ప్రతి పనికి సమాజ ఆమోదం, ప్రశంస లభించినప్పుడే అది విజయమని భావిస్తాడు. కాని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి భిన్నమైనవాడే. సమాజం ఏర్పరిచిన నియమాలను, సమాజం మనిషి అభివృద్ధికి ఏర్పరిచిన కొలమానాలన్నీ కూడా ప్రతి ఒక్క జీవి ఆశించే విధంగా ఉండవు. కాని సమాజం అనే మూసలో ఒదిగిపోవడానికి తన మనసును కప్పేసి సమాజాన్ని త్రికరణ సుద్దిగా ఆమోదించడమే మనిషి చేస్తున్న పని. కాని కొందరు ఈ మూసలో ఒదిగి ఉండలేరు. తమ మనసు నడిపించే బాటలో జీవించడానికి సమాజం నిర్ణయించిన పరిధుల్ని దాటి వెళతారు. సమాజ పరిధిలో వారికి లభించిన సౌఖ్యాలన్నిటిని వదులుకుని మనసు చెప్పే ముళ్ళబాటలోకి ప్రయాణిస్తారు. వారిని మిగతా వారు మూర్ఖులంటారు. ధనాన్ని పేరుని కీర్తిని కాదని అనామకులుగా మిగిలిపోవాలని నిర్ణయించుకునే ఇలాంటి వ్యక్తులు అందరికీ అర్థం కారు. కాని వీరిలో నిజాయితి మాత్రం మనల్ని ఆకర్షిస్తూనే ఉంటుంది. అటువంటి ఒక వ్యక్తి కథే సోమర్సెట్ మామ్ రాసిన THE MOON AND SIXPENCE.

పాల్ గాగిన్ అనే ఒక ఫ్రెంచ్ చిత్రకారుని జీవితకథ ఆధారంగా ఈ నవల మామ్ రాసారు. గాగిన్ స్పూర్తితోనే చార్ల్స్ స్ట్రిక్లాండ్ అనే ఒక పాత్రను ఈ నవల కోసం సృష్టించారు రచయిత. చాల్ర్స్ ఒక స్టాక్ బ్రోకర్. మంచి ధనవంతుడు. భార్యా పిల్లలతో జీవిస్తూ ఉంటాడు. ఆ జీవితం, రొటీన్ మనుష్యులు, నాటకీయ ప్రపంచం అంటే విరక్తి పుట్టి భార్యా పిల్లలను, ఉద్యోగాన్ని వదిలి వెళ్ళిపోతాడు. సాధారణంగా ఇలా సంసారాన్ని వదిలి వెళ్ళడం స్త్రీ కోసమే అనుకుంటుంది కదా సమాజం. చార్స్ విషయంలో కూడా అందరూ అదే అనుకుంటారు.  ఈ నవలా రచయితను చార్ల్స్ భార్య పిలిపించి పారిస్ వెళ్ళి తన భర్తను వెతకించమని కోరుతుంది. రచయిత దానికి ఒప్పుకుని అతని కోసం బయలుదేరతాడు. అయితే అతన్ని ఒక పాడుబడిన గదిలో అతి పేదవాడిగా జీవించడం చూసి ఆశ్చర్యపోతాడు.  చార్ల్స్ రచయితతో తన పూర్వ జీవితం అంటే తనకు రోత కలిగిందని ఇప్పుడే తాను మనిషిగా జీవిస్తున్నానని ఈ జీవితాన్ని వదిలి రానని చెబుతాడు. తన కుటుంబానికి తన అవసరం లేదని. వారితో ఉన్న సంబంధం కేవలం ఆర్థికమైనదే అని. తాను లేకపోయినా తాను సంపాదించి పెట్టిన ఆస్తితో వారు ఏ లోటూ లేకుండా జీవిస్తారని చెబుతాడు. తనకు చిత్రకళ అంటే ఇష్టమని, డబ్బు సంపాదనలో పడి తన కోరికలను ఇన్నాళ్ళు చంపుకున్నానని, ఇప్పుడు తనకు నచ్చిన విధంగా జీవించ దల్చుకున్నాని రచయితకు చెప్తాడు. అన్ని బంధాల నుండి విముక్తే తనకు ఆనందాన్నిస్తుందని వివరిస్తాడు. చాలా పేదగా తినడానికి కూడా సరైన తిండి లేక చార్ల్స్ బ్రతుకుతూ ఉంటాడు. అయినా అతని మొహంలో ఎప్పుడు లేని ఆనందం కనిపిస్తూ ఉంటుంది. అలా జీవిస్తూ తన కిష్టమైన చిత్రాలను చిత్రిస్తూ చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న చార్ల్స్‌ని, అతనిలోని ప్రథిభను ఒక డానిష్ చిత్రకారుడు గుర్తిస్తాడు. అతని చిత్రకళా నైపుణ్యాన్ని గమనిస్తాడు. అతనో మేధావి అని గుర్తిస్తాడు. చార్ల్స్ తన చిత్రాలను మార్కెట్లో  అమ్మడు, ఎటువంటి ప్రదర్శణలకు పంపడు. డబ్బు లేదా కీర్తి కోసం ప్రాకులాడదు. చిత్రాలను చిత్రించడంలో అతనికి లభించే స్వచ్ఛమైన ఆనందం కోసమే అతను పని చేస్తూ ఉంటాడు. వేసుకోవడానికి సరయిన బట్టలు కూడా లేని స్థితిలోనే అతను జీవిస్తాడు. తిండి లేక అపస్మారక స్థితిలోకి వెళుతున్న అతన్ని ఆ డానిష్ చిత్రకారుడు ఒక రోజు చూసి తన ఇంటికి తీసుకుని వెళతాడు. ఆ చిత్రకారుడి భార్య అతనికి సపర్యలు చేస్తుంది. ఆ క్రమంలో అతన్ని ప్రేమిస్తుంది. అతని కోసం తన భర్తను వదులుకుంటుంది. చార్ల్స్ స్ట్రిక్లాండ్ ఆమెను స్వీకరించినా అదే స్థాయిలో ఆమెను ప్రేమించలేకపోతాడు. తనకు తన పని కన్నా మరే విషయంపై ప్రేమ ఉండదని ఆమెకు చెబుతాడు. అయినా ఆమె అన్నీ వదిలి అతని కోసం వచ్చేస్తుంది. తన ప్రేమతో అతన్ని కట్టిపడేయగలనని నమ్ముతుంది. కాని చార్ల్స్ ఎవరికీ కట్టుబడి ఉండే మనిషి కాదు. తనను అతను నిర్లక్ష్యం చేయడం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది.

స్ట్రిక్లాండ్ ఆ ఊరు వదిలి తాహితి అనే ఒక ద్వీపం చేరుకుంటాడు. అక్కడ ఆదిమ ప్రజల మధ్య ఒక కార్మికుడిగా జీవిస్తూ దుర్భర దారిద్ర్యం అనుభవిస్తూ చిత్రాలు గీస్తూనే ఉంటాడు. ఆక్కడి తెగలో మరో స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఆదిమ స్త్రీలలోని నిర్భయత, భర్తపై ఆధారపడి ఉండని వారి నైజం అతన్ని ఆకర్షిస్తాయి. ఆదిమ తెగలలోని స్త్రీలు నాగరిక స్త్రీలుగా కుచించుకుపోయి, నిత్యం పురుషుని నీడలో సేద తీరాలని కోరుకుంటూ అదే స్త్రీ లక్షణం అనుకుంటూ జీవించరు. వారు మగవారిపై ఏ రకంగానూ ఆధారపడరు. అటు వంటి స్త్రీ తో జీవితంలోనే నిజమైన తోడు పురుషునికి దొరుకుతుందని అతను అర్థం చేసుకుని ఆ వివాహంలోని సౌఖ్యం అనుభవిస్తూ ఉంటాడు. అతనికి ఇద్దరు పిల్లలు పుడతారు. అక్కడే కుష్టు వ్యాధి సోకి అతి దుర్భర పరిస్థితులలో అతను మరణిస్తాడు. అతని మరణానంతరం అతని చిత్రాలు గొప్ప కీర్తిని సంపాదిస్తాయి. కాని అతని గొప్ప చిత్రాలన్నీ ఇంటి గోడలపై అతను గుడ్డివాడవక ముందు వేసినవే. అయితే అతని చివరి కోరికను అనుసరించి అతని భార్య ఆ చిత్రాలన్నిటిని కాల్చేస్తుంది.

ప్రపంచంలో నటన, మనవ సంబంధాల మధ్య ఉన్న మోసం, ద్వంద్వ వైఖరిలను అసహ్యించుకున్న ఒక వ్యక్తి ఆదిమ జాతి వ్యక్తిగా బ్రతకడానికి సిద్దపడి తన డబ్బును, సౌకర్యాలను వదిలి కష్టాలను కౌగలించుకుని బ్రతికాడు. జీవితంలోని ప్రతి నిముషాన్ని నిజాయితీగా బ్రతకాలనే అతని కోరిక అతని వెతుకులాట అతనికి ఏం మిగిల్చింది అన్నది సమాజపు దృష్టికోణంతో చూస్తే మనకు అర్థం కాదు. స్ట్రిక్లాండ్ మిత్రులెవ్వరికీ అతను అర్థం కాలేదు. అతను మరణించే వరకు తన చిత్రాలను ప్రపంచం నుంచి దాచాడు. ఉత్తమ చిత్రాలని కాల్చేసాడు. ఈ ప్రపంచం నుంచి కీర్తిని, పేరుని అతను ఆశించలేదు. తాను సంపాదించగలిగిన ఆ ఆరు అణాలను (Sixpence అన్నది డబ్బుకు ప్రత్యాయమానంగా వాడే మాట) అతను ప్రేమించలేదు. ఆ ధనం తనకు అవసరం లేదనే అన్నాడు. ఆకాశంలో మెరుస్తున్న చంద్రుని లోని స్వచ్ఛత కోసం అతను తాపత్రయపడ్డాడు. అంత స్వచ్ఛంగా మనసుకు ఎటువంటి మోహం అంటకుండా బ్రతకాలని తాపత్రయపడ్డాడు. బంధాల పేరుతో అతను తనను తాను బంధించుకోలేకపోయాడు. స్వేచ్ఛగా వెన్నెలలో విహరించాలనుకున్నాడు. డబ్బు ఇచ్చే సౌకర్యాలను, పాలరాతి మేడలను అందులోని నాటకీయతను అతను తిరస్కరించాడు. కార్మికుడిగా తన పొట్టకు కావలసినంత సంపాదించుకుంటూ, తన కిష్టమైన పనిని చేసుకుంటూ మరొకరి దృష్టితో తన జీవితాన్నికొలవకుండా తనకు నచ్చిన దారిలో జీవించాడు. అందుకోసం అతి దుర్బరమైన దారిద్ర్యాన్ని కూడా సంతోషంగా భరించాడు. ప్రేమ అనే మోసపూరిత భావలాతో అతను బంధాలను నిర్మించుకోలేదు. కోరికలకు వాంఛలకు ప్రేమ అనే ముసుగులు వేయలేదు. అందుకే చాలా కర్కశుడిగా, స్వార్ధపరుడిగా కనిపిస్తాడు. అయినా తనని ఇతరులు ఎలా ఎంచుతారన్నది అతను ఎప్పుడూ పట్టించుకోకుండానే బ్రతికాడు.

చార్ల్స్ స్ట్రిక్లాండ్ జీవితాన్ని పక్కన పెట్టిసి మన జీవితాలలో తొంగి చూస్తే మనం సంపాదించిన డబ్బు, కీర్తి, మనం నిత్యం చేస్తున్న జీవన ప్రయాణంలో ఎన్ని ముసుగులని వేసుకుని మంచివారిగా చెలామణీ అవుతున్నామన్నది నిజాయితీగా పరీక్షించుకుంటే అతని జీవిత మార్గం కొంతవరకైనా మనకు అర్థం అవుతుంది. మనం మన కోసం అంటూ నిజాయితీగా ఏం చెస్తున్నామన్నది ఒక్కసారి ప్రశ్నించుకుంటే మన జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలలో మన మనసుకన్నా ఇతరుల ఆమోదం ఎక్కువ ప్రాముఖ్యత పొందిందన్నది అర్దం అవుతుంది. చార్ల్స్ మరణించిన తరువాత అతను వద్దనుకున్న కుటుంబం అతని చిత్ర్రాలన్నీటిని ప్రదర్శనకు పెట్టి వాటి ద్వారా డబ్బు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబం అతని పేరును చిత్రాలను వాదుకున్న విధానం గురించి తెలుసుకుంటే మానవ సంబంధాలలోని ఈ స్వార్థాన్ని వదిలి ఎవరికీ అందనంత దూరంగా ఎందుకు చార్ల్స్ జీవించాడో  అర్థం అవుతుంది. మరణం తరువాత ఎంతో గొప్ప పేరు వచ్చింది స్ట్రిక్లాండ్‌కి కాని అతను దాన్ని ఎప్పుడు కోరుకోలేదు. ఆ చిత్రాలను సృష్టించే క్రమంలో అతను అనుభవించిన ఆనందం కోసమే అతను జీవించాడు.

చార్ల్స్ స్ట్రిక్లాండ్ పాత్ర అచ్చంగా పాల్ గాగిన్‌ని పోలి ఉంటుంది. అతన్ని గుర్తించిన డానిష్ చిత్రకారుడు వాన్ గో. వాన్ గో భార్యతో గాగిన్ సన్నిహితంగా ఉండే వాడన్న వార్త లో కొంత నిజం ఉంది. గాగిన్ కూడా తన చివరి రోజులు తాహితీలో గడిపాడు. అక్కడి ఆదిమ తెగల మనుష్యులని వాతావరణాన్ని తన చిత్రాలలో చిత్రించాడు. నాగరిక జీవితాన్ని అసహ్యించుకున్నాడు. అతను రాసిన నోవా నోవా అనే ఆత్మకథలో గాగిన్ తన భావాలను ఎటువంటి సంకోచం లేకుండా పంచుకున్నాడు. ఆ పుస్తకాన్ని ఈ  సంచికలోనే  ఇదివరకు నేను పరిచయం చేయడం జరిగింది. సోమర్సెట్ మామ్ గాగిన్ జీవితాన్ని పరిశిలించి ప్రభావితమై రాసిన నవల ఇది.

మామ శైలిని ప్రేమించని ఆంగ్ల పాఠకులు ఉండరు. వీరి వాక్య రచన చాలా గొప్పగా ఉంటుంది. ఈ నవలలో ఒక కళాకారుని తృష్ణను తోటి కళాకారుడిగా అర్థం చేసుకోగలిగిన మామ్ కనిపిస్తారు.

Exit mobile version