Site icon Sanchika

ది ఫిలాసఫర్ క్వీన్ – అహల్యాబాయి హోల్కర్

[dropcap]మే[/dropcap] 31 వతేదీ అహల్యాబాయి హోల్కర్  జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

హిందూమత పునరుద్ధరణ కోసం అమిత కృషి చేస్తూనే సమాంతరంగా మతసహనం చూపిన గొప్ప పరిపాలకురాలు, సుమారు 250 ఏళ్ళు క్రితమే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేసిన మహిళా శిరోమణి, ఒక రాజ్యానికి కావలిసిన సౌకర్యాలన్నిటిని సమకూర్చి, స్వంత ధనంతోనే జీవనాన్ని సాగించి – స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం వెచ్చించిన మహిమాన్వితురాలు, ఇండోర్ రాజ్యాన్ని పరిపాలించిన రాణి అహల్యాబాయి హోల్కర్.

వీరు 1725వ సంవత్సరం మే 31వ తేదీన అహమ్మద్ నగర్ సమీపంలోని చౌండి గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు సుశీలా షిండే, మాంకోజీ షిండేలు.

ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువుకునేందుకు సౌకర్యాలు లేవు. మాంకోజీ కుమార్తెకు చదవడం, వ్రాయడం నేర్పించారు. తన కుమార్తె చదువుకుని పైకి రావాలని వారి ఆకాంక్ష.

పీష్వా బాజీరావు కమాండర్‌లలో ఒకరు మల్హర్ రావు హోల్కర్. ఆయన ఒకసారి పూనా వెళుతూ మార్గమధ్యంలో అహల్యాబాయిని చూశారు. ఆమె అందం, అణుకువ, సౌకుమార్యం భక్తిభావం ఆయనని ఆకర్షించాయి. తన కుమారునికి సరైన జోడి అని నిర్ణయించుకున్నారు. పదేళ్ళ అహల్యను తన కుమారుడు ఖండేరావు కిచ్చి వివాహం చేశారు. కోడలైనా కూతురి కంటే ఎక్కువ అభిమానం చూపించేవారు.

హోల్కర్‌లు ఇండోర్‌ను పరిపాలిస్తున్నారు. 1754లో కుంభేర్ కోట ముట్టడి కోసం జరిగిన యుద్ధంలో ఖండీరావు మరణించారు. అహల్య సతీసహగమనం చేయడానికి సిద్ధపడ్డారు. మల్హర్ రావు వారించారు. కోడళ్ళను రాసి రంపాన పెట్టి హింసిస్తున్న ఈ రోజుల్లో ఇది వింతల్లో వింతగానే ఉంటుంది.

మల్హర్ రావు కోడలికి యుద్ధవిద్యలు నేర్పించారు. రాజనీతి, పరిపాలనా విధానాలలో స్వయంగా శిక్షణను ఇచ్చారు.

ఒక పరిపాలకురాలికి ఉండవసిన విధి విధానాలలో నిష్ణాతురాలిని చేశారు. ఆయన 12 సంవత్సరాల తరువాత 1766లో మరణించారు.

తరువాత అహల్యాబాయి కుమారుడు మాళోజిరావు ఇండోర్ రాజయ్యాడు. మామగారు నేర్పిన విద్యల సారం, అనుభవంతో కుమారుని పరిపాలనను పర్యవేక్షించారామె. కొద్ది నెలలలో మాళోజీరావు కూడా మరణించాడు. రాజ్యపాలనా బాధ్యతలను ముఖ్యంగా భావించారు. పుత్రశోకాన్ని మనసులోనే బంధించి దైర్యశాలిగా నిలిచారు.

1767 లో పీష్వా సలహాతో స్వయంగా తానే సింహాసనాన్ని అధిష్ఠించారు. రఘోబా వంటి మరాఠా సర్దార్లు ఒక మహిళ రాజ్యపాలన చేయడం పట్ల అయిష్టత వ్యక్తపరిచారు. అయినా పీష్వా మాధవరావు సలహా, సహకారాలతో పరిపాలించడం మొదలు పెట్టారు. సామంతరాజులు ఆమెకు సహయ సహకారాలను అందించారు. మహిళా సైన్యాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

దారి దోపిడీ దొంగలయిన థగ్గుల బారి నుండి ప్రజలను రక్షించుకున్నారు, దానధర్మాల ద్వారా పేదవారిని ఆదుకున్నారు. కాలువలను, చెఱువులను, బావులను, త్రవ్వించారు. కొత్త కొత్త రోడ్లు వేయించి రహదారులను అభివృద్ధి పరిచారు. దొంగతనాలు, నేరాలు తగ్గాయి.

ప్రజలు భయం లేకుండా జీవించసాగారు. నీతి నియమాలతో న్యాయబద్ధమైన, స్వచ్ఛత గలిగిన పరిపాలనను అందించారు.

చిత్రమేమిటంటే మాళవ సరిహద్దులలో నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయినప్పటికి రాణి యొక్క దౌత్యనీతి, రాజనీతిజ్ఞత, శాంతి కాముకతలతో భూభాగాలని నష్టపోకుండా కాపాడుకున్నారు.

యుద్ధాల ప్రభావం ప్రజలమీద ఇసుమంత కూడా లేదు. యుద్ధాలు, పరిపాలనలో వీరితో మల్హర్ రావు దత్తపుత్రుడు తుకోజీరావు హోల్కర్ బాధ్యతలను పంచుకున్న తీరు ‘నభూతోనభవిష్యతి’. వీరు సర్వసైన్యాధిపతి కూడా!

వీరు రాజధానిని నర్మదానదీ తీర ప్రాంతం మహేశ్వరంకు మార్చారు. మరాఠీ శిల్ప సంప్రదాయంలో అహల్య కోటను నిర్మించారు, మహేశ్వరం నగరాన్ని వీరు అభివృద్ధి చేసిన తీరు అద్వితీయం. వివిధ రంగాలలో ఈ నగరం సాధించిన ప్రగతి అహల్యాబాయి పరిపాలనా చతురతకు నిదర్శనం.

మరాఠా (నల్లరేగడి) నేల మొదటి నుండి ప్రత్తిపంటకు, చేనేత పరిశ్రమకు నిలయం. మహేశ్వరం లోని చేనేత పనివారందరికీ పని కల్పించారు. మహేశ్వరం చీరలు ఈ నాటికీ అందరికీ ఇష్టమైనవే! రాణి అహల్యాబాయి వేసిన పునాదుల మీద సుసంపన్నమై వెలుగుతోంది.

ఇంకా ఈ నగరం శిల్పులు, వివిధ రంగాల కళాకారులు, పండితులకు నిలయంగా మారింది. ఈ రంగాల వారికి ఉద్యోగాలిచ్చి జీతభత్యాలను సమకూర్చారు రాణి. వీరిలో మోరోపంత్ కవి, షాహిర్ అనంత పాండి సంస్కత పండితులు కుషాలిరామ్‌లు ప్రసిద్ధులు.

మరాఠా ప్రాంతపు రాజులు, చక్రవర్తులు హిందూమత పునర్నిర్మాణం కోసం చేసిన కృషి అసామాన్యం. అహల్య వారిని అనుసరించారు. అయితే వారందరి కంటే విస్తతమైన కృషి చేశారామె.

గంగానది మొక్కలి కాశీ విశ్వనాథ్ ఘాట్ వీరు నిర్మించినదే! ఈ నాటికీ ఈ ఘాట్ గంగానది మీద ఘాట్‌లకే తలమానికం. సహజంగా శైవ భక్తురాలు. వందలాది శివాలయాలను, సోమనాథ దేవాలయంతో సహా పునర్మించారు.

ఉత్తరాదిన కాశీ, గయ, సోమనాథ్, అయోధ్య, మధుర, ద్వారక, దక్షిణాదిన కంచి, రామేశ్వరం, పూరీ జగన్నాథ్ మొదలయిన దేవలయాలను పునరుద్ధరించారు, అయితే వీరి పరమత సహనం వీరిని అన్ని మతాలవారికి దగ్గర చేసింది.

ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడం కోసం వ్యవసాయానికి కావలసిన సౌకర్యాలను విస్తృత పరిచారు. వ్యాపారస్తుల కోసం మార్కెట్ సౌకర్యాలను అభివృద్ధి పరచారు. స్థానిక పరిశ్రమలకు కావలసిన మౌలిక వసతులను సమకూర్చారు. వీరి నుండి నేటి పరిపాలకులు నేర్చుకోవలసిన పాఠాలు చాలా వున్నాయి.

వీరు ప్రభుత్వధనమును తన కోసం వాడుకోలేదు. ఆనాటికి వీరికి గల 16 కోట్ల రూపాయలను తమ కోసం వాడుకునేవారు. అంతేకాదు ఈ సొమ్ముతో స్వచ్ఛంద సేవా సంస్థలకు నిధులను సమకూర్చి సేవా కార్యక్రమములను నిర్వహింపజేశారు.

ప్రతి రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేవారు. వారి సమస్యలకు పరిష్కారాలను సూచించేవారు. వీరి పరిపాలనా కాలం ‘ఇండోర్ స్వర్ణయుగం’ లా భాసిల్లింది.

ఒక మహిళగా స్త్రీ సమస్యలు తెలిపిన వారామె. అందువల్ల మహిళా సమస్యల పరిష్కారానికి ప్రముఖ స్థానాన్ని కల్పించారు. స్త్రీలకు, వితంతువులకు భర్త ఆస్తిలో భాగం కల్పిచే చట్టాలు చేసిన సంస్కరణామూర్తి వారు. ఈ విధంగా మహిళల ఆర్థికాభివృద్ధి, ఆర్థిక స్వేచ్ఛ కోసం కృషి సలిపారు.

బ్రిటిష్ తూర్పు ఇండియా సంఘం అప్పుడప్పుడే భారత భూభాగాన్ని కబళించడం మొదలయిన కాలమది. అహల్యాబాయి రాబోయే ఉత్పాతాన్ని ముందే ఊహించారు. బ్రిటిష్ వారు ఎలుగుబంటి వంటివారని వారిని ఎదుర్కోవడం కష్టమని జాగ్రత్తగా ఉండమని ముందే తోటి రాజులను హెచ్చరించారు. అది ఆవిడ సునిశిత పరిశీలనకు తార్కాణం.

వీరు అల్లుడు యశ్వంతరావు మరణించిన తరువాత కుమార్తె ముక్తాబాయి సతీ సహగమనం చేసింది. ఈ సంఘటనతో అహల్య చాలా దుఃఖానికి లోనయ్యారు.

1795 ఆగష్టు 13వ తేదీన ఇండోర్‌లో మరణించారు. తరువాత తుకోజీరావు హోల్కర్ రాజ్యబాధ్యతలను స్వీకరించారు.

జాన్‌కీ వీరిని ‘ది ఫిలాసఫర్ క్వీన్’ అని పిలిచారు.

వీరి జ్ఞాపకార్థం భారత తపాలా శాఖ 1996 ఆగష్టు 25 వ తేదీన రెండు రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. స్టాంపు మిద దీర్ఘవృత్తాకారపు చట్రంలో మరాఠీ శైలి చీరకట్టు, మేలిముసుగు, రాచఠీవితో మెరిసిపోతున్న రాణి అహల్యాబాయి దర్శనమిస్తుంది.

వీరి జయంతి మే 31 వ తేదీ సందర్భంగా ఈ నివాళి.

*** 

Image Courtesy: Internet

Exit mobile version