[dropcap]ఇం[/dropcap]గ్లీష్ సాహిత్యంలో చాలా పేరు పొందిన ఈ చిన్ని నవలిక చదవడం ఒక గొప్ప అనుభవం. మనిషి మనసులోని మంచీ చేడు, వాటి మధ్య జరిగే నిరంతర పోరాటాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించిన నవల ఇది. దీన్ని 1886లో స్కాటిష్ రచయిత రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్ రచించారు. వీరు సృష్టించిన ఈ రెండు పాత్రలెంత ప్రఖ్యాతి వహించాయి అంటే ఇప్పుడు కూడా మంచి చెడులను వర్ణించేటప్పుడు ఆ దేశాలలో జెకిల్ మరియు హైడ్‌తో పోల్చడం సర్వసాధారణం. మనస్తత్వశాస్త్రంలో కూడా ఈ పాత్రలకు, ఈ నవలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకే మనిషిలోని మంచి చెడులను ఆధారంగా తీసుకుని మానసిక విశ్లేషణ జరగడం అన్నది ఈ నవలతోనే ఆధునిక సాహిత్యంలో మొదలయ్యింది అని చెప్పవచ్చు. ఈ పాయింట్ ఆధారంగానే కొన్ని వేల క్రైమ్ నవలలు రచించబడ్డాయి. ఆధునిక యుగంలో శాస్తీయ పద్దతిలో క్రైమ్ సైకాలజీ కూడా ఈ పాయింట్ మీదే ఆధారపడి క్రిమినల్ చర్యలను, వారి మేధస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ నవలను రచించడానికి రచయిత ప్రేరణ పొందింది అతని మిత్రుడు తన భార్యను హత్య చేసిన ఒక కేస్ నేపథ్యంలో. ఎంతో సాత్వికుడైన ఆ మిత్రుడు హత్య చేసిన విధానాన్ని విని అతన్ని నిత్యం పరిశిలిస్తున్న లూయిస్ ఆశ్చర్యపడ్డాడు. ఆ మిత్రుడు ఇంకా కొన్ని హత్యలు అంతకు ముందు చేసాడని తెలిసి పరమ సాత్వికుడైన ఆ మిత్రునిలోని ఆ మరో మనిషి ఉండడం గురించి ఆలోచించేవాడు. అలా రాసిందే ఈ నవల. దీన్ని రాసిన తరువాత ఒకసారి కాల్చి వేసాడు. మళ్ళి తిరగరాసి పబ్లిష్ చేసారని అంటారు. తన పాత్రలను తననుకున్న విధంగా పరిచయం చేయడం సబబేనా అన్న మీమాంస వారిని చాలా కాలం వేధించింది.
ప్రతి మనిషిలో మంచి చెడులుంటాయి. సమాజం, మనిషి జీవితం, వాతావరణం కొన్ని సార్లు మంచిని ప్రేరేపిస్తే ఆ మనిషి మంచివాడుగా చెలామణి అవుతాడు. అతనిలో చెడు నిద్రాణమై ఉండిపోతుంది. అదే ఆ మనిషిలో చేడు రెచ్చిపోతే మంచి నిద్రావస్తలో ఉండిపోతుంది. ఒకోసారి పరమ క్రూరుడనుకున్న వ్యక్తిలో ఊహించని మంచితనం చూస్తాం. చాలా మంచివాడనుకున్న వ్యక్తిలో పరమ కిరాతకుడు కనిపిస్తాడు. దీనికి కారణం మనిషిలో ఉండే ఆ రెండు సహజ రూపాలే అన్నది ఈ నవల కథాంశం. పరిస్థితుల ప్రభావంతో మనిషిలోని ఆ రూపాలు బైటికి వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని రసాయనిక క్రియల కారణంగా ఇవి రెండు సమాన స్థాయిలో విజృంబిస్తే ఆ మనిషి సమాజానికి అర్థం కాని వ్యక్తిగా మారిపోతాడు. అక్కడే అనుకోని హింస బైటపడుతుంది. హింస చేస్తున్న వ్యక్తి లేదా ప్రేరేపిస్తున్న వ్యక్తి పరమ సాత్వికుడిలా కనిపిస్తూ ఉంటాడు. అతనిలోని ఈ స్ప్లిట్ పర్సనాలిటిని గుర్తిస్తే మనిషి మేదస్సు ఎంత రహస్యాత్మకంగా ఉంటుందో, దాని పొరలలో ఎన్ని నిగూఢ రహస్యాలుంటాయో అర్థం అయితే మనిషి నిజంగా ఒక పెద్ద క్లిష్టమైన జీవిగా అర్థం అవుతాడు. మనిషిలోని ఈ మంచి చెడులు సమాన స్థాయిలో ఉన్నందువలనే మనం ఊహించలేని సంఘటనలు ఊహించలేని మనుష్యులు చేస్తూ కనిపిస్తారు.
గాబ్రియల్ జాన్ అట్టర్సన్ అనే ఒక లాయర్ జెకిల్‌కి మిత్రుడు. జెకిల్ ఒక పెద్ద డాక్టరు. ప్రయోగాలు చేస్తూ మందులు కనుక్కుని ఎందరికో ఉపయోగపడే మహానుభావుడు. ఒక రోజు తన బంధువు రిచర్డ్ ఎన్ఫీల్డ్‌తో నడుస్తూ వెల్తున్నప్పుడు రిచర్డ్ ఒక పెద్ద ఇల్లు చూపించి ఆ ఇంటి ముందే ఒకసారి హైడ్ అనే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని గాయపరిచినందుకు తాను వంద పౌండ్లు అతని వద్ద తీసుకున్నానని. దానికి అతను ఇదే ఇంటిలో జెకిల్ అనే మర్యాదస్తుని పేరు మీద ఒక చెక్ ఇచ్చాడని చెప్తాడు. తన మిత్రుడు జెకిల్, హైడ్ అనే వ్యక్తి పేరు మీద వీలునామా మార్చాడని అట్టర్సన్‌కి తెలుసు. హైడ్ తన మిత్రుడు అనుకున్నంత మంచివాడు కాదని అతనికి ఈ సంగతి చెప్పాలని అట్టర్సన్ ప్రయత్నిస్తాడు. కాని జెకిల్ అతని మాటలు పట్టించుకోడు. ఒక హత్య హైడ్ చేసాడని తెలుసుకుని అట్టర్సన్ పోలీసులతో హైడ్ ఇంటికి వెళ్ళినప్పుడు తాను జెకిల్‌కి బహుమతిగా ఇచ్చిన చేతి కర్ర అక్కడ సగం విరిగి కనిపిస్తుంది. ఈ సంగతి మిత్రుడికి చెప్పబోతే జెకిల్ హైడ్ పశ్చాత్తాపంతో తనకి రాసిన ఉత్తరం చూపిస్తాడు. అట్టర్సన్ ఆ ఉత్తరంలోని దస్తూరి జెకిల్‌ది అని గుర్తిస్తాడు. ఎందుకో జెకిల్ హైడ్‌ని రక్షిస్తున్నాడని బాధపడతాడు.
మన మనసులోని చెడుని నియంత్రించడంలో మనం సఫలం కాలేకపోతే అది మనల్ని పూర్తిగా జయించివేస్తుందని చెడు ప్రభావం మంచిపై ఎప్పుడు ఎక్కువ మోతాదులోనే ఉంటుందనే సందేశంతో రాసిన ఈ కథ ఇంగ్లీష్ సాహిత్యంలో పాత్రల నిర్మాణంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. మనిషిలోని ద్వంద్వ వైఖరిని చర్చించేటప్పుడు మేధావులు ఈ పాత్రలను తప్పకుండా గుర్తుచెసుకుంటారు. ప్రాయిడ్ చర్చించిన కాన్షస్ అండ్ అన్‌కాన్షస్ మైండ్ అనాలిసిస్‌కు కూడా ఈ పాత్రలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఒకే మనిషిలోని బైటి వేషానికి అతనిలోపలి రాక్షసత్వానికి కొన్ని సార్లు పొంతన ఉండదు. కాని అవి రెండు ఆ మనిషిలోని స్వభావాలే. మంచి చెడులన్నవి ఇంత గాఢంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. వాటిని వెలికి తీసే క్రమంలో జరిగే పరిణామాలపైనే మనిషి స్వభావం ఆధారపడి ఉంటుంది. కాని ఆ స్వభావమే అతని నిజమైన వ్యక్తిత్వం చాలా సార్లు కాకపోవచ్చు అన్న సంక్లిష్టమైన సైకో అనాలిస్ ఆధారంగా రాయబడిన ఈ నవల ఇప్పటికీ మానవ స్వభావంపై రాయబడిన అత్యద్బుతమైన పుస్తకంగా కొనియాడబడుతుంది. నిండా వంద పేజీలు కూడా లేని ఈ నవలను చదవడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప జ్ఞాపకంలా మిగిలిపోతుంది.