గూఢచారి లాంటి The Wedding Guest

0
2

[box type=’note’ fontsize=’16’] “మానవ స్వభావాలు, మన (భారత పాకిస్తాన్) దేశాలలో స్త్రీల ఎంపిక చేసుకునే స్వేచ్చ గురించి ఇంకా చాలా చెప్పడానికి వస్తువు వుంది. పూర్తిగా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యలేదు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ద వెడ్దింగ్ గెస్ట్’ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] సారి 2018 లో తీసిన బ్రిటిష్ చిత్రం ద వెడింగ్ గెస్ట్. దేవ్ పటేల్ నటించిన, నిర్మించిన చిత్రం. దర్శకుడు వివిధ జానర్లలో చిత్రాలు తీసిన మైకల్ వింటర్బాటం.

పాకిస్తాన్ నుంచి ఇండియాకి ప్రయాణమవుతున్నాడు జయ్ (దేవ్ పటేల్). మొదట్లోనే అతను సూట్కేస్ సర్దుకుంటూ అందులో అనేక్ పాస్ పోర్టులు పెట్టుకోవడం చూపిస్తారు. తర్వాత రకరకాల పేర్లతో కదిలినా, ఇక్కడ చివరిదాకా జయ్ పేరుతోనే వ్యవహరిస్తాను. తన మిత్రుని పెళ్ళికి వెళ్తున్నట్టు మొదట్లో చెప్పుకున్నా అది కేవలం పెళ్ళికి వెళ్ళడం కాదని తొందరగానే అర్థమవుతుంది. ముందు పాకిస్తాన్ లోని పట్టణాలు, వీధులు అన్నీ చూసుకుంటూ, రకరకాల పేర్లతో కార్లు అద్దెకు తీసుకుంటూ, వొకసారి పెళ్ళి విడిదికీ, పెళ్ళికూతురు ఇంటికీ వెళ్ళి వో రెక్కే చేస్తాడు. జత గన్నులు కొంటాడు. సూట్కేసు, టేపు వగైరా కావలసినవి కొంటాడు. వొక పక్కా ప్రొఫెషనల్ లాగా. పాకిస్తాన్ లో పుట్టి లండన్లో పెరిగిన సమీర (రాధికా ఆప్టే) వివాహం ఆమె ఇష్టానికి విరుధ్ధంగా జరగబోతుంది. జయ్ ఆ పెళ్ళికి ఆహ్వానితుడుగా, అతిథిగా వెళ్ళి ఆమెను కిడ్నాప్ చేసి ఆమె దీపేష్ (జిం సర్భ్) అనేప్రేమికుడికి అప్పచెప్పాలి. ఆ పని చేసినందుకు అతనికి డబ్బు బాగానే ముడుతుంది. ఇదివరకు ఇలాంటివి ఎన్ని చేశాడో తెలీదు గాని, పక్కా వృత్తినైపుణ్యంతో చేస్తాడు. పాకిస్తాన్ నుంచి, భారత దేశానికి తీసుకెళ్ళి అక్కడ సంకేత స్థలంలో దీపేష్ కి అప్పచెప్పాలి. అయితే కొంచెం గడబిడ అవుతుంది. కిడ్నాప్ చేసి పారిపోతున్న క్షణాన వాచ్మన్ చూసి అడ్డుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో అతన్ని చంపాల్సి వస్తుంది. అనుకున్నట్టుగా ఇండియాకు చేరుకున్నా అనుకున్నట్టుగా దీపేష్ రాడు. కారణం ఇప్పుడు ఈ హత్య కారణంగా వారు వార్తల్లో ఎక్కి, పోలీసు నిఘాలో వుంటారు. తనకి ప్రమాదం. కాబట్టి అతను ఇవ్వాల్సిన మిగతా మొత్తం జయ్ కి ఇచ్చేసి తప్పుకోవాలని చూస్తాడు. ఇప్పుడు జయ్, సమీరా మాత్రం మిగిలారు. జయ్ కు దీపేష్ చెప్పినది ఆమెను తిరిగి పాకిస్తాన్లో ఎక్కడన్నా వదిలి తన దారి చూసుకొమ్మని. దానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెబితే దానిక్కూడా ఒప్పుకుంటాడు. కాని సమీరా తాను తిరిగి ఇంటికి వెళ్ళదలచలేదు. పాకిస్తాన్ కైనా కనీసం దీపేష్ ను వొక్కసారన్నా కలవకుండా వెళ్ళనంటుంది. వాళ్ళిద్దరినీ చివరిసారి కలపాలని అన్ని ఏర్పాట్లు చేస్తాడు జయ్. వాళ్ళు కలిసినప్పుడు ఇద్దరి మధ్యా గొడవ అవుతుంది, దీపేష్ సమీరా మీద చెయ్యి చేసుకుంటాడు. ఈ సారి పెనుగులాటలో జయ్ చేతిలో దీపేష్ మరణిస్తాడు. ఇంత సేపూ వాళ్ళు ప్రేమ కారణంగా ఇంత నాటకం ఆడారు అనుకుంటున్న జయ్ కి తెలుస్తుంది అసలు కారణం వేరని. డైమండ్ వ్యాపారస్తుడైన జయ్ తన తండ్రి కన్నుగప్పి కొన్ని బహుమూల్యమైన రంగురాళ్ళు దొంగలిస్తాడు. వాటిని అమ్మేసి ఆ సొమ్మును సమీరా తో పంచుకోవాలని ఒప్పందం. కాని కథ రెండు సార్లు అడ్డం తిరిగింది. వీళ్ళు రకరకాల పేర్లతో తిరుగుతున్నా రోజూ వార్తల్లో ఎక్కుతూనే వుంటారు.

ఆ తర్వాతి కథ అమేజాన్లో చూడండి. జయ్, సమీరా దగ్గరయ్యారు కదా, కలిసి పారి పోతారా? పట్టు బడతారా? జయ్ రాటుదేలిన గూండానా? సమీరా మనసులో ఏముంది? ఇలాంటివి మనల్ని సినెమా కన్నార్పకుండా చూసేలా చేస్తాయి.

దేవ్ పటేల్, రాధికా ఆప్టేల నటన బాగుంది. దర్శకత్వం రచనా రెండూ మైకల్ వే. దర్శకత్వం బాగానే వున్నా, రచన కొంత అసంత్రుప్తికరంగా వుంది. చివరి దాకా సస్పెన్స్ చిత్రంగా నడిచినా ఇందులో మానవ స్వభావాలు, మన (భారత పాకిస్తాన్) దేశాలలో స్త్రీల ఎంపిక చేసుకునే స్వేచ్చ గురించి ఇంకా చాలా చెప్పడానికి వస్తువు వుంది. పూర్తిగా దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యలేదు. చాయాగ్రహణం, సంగీతం సినెమా నడకకు తగ్గట్టుగా బాగున్నాయి. గొప్ప చిత్రం కాదు గాని, వొక సారి చూడతగ్గ చిత్రమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here