గోధే నవల ‘ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్థెర్’
[dropcap]1[/dropcap]774లో గోధే రాసిన నవల ‘ది సారోస్ ఆఫ్ యంగ్ వెర్థెర్’. జర్మన్ సాహిత్యంలో ఈ నవలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని పుస్తకాలు మనుష్యుల ఆలోచనలను స్థంబింపచేస్తాయి. మన ఆలోచనలు, అనుభవాలు ఎంత అల్పమైనవో, మనం నిజం అనుకున్న నమ్మకాలు ఎంత పేలవమైనవో తేల్చిపారేసే శక్తి పదునైన నిజాయితీ గల రచనలో ఉంటుంది. అలాంటివి చదివి తట్టుకోవడం చాలా కష్టం. ఒక పుస్తకం దేశంలో ఎంతో మందిని ఆత్మహత్యలకు కారణమయ్యింది అని వింటే ప్రస్తుతం మనం నమ్మలేం. కాని ఈ పుస్తకం చెసినది అదే. దీని ప్రభావంలో కారణంగా దేశంలో జరుతున్న అత్మహత్యలను నివారించడానికి జర్మనీ, ఇటలీ, నెధర్లాండ్స్‌లో ఈ పుస్తకాన్ని బాన్ చెసారు. అలా అని ఈ పుస్తకాన్ని తక్కువచేసి చూడలేం. ప్రపంచ సాహిత్యంలో అతి గొప్ప నవలలో ఇది తప్పకుండా ఒకటి. ఇందులో వర్థర్ పాత్ర ద్వారా ప్రేమ రాహిత్యం కలిగించే బాధను, తాను పొందలేని జీవితాన్ని అది మిగిల్చిన దుఖాన్ని తట్టుకోలేక మథనపడే హృదయవేదనను నిజాయితీగా రచయిత మన ముందుకు తెస్తారు. చివరకు గత్యంతరం లేని పరిస్థితిలోనే వర్థర్ ఆత్మహత్య చేసుకుంటాడు. ఆతను దానికి ముందు పడిన మానసిన నరకానికి ఇది సరిఅయిన ముగింపే అనిపించినట్లున్న ఈ ముగింపు మనలను చాలా రోజులు వెంటాడుతుంది. ప్రపంచంలోని హిపోక్రసీని మనిషి సుఖపడడానికి ప్రతి నిముషం తనను తాను మోసం చేసుకునే విధానాన్ని, అలా బ్రతకలేని నిజాయితీపరుడి వేదనను మనం పతి అక్షరంలో అనుభవిస్తాం. వర్థర్ బాధతో ప్రయాణిస్తాం.
ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. కాని ఈ ప్రపంచంలో మనిషికి ప్రేమను ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ బ్రతికే అవకాశం ఎంత వుందో నిజాయితీగా ఆలోచిస్తే మన చుట్టూ ప్రపంచంలో మలినం మనలను వెంటాడుతూ కనిపిస్తుంది. ఈ ప్రపంచాన్ని ఇలా స్వీకరించలేక, దానితో రాజీపడలేక మథనపడే హృధయాల వేదనను అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలోని కుళ్ళుకు మనం తోడ్పడకుండా కనీసం మనవంతు ప్రయత్నం చేయగలిగే మనుష్యులుగానన్నా మనం మిగిలి పోతాం. మనల్ని మనం అలా కాపాడుకోవడానికి ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. వర్థర్ అనుభవించిన వేదనను అర్థం చేసుకోవాలి. ఆత్మహత్య వ్యక్తిగత నిర్ణయం అయినా దానికి ప్రేరేపించే సామాజిక కారణాలు ఎన్నో. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నానికి ఈ పుస్తకం గొప్పగా తోడ్పడుతుంది. కొందరికి ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేని స్థితి ఎందుకు కలుగుతుందో ఆలోచించవలసిన అవసరం జీవితం గొప్ప వరం అని నమ్మే మన అందరిదీ.
ఈ నవలలో వర్థర్ ఒక వివాహితను ప్రేమిస్తాడు. ఆమె పై తన ప్రేమను చంపుకోలేక, ఆమెను పొందలేక, తన ప్రేమలోని నిజాయితీని వదులుకోలేక, ఆమె భర్త పట్ల గౌరవాభిమానాలకు దూరం కాలేక నలిగిపోతాడు. చివరకు పిస్తోలు పేల్చుకుని చనిపోతాడు. ఈ నిర్ణయానికి రావడానికి అతను పడే బాధ ప్రతి అక్షరంలో కనిపిస్తుంది. తన వేదనను ఒక డైరీ రూపంలో రాసుకుంటాడు. వర్థర్ ఒక సున్నిత మనస్కుడు, చిత్రకారుడు. సమాజంలో హిపోక్రసికి అలవాటుపడలేక నలిగిపోతూ ఉంటాడు. అతని మనసుకు అతి దగ్గరగా వచ్చిన ఏకైక యువతి చార్లెట్. ఆమెను వర్థర్ కలిసినప్పటికే ఆమె పెళ్ళి నిశ్చయమయి ఉంటుంది. ఆమె తన కాబోయే భర్తను ప్రేమిస్తుంది. అది తెలుసుకుని వర్థర్ ఆమెకు తానొక సమస్య కాకూడదని ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళి పోతాడు. కాని అక్కడి మనుష్యులతో కలవలేకపోతాడు. ప్రతి ఒక్కరిలో స్వార్థం, మోసం, కపట స్వభావం కనిపిస్తూ ఇంకా బాధపెడతాయి. వారి మధ్య ఒంటరిగా ఉండలేక, తనకు మనశ్శాంతి ఇవ్వగల స్నేహితురాలి సాంగత్యం కోసం మళ్ళీ ఆమె వద్దకు వెళతాడు కాని అప్పటికే ఆమెకు వివాహం అవుతుంది. ఆమె ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ప్రేమ అనే అద్భుతమైన భావనకూడా తనకు ఆనందాన్ని బదులు బాధను తీసుకొని రావడం అతన్ని తీవ్ర వేదనకు గురి చేస్తుంది. జీవించడానికి మరో ఆధారం లేక పూర్తిగా ఒంటరి అవుతాడు వర్థర్. ఎవరితో కలవలేక జీవితాన్ని ప్రేమించలేక ఆత్మహత్య తప్ప మరో దారి అతనికి కనపడదు. దానికోసం చార్లెట్ భర్త వద్ద తుపాకి తీసుకుని ప్రాణం తీసుకుంటాడు.
ఇప్పుడు డిప్రెషన్ అని మనం పిలిచే మానసిన స్థితిలో ఒక మనిషి పడే నరకానికి అప్పట్లోనే రచయిత అక్షరబద్దం చేయగలిగారు. వర్థర్ బాధ మన బాధ అవుతుంది. మానవ సంబంధాలలోని డొల్లతనాన్ని వర్థర్ ప్రశ్నిస్తుంటే వాటికి జవాబులు దొరకవు. ఆత్మహత్యని తనను సృష్టించిన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళిపోవడం అని వర్థర్ అన్నప్పుడు నిజమే అనిపించకమానదు. సమాజంలో శాంతి లేక తిరిగి గర్భంలోకి వెళ్ళిపోవడమే ఆత్మహత్య అంటాడు వర్థర్. నువ్వు తప్ప నాకింకెవ్వరూ లేరు అని భగవంతునితో చెప్పుకోవడమే ఆత్మహత్యకి అర్థం అతని దృష్టిలో. అపరిచితుల మధ్య నుండి ఒక బిడ్డ తండ్రి వద్దకు తిరిగి వెళ్లడమే ఆత్మహత్య. ఇలాంటి చాలా వాక్యాలు ప్రపంచానికి అర్థం కాని, ప్రపంచం అర్థం చేసుకోవడానికి సిద్దపడని సున్నిత మనస్కుల బాధను వ్యక్తపరుస్తాయి. ప్రపంచంలోని నాటకీయత, స్వార్థం, ఆలోచించగలిగే వ్యక్తులను సమాజం నుండి, సమూహం నుండి, జీవితం నుండి ఎలా దూరం చేయగలవో అర్థం అవడానికి ఈ పుస్తకం చదవాలి. వర్థర్‌లో ఒక మేధావి కనిపిస్తాడు. తనకు ఎదురయ్యే మనిష్యులలోని స్వార్ధాన్ని, బ్రతకనేర్చిన తనాన్ని స్పష్టంగా వారి లోనుండి చొచ్చుకుపోయి చూడగలిగే శక్తి అతనికి ఉంది. అందుకే తన చుట్టు ఉన్న వారి తీయటి మాటలు వారి అంతరంగ ఆలోచనల మధ్య సమన్వయం లేకపోవడం చూసి తట్టుకోలేడు. ఇంత పెద్ద మోసపూరిత వాతావరణం లో ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. దొరికిన ఒక్క నేస్తం తన జీవితంలోకి రాలేదు. మరెక్కడా అతనికి తృప్తి లేదు.
డిప్రెషన్‌లో కొట్టుకుపోతున్న వ్యక్తి మనసులోని బాధను ఇంత గొప్పగా వ్యక్తీకరించడానికి ఇందులో చాలా వరకు రచయిత సొంత జీవిత చిహ్నాలు ఉండడం కారణం కావచ్చు. తన మనసుకు తృప్తి ఇవ్వలేని జీవితాన్ని జీవించడం తనకు చేతకాదు అంటాడు వర్థర్. ఈ జీవితం అనే ఆట ఆడలేకపోతున్నానని బాధపడతాడు. ప్రతి సూర్యోదయాన్ని చూస్తూ ఇంత అందాన్ని ఈ మనుష్యులు తమ క్రూరత్వంతో నాశనం చేస్తారు మరోసారి అని బాధపడతాడు. చాలా గొప్పగా ప్రతి పవిత్రమైన దాన్ని పాడుచేయగల ఈ మనవ సమాజ సమర్ధత పై అతనికి ఎన్నో ప్రశ్నలు. ప్రపంచంలో తాను చూస్తున్న అన్యాయాలపై ఎంతో కోపం, సంతోషకరమైన మానవుడు కేవలం ఊహలలోని ఎందుకుంటాడొ అర్థం కాని అయోమయం. మనకు అత్యంత సంతోషం కలిగించే ప్రతిదీ అత్యంత విషాదానికి కారణమవ్వడం వెనుక మనిషి మనసు పడే బాధ అతనికి ఊపిరి ఆడనివ్వదు. మనసు కోరుకుంటున్న ఆనందాన్ని ఒక క్రమపద్దతితో సమాజం నాశనం చేస్తూ పోవడం, రక్తం ఓడుతున్న గుండె గాయాన్ని దాచిపెట్టుకోవలసి రావడమే జీవించడం అంటే అది నేను చేయలేను అంటాడు వర్ధర్.
హిందీలో గురుదత్ ప్యాసా సినిమాకి సాహిర్ ఒక పాట రాసాడు……..
హర్ ఎక్ జిస్మ్ ఘాయల్, హర్ ఎక్ రూహ్ ప్యాసీ
నిగాహో మె ఉల్ఝన్ దిలో మే ఉదాసి
యె దునియా హై యా ఆల్–మే–బద్ హవాసీ
యె దునియా అగర్ మిల్ భీ జాయే తో క్యాహై
అయితే ఆత్మహత్యను సమర్ధిస్తున్న రచనగా భావించి కాపీ కాట్ సిండ్రోమ్ లోకి కొట్టుకుపోయి ఎందరో వర్థర్‌లా ఆత్మహత్యలు చేసుకున్నారని విన్నప్పుడు ఈ పుస్తకం లోని అక్షరాల కున్న శక్తి అర్థం అవుతుంది. అది సమర్థించలేని పరిణామమే అయినా ఈ పుస్తకంలోని చాలా ప్రశ్నలకు ఎంత ఎమోషనల్‌గా పాఠకులు కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ సాహిత్యంలో ఇది తప్పకుండా ఒక గొప్ప రచన అనే నా అభిప్రాయం. కాల్పనిక ప్రపంచంలో విహారానికి కాకుండా భయంకరమైన సత్యాలవైపు ప్రయాణం చెసే ధైర్యం ఉన్నవాళ్ళందరూ చదవవలసిన పుస్తకం ఇది. వాన్ గో ‘స్టారీ నైట్’ని ఎడ్వర్డ్ మునిచ్ ‘స్క్రీమ్’ చిత్రాన్ని అర్థం చేసుకోగలిగితే వర్థర్ అర్ధమవుతాడు. వాన్ గో ‘స్టారీ నైట్’ని మానసికచికిత్సలయంలో ఉన్నప్పుడు రాత్రి ఒంటరిగా ప్రపంచాన్ని చూస్తూ వేసాడన్నది చాలా మందికి తెలీదు. సమూహంలో ఉంటూ ఒంటరిగా బ్రతికే ఒక వ్యక్తి ఆక్రందనను ఎడ్వర్డ్ మునిచ్ ‘స్క్రీమ్’ చిత్రంలో చూపించారు. గోధే వర్థర్ లోని మారణ ఘోషను అక్షరబద్దం చేయగలిగారు. ఈ నవలను కేవలం 24 ఏళ్ళ వయసులో వారు రాసారన్నది ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో దొరుకుతుంది.