ఆంగ్ల సాహిత్యంలో అత్యంత క్లిష్టమైన నవలగా చెప్పుకునే William Faulkner రచన ‘ది సౌండ్ అండ్ ది ఫ్యూరి’

1
2

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]మ[/dropcap]న పుస్తక పఠనంలో చాలా ఇష్టంతో చదివే పుస్తకాలు కొన్నుంటాయి. ఇవంటే చాలా ప్రేమ మనకి. మళ్ళీ మళ్ళీ అవి చదవాలనిపిస్తుంది కుడా. అలానే కొన్ని పుస్తకాలు చాలా కష్టంతో చదివి అవి ఇచ్చే సమాచారాన్ని తద్వారా మనం పొందే తృప్తిని అనుభవించి వాటిని ఇష్టపడతాం. ఆ కష్టంతో కూడిన ఇష్టంతో సాహిత్యం పట్ల ఒక గౌరవం, రచయిత పట్ల ఒక ఆరాధన కలుగుంది. అలాంటి ఫీలింగ్ ఇచ్చిన రచన THE SOUND AND THE FURY. రచనా కాలం 1929. నేను ఇప్పటి దాకా చదివిన పుస్తకాలలో చాలా కష్టమైన రచన ఇది. కాని ఇది చదవడం ఒక గొప్ప అనుభవం. రచయిత మేధావితనం ఈ రచనా శైలిలో కనిపిస్తుంది. దీని రచయిత WILLIAM FAULKNER. సాహిత్యం మీద ఎంతో అభిమనం ఉన్న వారందరూ ఈ నవలను సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి కనీసం రెండు సార్లన్నా దీన్ని చదవాలి. రచయిత కథనంలో విసిరే ప్రతి చాలెంజ్‌ని పట్టుకోగలిగితే ఈ నవలా పఠనం ఇచ్చే అనుభవం కొన్ని పదుల సంఖలో నవలలు చదివినా రాదని ఖచ్చితంగా చెప్పగలను. ఆనందించడానికి, పొద్దు పుచ్చడానికి ఈ నవల చదవకూడదు. కష్టతరమైన శైలిలోని రుచిని కష్టపడుతూ ఆస్వాదించగల ధైర్యం ఉన్న వారు చదవవలసిన నవల ఇది.

ఇందులో కథ చాలా సాధారణమైనది. జేసన్ కాంప్సన్ అనే ఒక వ్యక్తి కుటుంబ కథ ఇది. అతనో తాగుబోతు, భాద్యతారహితంగా జీవించే వ్యక్తి. అతని భార్య కారొలెన్. పిల్లలను పెద్దగా పట్టించుకోదు. ఎప్పుడూ తన ఒంట్ళో బావోలేదని అనుకుంటూ విపరీతమైన అటెన్షన్ కుటుంబం నుండి కోరుకుంటూ జీవిస్తూ ఉంటుంది. వారికి నలుగురు పిల్లలు. క్వెంటిన్ అందరిలో తెలివిగలవాడు. కాండెస్ రెండో కూతురు. ఈమెకు నైతికత, పవిత్రత లాంటి పదాలకు అర్థం తెలీదు. కనిపించిన ప్రతి ఒక్క మగాడితో శారీరిక సంబంధం పెట్టుకుంటూ ఆనందిస్తున్నాననుకోవడం ఈమె నైజం. జేసన్ తరువాతి వాడు. ఇతనికి డబ్బు ముఖ్యం. జీవితంలో తనది ఎప్పుడూ పై చేయిగా ఉండడానికి ఏమైనా చేసే రకం. చివరి వాడు బెంజమిన్. మానసికంగా ఎదగని వ్యక్తి. ఈ నలుగురుకీ కూడా కుటుంబంలో ఒకరికి ఒకరి పట్ల ప్రేమలు పెద్దగా ఉండవు. వీరందరినీ చూసుకోవడానికి ఆ ఇంట్లో ఒక పెద్ద వయసు నల్ల జాతీయురాలు ఉంటుంది. ఆమె దిల్సే. ఈమే ఒక్కతే నిస్వార్థంగా పిల్లలను ఆ కుటుంబాన్ని ప్రేమిస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆ పిల్లలే బెంజమెన్‌ను చూసుకుంటారు. ఆఖరికి ఆమె మనవడు కూడా బెంజమెన్ సంరక్షణలో పాలు పంచుకుంటాడు. వీరు కాక కాండిస్‌కు పుట్టిన కూతురు క్వెంటిన్ కూడా ఆ కుటుంబంలోనే పెరుగుతుంది.

ఈ నవల నాలుగు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఏప్రెల్ 7, 1928 న బెంజమెన్ మనకు చెప్పే కథ. అప్పటికి అతని వయసు 33 సంవత్సరాలు. ఒక మానసిక ఎదుగుదల లేని వ్యక్తి చెప్పే కథ ఎలా ఉంటుందో అచ్చంగా ఆ శైలిలో ఈ భాగంలో కథ నడుస్తుంది. ఇది చదవడం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. కథలో సంఘటనల మధ్య కాలమానం ఒకో పేరాకీ ఒక దశాబ్దం తేడాతో నడుస్తుంది. అది అర్థమవడానికి చాలా సమయం తీసుకుంటుంది. నాన్ లీనియార్ శైలిలో, స్ట్రీం ఆఫ్ కాన్షియస్నెస్ పద్దతిలో నడిచే ఈ కథనం కొన్ని సార్లు ఇటాలిక్స్ లో కొన్ని సార్లు మామూలు ప్రింట్ లో ఉంటుంది. బెంజమెన్ కథాక్రమాన్ని మారుస్తున్న ప్రతి సందర్భంలో రచయిత మనకిచ్చే హింట్ అది. ఒక మానసిక వికలాంగుడు తన గురించి చెప్పేటప్పుడు ఏ శైలిలో వ్యక్తీకరించుకోగలడో అదే శైలిలో తానూ ఒక మానసిక వికలాంగుడిలా మారిపోయి రచయిత రాసే ఆ కథను ఏ సైకియాట్రిస్ట్ కూడా మామూలు వ్యక్తి రాసిన కథ అని అనలేని విధంగా గజిబిజి గందరగోళంగా ఉంటుంది ఆ మొదటి భాగం. మొట్టమొదటి సారి ఈ రచన చదువుతున్న పాఠకుడికి పాత్రలు తప్ప ఏం అర్దం కాదు. ఈ ప్రయోగమే సాహిత్యంలో మొట్టమొదటి సారి జరిగిందని సాహిత్య చరిత్రకారులు చెబుతారు. ఈ కథలో కాండిస్ ఒక్కతే బెంజమెన్‌ను నిజంగా ప్రేమించిందని మనకు అర్థం అవుతుంది. ఆమె వివాహం అవడం తరువాత ఆమె కడుపులో బిడ్డకు తాను తండ్రిని కానని తెలుసుకుని ఆమె భర్త ఆమెను వదిలేసాడని ఈ భాగంలో కాస్త అర్థం అవుతుంది. అర్థం అయీ అవనట్లు చెప్పే బెంజెమెన్ కథనం వలన ఏ విషయంలోనూ స్పష్టత ఉండదు.

ఇక రెండవ భాగం జూన్ 2, 1910 న పెద్ద కొడుకు క్వెంటన్ చెప్పే కథ. ఉత్తమ పురుషలో నడుస్తుంది. ఇది కూడా నాన్ లీనియార్ శైలిలోనే సాగుతుంది. ముందు మొదటి భాగం కన్నా కాస్త సులువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని రాను రాను క్లిష్టంగా మారుతుంది. క్వెంటెన్ ఆత్మహత్య చేసుకునే రోజు అతని మనసులోని ఆలోచనలన్నీ ఈ కథనంలో ప్రతిబింబిస్తాయి. క్వెంటెన్‌కి నైతికత పట్ల ఎంతో నమ్మకం. తెలివైన వాడు కాబట్టి ఎంతో ఆశతో కూటుంబం బెంజెమెన్‌కి ఇష్టమైన గోల్ప్ కోర్స్‌ని అమ్మేసి ఆ డబ్బుతో క్వెంటెన్‌ని హార్వర్డ్ పంపించి చదివిస్తూ ఉంటారు. క్వెంటెన్‌కి పవిత్రత, శీలం, నైతికత పట్ల ఉన్న నిర్దుష్టమైన అభిప్రాయాల కారణంగా అతను అమితంగా ఇష్టపడే చెల్లెలు కాండెస్ ప్రవర్తన బాధిస్తూ ఉంటుంది. తండ్రితో ఈ విషయం గురించి చెప్పాలనుకుంటాడు. కాని తండ్రి కొందరికి నైతికత అంత ముఖ్యం కాదు అని కాండెస్ ఆ కోవలోకి వచ్చే వ్యక్తి అని, ఆమె గురించి అతిగా ఆలోచించవలసిన అవసరం లేదని కొట్టిపడేస్తాడు. కాండెస్ గర్భవతి అని తెలుసుకుని ఇంట్లో ఆమె చులకన అయిపోతుందేమో అన్న భయంతో ఒక సందర్భంలో ఆ బిడ్డకు తానే తండ్రిని అని కూడా చెప్తాడు క్వెంటెన్. కాండిస్ ప్రవర్తన, ఆమె పట్ల క్వెంటెన్‌కి ఉన్న ప్రేమ తెలుసు కాబట్టి తండ్రి చెల్లెల్ని కాపాడటానికి ఇంత పెద్ద నింద తన మీద వేసుకోవాలనుకునే క్వేంటిన్ మాటలను కొట్టిపడేస్తాడు. కాండిస్ ఒకతన్ని చూపించి అతను తన బిడ్డకు తండ్రి కావచ్చు అని చెప్పినప్పుడు క్వెంటన్ అతనితో వైరం పెట్టుకుంటాడు. తన చెల్లెలిని మగాళ్ళందరి నుండి రక్షించుకోవాలని విపరీతంగా తపన పడతాడు. అదే భాద్యతతో ఒక ఇటాలియన్ అమ్మాయికి సహాయం చేయబోయి నవ్వుల పాలవుతాడు. అమ్మాయిలను రక్షించాలనే అతని అతి తాపత్రయం స్నేహితులకీ అర్థం కాదు. ఈ ఆలోచనలతో మతిస్థిమితం కోల్పోయి అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అతని ఆత్మహత్యకు ముందు అతని మనసు ఎంత గందరగోళంతో నిండి ఉంటుందో అంతే గందరగోళ శైలితో రాసిన అధ్యాయం ఇది. అతని కథనంలో విపరీతమైన డిప్రెషన్, పొంతన లేని ఆలోచనాక్రమం, చెప్పుకోలేని భయం, బాధ, ఒంటరితనం కనిపిస్తుంది. ఈ అధ్యాయం రాస్తున్నంత సేపూ కూడా తానొక మతి తప్పిన వక్తిగా మారి ఆ రచయిత కథనాన్ని నడిపించడం ఆశ్యర్యపరుస్తుంది. ఈ భాగం చదువుతున్నప్పుడు ప్రతి వాక్యంలో ఒక డెప్రెషన్‌కు గురి అయిన వ్యక్తి కనిపిస్తాడు. అందుకే ఇది మొదటి అధ్యాయం కంటే కూడా చదివి అర్థం చేసుకోవడానికి పాఠకులు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలి.

మూడవ అధ్యాయం జేసన్ మాటలలో నడుస్తుంది. ఇతన్ని తల్లి చాలా ఇష్టపడుతుంది. ఆ విషయాన్ని అతను పూర్తిగా తనకు అనుకూలంగా మలచుకూంటాడు. అప్పటికే కాండిస్ తండ్రి ఎవరో తెలియని ఒక బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను ఆమె తండ్రి తీసుకునివచ్చి భార్యకిచ్చి ఆ బిడ్డ బాధ్యత తీసుకోమంటాడు. ఆ ఇంట్లో పిల్లలందరినీ పెంచిన దాది దిల్సే ఆ బిడ్డను పెంచుతుంది. గర్భంతో ఉన్నప్పుడు కేండిస్ ఈ విషయాన్ని దాచిపెట్టి ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుంటుంది. అయితే ఆ సంగతి అతనికి తెలిసి ఆమెకు విడాకులిస్తాడు. కేండిస్‌ను అందరూ ద్వేషిస్తారు. ఇంటికి వచ్చే పరిస్థితి ఉండదు. కాని బిడ్డ పుట్టాక, ఆ బిడ్డ బాధ్యత కొంతయినా తీసుకోవాలని జేసన్‌కు ప్రతి నెలా డబ్బు పంపిస్తుంది కెండిస్. తల్లికి ఆ డబ్బు తిరిగి పంపిస్తున్నానని చెప్పి జేసన్ మాత్రం ఆ డబ్బును స్వంతం చేసుకుంటూ ఉంటాడు. ఇది కేండిస్ కూతురు క్వెంటిన్‌కు తెలుస్తుంది. జేసన్ క్రమశిక్షణ పేరుతో ఆమెకు చూపించే నరకానికి కోపంతో క్వెంటిన్ తిరగబడి అతని డబ్బు దోచుకుని ఒకతనితో పారిపోతుంది. ఈ అధ్యాయంలో ఒక స్వార్థపరుని కథనం ఉంటుంది. ఇక్కడ ప్రతి వాక్యంలో ఆ స్వార్థపరుడు తనను తాను సమర్థించుకుంటూ పాఠకుల సానుభూతి రాబట్టే ప్రయత్నం చేస్తాడు. రచయిత ఒక స్వార్థపరునిలా ఈ అధ్యాయం రాస్తాడు. మనం పూర్తిగా అందులో పడిపోయి కొన్ని సార్లు జేసన్ పట్ల సానుభూతి చూపిస్తాం. ఒక మేనిప్యులేటివ్ వ్యక్తి మానసిక స్థితి, అతని మాటల చాతుర్యం పూర్తిగా ఈ అధ్యాయంలో కనిపిస్తాయి.

నాలుగవ అధ్యయంలో రచయిత తన సొంత గొంతుతో కథనం సాగిస్తూ మనకు అర్థం కాని విషయాలను స్పష్టపరుస్తూ వెళతారు. ఇక్కద దిల్సే ద్వారా కథ నడుస్తుంది. ఆ కుటుంబ పరువుని కాపాడటానికి, సభ్యులందరి మధ్య సయోద్య కుదర్చడానికి ఆమె పడే శ్రమ కనిపిస్తుంది. 1945లో Faulkner ఈ నవలకు కొనసాగింపుగా మరో అధ్యాయం రాసారట. కాని పాత పుస్తకంలో ఈ అధ్యాయం ఉండదు.

ఇలా భిన్నమైన శైలితో విభ్భిన్నంగా ఇంత విసృతంగా రాసిన మరో రచన కనపడదు. అందుకే ఇప్పటికీ దీన్ని THE MOST INTELLIGENT NOVEL అనే అంటారు. ఒక్క వాక్యం, లేదా భావం కాని అనవసరం అనిపించకుండా, ప్రతి అధ్యాయాన్ని ఆ కథ చెప్పే వ్యక్తి మెదడులోకి దూరి రాసినట్లుగా అనిపిస్తుంది. నాలుగు అధ్యాయాలు ఒకే వ్యక్తి రాసినట్లు కూడా నమ్మడం కష్టమవుతుంది. ఒక మానసిక వికలాంగుడు, డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి, ఒక స్వార్ధపరుడు, ఒక కథకుడు ఇలా నలుగురు వ్యక్తుల మానసిక స్థితి మనకు అవగతం అయ్యే విధంగా రాయబడిన రచన ఇది. ఇది చదవడం నిజంగా గొప్ప అనుభవం, గొప్ప పరీక్ష కూడా. ఒక రచయిత ఎంతగా పాత్రలోకి ఇమిడిపోగలడో చెప్పే అద్భుతమైన నవల ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here