ది రైన్ గర్ల్

0
2

[శ్రీ కర్లపాలెం హనుమంతరావు రచించిన ‘ది రైన్ గర్ల్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]మా[/dropcap] ఇల్లు మౌనంగా రోదిస్తోంది. నా పరిస్థితీ అందుకు భిన్నంగా లేదు. పొర్లుకొచ్చే దుఃఖాన్ని దిగమింగే ప్రయత్నంలో వున్నాను.. అంతే!

బైట ఉన్నట్లుండి ఉరుములూ.. మెరుపులూ..! అంత దుఃఖంలోనూ నా పెదాల పైన చిరునవ్వు విరిసింది ఒక్క క్షణం! జారిపడే జుత్తును పైకి లాగి రిబ్బనుతో ముడి వేసుకుంటూ పెరట్లోకి పరిగెత్తా.

మా ఇంటికి వెనకే ఓ గున్నమామిడి చెట్టుంది అల్లంత దూరాన కనిపిస్తూ. వానగాలికి దాని కొమ్మలు వూగుతూ నన్ను రారమ్మని పిలుస్తున్నాయి. ఎప్పట్లానే హుషారుగా పరుగెత్తా. కట్టుకున్న పూల పరికిణీ కాళ్ళకడ్డొస్తోంది. ఒక్క క్షణం ఆగా.. పరికిణీ అంచులు పైకెగరకుండా పట్టుకొందామని. బాగా రొప్పొచ్చేసింది. గాలి పోసుకొందామని తల పైకెత్తానా.. మబ్బుల్లో ఓ మెరుపు మెరిసింది. టప్పుమని చినుకొకటి ముక్కు మీద రాలింది. మరో చినుకు చెంపల్ని ముద్దాడింది. ఇంకో చినుకు నుదుటి మీద పడి కిందికి జారింది. చూస్తుండగానే చినుకులన్నీ ఒక్కుమ్మడిగా దాడి చేసాయి. వళ్ళంతా తడిపేస్తూ అల్లరి చేస్తున్నాయి. పిల్లల గోలకు తల్లి మురిసినట్లే వాన చినుకుల అల్లర్లకు నేనూ పరవశించా. పిల్లల్లో పిల్లనై ఉల్లాసంగా వానా వానా వల్లప్పా అని పాడుకుంటూ గిర్రున తిరగటం మొదలుపెట్టా. వర్షంలో అలా నిలువునా తడుస్తూ గిర్రున తిరిగే నన్ను చూస్తే మా నాన్న ఇప్పుడు ఎంత మురిసిపొయ్యేవాడో! ఎప్పట్లా ‘మంచుసోనలో తడిసే గులాబీ పువ్వులా ముద్దొస్తున్నావం’టూ ఏదో కవిత్వం మొదలెట్టేవాడు. నాన్న అలా కవిత్వం చెపుతుంటే భలే ఉండేది. చెప్పనప్పుడూ బానే ఉండేదనుకోండి! నాన్న ఎలా వున్నా నాకు బాగుంటాడు ఎప్పుడూ! మై డాడీ ఈజ్ మై ఫేవరెట్ హీరో!

‘నీ హ్యాపీనే నా హ్యాపీ బంగారూ!’ అని రోజులో ఎన్ని సార్లు అనేవాడో! నాన్నలా కవిత్వాలు చెప్పటం నాకు రాదు కానీ నాన్న హ్యాపీనే నా హ్యాపీ కూడా! కానీ, నాన్న కాసంగతి ఎప్పుడూ చెప్పలేదు.. అమ్మ వింటే హర్టవుతుందని. అమ్మ హర్టయే పని నేను ఎప్పుడూ చెయ్యను.. చెయ్యలేను. కానీ, ఇప్పుడేమయిందీ?

నాన్నను తలుచుకొంటే నాన్న చెప్పే కథోటి గుర్తుకొస్తుంది ముందు. ఆ రోజూ ఇట్లాగే కుండపోతగా వర్షం కురిసింది. వానలో తడిసి అమ్మ చేత చివాట్లు తిన్న తరువాత నాన్న తీరిగ్గా నన్నీ పెరట్లోని పచ్చిక మీద పక్కనే కూర్చోబెట్టుకుని చెప్పిన ఆ కథ ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. నా వాన పిచ్చిని గురించి చెప్పేటప్పుడు ఆయన కళ్ళల్లో మెరిసే ఆ కాంతిని వర్ణించడం నా వల్లయే పనికాదు బాబూ!

‘నీ కప్పుడు పది నెలల వయస్సు బంగారూ. ఇల్లంతా నీ బుడి బుడి నడకలతో యమా సందడిగా వుండేది. నేను ఆఫీసు పనిలో వున్నానా రోజు. అమ్మ స్నానం చేస్తోంది. బైట కురిసే వాన పెద్దదవటంతో ఇంట్లో జల్లు పడకుండా తలుపులేద్దామని హల్లో కొచ్చా. మెయిన్ డోర్ వారగా తెరిచుంది. నీ జాడ లేదు. ఇల్లంతా గాలించాం అమ్మా నేనూ. పావుగంట వెతికినా కనిపించక పోయేసరికి అమ్మ కుప్పకూలిపోయింది. నాకూ కాళ్ళూ చేతులూ ఆడాయి కాదు. పోలీసుల కోసం ఫోన్ చేద్దామని నా గదిలో కెళితే ఏముంది.. అక్కడి కిటికీలో నుంచి కనిపించావ్ నువ్వు.. వానలో నిలువునా తడుస్తూ ఈ గున్న మామిడి చెట్టుకింద కిలకిలా నవ్వుకుంటూ ఆడుకొంటున్నావ్! బిత్తరపోయాం అమ్మా నేనూ. ఆ సంఘటన తరువాత మెయిన్ గేటుకి గ్రిల్ పెట్టిచ్చామనుకో. అయినా ఎప్పటి కప్పుడు ఏదో బెంగ అమ్మకు.. నీ వాన పిచ్చితో ఏం తంటాలే తెచ్చిపెడతావోనని. కానీ నా కయితే వానతో నీకున్న అనుబంధం అర్థమయిందిలే. వర్షంలో తడిసేటప్పుడు నువ్వు పొందే ఆనందం విడదీయలేనిదని తెలిసిపోయింది. అందుకే నిన్ను ‘రెయిన్ గర్ల్’ అని ముద్దుగా పిలుచుకొనేది బంగారూ!’

ఆ కథ ఇప్పుడు గుర్తుకొచ్చింది. కన్నీరు కట్టలు తెంచుకొంది. ‘కన్నీళ్ళు మన బలహీనతకు సంకేతం’ అనేవాడు నాన్న.

మనిషన్న వాడు ఏడవకుండా ఎలా ఉంటాడు? ఎంత ఉగ్గబట్టినా ఎప్పుడో ఒకప్పుడు కళ్ళు తడవకుండా ఉండవు కదా!

‘అయినా సరే.. కంట నీరు పెడుతూ నలుగురి కంటపడకూడదురా. అంత ఆపుకోలేనంత దుఃఖమే ముంచుకొస్తే.. నీకు ఆనందమిచ్చే చోటుకి పారిపో!’ అంటూ సుతారంగా నా ముక్కు కొసను పట్టుకొని అటూ ఇటూ వూపేవాడు.

నాన్నతో వుంటే ఎంత లావు దుఃఖానికైనా నా దగ్గరకొచ్చే ధైర్యమేదీ! ఆ మాటే నాకు తెలిసిన మాటల్లో అంటే ‘అందుకేగా నేను ఎప్పటికీ నా రెయిన్ గర్ల్‌ని వదిలి పెట్టి పోను’ అని బిగ్గరగా నవ్వేసేవాడు. ‘ఎప్పటికీ’ అన్న మాట అంతరార్థం అంత లేత వయసులో అర్థమవలే. కానీ, ‘ఎల్లప్పటికీ’ అన్న గూఢార్థంలో నాన్న ఆ మాట అన్నాడని ఇప్పుడు అర్థమవుతోంది. మనిషెప్పుడూ ఓ చెట్టో పుట్టో రాయో రప్పో కాలేడు.. వాటిలాగా అమరత్వం వాడికి సాధ్యం కాదు!

అప్రయత్నంగా నా దృష్టి ఎదుటి గున్న మామిడి చెట్టు మీద పడ్డది. ఈ నా నేస్తం ఎప్పట్నుంచీ ఇక్కడున్నదో.. ఎప్పటిదాకా ఇక్కడుంటుందో.. నాకు తెలుసా? అసలెవరికైనా తెలుసా? ఎవరో మా ముత్తాత నాటాడుట ఈ చెట్టు మొలకను.. నాన్న చెప్పేవాడు. ఎప్పుడు నాటాడో తనూ చెప్పలేదు. చెప్పలేడేమో కూడా!

నా కాళ్ళు తేలిపోతున్నాయి. వంటి బరువు తగ్గిపోతూ వుంది. ఈ పచ్చికనూ మైదానాన్నీ ఇంటినీ వదలి పోవాలని లేదు. కానీ నా రెక్కలు పట్టుకొని పైకి గుంజేస్తున్నారే.. ఎవరో! ఆపటం నా తరం కావటం లేదే!

ఏడుపు తన్నుకొచ్చింది. నా దుఃఖాన్ని తరమడానికి నాన్న గాని వస్తాడేమో! అని ఆశ పడ్డా.. రాడని… రాలేడని తెలిసి కూడా!

నేను ఏడవటం ఎవ్వరూ చూడకూడదు. అందుకే ఇంట్లో నుంచి బైటికిలా పరుగెత్తు కొచ్చింది. నాన్న చెప్పాడుగా.. దుఃఖం ముంచుకొస్తే ఆనందమిచ్చే చోటికి వెళ్ళిపోవాలని. అందుకే ఇల్లు పెరట్లోని ఈ పచ్చిక మైదానంలో కొచ్చి పడింది.

నా వెనక అడుగులచప్పుడయింది. ఎవరో నా వైపుకే నడిచి వస్తున్నట్లనిపించింది.

నాన్న కాదుగదా ఆ వచ్చేదీ?.. ఎందుకేడుస్తున్నావని కోప్పడటానికి కాదుగదా!

నా అనుమానం నిజమే అయింది! నాన్నే! కంటపడగానే నన్ను ఉత్తేజ పరిచే నాన్న ఉనికే అది!

ఆశ్చర్యం! ఆయన ఏడుస్తున్నాడు.. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు నా హీరో!

ఏడుపు తన్నుకొస్తే ఎవరికంటా పడకుండా ఏకాంతంలోకి పారిపొమ్మనేవాడు కదా నాన్న! ఏడ్చేందుకేనా నాన్న ఇట్లా ఎవరూ చూడకుండా పెరట్లోకి పారిపోయొచ్చిందీ!

కాని తను ఏకాంతంలో లేడుగా. నేను పక్కనే నిలబడున్నానుగా. నాన్నకే ఆ సంగతి తెలీదు!

నాన్న కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ‘నిన్నొదిలి నేనెక్కడికీ వెళ్ళనన్నాగా! ఎందుకింతలో తొందర పడ్డావ్ బంగారం! నువ్వు లేకుండా నేను మాత్రం ఇక్కడుండ గలనా?’ భోరుమన్నాడు నా ధీరోదాత్తుడు నాన్న! ‘నన్నూ నీతో రానివ్వరా నీకు తోడుంటా ఎప్పటిలాగా!’

నాన్ననట్లా చూసి నా గుండె బద్దలయింది. వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నా తన భుజం మీద నా తల వాల్చుకొని. కానీ నాన్న కివేమీ పట్టినట్లు లేదు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు. ‘బేబీ! ఐ లవ్ యూ! ఐ లవ్ యూ రా నా కన్నా!..’

నేనూ అన్నా తన చెవిలో రహస్యంగా.. ‘ఐ టూ లవ్ యూ నాన్నా! ఐ లవ్ యూ డియర్ డాడ్! ఐ యామ్ హ్యాపీ.. ఐ యామ్ వెరీ హ్యాపీ టూ సీ యూ.. ఎలైవ్!’

పొద్దున మార్నింగ్ వాక్ కని వెళ్ళినప్పుడు జరిగిన బైక్ యాక్సిడెంట్లో తను కాకుండా నేను ‘పోయినందుకు’.. ఎంతా హ్యాపీగా ఉందో నాకు! నాన్న కెలా నేను చెప్పటం నా ఫీలింగ్స్? అవును, పోయినోళ్ళ మాటలు బ్రతికివున్న వాళ్ళకు వినిపిస్తాయా.. నా పిచ్చి గానీ!

నాన్నకు ఇప్పుడు బాధగానే ఉంటుంది కానీ, కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది తను లేని ఇల్లు ఎలా ఉంటుందో? నాన్నకు నీడలా మసిలే అమ్మ, నాన్న తోడు లేకుండా క్షణమైనా సంతోషంగా ఉండగలదా? మాటలింకా రాని ఏడాది పసివాడు తమ్ముడు చందుకీ నాకులాగా నాన్న ప్రేమ దక్కాలిగా? నాయనమ్మకు నాన్నే సర్వస్వం. హుషారుగా బైటికెళ్ళినకొడుకు నిర్జీవిగా తిరిగింటికొస్తే ఆ ముసలి ప్రాణం తట్టుకోగలిగుండేదా?

నాన్న లేని ఇల్లు నరకం. నాన్న ఉంటేనే ఇల్లు స్వర్గం. నా ఇల్లు నరకంలాగా తయారైతే నేను మాత్రం తట్టుకోగలనా.. నేను ఎక్కడున్నా!

నావాళ్ళకు నేను దూరమయినందుకు దుఃఖంగానే ఉంది! ఆపుకోలేనంతగా ఏడుపొస్తోంది కూడా. మన బాధ బైటవాళ్ళకు తెలీకుండా ఇష్టమైన చోటుకు వెళ్ళిపొమ్మన్నాడుగా నాన్న!

పుట్టినప్పట్నుంచీ నాకీ ‘వర్షం’ అంటే చచ్చే ప్రేమ. చచ్చిపోతే మాత్రం ఈ పిచ్చి ప్రేమ చచ్చిపోతుందా?

కుండపోతగా వర్షం ఎలాగూ కురుస్తూనే వుంది.. నా కోసమే అన్నట్లుగా! నాన్న చెప్పినట్లే నేనింక ఈ చినుకుల్లో చినుకుగా మారి కనుమరుగయిపోతే సరి!

వర్షం కురిసినప్పుడెలాగూ నాన్న ఈ ‘రెయిన్ గర్ల్’ని తలవకుండా ఉండడు. నేనింక నాన్నకీ ఈ ఇంటికి దూరమయిందెక్కడా!

గాలికి ఊగే నా చిన్ననాటి మిత్రుడు గున్న మామిడి చెట్టుకీ టాటా బైబై చెప్పేసా. వానగాలితో కలిసి వెళ్ళిపోతున్నానిక.. నాన్న నుదుటి మీద నా చివరి ముద్దు అద్దేసి!

తెల్లారి మళ్ళా తూర్పు దిక్కు నుంచి నా ఇంటి ముంగిటిలోకి తొంగి చూస్తాలే ఉషా కిరణంగా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here