ది ఔట్‌సైడర్ – ఆల్బర్ట్ కామస్
[dropcap]ఆ[/dropcap]ల్బర్ట్ కామస్ రాసిన థి ఔట్‌సైడర్ ఫ్రెంచ్ సాహిత్యంలో చాలా ప్రాముఖ్యత ఉన్న నవల. దీన్ని ఇంగ్లీషులోకి చాలా సార్లు అనువదించారు. కొన్ని చోట్ల ‘ది స్ట్రేంజర్’ అనే పేరుతో కూడా ఇంగ్లీషులో ఈ పుస్తకం దొరుకుతుంది. సమాజంలో మనిషి ఎలా బ్రకతాలో నిర్దేశించే కొన్ని నియమాలున్నాయి. అలాగే అతను ఏర్పరుచుకునే మానవ సంబంధాలు, వాటి పట్ల అతని వైఖరి ఎలా ఉండాలో కూడా సమాజమే నిర్దేశిస్తుంది. అతని అతి పర్సనల్ ఎమోషన్స్ కూడా ఎలా, ఎప్పుడు, ఎంత మోతాదులో ఉండాలో కూడా సమాజం నిర్దేశిస్తుంది. ఈ నియమాలకు అతీతంగా ప్రవర్తించే వ్యక్తిని సమాజం క్షమించదు. కన్న తల్లి పట్ల, కుటుంబం పట్ల మనిషి ప్రేమ ఎలా ఏ స్థాయిలో ఉండాలో చెప్పే కొన్ని కొలమానాలున్నాయి. కాని మానవ సంబంధాలు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, ప్రేమ, వారి మధ్య ఉండే సయోధ్యపై ఆధారపడి ఉంటాయి. అందుకే చాలా సార్లు సమాజం ఆశించినంత స్పందన తమ చూట్టూ ఉన్న వారిపై మనుష్యులకు కలగదు. అప్పుడు వారు నటించడం మొదలెడతారు. అలా నటించని వారిని, నటించడానికి ఇష్టపడని వారిని సమాజం సహించదు.
ఎవరైనా చనిపోయారని తెలిసినప్పుడు వారి అంత్యక్రియలకు లేదా ఆఖరి చూపులకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణంలో విషాదంతో పాటు ఆ చనిపోయిన వ్యక్తి పట్ల చుట్టూ ఉన్న వారు అప్పుడు ప్రదర్శించే ప్రేమ, వెలబుచ్చే భావాలు చాలా నాటకీయంగా ఉంటాయి. వారికి ఆ వ్యక్తిపై ప్రేమ కన్నా ఆ ప్రేమ ప్రదర్శించకపోతే తాము చెడ్డపేరు తెచ్చుకుంటామేమో అన్న దుగ్ధ అధికంగా కనిపిస్తుంది. వారిది నటన అని చుట్టూ ఉన్నవారందరికీ తెలుసు కాని ఆ సమయానికి అది అత్యవసరం, అతి సహజం అని అందరూ నిర్ణయించేసుకుని ఆ నటనను ఆమోదిస్తారు. నటించడం చేతకాని వ్యక్తులు సమయానుకూలంగా బాధను వ్యక్తపరచట్లేధంటే వారినెంతో క్రూరమైన వ్యక్తులుగా అప్పుడే నిర్ణయించేస్తారు. అందుకే భర్త శవం దగ్గర భార్యలు ఏడవట్లేదని వారిని శంకించి, నిందిస్తారని కొన్ని ప్రాంతల్లో గుండె కొట్టుకుంటూ భార్య ఏడవడం ఒక సాంప్రదాయం అయిపోయింది. అంటే మానవ సంవేదనాలన్నిటిపై నియంత్రణ సమాజానిదే.
కామస్ తన రచనలలో ఈ హిపోక్రసిని వ్యతిరేకిస్తాడు. ఈ నవలలో మెర్సాల్ట్ అనే వ్యక్తి నటించడం ఇష్టపడని ఒక సగటు మానవుడు. అతని తల్లితో అతనికి పెద్ద గొప్ప అనుబంధం ఏం ఉండదు. ఆమెను ఒక వృద్దాశ్రమంలో ఉంచుతాడు అతను, ఆమె పట్ల అతని మనసులో ప్రేమ, ఆత్మీయత లాంటి భావాలుండవు. అందుకని వాటిని ప్రదర్శించడు. ఆమె పెద్ద వయసుతో మరణిస్తుంది. కాని ఈ వార్తతో అతనిపై ఆకాశం ఏం విరిగిపడదు. అతనికి పెద్ద విషాదం కూడా అనిపించదు. ఆమెపై అతనికి ఎలాంటి స్పందనలు లేవు. వారి మధ్య బంధం అంత గొప్పదు కాదు. ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఇలాంటి నిర్వీకార భావనే ఉంటుంది. విషయం తెలిసి చివరి చూపు కోసం వృద్దాశ్రమం వెళ్ళినప్పుడు కూడా జరగాల్సిన కార్యక్రమాల గురించి మాట్లాడతాడు కాని ఆమె శవాన్ని చూడాలని, అక్కడ లేని దుఖాన్ని నటించాలని అనుకోడు. ఆమె అంతక్రియలు ముగించి తన దైనిక జీవితంలోకి త్వరగా వెళ్ళిపోతాడు మెర్సాల్ట్. తన గర్ల్ ఫ్రెండ్‌తో ఈతకు సినిమాకు వెళ్ళి ఆమెతో రాత్రి గడుపుతాడు. తల్లి మరణించిన వెంటనే గర్ల్ ప్రెండ్‌తో ఇలా సమయాన్ని గడపడం అతనికి తప్పు అనిపించదు. మనుష్యులను సహజంగా స్వీకరించి వారితో మెసలడం తప్ప అనవసర విషాదాన్ని అదీ మనసులో లేని దాన్ని ప్రదర్శించడం అతనికి తెలీదు.
అప్పుడే సమాజంలో కొంచెం చెడ్డపేరు ఉన్న ఒకవ్యక్తితో మెర్సాల్ట్‌కి స్నేహం అవుతుంది. అతను తన విషాద కథ పంచుకుంటాడు. తనను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని అందువల్ల తానామెకు బుద్ది చెప్పదలచానని ఆ పనిలో మెర్సాల్ట్ సహాయం కోరతాడు అతను. ఇతని మాటలు నమ్మి అ అమ్మాయి బంధువుల్తో వైరం పెంచుకుంటాడు మెర్ల్సాల్ట్. తన స్నేహితుడు చెప్పినట్లు చేస్తే ఒక అమ్మాయికి నష్టం జరుగుతుంది అని కూడా ఆలోచించడు. అతనికి ఆ స్నేహితుడు చేస్తుంది సరైనది అనే అనిపిస్తుంది. ఆ అమ్మాయి సోదరుడు అతని స్నేహితులు వీరితో గొడవ పడతారు. అప్పుడు ఒక అరబ్ దేశీయుడిని మెర్ల్సాల్ట్ హత్య చేస్తాడు. ఈ హత్య చేసిన తరువాత కూడా అతనికి తానేదో నేరం చేసాను అనిపించదు. తనను చంపడానికి వచ్చిన వారిని ఆత్మరక్షణ కోసం చంపడం తప్పు కాదని అతను బలంగా నమ్ముతాడు. ఈ కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు.
కోర్టులో కేసులో భాగంగా అతని స్వభావాన్ని లాయర్లు అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. అతని గడచిన జీవితం తెలుసుకుని అందరు ఆశ్చర్యపోతారు. తల్లి మరణించిన వెంటనే గర్ల్ ప్రెండ్‌తో సరదాగా గడపడానికి ఏ మాత్రం వెనుకంజ వేయని అతన్ని అసహ్యించుకుంటారు. తల్లి మరణం కాని ఇతరుల అసహ్యం కాని అతన్ని కదిలించవు. అసలు అవి ఆలోచించాల్సిన విషయాలే కావన్నది మెర్స్లాల్ట్ భావన. అందరికీ అతనో క్రూరుడుగా, కఠినాత్ముడిగా కనిపిస్తాడు. కోర్టులో ఎక్కడా అతను బెదరడు. చాలా నిర్వికారంగా నిలబడతాడు. అతని వైఖరి చూసి అందరూ అతనో కరడు గట్టిన ఉన్మాది అని, ఏ మాత్రం స్పందనలు లేని రాయి అని అతని వల్ల సమాజానికి నష్టం అని తేలుస్తారు. కోర్ట్ అతనికి మరణ శిక్ష విధిస్తుంది. ప్రజలందరి సమక్షంలో గలిటిన్‌లో అతని మెడ నరకాలని నిర్ణయిస్తారు.
మరణశిక్షకు ఎదురు చూస్తున్నప్పుడు అతన్ని ఒక చర్చి మతాధికారి కలుస్తాడు. ఇప్పుడన్నా ప్రాయశ్చితం చెసుకోమని, భగవంతుని క్షమ కోసం ప్రార్ధించమని, చేసిన పాపాలన్నిటిని ఒప్పుకోమని ఆ మతాధికారి కోరతాడు. కాని భగవంతుడిని ప్రార్థించడానికి అతను ఒప్పుకోడు. దైవం పై తనకు నమ్మకం లేదని చెప్తాడు అతను. అసలు ఈ ప్రార్థనలు పెద్ద నటన అని సమయాన్ని వృథా పరుచుకోవడమని మెర్సాల్ట్ చెబుతాడు. చర్చ్ సహాయం సానుభూతి అతను కోరడు. ఆ పరిస్థితులలో కూడా అతను అబద్దం చెప్పడు. జరగనికి జరిగినట్లు, చూడని చూసినట్లు, విననిది విన్నట్లు చెప్పడం అబద్దం చెప్పడమవుతే, మనసులో లేని భావాలను ఉన్నట్లు బైటికి చెప్పుకోవడం కూడా అబద్దమే అంటాడు మెర్సాల్ట్. మనసులో ఉన్న ప్రేమను ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం కూడా అబద్దమే అతను దృష్టిలో. అతన్ని మళ్ళీ మళ్ళీ ప్రార్థనకు కూర్చోమని బలవంత పెట్టే మతాధికారిపై అతను విరుచుకు పడతాడు. అసలు తన స్వభావం గురించి విశ్లేషించడానికి ఎవరికైనా అర్హత ఎందుకుంటుందని తన ఆలోచనల ఆధారంగా జీవితాన్ని గడిపే హక్కు తన వ్యక్తిగతం అని వాదిస్తాడు. ఈ సమాజం తనను అర్ధం చెసుకోవాల్సిన అవసరం లేదని అసలు తనను జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదని గట్టిగా చెప్తాడు. తనకు నిజమైన మనశ్శాంతి ఆ మరణశిక్షతోనే లభించవచ్చని తన స్థితిని అంగీకరిస్తాడు, మరణానికి సిద్దపడతాడు.
ఎవరో ఏదో అనుకుంటారని మనం మన జీవితంలో ఎన్నో పనులు చేస్తాం. సహిస్తాం, అలా చేయనివారిని విమర్శిస్తాం. నాటకీయాతను సమర్ధిస్తాం. కాని కళ్ళు తెరిచి చూస్తే నటననే జీవితం చేసుకుని బ్రతికేస్తాం. మన జీవితాలలోని డొల్లతనాన్ని ఈ నవల బాగా ఎత్తిచూపుతుంది. ఈ నవలలో రచయిత మెర్సాల్ట్ పాత్ర ద్వారా వేసిన ప్రశ్నలు చాలా కాలం వెన్నాడుతాయి. కామస్ ఫిలాసఫీ అబ్సర్డిసమ్, ఎక్సీస్టేంషనిలిసమ్‌ను చర్చిస్తుంది. వాటి ఆధారంగా రాసిన ఈ నవలిక ఒక్క ఇంగ్లీషు భాషలోనే ఎన్నో సార్లు అనువదించబడింది. ప్రపంచ భాషలన్నిటిలో కూడా ఈ నవల అనువాదం జరిగింది. దాని బట్టి ఈ నవలకున్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు.