Site icon Sanchika

ది వరల్డ్ ఎండింగ్ ఫైర్ – పుస్తక పరిచయం

[dropcap]ఈ[/dropcap] పరిచయం అమెరికాకు చెందిన కవి, రచయిత, దార్శనికుడు మరియు రైతు అయినటువంటి వెండెల్ బెర్రీ రాసిన వ్యాసాల సంకలనం “The world-ending fire” గురించి. హద్దుల్లేని పారిశ్రామీకరణ అన్నది ప్రపంచాన్ని కబళించి వేసే దావానలం వంటిదని బెర్రీ రాసిన ఒక వ్యాసంలోని వాక్యం ఆధారంగానే ఈ వ్యాస సంకలనానికి The world-ending fire అన్న పేరు పెట్టారు సంపాదకులు. ఈ పుస్తకం నేను అమెజాన్లో కొన్నప్పుడు ఐదు వందల రూపాయల లోపే దొరికింది ఇప్పుడు ధర పెరిగినట్టుగా ఉంది.

నేను వెండెల్ బెర్రీ రచనలు ఇంచుమించుగా రెండేళ్ల బట్టి చదువుతున్నాను. ఆయనకి ఇప్పుడు 86 ఏళ్ళు. 1960 నుంచి ఇప్పటి దాకా గ్రామీణ అమెరికా సమాజంలో జరిగిన మార్పుల గురించి తెలుసుకోవాలని అనుకునే వారు తప్పక చదవాల్సిన రచనలు ఇవి.

“అరే ఇవాళ నగరం ఒక చంబల్ వ్యాలీ గ్రామం దేశానికి కూలీ” అన్న గుంటూరు శేషేంద్ర శర్మ కవితకు అమెరికా గొంతుక వెండెల్ బెర్రీ. ఐదారు దశాబ్దాలలో అమెరికాలోని పల్లెటూళ్లు అభివృద్ధి, నగరీకరణ, పారిశ్రామీకరణ, ఆధునికత వగైరాల ప్రభావానికి లోనై ఏమి కోల్పోయాయి ఏమి మిగుల్చుకున్నాయి అన్న విషయంపై వెండెల్ బెర్రీ రాసినంతగా రాసిన రచయిత మరొకరు లేరు. వెండెల్ బెర్రీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా 2011లో నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ తో సత్కరించారు

నాకైతే అమెరికావారి వేయిపడగలను చదివినట్టుగా అనిపిస్తుంది వెండెల్ బెర్రీని చదువుతున్నపుడు అప్పుడప్పుడు. విశ్వనాథకు మల్లే బెర్రీను కూడా తిరోగమనవాది అనీ , కాలచక్రాన్ని వెనక్కి తిప్పే ప్రయత్నం చేస్తున్న వాడనీ, అభివృద్ధి నిరోధకుడనీ, టెక్నాలజీ వ్యతిరేకనీ ప్రగతి విరోధకుడనీ ఇలా రకరకాలుగా విమర్శించేవారు ఉన్నారు. 1964లో న్యూయార్కులో విశ్వవిద్యాలయంలో ఉన్నత పదవిని వదులుకొని తన పూర్వీకుల గ్రామంలో పొలం ఒకటి కొనుక్కొని అప్పటి నుంచీ అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు బెర్రీ. తన సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే రచనా వ్యాసంగం కొనసాగించారు ఆయన.

1988లోనే “Why i am not going to buy a computer” అని ఒక వ్యాసం రాసారు బెర్రీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్యూటర్ , సెల్ ఫోన్ లేకుండానే బతికేస్తున్నారట ఆయన. ఆయన రచనలు చాలా కూడానూ 1950ల కాలం నాటి టైప్ రైటర్ మీద టైపు చేసి పబ్లిషర్లకు పంపినవేనట. ఇది ఒక అలోచనాధార. దానిలోని తత్వాన్ని అర్థం చేసుకొని మన జీవన విధానాల్లో సాధ్యమయ్యే మార్పులు చేసుకోవాలి. కనీసం ఆ దిశగా ఆలోచన చేయాలి. అంతే. అంతకు మించి ఇప్పటికిప్పుడు ఈ క్షణమే అందరూ కంప్యూటర్లు వాడటం మానేసి చొక్కాలు చింపుకొని బికారులు అవ్వండని కాదు అర్థం.

నేను అమెరికాలో బతికింది లేదు. వృత్తిరీత్యానో టూరిస్టుగానో వెళ్ళింది కూడా లేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు టికెట్టు కొనుక్కొని వెళ్లినా కూడానూ 1960-70ల నాటి గ్రామీణ అమెరికాకు వెళ్ళలేను. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలే దిక్కు. 1927లలో ప్రఖ్యాత అమెరికన్ రచయిత ఆల్డాస్ హాక్స్లీ (Aldous Huxley) ఇలా అన్నారు “The future of America is the future of the world” అని. అంటే అన్ని దేశాలు అమెరికా అభివృద్ధి నమూనాను గుడ్డిగా అనుసరించటం తథ్యమని ఆయన దశాబ్దాల ముందే ఊహించారు. భారత దేశం అభివృద్ధి నమూనా కూడా ఇదే ఇప్పటికైతే. కాబట్టి వెండెల్ బెర్రీని తప్పకుండా చదవాలి భారత దేశపు బుద్ధిజీవులు. ఇటువంటివి చదివినప్పుడే మనం ఎటు పోతున్నామో ఏం కోల్పోతామో తెలుస్తుంది మనకు.

1968 నాటి వ్యాసం ఒకదాంట్లో వెండెల్ బెర్రీ నేటివ్ అమెరికన్ జాతుల వారి ప్రస్తావన తెస్తారు. తన పూర్వీకులు ఈ దేశానికి వలస వచ్చి ఇక్కడి నేటివ్ అమెరికన్ల జీవన విధానాన్ని ధ్వంసం చేసిన విధానం తనను నిరంతరం బాధ పెడుతూనే ఉంటుందనీ అంటారాయన. అయితే ఈ నేటివ్ అమెరికన్ జాతుల వారు కానీ ఆధునికత అంతగా అలవడని ప్రాచ్య దేశాల వ్యవసాయదారులు కానీ నేలను ప్రేమతో అభిమానంతో చూసుకున్నారని పారిశ్రామికీకరణ తర్వాత మారిన వ్యవసాయ విధానం దీనికి విరుద్ధంగా ఎంతో విధ్వంసంతో కూడుకున్నదనీ అంటారాయన.

అమెరికన్ ఇండియన్లకు ప్రాచ్య దేశాల వారికీ రోడ్డు అవసరం ఎప్పుడూ లేదనీ, వేల సంవత్సరాలు వారు రోడ్లు లేకుండానే సుఖంగా బతికారనీ, వారికి కేవలం నడకకు అనువైన దారి చాలని అంటారాయన. రోడ్లు కట్టే సంస్కృతి స్వంత ఊరంటూ లేని ఆక్రమణదారుల సంస్కృతని అంటారు బెర్రీ. యూరోపు వదిలేసి అమెరికాకు వలస వచ్చిన తెల్లవారికి ఈ రోడ్ల అవసరం వచ్చిందని , రోడ్డు అన్నది కేవలం ఒక చోట నుంచి మరొక చోటికి వెళ్ళటానికి నిర్మించుకున్నది కాదనీ, చుట్టుపక్కల పరిసరాలను పట్టించుకోకుండా వాటితో సంబంధం లేకుండా వేగంగా ప్రయాణం ముగించుకోవాలని అనుకొనే వారికే రోడ్డు కావాల్సి వస్తుందనీ అంటారు బెర్రీ. నవ్య అమెరికా నాగరికతకు రోడ్డు అన్నది ప్రధానమని, నేటివ్ అమెరికన్ జాతుల వారికి ఆ రోడ్డుతో పనిలేదని, ఇది ఈ రెండు సంస్కృతుల దృక్కోణంలో ప్రధానమైన వైరుధ్యమని చెప్పుకొస్తారు వెండెల్ బెర్రీ.

నాకేది మంచిదో అది సమాజానికి కూడా మంచిదే అవుతుందని అనుకొని తన వ్యక్తిగత ఇష్టాలకు అనుగుణంగా తనకు నచ్చిన పని చేయటానికీ , తద్భిన్నంగా, ముందైతే సమాజానికి ఏది మంచిదో గుర్తించి అదే చివరకు తన మంచికి కూడా తోడ్పడుతుందని గ్రహించి ఆ పని చేయటానికి పూనుకోవటానికి చాలా తేడా ఉందనీ అంటూ ప్రాచీన జీవన విధానానికి ఆధునిక సమాజానికి గల తేడాను ఎత్తి చూపుతారు బెర్రీ.

సగటు అమెరికన్ రైతు సంతానం చాలా వరకు పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారనీ, పల్లెల్లో ఎవరూ ఉండట్లేదని, నిజానికి చిన్న రైతు చేతి పనిముట్ల వారు హస్త కళాకారులు అనే వారు అమెరికన్ గ్రామాలలో కనుమరుగు అయిపోతున్నారనీ, చివరకు ఈ భూములన్నీ యాంత్రిక వ్యవసాయానికి కార్పొరేషన్లకు దాసోహం అవ్వల్సినవేననీ వాపోతారు బెర్రీ 1970/80 కాలం నాటి మరొక వ్యాసంలో.

ఇప్పటి అమెరికాలో రెండు శాతం కంటే తక్కువే రైతులు ఉన్నారు జనాభా ప్రాతిపదికన. అసలు అమెరికాలో వ్యవసాయదారులు ఉండనక్కర్లేదని, రైతు లేకపోతే పెద్ద నష్టమేమీ లేదని , అంతకంటే వేరే వృత్తుల ద్వారా వ్యాపారాల ద్వారా సంపద పెంపొందించుకోవచ్చని, వ్యవసాయం పూర్తిగా యంత్రాలతో జరిపించచ్చని వాదించే మేధావులు కూడా నేటి అమెరికాలో ఉన్నారని అంటారు మరొక చోట బెర్రీ. ఇదంతా కూడాను “efficiency” అంటే సామర్థ్య బలం అన్న కారణం చేత మంచి మార్పేనని చాలా మంది వాదిస్తారనీ అయితే ఆ ఆలోచన తప్పని అంటారు బెర్రీ. సన్నకారు రైతు అనేవాడు నేలతో మట్టితో ప్రేమ అనురాగం కలిగి ఉంటాడని, తాత్కాలిక లాభం కోసం వాడు నేలను ధ్వంసం చేయడనీ, కార్పొరేషన్లు లేదా యాంత్రిక బలంపై ఆధారపడే వ్యవసాయం ఇటువంటిది కాదని , అది తర్వాతి తరాల జీవనోపాధి గురించి ఆరోగ్యం గురించి ఆలోచించదనీ, అది కేవలం తాత్కాలిక లాభాల వ్యామోహంతో చేసే వ్యవసాయమని అంటారు బెర్రీ.

వృద్ధాప్యం వలన రైతు చనిపోతే అతని స్థానాన్ని భర్తీ చేయటానికి తర్వాతి తరం అన్నది రావట్లేదని, యువకులు చేతికి అందొచ్చే వయసు రాగానే పట్నాలకు వలస పోతున్నారని, ప్రతి సమస్యకూ సామర్థ్య బలం (efficiency) పోటీ (competition) నూతన ఆవిష్కరణలు (innovation) అనేవి సమాధానంగా చూపించి అన్ని మార్పులు మంచివే అని సర్ది చెప్తున్నారని అది సరైన దృక్పథం కాదని అంటారు బెర్రీ.

యాంత్రిక పద్ధతిలో కార్పొరేషన్ల పైన ఆధారపడి సాగించే వ్యవసాయం అన్నది ఒక వక్త ప్రేక్షకులను పట్టించుకోకుండా ఏకధాటిగా ఉపన్యాసం ఇవ్వటం వంటిదంటారు బెర్రీ. నాకు ఫలానా కావాలి అని చెప్పి ప్రకృతి నుంచి అది లాక్కోవటం మాత్రమే ఆ పద్ధతికి తెలుసని భూమితో సంభాషించే లక్షణం ఆ వ్యవసాయానికి లేదని అంటారాయన. సంప్రదాయ వ్యవసాయదారుడు నేలతల్లితో సంభాషిస్తాడనీ ఆ సంభాషణ రెండు వైపులా సాగుతుందని అదే సరైన పద్ధతనీ అంటారు బెర్రీ.

పారిశ్రామిక పద్ధతుల ద్వారా చేసే యాంత్రిక వ్యవసాయం భూమిని బలాత్కారం (రేప్) చేయటం వంటిదని ఇక మీదటైనా ఈ విషయంలో మనం శాశ్వతమైన వివాహబంధం గురించి ఆలోచించాలని అంటారు వెండెల్ బెర్రీ. ఇది 1989 నాటి మాట! అమెరికాలో కూడా ఇటువంటి వాదన వినిపించే వారున్నారు అంటే ఆశ్చర్యమే! అయితే ఈ వాదనలను ఆ దేశం పట్టించుకున్న దాఖలాలు లేవు. మన దేశంలో కూడా జనాభాలో వ్యవసాయదారుల శాతం రెండు మూడు శాతానికి పడిపోతే అపుడు మన సమాజ స్వరూపం ఎలా ఉంటుందో ఏమో. ఈ మార్పు పాడి పరిశ్రమలో కూడా కనిపిస్తుంది. కన్నతల్లి బిడ్డకు పాలిచ్చే పద్ధతికి ఫ్యాక్టరీలలో వేలకొలది జంతువుల నుంచి ఒకేసారి యాంత్రిక పద్ధతుల ద్వారా పాలు పిండే పద్ధతికి చాలా తేడా ఉంది!

1988లో రాసిన మరొక వ్యాసంలో పర్యావరణ పరిరక్షణ గురించి ప్రకృతి వైపరీత్యాల గురించి ప్రస్తావిస్తారు బెర్రీ. కమ్యునిజంలోనూ క్యాపిటలిజం లోనూ ఈ విపత్తు నుంచి బయట పడటానికి సమాధానం వెతకలేమని అంటారు బెర్రీ. క్యాపిటలిస్టు ఫ్రీ మార్కెట్టు పేరు మీదో సామర్థ్య బలం అంటే efficiency పేరు మీదో తాత్కాలిక కష్టాలను మార్పులను దిగమింగుకొమ్మని చెప్తాడని బంగారు భవిత మరియు అపరిమిత సంపద సుఖం అన్నది భవిష్యత్తులో లభిస్తుందని ఆశ చూపిస్తాడనీ అంటారు బెర్రీ. కమ్యూనిస్టు కూడా బంగారు భవిత అనే ఆశను చూపి సమాజ శ్రేయస్సు కోసం కొంతమంది కష్టాలను దిగమింగుకోక తప్పదని వాదిస్తాడని అంటారాయన. ఈ రెండు ఆదర్శాలలో కూడాను స్థానిక సంస్కృతులు, గ్రామీణ జీవన విధానాలు నిలబడలేవని అంటారు బెర్రీ. సామర్థ్య బలం (efficiency) అనే లాజిక్కును ఉపయోగిస్తే ముందు శ్రామికులలో ఎక్కువ జీతం వారు తక్కువ జీతం వారి వలన అంటే చీప్ లేబర్ వలన ఉపాధి కోల్పోవలసి వస్తుందనీ , తర్వాత ఆ చీప్ లేబర్ స్థానే యంత్రాలు వస్తాయని, పోటీ ప్రపంచ న్యాయ సిద్థాంతం యుద్ధనీతి వంటిదని, యుద్ధంలో చివరికి గెలిచేది ఒక్కడేనని, ఈ విధానం వలన మోనోపోలీ కార్పొరేషన్ల హయాంలో అందరూ బతకాల్సి వస్తుందనీ అంటారు బెర్రీ. అందుకనే ఆనంద కుమారస్వామి వంటి మేధావి పారిశ్రామీకరణను mammon of injustice, అంటే , అన్యాయానికి నిలువెత్తు ప్రతిరూపంగా అభివర్ణించాడని అంటారు బెర్రీ.

మనకు కావలసినది సంపదతో అలరారే వేలకొలది బలమైన స్థానిక ఆర్థిక వ్యవస్థలనీ, ప్రతీ గ్రామం స్వయం సమృద్థిగా ఉండే వ్యవస్థ అవసరమని , నగరీకరణ కేంద్రీకృత పారిశ్రామీకరణ కాదని అంటారు బెర్రీ. తాను ఉండే గ్రామాల చుట్టూతా న్యూయార్క్ న్యూ జెర్సీ పెన్సిల్వేనియా వంటి మహా నగరాల రాష్ట్రాల నుంచి ప్రతీ రోజు ట్రక్కుల నిండా చెత్త వచ్చి పడుతుందని, ఇది అమానుషమైన హేయమైన జీవన విధానమనీ అంటారు బెర్రీ. నిజానికి పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు ముందున్న పరిస్థితులు లేవని, వారు కూడా నగర జీవులకు నకళ్ళుగా మారిపోతున్నారనీ, నిజానికి పల్లె జీవుల రోజువారీ వ్యర్థాలను పట్నపు వాసుల రోజువారీ వ్యర్థాలను ఒక చోట కుప్పగా పేరిస్తే ఏది ఎవరిదో చెప్పటం కష్టమేనని అంటారాయన. జీవన విధానాలు అంతగా మారిపోయాయని ఆయన భావం. పల్లెటూరి వారి కోరికలు కూడా టీవీ వంటి సమాచార మాధ్యమాల ద్వారా వెల్లువలా వచ్చిపడ్డ సేల్సుమెన్ల ప్రకటనల ప్రభావంలో పుట్టుకొచ్చిన కోరికలేనని వారి జీవన ప్రమాణాలను కూడా పట్టణ ప్రజలకు మల్లే వ్యాపార దిగ్గజ సంస్థల్లోని మేధావులే నిర్ణయిస్తారని అంటారు బెర్రీ.

నిజానికి కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఇరుగు పొరుగు వారితో చీకటి పడే వరకు కబుర్లు చెప్పుకొని కథా కాలక్షేపం చేసే సంస్కృతి అమెరికా గ్రామాలలో ఉండేదని అంటారు బెర్రీ. ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారని, అవసరం వస్తే సాయానికి మనిషి ఉండే వాడని, వారికి అంతులేని సంపద లేకపోయినా కూడాను వారికంటూ ఒక స్థానీయ ఆర్థిక వ్యవస్థ ఉండేదని, అది వారి కనీస అవసరాలకు సరిపోయేదనీ అంటారు బెర్రీ. అసలు imported pleasure అంటే ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్న సౌఖ్యాల ప్రస్తావన లేకుండా సంభాషించే శక్తిని మనం ఇప్పుడు కోల్పోయామని అంటారు బెర్రీ. ప్రతి నిమిషము ఎవరో ఒకరు ప్రకటనల ద్వారా ఏదో ఒకటి మనకి అమ్మటానికి ప్రయత్నిస్తూనే ఉండే రోజులు ఇవని అంటారాయన. నిద్రపోయే సమయంలో కూడా టీవీ ద్వారానో మరే ఇతర సాధనాల ద్వారానో మనం ఈ వ్యాపార ప్రకటనల ప్రపంచంలోనే బతుకుతున్నామని అంటారు బెర్రీ. నిజానికి ఒక నలభై యెనిమిది గంటలు విద్యుత్తు సరఫరా నిలిచిపోతే మనలో చాలా మందికి ఇరుగు పొరుగు వారితో సంభాషించే శక్తి లేదని, ఇప్పుడు తమ కథలు పొరుగింటి వారికి ఎవరూ చెప్పుకోరని, డాక్టర్లతో, లాయర్లతో, సైకియాట్రిస్టుతో మాత్రమే మనసు విప్పి అవసరానికి అనుగుణంగా మన మనసులోని బాధలను కథలను పంచుకుంటున్నామని, ఇరుగు పొరుగుతో ముచ్చట్లు పెట్టుకోవటం మనం మర్చిపోయిన విద్యని అంటారు బెర్రీ. ఒకవేళ కథ చెప్పుకున్నా కూడాను మనం చెప్పుకునే కథలకు స్క్రిప్టు న్యూయార్క్ లొనో లాస్ ఏంజిల్స్ లోనో ఏదో వ్యాపారి రాసి ఉంటాడని, మన కథలో మన స్థానిక సంస్కృతి పాలు చాలా తక్కువని అంటారు బెర్రీ. స్థానిక సంస్కృతులు స్థానీక ఆర్థిక వ్యవస్థలు మూలలతో సహా పెకిలింప వేయబడుతున్నయని వాపోతారు బెర్రీ. నిజానికి నలభై ఎనిమిది గంటలు విద్యుత్తు సరఫరా నిలిచి పోతే కిటికీలు లేని మన బడులు , ఎయిర్ కండిషన్ ఉంటే తప్పితే పనిచేయని ఆఫీసులు అతలాకుతలం అయిపోతాయని అంటారు బెర్రీ.

మొన్నామధ్య ఆఫీసు విషయమై అమెరికాకు చెందిన ఒక సహోద్యోగితో మీటింగు పెట్టుకున్నాను. కొన్ని గంటలు ఆలస్యంగా వచ్చింది ఆ అమ్మాయి. ఏంటి మరి ఇంత లేటుగా వచ్చావు అంటే మా ఇంట్లో కరెంటు పోయింది , అలా అప్పుడప్పుడు కరెంటు పోతే మా ఇరుగు పొరుగులో పెద్ద వేడుక జరుగుతున్నట్టే. అలా కరెంటు పోతేనే అందరం ఇళ్ళ బయటకు వచ్చేది. వాళ్ళందరితో చాలా సేపు ముచ్చట్లాడుకొని ఇంటికొచ్చేసరికి ఇదిగో ఈ వేళ అయ్యింది అని వాపోయింది ఆ అమ్మాయి. వెండెల్ బెర్రీను తలచుకున్నాను అప్పుడు నేను.

ఎండవల్లి భారతి గారి “ఎదారి బతుకులు” చదివాను మొన్నా మధ్యన. అందులో ఇటువంటిదే ఒక వాక్యం ఉంటుంది “పేరుకు నూరిండ్లు ఉండే ఊరు మాది. అయినా వీదిలో పిట్టగూడా లేదు. ఈ పొద్దే కాదు, ఈ టీవీలు వచ్చినబ్బుటి నింటి ఇంతే. పగులుగానీ రెయ్యిగానీ ఇండ్లకివతల తలకాయే కనబడేది లేదు. ఇందరుండే ఊర్లో అందరమూ ఒంటిగాళ్లము అయిపోతిని” అని. గ్రామీణ అమెరికా విధ్వంసం గురించి వాపోయిన వెండెల్ బెర్రీ అయినా ఎండవల్లి భారతి అయినా వేయిపడగల విశ్వనాథ అయినా మనిషికి మనిషికి మధ్యన ఏర్పడిన ఈ అగాధం గురించే రాసింది ఆధునికత మన సమాజంలో తెచ్చిన పెను మార్పుల గురించే ప్రస్తావన.

అదిలాబాద్ కళా ఆశ్రమం స్థాపించిన గురూజీ రవీందర్ శర్మ ఒక మాట అంటారు. కార్ఖానాలు చిన్నవిగా ఉన్నప్పుడు కుటుంబాలు పెద్దగా ఉండేవని కార్ఖానాలు పెద్దయ్యే కొద్దీ కుటుంబాలు చిన్నవయిపోయాయని అంటారాయన. ఉరుకుల పరుగుల జీవితాలలో పడి ఇప్పుడివన్ని ఆలోచించే సమయం లేదు మనకు.

స్థానీక కుటుంబ పరంపరలు తెగి పడుతున్నాయని వారసత్వాలు కొనసాగట్లేదని తరాల కొలదీ ఒకటే చోట ఉండే వ్యవస్థ ఇప్పుడు లేదని అంటారు బెర్రీ. రవీందర్ శర్మ గారు కూడా ఇలాగే అంటారు ఒక చోట ఇప్పుడు మనం అందరం సంచార జాతుల వారి వలె బతుకుతున్నామని. Nomadic lifestyle!

పల్లెటూళ్ళలో తల్లితండ్రులు చనిపోతే పిల్లలు పట్నాలకు వలస పోతే ఊళ్ళ లోని భూములను గుర్తు తెలియని కొత్త వ్యక్తులకు అమ్ముకుంటున్నారని అంటారు బెర్రీ. అయితే ఈ వలస వెళ్లాల్సిన అవసరాన్ని కూడా గ్రామాలకు వెలుపల కేంద్రీకృతమైన ఆర్థిక వ్యవస్థలు సృష్టస్తున్నాయని గ్రామాల స్వయం ప్రతిపత్తి అన్నది నాశనం అయిపోయిందని అంటారు బెర్రీ. పట్నాలకు వెళితే వెళ్ళారు కానీ తిరిగి వచ్చే ఉద్దేశంతో చాలా తక్కువ మంది వెళ్ళతున్నారని నిజానికి ఉన్న చోటును వదిలి వెళ్ళటమే ఈ యుగ లక్షణం కానీ తిరిగి రావడం అన్నది నేటి మన జాతి లక్షణం కాదని అంటారు బెర్రీ. పారిశ్రామిక సమాజాలలో కుటుంబ పరంపరానుగత వృత్తులకు కొనసాగింపు ఉండదని, పిల్లల లక్ష్యం తల్లితండ్రుల వారసత్వాన్ని కొనసాగించటం కాదనీ, అంతకు మించి ఇంకేదో సాధించటమే వారి లక్ష్యమని అందుకోసమే ఎదుగుదల కోసమో ఉపాధి కోసమో వలసలు జరగటం అనేది మన జాతి లక్షణంగా మారిందని అంటారు బెర్రీ. స్కూళ్ళలో కూడా సొంత గూటికి తిరిగి వెళ్ళమని చెప్పరనీ ఇంటిని వదిలి సొంత ఊరిని వదిలి వేరే ఎక్కడికో వెళ్ళి ఇంకేదో సాధించాలని నూరిపోయటమే మన స్కూళ్ళ లక్ష్యమని అంటారు బెర్రీ.

సరే ఈ సొదంతా మాకెందుకు ఆయన మనకిచ్చిన ప్రధాన సందేశం ఏమిటి ఈ వ్యాసాల సంకలనం ద్వారా అని అంటారేమో. ఇదిగో ఈ వాక్యం చూడండి.

“The only true and effective operator’s manual for spaceship Earth is not a book that any human will ever write. It is hundreds of thousands of local cultures”

ఈ భూమండలమనే పెద్ద అంతరిక్ష నౌకను సమర్థవంతంగా నడపటం ఎలా అనే ప్రశ్నకు సమాధానం అన్నది ఎవరో ఒక వ్యక్తి రాసే పుస్తకంలో ఉండదని ఆ ప్రశ్నకు సమాధానం వందల వేల స్థానిక సంస్కృతులలో వెతకాలని అంటారు బెర్రీ. ఆ సమాధానం మనకు దొరకాలంటే స్థానిక సంస్కృతులు బతకాలి . భాషలు బ్రతకాలి. ఆర్థికంగా ఆ సమాజాలు నిలదొక్కుకోగలగాలి. ఈ కాలంలో ఇవన్నీ సాధ్యమేనా అని అంటాము మనము ఇటువంటివి చదివినప్పుడు. ఇదిగో నేను భేషుగ్గా బతుకుతున్నా కదా అంటాడు వెండెల్ బెర్రీ.

జాతీయ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ప్రాంతీయ సంస్కృతుల వినాశనం తప్పదు అనే పరిస్థితి పోవాలని అంటారు బెర్రీ. మన కాలం అంతా కేంద్రీకరణ దిశగా ప్రయాణం. బెర్రీ వంటి మేధావుల దృక్పథం అంతా ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికేంద్రీకరణ దిశగా. ఒక మహా ప్రవాహానికి ఎదురీదుతూ భావి తరాలకు మార్గదర్శకత్వము చేసే మేధావులు ఇటువంటి వారంతా.

చిన్నకారు రైతు, చిన్న పొలము, స్థానికంగా వ్యాపారం సాగించే చిరు వ్యాపారి, స్వతంత్రంగా పని చేయగలిగే హస్త కళాకారుడు మెల్లగా అమెరికాలో కనుమరుగు అయిపోయారు అంటారు బెర్రీ. నిజానికి పీల్చటానికి గాలి తప్పితే వేరే ఏదీ కూడాను ఇతర వ్యవస్థల మీద ఆధారపడకుండా దొరికే పరిస్థితి ఇప్పటి ఆధునిక జీవనంలో లేదని అంటారు బెర్రీ. నేటివ్ అమెరికన్ సంస్కృతి అంతా కూడానూ ఆర్థిక స్వయం ప్రతిపత్తి అన్నది కోల్పోయి బయటి వ్యాపారుల మీద ఆధార పడే పరిస్థితి రావటం వల్లనే నాశనం అయిపోయిందని అంటారు.

1977 ప్రాంతంలో రాసిన ఒక వ్యాసంలో పర్యావరణ సమతౌల్యం గురించి ఒక మంచి మాట రాశారు బెర్రీ. మన పర్యావరణ సమస్యలకు మూల కారణం ఇంధన వనరుల దురుపయోగమేనని, బొగ్గు బదులు సూర్య రష్మి మీదనో మరేదో ఇతర మాధ్యమం మీదనో ఆధార పడితే మన సమస్యలన్నీ తొలగిపోతాయని చాలా మంది అనుకుంటారని అయితే ఆ భావన తప్పని అంటారు బెర్రీ. మనం పూర్తిగా సౌర శక్తి మీద ఆధార పడినా లేదా వాయు శక్తి మీద ఆధార పడినా కూడా ఆ శక్తితో ఏం చేయాలి ఎటువంటి జీవితం గడపాలి అని ఆలోచించే వివేచన మనం కోల్పోయామని ఆ ఆలోచన సరిచేసుకొలేనంత వరకూ ఇంధన వనరులను ఎలా మార్చినా పెద్ద ఉపయోగం లేదని అంటారు బెర్రీ. పారిశ్రామిక సమాజానికి వ్యవసాయ ఆధారిత సమాజానికి మౌలికమైన తేడాలు చాలానే ఉన్నాయని అంటారు బెర్రీ. పారిశ్రామిక సమాజంలో ఊరులేనితనం అన్నది ఉంటుందనీ ఇటువంటి సమాజంలో స్థానభ్రంశం అన్నది నిరంతరం జరుగుతూనే ఉంటుందనీ తన చిన్ననాటి గ్రామీణ అమెరికా ఇలా ఉండేదని కాదని అంటారు బెర్రీ. ఆధునికీకరణ ప్రబలిన సమాజంలో ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి అట్టే తేడాలు ఉండవని అంటారాయన. స్థానిక సంస్కృతుల జీవన విధానాల విధ్వంసం అన్నది కొలోనియల్ సామ్రాజ్యాలతో యూరోపు గుత్తాధిపత్యంతో మొదలై ఇప్పుడు అంతర్జాతీయ కార్పొరేషన్లతో కొనసాగుతోందని అంటారు బెర్రీ. “Get the worker away from home” అంటే బతుకు తెరువు కోసం ఇల్లు వదిలి ఇంకెక్కడికో ఫ్యాక్టరీలకు ఆఫీసులకు వెళ్లాల్సిందే అనే ప్రధాన సిద్దాంతం ఈ కాలంలోనే సృష్టింపబడిందని అంటారు బెర్రీ.

Limits అంటే అవధులు పరిమితులు అనే వాటిని గురించిన ఆలోచన పూర్తిగా మన కాలంలో లోపించిందని అంటారు బెర్రీ. ఉదాహరణకు మన కాలపు కాలుష్యం వల్ల తేనెటీగల (honeybees) జీవనానికి ముప్పు వచ్చిందే అని అనుకుందాం అప్పుడు ఈ సమస్య నుంచి బయట పడటానికి తేనెటీగలకు అనువుగా వ్యవసాయాన్ని పరిసరాలను మార్చే బదులు మోన్శాంటోనో (Monsanto) మరేదో ఇతర కంపెనీనో తేనెటీగలకు ప్రత్యామ్నాయంగా రోబోట్ల ద్వారా మొక్కల్లో పరాగ సంపర్కం (pollination) జరిపించే ప్రయత్నాలు చేస్తాయని అంటారు బెర్రీ. ఇప్పుడు ఇటువంటి ప్రయత్నాలు కోకొల్లలు జరుగుతున్నాయి యాంత్రిక వ్యవసాయ పరిశోధనలలో ఎన్నో కంపెనీలలో విశ్వ విద్యాలయాలలో. మన జీవితానికి అనుగుణంగా యంత్రాల వినియోగం చేయాలా యంత్రాలకు అనుగుణంగా మన జీవితాలను మర్చుకోవాలా అన్నది మనం ఆలోచించుకోవాలని అంటారు బెర్రీ. తన పొలంలో తాను ట్రాక్టర్ల బదులు గుర్రాలతో వ్యవసాయం చేసిన ఉదంతాల గురించి చర్చిస్తారు ఆయన ఒక వ్యాసంలో.

సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు దన్నుగా నిలిచే వందన శివ వంటివారిని 2001లో ఒక అమెరికన్ మేధావి దుయ్యబట్టడాన్ని తప్పుపడుతూ ఒక వ్యాసం రాశారు వెండెల్ బెర్రీ. పారిశ్రామిక క్యాపిటలిజం ను తప్పుపట్టిన వారిని luddites అంటే టెక్నాలజీ విరోధకులని ముద్ర వేయటం భావ్యం కాదని అంటారు బెర్రీ. పల్లెటూరి జీవనం అంటే మన మేధావి వర్గానికి చాలా చిన్నచూపని ఆ భావన పోవాలని అంటారు బెర్రీ.

నాకు నచ్చిన వస్తువు నేను కొనుక్కునే వెసులుబాటు ఉండాలి, “Greed” అంటే దురాశ లేదా అత్యాశ ఆన్న భావన మంచిదే, ఒకవేళ ఏవన్నా సమస్యలు ఉన్నా కూడా సైన్సు కచ్చితంగా సమాధానం ఇస్తుంది కాబట్టి మన జీవన విధానంలో మార్పులు అక్కర్లేదు అన్నవి అమెరికన్ల జీవితాన్ని నడిపించే ప్రధాన నమ్మకాలని అంటారు బెర్రీ. అవధుల్లేని నిరంతర భౌతిక ప్రగతి సాధ్యమే అని అదే మా మతమని విశ్వసించని దేశం లేదు ఇప్పుడు నా ఉద్దేశంలో.

“There’s always more” అంటే “ఇంకా చాలానే ఉంది” ఆన్న భావన అమెరికన్ సమాజంలో నాటుకు పోయి ఉందని కాబట్టి కోరికలకు కళ్ళెం వేయటానికి వారు సుతరామూ ఇష్టపడరనీ అంటారు బెర్రీ. అసలు disease of limitlessness అంటే ఈ హద్దుల్లేనితనం అనే జబ్బు నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటారు బెర్రీ. ఈ జబ్బుకు విరుగుడు సైన్సు టెక్నాలజీ మీద మితిమీరిన విశ్వాసం పెట్టుకోవటం వల్ల రాదనీ దీని నుంచి బయట పడాలంటే మనం లలిత కళల పై దృష్టి సారించాలని అంటారు బెర్రీ. ఒక కళాకారుడు గీసిన చిత్రం అనేది ఎంత గొప్పదైనా కూడానూ అది ఒక ఫ్రేములో ఇమడాల్సిందేననీ ఎంత మహాకవి అయినా కూడాను

అతను రాసిన కావ్యానికి ఆది అంతం ఉండాల్సిందేనని అలా కళలలో పరిమితులకు లోబడి ఆనందాన్ని పెంపొందించే లక్షణం స్వతసిద్ధంగా ఉందని అంటారు బెర్రీ. భూమి మీద దొరికే వనరుల భౌతిక పరిమితిని గుర్తించని ఆర్థిక విధానాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పాలనీ, “delusion of more” అంటే తృప్తి అనేది లేకుండా ఇంకా కావాలి ఇంకా కావాలి అనే తాపత్రయం నుంచి మనం బయట పడాలని అంటారు బెర్రీ. ఇది 2006 నాటి మాట!

మరొక వ్యాసంలో జీవన ప్రమాణాల గురించిన చర్చ చేస్తారు బెర్రీ. Standard of living ఆన్న విషయం గురించి మనం కచ్చితంగా ఆలోచించాలని మనం స్వంతంగా తయారు చేసుకున్నవి నిరంతరం మార్పుకు లోనవుతున్నవి అయినటువంటి ఈ ప్రమాణాల వల్లనే మనము ప్రకృతి విధ్వంసానికి కారణమయ్యే జీవన విధానాలకు బానిసలం అవుతున్నామని అంటారు బెర్రీ.

మనం తినే తిండి వందల వేల మైళ్ళు ప్రయాణం చేసి రావాల్సిన అవసరమే లేదని అసలు ఇటువంటి వ్యవస్థను చూసి మనం మురిసిపోవడంలో అర్థం లేదనీ అంటారు బెర్రీ. మనం అంతా కూడాను కలలలో బతుకుతున్నామని పరిమితమైన భూగోళంపై అపరిమిత భౌతిక ప్రగతి సాధ్యమే అనే పగటి కల కంటున్నామని అంటారు బెర్రీ. ఇది 1989 నాటి వ్యాసం!

వైజ్ఞానిక ప్రగతి (technological progress) అన్నది డబ్బు లేదా సంపద కుడబెట్టడానికో సరికొత్త సౌఖ్యాల కోసమో కావాల్సిందే అని మన కాలంలో మనము అనుకోవటం విదితమే. అయితే ఈ విషయం గురించి చాలా నిశితమైన విమర్శ చేస్తారు వెండెల్ బెర్రీ. బంగారు భవిత అన్నది సారవంతమైన నేలను కాపాడుకోవడంలో వృక్ష సంపదను నదీ జలాలను సముద్రాలను ఎడారులను కొండాకోనలను సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకోవటంలో ఉందనీ వర్తమానంలో వీటి సంరక్షణను గాలికి వదిలేసి భవిష్యత్తును గురించి ఏవో కలలు కనటంలో అర్థం లేదని అంటారు బెర్రీ.

అయితే ఇప్పటికే మనం ఎన్నో వైజ్ఞానిక ఆవిష్కరణల మీద ఆధారపడుతున్నామని అవి మన జీవితంలో అంతర్భాగం అయిపోయాయని వాటి మీద ఆధారపడడం తగ్గించుకోవటం అన్నది సామాన్యమైన విషయం కాదనీ అంటారు బెర్రీ. ఉదాహరణకు ఆటోమొబైల్ అంటే కార్లు బస్సులు బైకులు వగైరాల విషయానికొస్తే మన ఇళ్ళు ఊర్లు ఆఫీసులు అన్నికుడానూ ఆటోమొబైల్ కు అనుగుణంగా మార్చుకుంటూ వచ్చామని అసలు ఇప్పుడు ఆటోమొబైల్ లేకుండా జీవించలేము ఆన్న అభిప్రాయానికి వచ్చేసామని నిజానికి ఆటోమొబైల్ లేకుండా బతకచ్చనీ అయితే దానికోసం జీవన విధానంలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుందనీ అంటారు బెర్రీ.

ఈ పుస్తకం ముందుమాటలో Paul Kingsnorth ప్రస్తావించిన మాట ఒకటి నాకు నచ్చింది.

“Wendell Berry’s formula for a good life and a good community is simple and pleasingly unoriginal. Slow down. Pay attention. Do good work. Love your neighbours. Love your place. Stay in your place. Settle for less, enjoy it more” అని.

నేను జీవిత కాలం గుర్తుంచుకునే రచయిత వెండెల్ బెర్రీ. తెలుగులో ఆయన రచనల గురించిన ప్రస్తావన గురించి నేను చదివింది లేదు. అనువాదాలు కూడా చూడలేదు కొన్ని కవితలను మినహాయించి. తెలుగువారిలో కొందరికి ఆయన రచనల గురించి ఆసక్తి కలిగించటానికి ఇదొక చిన్న ప్రయత్నం. అమెరికా అంటే ఆకాశ హర్మ్యాలు అంతులేని వస్తు సంపద మాత్రమే కాదు అక్కడ ఒక వెండెల్ బెర్రీ కూడా ఉన్నాడు, గతించి పోతున్న జీవన విధానాలను బతికించటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని మనం గుర్తించాలి. మన దేశమూ అదే అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్న కాలంలో మన సమాజంలోని బుద్ధిజీవులు కచ్చితంగా చదవాల్సిన రచయిత వెండెల్ బెర్రీ.

Exit mobile version