ఫీల్ గుడ్ పిక్చర్ ‘తిరు’

1
2

[dropcap]ఇ[/dropcap]ది ‘తిరు’ సినిమా చూసిన వారికి బాగా అర్థం అయ్యే అవకాశం ఉంది. చూడని వారు కూడా చదవచ్చు, కథలోని కీలక అంశాలని నేనేం బహిర్గతం చేయటం లేదు.

***

ఇటీవల పనుల ఒత్తిళ్ళ వల్ల సినిమాలు చూడటానికి కుదరలేదు. ఇక రివ్యూలు వ్రాయటానికి సమయం అసలు దొరకటం లేదు.

‘ఎప్పుడు పనులేనా కాస్త సినిమా ఏదయినా చూద్దాం రండి’ అని శ్రీమతి, పిల్లలు కూడా పిలిచేసరికి ఇక తప్పని పరిస్థితిలో నిన్న ‘తిరు’ చూడటం జరిగింది.

ఇది ఒక చక్కటి ఫీల్ గుడ్ పిక్చర్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. కానీ ఇందులో కూడా నెమ్మదిగా ఎక్కే విషం లాంటి సబ్ వర్షన్స్ కొన్ని ఉన్నాయి. వాటి సంగతి కూడా చెబుతాను ఇదే రివ్యూలో.

కాకపోతే మూగ ప్రేమని, దాని తాలూకు సున్నిత భావాలని, సంఘర్షణలని చక్కగా చూపారు.

***

ముందుగా కథ:

ధనుష్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్. అతని తండ్రి ఒక చిన్న స్థాయి పోలీస్ ఆఫీసర్. అతని తాత పాత్ర భారతీరాజ (అలనాటి దర్శకుడు) పోషించారు. వీళ్ళుండే అపార్ట్మెంట్‌లో కింది అంతస్తులలో ఉండే నిత్య మీనన్ ఒక తమిళ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ రెండు కుటుంబాలకి మధ్య చక్కటి సాన్నిహిత్యం ఉంటుంది. ఇంచుమించు రెండు కుటుంబాలూ కూడా ఒకే కుటుంబంలాగా కలిసి మెలిసి ఉంటారు.

ధనుష్, నిత్యమీనన్ మధ్య ఒకరినొకరు ‘ఒరే’ అంటే ‘ఒరే’ అనుకునే స్నేహం ఉంటుంది. ధనుష్ ఆ అమ్మాయిని ఒక ‘స్నేహితుడి’ లాగా చూస్తాడే తప్ప వేరే ప్రత్యేకమైన అభిప్రాయం ఉండదు. తన ఇతర ప్రేమ కథలు కూడా ఆ పిల్లకి చెప్పి సలహాలు స్వీకరిస్తుంటాడు.

నిత్య మీనన్ మాత్రం అతనిని మూగగా ఆరాధిస్తూ ఉంటుంది. కానీ చెప్పదు.

ఈ ధనుష్ చాలా బ్రిలియంట్ స్టూడెంట్‌గా ఉంటూ స్కూల్ ఫస్ట్ వస్తుంటాడు. అలాంటి అతను చదువు ఎందుకు ఆపేశాడు, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ లాగా ఎందుకు జీవితం కొనసాగిస్తుంటాడు, తండ్రీ కొడుకులు ఎందుకు మాట్లాడుకోరు, ఒకప్పుడు చాలా చలాకిగా ఉండిన ధనుష్ ఎందుకు పరమ భయస్తుడు, పిరికివాడుగా మారిపోయాడు? అతనిలో మార్పు వచ్చిందా, అతని ప్రేమ కథ ఎలా మలుపు తిరిగింది తదితర ప్రశ్నలన్నింటికి తెరమీద సమాధానాలు దొరుకుతాయి.

***

ఈ చిత్రంలో ప్రధానంగా మనల్ని ఆకట్టుకునే అంశాలు.

* భారతీ రాజాని నటుడిగా చూసి సంభ్రమం చెందుతాము. అతని నటన చాలా సహజంగా ఉంది. తాతా మనవళ్ళ బంధం చక్కగా ఆవిష్కరించారు.

* మధ్య తరగతి ఇంటి వాతావరణాన్ని ఎంత చక్కగా చూపారంటే, అసలు మనం వాళ్ళ ఇంట్లో ఉన్నామేమో అన్నంత సహజంగా ఉంది చిత్రీకరణ.

* ప్రకాష్ రాజ్ నటన సహజంగానే పరిపక్వతతో నిండి ఉంది. కొన్ని కొన్ని సన్నివేశాలలో కన్నీళ్ళు తెప్పిస్తాడు. అతను కార్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ అనుకోకుండా చేసిన రోడ్డు ప్రమాదం కారణంగా అతను జీవితంలో ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చిందో చూస్తుంటే చాలా బాధ అవుతుంది.

* నిత్యా మీనన్ నటన అద్భుతంగా ఉంది. ఆ పాత్ర డిమాండ్ చేసినందువల్ల ఇంచుమించు పెద్ద గ్లామర్ లేని అమ్మాయిలాగా కనిపించాలి. ఆప్యాయత, ముక్కుసూటి తనం, ఎల్లలు లేని ప్రేమ, నిష్కపటత్వం, కొంత అల్లరి, ఎనలేని పరిణతి, ములుకులలాగా మనసుకి తగిలే గాయాల్ని తట్టుకుని నిలబడే నెమ్మదితనం, నిరాశ-నిస్పృహ ఇలా ఒకటి కాదు ఎన్నో షేడ్స్ ఉన్నాయి ఈ పాత్రలో. అవన్నింటినీ అలవోకగా నటించి తనని తాను నిరూపించుకుంది ఈ అమ్మాయి.

* మేనమామ బిడ్డ పెళ్లి సందర్భంగా ధనుష్ వాళ్ళు పల్లెటూరు వెళతారు. అక్కడి వాతావరణాన్ని చూపటంలో దర్శకుడు ఎంతో కృతకృత్యుడు అయ్యాడు.

* ఇవన్నీ ఒకెత్తైతే, ప్రేమకి సంబంధించి భారతీ రాజా పాత్ర చెప్పే మాటలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ‘నీ గురించి నీ కంటే ఆ అమ్మాయికే ఎక్కువ తెలుసు రా. నీకు ఆ అమ్మాయి గూర్చి అసలేమీ తెలియదు. అసలు తెలుసుకోవాలని కూడా నీవు అనుకోలేదు’అన్న మాటల దగ్గర ప్రతి ఒక్కరికి గుండె కలుక్కుమంటుంది.

* ‘ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో మాత్రమే వ్యక్తం అవుతుంది. అందునా నిరవధిక ప్రేమ, నిరంతర ప్రేమ, ఏ ప్రతిఫలం ఆశించని ప్రేమ నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమని ఆ పిల్ల నీ చిన్నప్పటి నుంచి, నీ పట్ల నీ కుటుంబం పట్లా చూపుతూనే ఉంది’ అన్నదగ్గర ప్రేక్షకుల హృదయాలు భారంగా అవుతాయి. నిజానికి భారతీరాజా పాత్ర చెప్పిన ప్రేమ తాలూకూ ఆ లక్షణాలు అన్నీ కూడా దైవానికి వర్తిస్తాయి. ఈ విధమైన మాటల ద్వారా, దర్శకుడు ఈ చిత్రం ద్వారా ప్రేమ పట్ల చాలా ఉదాత్తమైన భావాలు వ్యక్తపరుస్తాడు.

మన జీవితాలలో మనకి సులభంగా లభించేవి, ఉచితంగా లభించేవే నిజానికి అమూల్యమైనవి. వాటికి వెలకట్టలేము. నిజానికి ఇలాంటివన్నీ సృష్టిలో చిన్న చూపే చూడబడతాయి. మన ప్రాణం, మన పంచేద్రియాలు, ఆక్సిజన్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, మనం ఒక సారి దృష్టి సారించి కొత్త కోణంలో చూస్తే సృష్టంతా ఇంతే. మనకు ఇలా ఉచితంగా లభించే వాటి విలువ తెలియదు. ఎంతో విలువైనవి అని మనం భ్రమించే ఏవీ కూడా అశాస్వతాలు. ఇలాంటి పాయింట్స్ ఎన్నో మనకు ఈ కథ ద్వారా తెలియజేస్తాడు దర్శకుడు.

***

* తాతని, తండ్రిని ఒరే ఒరే అని కథానాయకుడు పిలవడం బాగాలేదు.

* తండ్రి మీద కోపం ఉండవచ్చు గాక. కానీ ఆయన్ని తరచూ అవమానించే సన్నివేశాలు బాధని కలిగిస్తాయి.

* తాతా మనవడు కలిసి కూర్చుని బీరు త్రాగటం బాగలేదు.

***

ఏది ఏమైనా ఇది ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here