[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]నీ[/dropcap]తి, నియమాలపై కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలున్న వారు సమాజాన్ని పరిశీలిస్తున్నప్పుడు చాలా సార్లు ఒక షాక్‌కి గురి అవుతూ ఉంటారు. మనం అనుకున్న పంథాలో మనుష్యులు జీవించట్లేదని, అలా జీవించకపోవడం కొందరి చాయిస్ అని ఒప్పుకోవడం ఇలాంటి వారికి కొంత కష్టం. అలాంటి కష్టాన్ని కలిగించే ఆత్మకథాత్మక రచన ఈ THE NAKED TRIANGLE. ప్రఖ్యాత పంజాబీ రచయిత, బలవంత్ గార్గి ఆత్మకథ ఇది. ఆత్మకథలను ఇష్టపడే పాఠకురాలిగా ఈ పుస్తకాన్ని చదివాను. ఇది ముందు 1979లో అచ్చు అయ్యింది, తరువాత 1993లో కొన్ని మార్పులతో దీన్ని పునః ప్రచురించారు. కాని ఈ పుస్తకంలోని మానవ సంబంధాలు, వాటి మధ్య సంఘర్షణ అప్పటి కాలానికంటే ఎంతో ముందున్నట్లు కనిపిస్తాయి. ఆనాటి సమాజంతో అన్ని రకాలుగా విభేదించిన జీవితాలు ఇందులో మనకు కనిపిస్తాయి. భారతీయ సాంప్రదాయం, విలువలు అంటూ నమ్మే చాలామందికి షాక్ ఇచ్చే పుస్తకం ఇది. రచయిత తాను జీవించిన జీవితం, తన సంబంధాల గురించే ఓపెన్‌గా చెప్పుకున్నారు. అతని స్వేచ్ఛా జీవితం, స్వేచ్ఛా సంబంధాలు అన్నిటి గురించి వివరించుకుంటూ వెళతారు.
సీయటిల్‌లో విపరీతమైన స్వేచ్ఛతో జీవిస్తున్న అతను జెనీ అనే అమ్మాయిని కలుస్తాడు. ముగ్గురు అమ్మాయిలతో ఒకేసారి డేటింగ్ చేసున్న ఇతని జీవితంలో జెనీ ప్రవేశిస్తుంది. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని మిగతా ముగ్గురిని తిరస్కరించి వారిని బాధకు గురిచేస్తాడు. ఒకమ్మాయి అయితే ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేస్తుంది కాని బ్రతుకుతుంది. జెనీ బలవంత్ ఇద్దరూ కూడా ఆ గొడవలను తప్పించుకోవాలని ఆ దేశం వదిలి చండీగర్ వచ్చేస్తారు. అతని ప్రేమ కోసం, అతనితో కలిసి ఉండడం కోసం జెనీ తన దేశాన్ని, సాంప్రదాయాన్ని కుటుంబాన్ని స్నేహితులనీ వదిలి వచ్చేస్తుంది. బలవంత్ లోని స్త్రీ ప్రేమ వివాహం అనే సాంప్రదాయానికి కట్టుబడేది కాదు. ఇక్కడ రాజీ అనే ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుంటాడు. రాజీ ఇద్దరు పిల్లల తల్లి, నటి కావాలని ఆమె ఆశ. ఒక నాటకాన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు బల్వంత్ ఆమెను కలుస్తాడు. అప్పటి నుండి ఆమె అతని జీవితంలో ఇంకో భాగం అయిపోతుంది.
ఇక్కడ జెనీ కూడా ఈ జీవితాన్ని ఆనందించలేకపోతుంది. ఆమె ఒంటరితనం, భర్త తత్వం ఆమెను నిలకడగా ఉండనివ్వవు. ఆమె కూడా మరో వ్యక్తి ప్రేమలో పడుతుంది. తన ప్రియునితో తిరిగి అమెరికా వెళ్ళిపోతుంది. బల్వంత్‌కి చెప్పకుండా పిల్లలను కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. బల్వంత్‌తో సంబంధాన్నిపూర్తిగా తెంచుకుంటుంది. అధికారులకు బల్వంత్ ఒక ఫ్రాడ్ అని నిరూపించి పిల్లలపై అతని హక్కులేకుండా చేస్తుంది. పిల్లల పేర్లు కూడా ఆమె మార్చి ఉంటుందని బల్వంత్ ఊహిస్తాడు. వారెక్కడున్నారో ఎలా ఉన్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితులు కలుగుతాయి.
బల్వంత్‌పై పిచ్చ ప్రేమ చూపించిన రాజి కూడా మరో వ్యక్తిని ప్రేమించడం మొదలెడుతుంది. తన కష్టకాలంలో బల్వంత్ తనను పట్టించుకోలేదని చెబుతూ అందువలన అతనిపై తన ప్రేమ చనిపోయిందని చెబుతుంది. అతని పట్ల ఇప్పుడు తనకేం భావం లేదని అందుకే మరొకరితో జీవితాన్ని ముడిపెట్టుకున్నానని చెప్పి బల్వంత్‌ను వదిలేస్తుంది. ఇది కేవలం స్త్రీ పురుష స్వేచ్ఛా సంబంధాల కథ కాదు. ఆలోచన లేకుండా తమ కోరికలకు అనుగుణంగా పరిగెత్తిన వ్యక్తుల కథ. ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే గౌరవంగా చూడకపోతే అది అసహ్యంగా మారే విధానాన్ని చూపించే కథ. ఇందులో ఎన్నో సందర్భాలలో ఫ్రీ లైఫ్, సోషల్ పార్టీల ప్రస్తావన వస్తుంది. ఫ్రీ సెక్స్, తాగుడు, కాజువల్ రిలేషన్ షిప్స్ ఎన్నో కనిపిస్తాయి. ఈ సంబంధాలన్నిటిలో ప్రేమ ప్రస్తావన వస్తుంది కాని ఏ ప్రేమలో కమిట్మెంట్ కనిపించదు. ప్రతి ఒక్కరి భావాలు త్వరత్వరగా మారుతూ కనిపిస్తాయి. వారి కోరికలు వారి ఆలోచనలను నియంత్రిస్తూ కనిపిస్తాయి. నీతి అన్నది అర్థం లేని ప్రస్తావనగా భావించిన జీవితాలు ఇవి.
ఇవే కాక నాటక రంగంలో రచయిత, దర్శకుడయిన బల్వంత్ చాలా విస్తృతంగా ప్రపంచ నాటక రంగం గురించి చర్చిస్తారు. కళా రంగంలో పని చేస్తున్న వారి మధ్య మానవ సంబంధాలపై ప్రభావం చూపే ఎన్నో విషయాలను బైటపెడతారు. డబ్బు, సక్సెస్ ఇవి రెండే ప్రధానం అని ఆదర్శం, నీతి, లాంటి సూత్రాలకు ఆ రంగంలో విలువ లేదని ఓపెన్‌గా చెప్పడం ఈ ఆత్మకథ ప్రత్యేకత. శారీరిక సంబంధాలు, మనుష్యుల మధ్య మోసపూరిత సంబంధాలు అతి మామూలు ఆ రంగంలో అని చెప్పడానికి వారు భయపడరు. మనసు కన్నా శరీరమే అక్కడ ప్రధానమని స్టేట్మెంట్ కూడా ఇస్తారు. మనసు ప్రస్తావన ఒక హిపోక్రసి అని దాని విలువ కళారంగంలో లేదని ఆయన చెప్పడం అప్పట్లో పెద్ద వివాదమయింది.
మనం మేధావులనుకునే చాలా మంది నిజ జీవితాలలోని కొన్ని కోణాలను ఈ పుస్తకం చూపిసుంది. సమాజం ముందు నీతికి పెద్ద పీట వేసే వారికి, చాటున గడిపే వారి వాస్తవ జీవితాలకు నడుమ ఉన్న తెరను ఈ పుస్తకం తొలగిస్తుంది. తన కోరికలపై నియంత్రణ లేక జీవితంలో ఒంటరిగా మిగిలిన రచయిత పట్ల కొంత జాలి కూడా కలుగుతుంది. తనను ప్రేమించిన వారి పట్ల క్రూరంగా ప్రవర్తించిన అతనిపై కోపం కూడా వస్తుంది. పాఠకులు ఇలా స్పందిస్తారని తెలిసినా, తన జీవితాన్ని ఉన్నదున్నట్లు బైటపెట్టారు రచయిత. ప్రేమ పేరుతో ఎందరి హృదయాలో గాయపడడం చూస్తాం. అలా గాయపరచడానికే ప్రేమ అంటూ వెంట పడే వ్యక్తులను చూస్తాం. చివరకు తాము దేని కోసం జీవించారో తెలియని అయోమయంలో పడిపోయిన వ్యక్తులు కనిపిస్తారు, జీవితంలో వారి ప్రయాణం ఎటు అన్న సందిగ్తతలో వాళ్ళే పడిపోవడం కనిపిస్తుంది.
మేధావితనం మాటున అహంకారంతో జీవితాలను కలగాపులగం చేసుకున్న మనకు తెలిసిన కొందరు గొప్ప వారూ ఈ ఆత్మకథ ద్వారా పరిచయం అవుతారు. అధికార దాహం, కీర్తి కాంక్షతో జీవితంలో అన్ని విలువలకు తిలోదకాలిచ్చి చివరకు వీరు సుఖపడిందెంతో కూడా అర్థం కాని స్థితిలో రాలిపోతారు.
ఆ రోజుల్లోనే చాలా మంది ప్రముఖులపై బురద చల్లిన పుస్తకంగా దీన్ని చెప్పుకునేవారు. ఇది ఇప్పుడు మార్కెట్‌లో ఉందో లేదో తెలియదు కాని చాలా నిజాయితీతో రాసిన ఆత్మకథ అని చెప్పవచ్చు. తన గురించి కూడా చెప్పలేని, చెప్పకూడని వాస్తవాలను రచయిత ఈ పుస్తకంలో చెప్పుకున్నారు. తనను తాను ఒక పాత్రగా మార్చుకుని నిజాయితీగా తన తప్పులను, కీర్తి కాంక్ష, వ్యసనాలను బైటపెట్టుకున్నారు. అందుకే ఇది అప్పట్లోనూ ఇప్పట్లోనూ Most Controversial Biographyగా చెబుతారు. తమ మేధస్సుతో దారి తప్పి ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తుల కథ ఇది.