Site icon Sanchika

కుదిపివేసే మౌనం “The silence of the drongos”

[box type=’note’ fontsize=’16’] “ఈ చిత్రం బలంగా చెప్పేది వొక్కటే మౌనంగా దేన్నీ సహించకుండా గళం విప్పాలి అని” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ” ది సైలెన్స్” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ప[/dropcap]చ్చటి కొండల నడుమ పెద్ద అందమైన సరస్సు. దానికి వో హార్ట్ ఆకారాన్నిస్తూ కొంత భూభాగం సన్నని దారిలా మధ్యలో కొంతవరకు సరస్సులోకి వెళ్తుంది. చాలా వాటికి అది సాక్షి. చిన్న పిల్ల అయిన చిన్ని అక్కడే వెళ్ళి నుంచుని మౌనంగా మనసులోనే యేడుస్తుంది. అక్కడే తండ్రీ కూతుళ్ళు కూర్చుని తమ గోడును వెళ్ళబోసుకుంటారు. అక్కడే తండ్రి, వెనుక అతని ఆర్థిక దారిద్ర్యాన్ని సూచించే సైకిలుతో, నిలబడి వెక్కి వెక్కి యేడుస్తాడు. కోకిలల స్వరాలు గాలుల్లో తేలియాడే ఆ పచ్చదనాల మధ్య ఈ కుటుంబం వ్యథ దేని గురించి?

మన అందరికీ తెలిసిన విషయమే. తెలిసినా మౌనం వహించే విషయమే. అది స్త్రీల, ముఖ్యంగా చిన్న పిల్లల లైంగిక దోపిడి. చాలా సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి, ఇలాంటి అత్యాచారాల్లో చాలా వరకు కుటుంబంలోనే, తెలిసిన వారి లేదా కుటుంబసభ్యుల చేతనే జరుగుతాయి. అయినా “పరువు” పేరు మీద మౌనమే వహిస్తారు. అందుకే చిత్రం పేరు కూడా మూర్ఖులు వహించే మౌనం అయ్యింది.

మొదటిసారి ముంబైలో అడుగు పెట్టిన అత్త (అంజలి పాటిల్) తన కథ చెప్పడం మొదలు పెడుతుంది. తన కథతో పాటే చిన్ని కథ కూడా. తన భర్త (నాగరాజ్ మంజులే – సైరాట్ దర్శకుడు) మేనకోడళ్లను – మందా (కాదంబరి కదం), చిన్ని (ముగ్ధా చాఫేకర్) లను చూడటానికి వెళ్తోంది. అయితే కథనం సరళ రేఖలా వుండదు. షఫల్ చేసిన పేకముక్కల పేరులా వుంటుంది. ముందుకీ వెనక్కీ కదులుతూ. అదీ వొక పధ్ధతి ప్రకారం. చిన్ని చిన్న పిల్లగా (వేదశ్రీ మహాజన్) తండ్రి (రఘువీర్ యాదవ్)తో మహారాష్ట్రలోని వో మారుమూల కుగ్రామంలో వుంటుంది. తండ్రి సైకిల్ మీద తిరుగుతూ పీచు మిఠాయి అమ్ముతుంటాడు. అందుకే అతని పేరు కూడా, వొకోసారి యెగతాళిగా, పీచుమిఠాయి అయిపోతుంది. భార్య ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత హృదయంలో బెజ్జం (congenital heart defect) వుండడంతో చనిపోతుంది. పెద్ద కూతురు మందా ని వాళ్ళ మామ ముంబాయిలో జూనియర్ ఆర్టిస్ట్ పనిలో పెట్టిస్తానని తీసుకెళ్తాడు. ఇప్పుడు చిన్ని కూడా పెద్దమనిషవడంతో అతనికి తన బావమరిది సాయం తీసుకోవాల్సి వస్తుంది. ముందే మామ (ఈ చిత్రంలో చాలా పాత్రలకు పేర్లు లేవు, సామాన్యీకరణ కోసం కావచ్చు) స్త్రీలోలుడు, భార్యను హింసించే వాడూను. అతనొచ్చి బావకు మటను, విదేశీ మద్యం, అమ్మాయికి గౌను ఇచ్చి అమ్మాయిని తన వూరుకు తీసుకెళ్తాడు. అక్కడ ఆమెను బలాత్కరిస్తాడు. ఇంటికి పోవాలని పట్టుబడితే తీసుకొచ్చాను అని చిన్నిని తండ్రి దగ్గరికి తిరిగి వదిలి వెళ్తాడు. అప్పట్నుంచీ పూర్తిగా మౌనం దాల్చిన ఆ చిన్నారిని తండ్రి అర్థం చేసుకోలేకపోతాడు, దిగులు పడతాడు. తర్వాత విషయం తెలిసిన తర్వాత మందా కేసు పెడుతుంది. కాని సరైన సాక్ష్యాలు లేక అతనికి శిక్ష పడదు. కాని అతనికి శిక్ష అతని భార్యే ఇస్తుంది – రెండు విధాలుగా. తండ్రి కాగల అవకాశం లేని అతని ముందు తన ప్రెగ్నెన్సి రెపోర్ట్ ఇచ్చి, “చూడు నన్ను గొడ్రాలన్నావు కదా, నేను తల్లిని కాగలను, అవుతాను కూడా” అంటుంది. తర్వాత అతన్ని కొడవలితో చంపేస్తుంది. జైలు గడువు పూర్తి అయ్యాకే తన కూతురిని కలుస్తుంది. మరో పక్క చిన్ని వో ముంబాయి లోకల్ లో వో మనిషి ఒక అమ్మాయిని బలాత్కారం చేసి నడుస్తున్న రైలు నుంచి బయటకు విసిరేయడం చూస్తుంది. తన మనసులో గూడుకట్టుకున్న బాధ ఆమెను వెంటాడుతూ వుంటే కనీసం ఆ చనిపోయిన అమ్మాయికైనా న్యాయం దక్కాలని పోలీసు స్టేషన్లో స్టేట్మెంట్ నమోదు చేయడానికి వెళ్తుంది.

ఈ చిత్రం వొక నిజ సంఘటన ఆధారంగా తీసింది. రఘువీర్ యాదవ్, అంజలి పాటిల్‌లు (వీళ్ళు “న్యూటన్”లో కూడా వున్నారు) బాగా నటించారు. చిన్నిగా చేసిన ఇద్దరూ, మందాగా చేసిన అమ్మాయీ బాగా చేశారు. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నాగరాజ్ మంజులే నటన. తన బాడీ లేంగ్వేజితో సహా ఆ పాత్రలో జీవించాడు. దర్శకుడుగా అతని సత్తా మనం సైరాట్ లో చూశాము. అవసరమైన సైలెన్సెస్ వాడుతూ ఇండియన్ ఓషన్ మంచి నేపథ్య సంగీతమిచ్చారు. కృష్ణ సోరెన్ చాయాగ్రహణం చాలా బాగుంది. వొకోసారి అంత అందాన్ని చూడటం కష్టమనిపిస్తుంది, యెందుకంటే కథ ఆడపిల్లల లైంగిక శోషణ కథకు అది అడ్డం పడుతుందేమో అనిపిస్తుంది. అయినా అందంగా వుందనే అంటాను యెందుకంటే చాలా విషయాలు మాటలతో కాక దృశ్యాలతోనే మనముందుకొస్తుంది కథ.

అత్త ఆ వివాహంలో, ఆ ఇంట్లో బందీ. హింసించే భర్త. యెవరికీ చెప్పుకోలేక యెక్కువ భాగం మౌనమే. ఆమెను మొదట్లో కిటికీ బయటి నుంచే ప్రతిసారీ చూపిస్తాడు. బాల్కనీలో చూపించాల్సినప్పుడు కూడా వూచల గోడకు ఆనుకుని కూర్చున్నట్టు చూపిస్తాడు. ఆ వంటింటి కిటికీ బయటినుంచి యేడుస్తున్న పాప స్వరం వినిపిస్తుంది. భర్తలో లోపం వుందని తెలుసు. ఆ వొంటరి నిస్సహాయతలో కనీసం పిల్లలున్నా మనసు మరలేది ఆమెకు. ఆమె చివర్న స్వేచ్చను అనుభవించినపుడు నేరుగా ఆకాశాన్ని, చుట్టుపక్కల పచ్చదనాలనీ చూస్తుంది. తన మౌనం వీడడం కూడా భర్త ముందు తన ప్రెగ్నెన్సి రిపోర్ట్ ఇవ్వడంతో చేస్తుంది. ఇది 80ల లో వచ్చిన భబేంద్రనాథ్ సైకియా అసామియా చిత్రం “అగ్నిస్నాన్” ను గుర్తుచేస్తుంది. చిన్న చిన్ని పెద్దమనిషైనపుడు సన్నివేశం చూడండి. రాత్రివేళ. తలుపు తెరిచి ఆరుబయట నులక మంచం మీద పడుకున్న తండ్రిని భయం భయంగా అయోమయంగా పిలుస్తుంది. ఆ సన్నివేశం అంతే. ఇక ఆ పాప పచ్చని పైర్లను మెరుస్తున్న కళ్ళతో చూస్తూ, బస్సులో కిటికీ బయట కూర్చుని, సంబరంగా మామయ్య వూరు వెళ్తుంది. అదే తిరుగు ప్రయాణంలో ఆమె కళ్ళు దిగులుగా, భయంగా, వుంటాయి. మిగతా షాట్ కంపోజిషన్‌లో మార్పు వుండదు. మామయ్య ఇప్పించిన వో బొమ్మతో ఆడుకుంటూ వుంటున్న వేళ తను అత్యాచారానికి గురవుతుంది. ఆ బొమ్మ చేసే చప్పుడు మాత్రం యెప్పుడూ వెంటాడుతుంది ఆమెను. నిద్దట్లో కూడా అది గుర్తుకొస్తే పక్క తడుపుకుంటుంది. (నిజ జీవితంలో ఆ మనిషి తర్వాత పెళ్ళి చేసుకున్నా వాళ్ళ సెక్సు జీవితం వ్యథాభరితమే, కాని వుండాల్సిన సహజానందం వుండదు అందులో). పెద్దయ్యాక ఆ చిన్ని తన ఖైదు నుంచి తను విదుదలయ్యేది తను చూసిన అత్యాచారాన్ని పోలీసులకు తెలియజేసి ఫిర్యాదు నమోదు చేయించడం ద్వారా. ఇక సోరెన్ ఇందులో దిజాల్వ్స్ లేదా fade-in fade-outలు బాగా వాడాడు. అత్యాచారానికి గురైన పాప అర్ధరాత్రి అత్తతో నొప్పి అంటుంది. అవతలికి తీసుకెళ్ళి అత్త పాప గౌను యెత్తి చూస్తుంది. ఇది డిజాల్వ్ (dissolve) అయ్యే సీనులో ఆ వంట గదిని బయటి నుంచి చిత్రీకరించడం. తెరమీద మూడు భాగాల్లో మొదటి చివరి భాగాలు చీకటి కప్పిన గోడ అయితే, మధ్యభాగంలో వెలుతురులో వంటగది, కిటికీ వూచల దగ్గర అటు తిరిగి నిలబడి వున్న అత్త, ఫోర్గ్రౌండ్‌లో మోకాళ్ళమధ్య తల దూర్చి కూర్చున్న పాప. మరో డిజాల్వ్ తర్వాత అదే కంపోజిషన్, కేవలం ఈ సారి అత్తా పాపా ఫోర్గ్రౌండ్‌లో నిస్సహాయత్వాన్ని వెలిబుస్తూ కూర్చుని వుంటారు. ఇలా చిత్రం మొత్తం ఆ దృశ్య భాషతోనే సంభాషణ. ఇక నాగరాజ్ నటన గురించి రెండు సన్నివేశాలు తలచుకుందాం. పిల్లలు కలగట్లేదంటే ఆమెలోనే లోపం వుంది, లోకం మాత్రం తననే శంకిస్తోంది అని కోపంగా అని భార్యను చెంపల మీద యెడాపెడా వాయించేస్తూ బలాత్కారం చేయబోతాడు. మొద్దులా వున్న ఆమెలో యెలాంటి స్పందనా లేకపోతే లేచి కూర్చుంటాడు. కంట్లో నలకే పడిందో, కన్నీటి చుక్కే చేరిందో బొటను వేలితో కంటికొలకలు తుడుచుకుంటాడు, ముక్కు యెగబీలుస్తాడు, తర్వామ మూతిని తుడుచుకుంటాడు తన కోపాన్ని, అవమానాన్ని, బలహీనతనీ దిగమింగుతూ. మరోసారి చిన్నిని బావ దగ్గర విడిచి పెట్టాక రాత్రి తిరిగి వెళ్తూ అతని చేతికి కొంత రొక్కమిచ్చి, సేండల్స్ వేసుకుని, చేతులు దులుపుకొని, చిన్నగా వుమ్మి నడుచుకుంటూ ఆ ఫ్రేం నుంచి నిష్క్రమిస్తాడు. ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి సంగతులు.

మీకు గుర్తుంటే నాగేష్ కుకునూర్ చిత్రం “లక్ష్మి” కూడా ఆడపిల్లల ట్రాఫికింగ్ గురించే. అది భయంకరంగా డిస్టబ్ చేస్తుంది. ఇది మాత్రం చాలా మెత్తగా చెబుతుంది కథను. ప్రభావం విషయంలో లక్ష్మి చిత్రానిదే పై చేయి. అయితే ఈ చిత్రం బలంగా చెప్పేది వొక్కటే మౌనంగా దేన్నీ సహించకుండా గళం విప్పాలి అని. యెందుకంటే మౌనం అత్యాచారాలు చేసేవారికి ప్రోత్సాహమే అవుతుంది గనుక.

Exit mobile version