Site icon Sanchika

మూడు తరాల విషాద కుటుంబ ప్రేమ కథ – ది థార్న్ బర్డ్స్

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

[dropcap]అ[/dropcap]తి పెద్ద నవలలు రెండు మూడు తరాలకు సాగే మూల కథలు, వీటి మధ్య కనిపించే ఎన్నో పాత్రలు సాహిత్యంలో అన్ని ప్రాంతాలలో, దేశాలలో, భాషలలో మనకు కనిపిస్తాయి. మార్గరెట్ మిచెల్ “గాన్ విత్ ద విండ్,” టాల్‌స్టాయ్ “వార్ అండ్ పీస్”, విక్టర్ హ్యూగో “లే మిసరబెల్స్” నిజంగా గొప్ప నవలలు. ప్రతి దానికో ప్రత్యేకత ఉంది. అయితే ఇవి ప్రపంచంలోని అతి పెద్ద నవల “ది బ్లె స్టొరి” కన్నా చాలా చిన్నవి. ఆస్ట్రేలియా నవలలో అత్యధికంగా అమ్ముడు పోయిన అతి పెద్ద నవలగా “ది థార్న్ బర్డ్స్” కి పేరుంది. అందుకోసమే దీన్ని చదివడం జరిగింది. దీన్ని టీవీ సీరియల్‌గా కూడా తీసారట. ప్రపంచంలో అత్యధిక ప్రేక్షకులను అలరించిన టి.వీ సీరియల్‌గా కూడా దీనికి పేరుంది. ఈ నవల 1977లో మొదట ముద్రించబడింది. రచయిత కోలేన్ మెక్ కులొహ్. చాలా చిన్న ప్రింట్‌తో సుమారు 700 పేజీల ఈ నవల క్లేరీ కుటుంబం మూడు తరాల చరిత్ర. కథ కన్నా కథనం, పాత్రల చిత్రీకరణ గొప్పగా ఉండే నవల ఇది. డ్రొఘెడా అనే ఒక గొర్రెల ఫార్మ్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. అయితే ఆస్ట్రేలియాలో ఈ పేరుతో ఏ ప్రదేశం లేదు. ఇది రచయిత సృష్టి, కాని ఐర్లాండ్ దేశంలో ఇదే పేరుతో ఒక ప్రదేశం ఉందట.

నవల న్యూజిలాండ్ దేశంలో ఒక అతి సాధారణ కుటుంబంలో మెగ్గీ అనే ఒక నాలుగు సంవత్సరాల పాప పుట్టినరోజు వేడుకలతో మొదలవుతుంది. ఐదుగురు మగ పిల్లలున్న క్లేరీ కుటుంబంలో ఒకే ఒక పాప మెగ్గీ. చాలా అందమైన అమాయమైన అమ్మాయి. తండ్రి పాడి, తల్లి ఫీ కుటుంబం కోసం నిరంతరం కష్టపడే కష్టజీవులు. పెద్ద అన్న ఫ్రాంక్ అంటే మెగ్గికి చాలా ఇష్టం. కాని ఫ్రాంక్ ఆ కుటుంబం మధ్య అపరిచితుడిలా జీవిస్తూ ఉంటాడు. తండ్రి పాడి అంటే అతనికి విపరీతమైన కోపం. ఏ మాత్రం మృదు స్వభావం లేని పాడి తల్లిని ప్రతి సంవత్సరం గర్భవతిని చేయడం అతనికి నచ్చదు. కుటుంబంలో ఒక పద్దతి లేదని అసహ్యించుకుంటాడు. తల్లికి ప్రాంక్ అంటే ప్రత్యేకమైన ప్రేమ. పాడి అక్క ఆస్ర్టేలియాలో ఉంటుంది. ఆమె భర్త చనిపోయాక ఆ ఆస్తి మొత్తానికి ఏకైక వారసురాలిగా మిగిలిపోతుంది. పెద్ద వయసులో డ్రొఘెడా నిర్వహణ కష్టం అయి తమ్ముడి కుటుంబాన్ని తన దేశానికి వచ్చి సెటిల్ అవ్వమని పిలుస్తుంది. తన తదనంతరం ఆ ఆస్తికి పాడి కుటుంబమే వారసులని కబురు పంపిస్తుంది. కుటుంబం అంతా అలా డ్రొఘెడా చేరతారు. ఇక్కడ పాడికి ఫ్రాంక్‌కి మధ్య దూరం ఇంకా పెరుగుతుంది. అనుకోకుండా ఫ్రాంక్‌కి తన జన్మ రహస్యం తెలుస్తుంది. తల్లి ఫీ తనను పెళ్ళికి ముందే కన్నదని. తల్లి కుటుంబీకులు అపవాదు తప్పించుకోవడానికి తమ వద్ద పని చేసే వ్యక్తికి తల్లినిచ్చి పెళ్ళి చేసారని అలా పాడి తన తండ్రి స్థానంలోకి వచ్చాడని తెలుసుకుని అతను ఇల్లు వదిలి వెల్లిపోతాడు.

డ్రొఘాడా ప్రాంతంలో మత ప్రచారకుడు రాల్ఫ్ – డె- బ్రికాస్సర్ట్. చాలా అందగాడూ. పాడీ అక్క మేరి ఆస్తిని చర్చ్‌కి రాయించాలి అతని కోరిక. కాని పాడి కుటుంబం రావడంతో అతనికి నిరాశ కలుగుతుంది. మొదటి క్షణంలోనే చిన్ని మేగ్గిపై అతనికి ప్రేమ పుడుతుంది. ఆ కుటుంబానికి చేరువగా ఉంటూ మెగ్గీతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. మెగ్గీ కూడా రాల్ఫ్‌కి చేరువ అవుతుంది. అతనే ఆమె లోకం అవుతాడు. కాని కొంత వయసుకు వచ్చాక మేనత్త చనిపోతూ ఆస్తిలో చాలా భాగం చర్చ్‌కి రాస్తూ బ్రతికి ఉన్నంత వరకు క్లేరి కుటుంబీకులు డ్రొఘాడా లో ఉండడానికి ప్రతి ఒక్కరికి కొంత డబ్బు పంచుతుంది. రాల్ఫ్ ప్రయోజకత్వంతో చర్చ్‌కి చాలా ధనం వచ్చిన కారణంగా అతన్ని పై పోస్ట్‌కి మరో దేశానికి బదిలీ చేస్తుంది చర్చ్. అప్పుడు రాల్ఫ్‌కి తాను మెగ్గీనీ ప్రేమిస్తున్నానని అర్ధం అవుతుంది. కాని కాథలిక్ మత గురువుగా తాను వివాహానికి అర్హుడుని కానని మెగ్గీ కన్నా మతం వైపే మొగ్గు చూపి దేశం వదిలి వెళ్ళిపోతాడు. రాల్ఫ్‌ని మర్చిపోలేక మెగ్గీ బాధపడుతున్న సమయంలో ఇంచుమించు ఆ పోలికలతో వారితో పని చేయడానికి లూక్ వస్తాడు. రాల్ఫ్ పోలికలతో ఉన్నందుకు మెగ్గీ అతన్ని వివాహం చేసుకుంటుంది. కాని డబ్బు కోసం మాత్రమే మెగ్గీని పెళ్ళి చేసుకున్న ల్యూక్ ఆమెను మరో ప్రాంతానికి తీసుకెళ్ళి స్నేహితుని ఇంట్లో పని అమ్మాయిగా ఉంచుతాడు. భర్త స్వభావం అర్ధం అయినా అతనికి ఇష్టం లేదని తెలిసినా జీవితంలో ముందుకు సాగాలంటే కనీసం పిల్లలయినా ఉండాలని మెగ్గి ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. పురుటి నొప్పులతో ప్రాణాలు పోతున్నట్లు బాధ పడుతున్న ఆమె కోసం ఆమె భర్త రాడు. కాని రాల్ప్ అనుకోకుండా అమె వద్దకు ఆ రోజు వస్తాడు. అతన్ని చూసి మేగ్గి అతన్ని మర్చిపోవడం జరగని పని అని అర్ధం చేసుకుంటుంది. బిడ్డ పుట్టాక గాలి మార్పు కోసం ఆమె యజమానులు ఆమెను కొంత సమయం విశ్రాంతి తీసుకొమ్మని ఒక నిర్మానుష ప్రాంతానికి పంపిస్తారు. ఆమెను చివరిసారి కలవాలని అక్కడకు వచ్చిన రాల్ప్ ఆమెతో శారీరికంగా కలుస్తాడు. కాని తనకు తన చర్చ్ కిచ్చిన మాట ముఖ్యమని రాల్ఫ్ ఆమెను విడిచి రోమ్ వెళ్ళిపోతాడు.

భర్తతో విడిపోయి తన కూతురు జస్టిన్‌తో కడుపులో రాల్ఫ్ బిడ్డతో మెగ్గీ మళ్ళి డ్రొఘాడ చేరుతుంది. అక్కడే పిల్లలను పెంచుకుంటూ తన అన్నలకు సహాయపడుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో అంతకుముందు ఎన్నో విషాదాలు జరుగుతాయి. చాలా చిన్నప్పుడు ఫీ కు పుట్టిన ఒక కొడుకు అతి చిన్న వయసులో మరణీస్తాడు. పాడి అతని మరో కొడుకు తుఫానులో చిక్కుకుని చనిపోతారు. మిగిలిన ఐదుగురు కొడుకులలో ఇద్దరు యుద్దంలో సైనికులుగా చేరి గాయాలతో ఇంటికి వస్తారు. ఫ్రాంక్ జైలు పాలయ్యి కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ తల్లి పంచన చేరతాడు. అన్నీ ఓడినట్లు జీవిస్తున్న తన కత్యంత ప్రియమైన కుమారుడిని నిత్యం చూస్తూ ఫీ ఎంతో వేదన అనుభవిస్తూ ఉంటుంది. ఇక్కడే మెగ్గీ రాల్ప్ కొడుకు డేన్‌కు జన్మనిస్తుంది. ఫీ ఆ బిడ్డ రాల్ప్ సంతానం అని అర్ధం చేసుకుంటుంది. కాని మెగ్గీ ఈ సంగతి రాల్ఫ్‌కి చెప్పడానికి ఇష్టపడదు. రాల్ఫ్ ప్రేమ తన సొంతం కాకపోయినా ఈ బిడ్డ అచ్చంగా తన సోంతం అని ఆ భావనతో కొన్ని సంవత్సరాలు గడిపేస్తుంది. యుక్త వయసు వచ్చిన తరువాత కూతురు జస్టిన్ స్టేజీ నటి అవడానికి లండన్ వెళ్ళిపోతుంది. కొడుకు డేన్ తాను మత ప్రచారకుడిని అవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు మేగ్గీ నిర్షాంతపోతుంది. తన కిష్టమైన ఇద్దరు మగవారు తనను వదిలి దేవున్ని కోరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. అయినా కొడుకు నిర్ణయాన్ని కాదనలేక రాల్ఫ్ వద్దకు రోమ్ పంపిస్తుంది. రాల్ఫ్ గురువు డేన్‌ని చూసిన వెంటనే అతను రాల్ఫ్ కొడుకని మెగ్గీ ఈ విషయం రాల్ఫ్‌కి చెప్పలేదని తెలుసుకుంటాడు. మత ప్రచారకుడుగా నియమింపబడిన తరువాత డేన్ సముద్రంలో ఈతకు వెళ్ళి అక్కడ మునిగిపోతున్న ఇద్దరు అమ్మాయిలను కాపాడే ప్రయత్నంలో మునిగి చనిపోతాడు. అతని శవాన్ని డొఘేడా తీసుకురావడం కష్టమవుతున్న సందర్భంలో రాల్ఫ్ సహాయం కోరుతూ మెగ్గీ డేన్‌కి తండ్రి రాల్ఫ్ అని అతనికి చెబుతుంది. కన్న బిడ్డను దగ్గర ఉండి కూడా గుర్తు పట్టలేకపోయిన తన దౌర్భాగ్యానికి కృంగి రాల్ఫ్ తరువాత కొన్ని నెలలకే మరణిస్తాడు. జస్టిన్ వివాహం చేసుకుని లండన్‌లో ఉండిపోతుంది. డ్రొఘాడా లోపెళ్ళి కాని ముసలి అన్నలతో, తల్లి ఫీ తో మెగ్గీ ఒంటరిగా మిగిలిపోతుంది.

ఆస్ర్టేలియాలో ఒక కథ ప్రచారంలో ఉంది. అక్కడ చక్కని పాటలు పాడే కొన్ని పక్షులుంటాయట. అవి పుట్టిన క్షణం నుండే ముళ్ళ కోసం వెతుక్కుంటాయి. ముళ్ళు కనిపించగానే వాటికి తమ శరీరాన్ని గుచ్చుతాయి. మరణిస్తూ మధురమైన పాటలు పాడుతాయి. వీటినే అక్కడ ది థార్న్ బర్డ్స్ అంటారు. ఈ నవలలోని పాత్రలన్నీ అలాంటి థార్న్ బర్డ్స్. జీవించడానికి ఎన్నో మార్గాలున్నా తమ మనసు మార్గం అనుసరించి బాధలని కొని తెచ్చుకుని అందమైన జీవితాలనే గడిపినా అంతులేని విషాదాన్ని అనుభవిస్తారు. ఇది వారు ఇష్టపూర్వకంగా స్వీకరించిన జీవన విధానం. తను ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి జరగదని తెలిసినా అతనితో బిడ్డను కని కుటుంబ ఆగ్రహానికి దూరమయి ఎంతో సంపన్నురాలైన ఫీ పనివాడైన పాడి ని పెళ్ళి చేసుకుని అతనితో జీవితం గడుపుతుంది. తీవ్రమైన శారీరిక కష్టాన్ని, ఫ్రాంక్‌కు అనుకున్న జీవితాన్ని ఇవ్వలేక తనలో తానే చివరి దాకా కుమిలిపోతుంది. మెగ్గీ రాల్ఫ్ తనకు దక్కడని తెలిసి అతన్ని ఎంతలా ప్రేమిస్తుందంటే మరో మగాడితో జీవించలేనంత. చివరికి అతని ద్వారా పుట్టిన కొడుకు కోసం జీవిద్దామంటే అతను కూడా మత ప్రచారకుడిగా మారతాడు. అయినా తల్లిగా కొడుకు పక్కన ఉందామంటే ఇరవై ఆరేళ్ళకే ఆ కొడుకు మరణిస్తాడు. జస్టిన్ జీవితంలో ఎలా బ్రతకాలనుకుంటుందో అలా ఉండలేక పోతుంది. తల్లి మెగ్గీ పై ప్రేమ ఉన్నా అది చూపించే అవకాశం రాదు చివరకు తల్లి లేదా భర్త ను ఎంచుకోవలసి వచ్చినప్పుడు తనకత్యంత ప్రీతికరమైన గతాన్ని వదిలి భర్తతో ఉండిపోతుంది.

పాడి భార్యను విపరీతంగా ప్రేమించినా ఆమె ప్రేమను సంపూర్ణంగా అందుకోలేకపోతాడు. అతని పిల్లలు కూడా జీవితంలో కష్టతర మార్గాలనే ఎన్నుకునే విషాద పరిస్థితులలో జీవిస్తూ ఉంటారు. ప్రాంక్ తల్లిని విపరీతంగా ప్రేమించినా ఆమెకు అంతులేని వేదననే ఇస్తాడు. ఇక రాల్ఫ్ నిజంగా ప్రేమించింది మెగ్గిని కాని తాను మతానికిచ్చిన మాట కోసం ఆమెను వదులుకుని నిత్యం నరకం అనుభవిస్తాడు. చివరకు కొడుకును కూడా గుర్తించలేక తాను గొప్ప అనుకున్న జీవితంలోని పొరలను అంగీకరించలేక నలిగిపోయి వేదనపడి మరణిస్తాడు.

నవలలో కథ కన్నా కథనం కట్టిపడేస్తుంది. పాత్రల ప్రతి ఎన్నిక మనకు బాధను కలిగించినా అలా తప్ప మరోలా జీవించలేని వారి అశక్తత వారిని మనలను దగ్గర చేస్తుంది. నిజ జీవితంలో మనం అందరం ఇలానే జీవిస్తున్నామని ఇలాంటి తప్పిదాలే చేయకుండా ఉండలేకపోతున్నాం అని మనసు నడిపించిన దారిలో విషాదాన్ని ఆహ్వానిస్తూ ఉన్నామని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది. నాకు బాగా నచ్చిన నవలగా దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అన్నా కేరనీనా నవలలో టాల్‌స్టాయ్ చెప్పినట్లు సంతోషకరమైన కుటుంబాలు అన్నీ ఒకేలా ఉంటాయి. కాని విషాదంగా జీవిస్తున్న కుటుంబాలన్నీ తమదైన పద్దతిలో విషాదాన్ని అనుభవిస్తూ ఉంటాయి. క్లేరి కుటుంబంలోని విషాదం వారికి మాత్రమే ప్రత్యేకమైనది. మరొకరికి అర్ధం కానిది.

Exit mobile version