Site icon Sanchika

ది వయొలిన్ ప్లేయర్ – ఆసక్తికరమైన చిత్రం

[box type=’note’ fontsize=’16’] “సినెమాని వొక కళా రూపంగా చూడడానికి ఇష్టపడే వాళ్ళు దీన్ని చూస్తే సంతోషిస్తారు. సినెమాలో ఉత్సాహం వున్న వాళ్ళను కూడా ఇది ఆకర్షిస్తుంది” అంటూ ‘ది వయొలిన్ ప్లేయర్’ సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

బొద్దింక. యెన్నో వేల సంవత్సరాల క్రితం నుంచీ వున్న జీవి. ఇన్ని రకాల వాతావరణ మార్పులకూ యెదురొడ్డి బతికిన జీవి. యెన్నో రకాల జీవరాశులు అంతరించినా ఇది మాత్రం సర్వైవ్ అవుతోంది. అది చాలా రకాల రోగాల వ్యాప్తికి కారణం అన్న మాట అటుంచినా, దాన్ని చూస్తేనే వికారం కలుగుతుంది మనకు యెందుకో? అది వొక సహజాత భావనా, లేక ముందు తరాలనుంచి అప్రయత్నంగా అందిపుచ్చుకున్న భావనా?

బౌధ్ధాయన్ ముఖర్జీ తీసిన ఈ రెండవ చిత్రం చాలా అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడింది, మన్ననలు పొందింది, అవార్డులూ పొందిది. అతని మొదటి చిత్రం తీన్‌కహోన్ (మూడు కథలు). వాణిజ్య ప్రకటనల చిత్రాలు తీసే బౌధ్ధాయన్ ఇక్కడ మాత్రం ఆ క్లుప్తత కాకుండా తీరికైన పాత్రల, ముఖాల స్టడీ గావించాడు. రెండు ప్రక్రియలూ పరస్పర విరుధ్ధం. వ్యాపార ప్రకటనలో క్షణంలోనే కథంతా చెప్పేస్తే ఇందులో అతను తాపీగా మనుషుల మనసులను స్టడీ చేస్తాడు. వాళ్ళకు యెక్కువ సంభాషణలు కూడా వుండవు. ఆ కళ్ళు, ఆ ముఖం పైని మారుతున్న రంగులు తప్ప. మళ్ళీ ఇదంతా మూల కథకు విధేయంగానే వుంటుంది.

కథగా చెప్పడానికి యెక్కువేం లేదు. అతను (రిత్విక్ చక్త్రవర్తి) వో వాయులీనం వాయించేవాడు. సినెమాలకు సంగీత రికార్డింగులప్పుడు వయోలిన్ వాయించే వాళ్ళ అవసరం పడినపుడు అతనికి పని వుంటుంది. అంతమంది వయోలిన్ వాద్యకారుల్లో వొకడుగా కూర్చుని తన వంతు స్వరాలు తాను పలికించాలి. మందిలో వొకడుగా. జీవికా, ప్రేమా రెండూ సంగీతమే. జీవితమూ కలా కూడా. చిత్రం మొదట్లో అతను పేపర్ చదువుతూ వుంటాడు. వెనుక భార్య (out of focusలో చూపిస్తాడు) గబగబా పనులు చేసుకుని, తయారై, అతనికి టీ ఇచ్చి పనికి వెళ్తుంది. యేదో జూనియర్ అసోసీషన్ మీటింగు వుందట. వెళ్తూ వెళ్తూ చెబుతుంది, గిన్నెలు తోమలేదనీ, పాటిల్ (బహుశా కిరాణా కొట్టువాడు ) కనబడినప్పుడల్లా బాకీ గురించి అడుగుతున్నాడు నీ దగ్గర వున్న డబ్బు అతనికిచ్చి వెళ్ళు అంటుంది. ఆమె వెళ్ళిపోయాక అతను గిన్నెలు తోమి, బట్టలు ఉతికి ఇంటి ముందు వున్న తీగల మీద ఆరేస్తాడు. ఆమె లోదుస్తులు మాత్రం ఇంటి వెనుక తీగల మీద ఆరేస్తాడు. అప్పుడు అతని దృష్టి గోడమీద వున్న బొద్దింక మీద పడుతుంది. జీవితంలో యెన్నిరకాల అణచివేతలకు గురయ్యాడోమరి, యెన్ని అణచుకున్న దుఃఖాలున్నాయోమరి, యెన్ని frustrations వున్నాయో మరి చెప్పు తీసి దాని మీద విసురుతాడు. అది కింద పడిపోతుంది. మంచం కింద. చచ్చిందా? బతికే వుందా? వెళ్ళి చీపురు తీసుకు వస్తాడు. మంచం కింద వూడిస్తే అది బయటకు వస్తుంది. అంతే కసిగా దాన్ని చీపుర్తో కొట్టి కొట్టి చంపుతాడు.

తర్వాత తను వెళ్ళాల్సిన స్టుడియోకెళ్ళి తన వంతు వయోలిన్ వాయించడం అయ్యాక ఇంటికి తిరుగు ముఖం పడతాడు. రైల్వే స్టేషన్లో తన లోకల్ గురించి యెదురు చూపు. ప్లాట్ఫాం అవతల వొక మనిషి (ఆదిల్ హుస్సేన్) నిలబడి తదేకంగా తననే చూడడం గమనిస్తాడు. క్షణం, రెండు క్షణాలు కాదు నిరంతరం. తర్వాత అతనే ఇవతలి ప్లాట్ఫాం మీదకొచ్చి మీరు వయోలిన్ వాయిస్తారా అని అడుగుతాడు. మీకు వొక సెషన్ కు యెంత వస్తుందో దానికి రెట్టింపు ఇస్తాను, నా వెంట రావాలి, ఇప్పుడే రికార్డింగు అంటాడు. అతను తిప్పికొట్టలేని ప్రతిపాదన అది. కాని సందేహాలూ వుంటాయి. అడిగినా అతను వివరంగా చెప్పడు. అసలు ముప్పాతిక వంతు మౌనమే. మొహం కూడా చివరిదాకా సీరియస్ భావమే. భార్యకు ఫోన్ చేస్తాడు, అది స్విచ్ ఆఫ్ అని తెలుస్తుంది. ఇక అయోమయస్థితిలోనే అంగీకరిస్తాడు. ఆదిల్ చిత్ర దర్శకుడూ, సంగీత దర్శకుడూ కూడా అని చెప్తాడు. దానితో రిత్విక్ లో ఉత్సాహం వస్తుంది. ఆ విషయాలూ ఈ విషయాలూ ఉత్సాహంగా చెప్పడం మొదలు పెడతాడు. కాని ఆదిల్ దేనికీ స్పందించడు. ఈ లోగా మరిన్ని సార్లు భార్యకు ఫోన్ చేయడం అది స్విచ్ ఆఫ్ అని రావడం జరుగుతుంది. చర్చ్‌గేట్ వస్తుంది. అక్కడ దిగి టేక్సిలో వో పాడుబడిన బంగళా దగ్గరకు వెళ్తారు. చాలా పై అంతస్తులోని వొక గదిలోకి, అన్ని మెట్లూ యెక్కి వెళ్తారు. లోపల తక్కువ వెలుతురులో గది కి వో మూల బల్లపై రెండు కంప్యూటరులు, కాస్త సంగీత రికార్డింగుకు అవసరమైన సామగ్రి, వో కుర్చీ వుంటాయి . నేను చిత్రం స్టార్ట్ చేస్తాను, మొదట్లో సంగీతం వుండదు, యెక్కడ మొదలవ్వాలో నేను వేళ్ళతో 1,2,3,4 అని సూచిస్తాను. 4 అనగానే తెరపై కనపడుతున్నదాన్ని చూస్తూ వయోలిన్ సోలో వాయించాలి. నాకు వొక్క టేక్ లోనే అయిపోవాలి. నేను షూట్ చేసినా అంతే. అంటాడు. మానిటర్ మీద చిత్రం మొదావుతుంది. వొక soft porn. బాత్రూం లో స్నానం చేస్తున్న వో స్త్రీ. ఆమె అటు తిరిగి వుంటుంది. చేతిలోంచి సబ్బు జారడం, అది వెతుకుతూ నెమ్మదిగా ఇటు తిరగడం; అప్పుడు ప్రారంభం కావాలి నేపథ్య సంగీతం. వొక అక్షర కాలం ఆలస్యంగా మొదలవుతుంది. చిరాకు పడతాడు ఆదిల్. నీకు వాయించే వుద్దేశ్యం వుందా లేదా, నాకు వొక్క టేక్ లోనే అవ్వాలని చెప్పాను కదా; నీ కోసం ఇంకో అవకాశం ఇస్తున్నా ఈసారి కాకపోతే ఇక అంతే, అంటాడు. సరే నని అరగంటపాటు తన జీవితంలో మొట్టమొదటిసారి సోలో పర్ఫార్మన్స్ ఇచ్చి ఇంటికి బయలుదేరుతాడు, ఇచ్చిన డబ్బు పుచ్చుకుని.

“Art washes away from the soul the dust of everyday life”, Pablo Picasso అన్న వాక్యంతో చిత్రం ముగుస్తుంది.

ఈ చిత్రం యెందుకు చూడాలి? 35 యేళ్ళ క్రితం అరవిందన్ సినెమా “చిదంబరం” చూశాను. అసలే కొండలమీద నిశ్శబ్దాల నడుమ టీ తోటల్లో చిత్రీకరణ. అందులో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు. భార్య, భర్త, ఆ తోట మేనేజరు. యెక్కువ సంభాషణలు లేకుండా వాళ్ళ మనస్సులను చిత్రీకరించాడు, వాళ్ళ కళ్ళతో. ఇందులోనూ అదే విశేషం. నేను వ్యాఖ్యానంలో వ్రాసిన వాక్యాల కంటే ఇంకొన్ని సంభాషణలు యెక్కువ వుంటాయేమో. అంతే. మొత్తం ఆ పాత్రల హావభావాలే కథను చెబుతాయి. ముఖ్యంగా రిత్విక్. ఈ చిత్రం చూడకపోతే వో మంచి నటుడిని మిస్సయ్యేవాణ్ణి కదా అనిపించింది. మనిషికి యెన్ని రకాల ఉద్వేగాలుంటాయో అన్నీ అద్దంలా ప్రకటిస్తుంది అతని మోము. అంతే కాదు వేగంగా భావాలు మార్చగలగడం, కంఠ తీవ్రతను మార్చడం, టోన్ మార్చడం, బాడీ లేంగ్వేజ్ మార్చడం, వొకటేమిటి అన్నీ. నటనలో ఆసక్తి వున్నవారు దీన్ని చూస్తే మంచిది. ఇక ఆదిల్ మనకు తెలిసిన నటుడే. మంచి నటుడే. అతను తీసేది soft porn కాబట్టి చివరిదాకా ఆ విచిత్ర గాంభీర్యం అర్థం చేసుకోవచ్చు. కాని అలాంటి చిత్రాలలో కూడా నేపథ్య సంగీతంగా వెస్టర్న్ వయోలిన్ సంగీతం అవసరమా? రిత్విక్ లాగే పైకి రాని కళాకారుడా అతను? ఇవన్నీ ప్రశ్నలే.

ఆవిక్ ముఖోపాధ్యాయ చాయాగ్రహణము యెప్పటిలాగే గొప్పగా వుంది. ఈ మధ్యే వచ్చిన అక్టోబర్ గుర్తుందా? రోజులో ఆ టైం ని బట్టి లైటింగ్ వాడటం, ఆ చీకటిగదిలో కూడా రిత్విక్ ముఖమ్మీద పట్టిన చెమటను, అతని కళ్ళనూ పట్టడం, మామూలు దృస్యాన్ని పేంటింగ్ లా చేస్తాయి. ఇక సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినెమా లో చాలా వరకూ incidental sounds మాత్రమే వుంటాయి, రైలు చప్పుడు, స్టేషన్ లో అనౌన్స్మెంట్లు లాంటివి. సంగీతం అవసరమైన చోట్ల భాస్కర్ దత్తా, అర్నబ్ చక్రబర్తి లు మొజార్ట్, బీతోవెన్, చాయ్కోవస్కీలాంటి మహామహుల సంగీతాన్ని పునః సృష్టించారు. సంగీత జ్ఞానం వున్న వాళ్ళకి ఇది అదనపు అలంకారంలా భాసిస్తుంది. ఇక సినెమా టెక్నికుల్లో, వొకటి fade in-fade out. అది ఇందులో నిడివి యెక్కువ వున్న అంశం. ప్రతిసారి రిత్విక్ కళ్ళు మూసుకోవడంతో మమేకమవుతుంది. అతను కళ్ళు మూసుకున్నప్పుడంతా తన లోపలి ప్రపంచంలోకి వెళ్తాడు. వొక్క చివరి సారి తప్ప.

సినెమాని వొక కళా రూపంగా చూడడానికి ఇష్టపడే వాళ్ళు దీన్ని చూస్తే సంతోషిస్తారు. సినెమాలో ఉత్సాహం వున్న వాళ్ళను కూడా ఇది ఆకర్షిస్తుంది.

Exit mobile version