[dropcap]ఒ[/dropcap]క చిత్రానికి మొట్ట మొదట కావాలసింది ప్రేక్షకులను సాంతం చూసేలా చెయ్యగలగడం. ఇక అలా ఆకట్టుకోగలిగితే ముఖ్యమైన పరీక్ష పాసయినట్టే. ఎందుకంటే ఆ తర్వాతే కథా, తీసిన తీరూ మిగతావన్నీ చర్చలోకి వస్తాయి. ఎంత గొప్ప కథ అయినా సగంలో వదిలేసి ప్రేక్షకుడు వెళ్ళిపోయినా, లేదా థియేటర్‌లో వుంటే చేతిలోకి మొబైల్ తీసుకున్నా పరీక్ష తప్పినట్టే. ఇది సస్పెన్స్ చిత్రాలకైతే మరీ ముఖ్యం.
ఈ వారం నేను చూసిన (చాలా చెత్త చిత్రాలు చూసాక చూసానిది) “ద సలోన్” ఆ పరీక్ష పాసైంది.
రోడ్డు మీద ఒకతను వెళ్తున్నాడు. పొడగరి. నీలం చొక్కా, నల్ల పేంట్, పెరిగిన గడ్డం, భుజాల దాకా పెరిగిన వెంట్రుకలు. ఒక సలూన్ షట్టర్ సగం తీసి వుంది. దగ్గరికెళ్ళి వంగి చూస్తాడు. లోపల ఓ మనిషి ఏదో బస్తాని అవతలి రూం లోకి ఈడ్చుకెళ్తుంటాడు. ఇతను లోపలికెళ్తాడు. హెలో, హెలో అని కేకేస్తాడు. కాసేపటి తర్వాత వెనుక వైపు తలుపు తీసుకుని వస్తాడు ఆ మనిషి. టీ షర్ట్, నల్ల పేంటు, తల గుండు. రావడమే కోపంగా ఎవరయ్యా నువ్వూ దూసుకొస్తున్నావు, షట్టర్ బంద్ అని చూసి కూడా వచ్చావే అని కోప్పడతాడు. తనకు అర్జంటుగా గడ్డం గీయమంటాడు, రెట్టింపు డబ్బిస్తానంటాడు. ఈ రోజు సోమవారం, నేను రేజర్ ముట్టను అంటాడు. చివరికి 150/- ఇస్తానంటే, 200/- అయితే చేస్తానంటాడు. కస్టమర్ కూర్చుంటాడు. మగలి ముందు ఫోం, తర్వాత నీళ్ళ స్ప్రే, తర్వాత రేజర్ ఇలా వొక్కొక్కటీ వెతికి తీస్తుంటాడు. కస్టమర్ తన ముందు వున్న టూ ఇన్ వన్ ఆన్ చేయబోతే మంగలి కసురుకుంటాడు రువాబుగా. మళ్ళీ దేనికో అవతలి గదిలోకెళ్తే, కస్టమర్ రేడియో ఆన్ చేస్తాడు. ఏదో ఆడియో కథ వస్తున్నది. ఇద్దరు అక్క చెల్లెళ్ళ గురించి. (టీవీ రోజుల్లో రేడియోనా అని అడగకండి, కథకు అవసరం.) మంగలి మళ్ళీ కసురుకుంటాడు. నెమ్మదిగా గడ్డం గీయడం మొదలు పెడతాడు.
తర్వాత ఏమవుతుందో మీరు యూట్యూబ్ లో చూడండి. 22 నిముషాల చిత్రం. మొదటి పరీక్షలో నెగ్గిన ఈ చిత్రం చివరిలో కూడా అవును కదా అనిపించేలా చేస్తుంది. దర్శకత్వం, నటనా, చాయా గ్రహణం (అర్చిత్ జైన్, వినయ్ వర్మ), నేపథ్య సంగీతం (జాయ్ రాహా) అన్నీ బాగున్నాయి. ఇంతకంటే ఎక్కువ చర్చించడానికి సస్పెన్స్ అడ్డు వస్తుంది. దర్శకుడు బీరేన్. కథ అతనూ, ఓంకార్ కలిసి వ్రాసారు. ఇద్దరు నటులు బీరేన్, కె కె గౌతం. ఒకే గదిలో షూట్. సంభాషణలు ఎక్కువ. అయితే కథ డీటైలింగ్ కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇలాంటిదే వొక చిత్రం హిందీలో వచ్చింది. రాజేష్ ఖన్నా, నందా లు నటించినది. “ఇత్తెఫాక్” దాని పేరు. అది ఒక గది కాదు గాని ఒక పెద్ద బంగళాలో షూట్ చేసారు. కథ మొదలు ఇలాంటిదే. కాని మూల స్వభావం వేరు.
చూడమనే నా రెకమెండేషన్.
యూట్యూబ్ లింక్:
https://www.youtube.com/watch?v=493mFwQia6s