Site icon Sanchika

కుటుంబం విలువను తెలిపే సీరీస్ ‘దిసీజ్ అజ్’

[dropcap]ప[/dropcap]గలు ప్రతీకారాలు, అత్తాకోడళ్ళ గొడవలు చూపించే తెలుగు సీరియళ్ళ దర్శకులకు హృద్యమైన కుటుంబ కథలతో సీరియళ్ళు ఎలా తీయొచ్చో చూపించే అమెరికన్ సీరీస్ ‘దిసీజ్ అజ్’ (This is Us). ‘మేము ఇంతే’ అని అర్థం చెప్పుకోవచ్చు. 2016లో ప్రారంభమైన ఈ సీరీస్‌ని డిస్నీ+ హాట్ స్టార్‌లో చూడవచ్చు. ప్రస్తుతం ఆరో సీజన్ నడుస్తోంది. ఈ వ్యాసం మొదటి సీజన్ సమీక్ష.

అమెరికాలో కూడా డెయిలీ సీరియళ్ళు ప్రసారం చేస్తారు. కానీ అవి కేవలం మధ్యాహ్నం వేళ మాత్రమే ప్రసారమౌతాయి. ఏళ్ళ తరబడి నడుస్తాయి. వాటిని సోప్ ఓపెరాలు అంటారు. కథలు చౌకబారుగా ఉంటాయి. రాత్రివేళ ఎనిమిది గంటలకి ప్రైమ్ టైమ్ మొదలౌతుంది. వీక్లీ సీరియల్స్ ప్రసారం చేస్తారు. కామెడీ, డ్రామా సీరియళ్ళు ఇవి. కథ రసకందాయంలో ఉండగా ఆపేసి కొన్ని నెలల తర్వాత మళ్ళీ మొదలుపెడతారు. వీటినే సీజన్లు అంటారు. ఇలా కాక పరిమిత సీరియళ్ళు కూడా ఉంటాయి. అంటే 10 నుంచి 14 ఎపిసోడ్లలో కథ అయిపోతుంది. గత కొన్నేళ్ళుగా అద్భుతమైన సీరియళ్ళు వస్తున్నాయి. ‘This is Us’ కుటుంబ కథతో వచ్చిన చక్కని సీరియల్. అయితే చిన్నపిల్లలు చూడటానికి తగినది కాదు.

కథలోకి వెళ్ళే ముందు అమెరికా సంస్కృతి గురించి కొంచెం చెప్పుకోవాలి. చాలా వ్యక్తి ఆధారిత (Individualist) సంస్కృతి. నా జీవితం నా ఇష్టం, తప్పు చేసినా ఒప్పు చేసినా నేనే భరిస్తాను అనే సంస్కృతి. తలిదండ్రులు కూడా మిమ్మల్ని పెంచాం, చదివించాం, ఇక మీ జీవితం మీరే చూసుకోండి అంటారు. ఎవరి జీవితభాగస్వామిని వారే ఎంచుకుంటారు. డేటింగ్ చేసి నచ్చిన వారితో జీవితం పంచుకుంటారు. అయితే సాధారణంగా విచ్చలవిడిగా ఉండరు. ఒకే భాగస్వామికి అంకితమై ఉంటారు. అలా ఉండకపోతే తప్పుగా భావిస్తారు. పెళ్ళికి ముందు శృంగారం సంఘం ఆమోదిస్తుంది. పెళ్ళికి ముందు పిల్లలు పుడితే వారికి అన్ని హక్కులూ ఉంటాయి. పెళ్ళి, ఆస్తి పంపకంలో తలిదండ్రుల సహకారం ఉంటుంది. అలాగే తలిదండ్రుల చరమదశలో పిల్లల సహకారం ఉంటుంది. అయితే తల్లిని గానీ, తండ్రిని గానీ ఇంట్లో ఉంచుకుని సేవ చేయటం తక్కువే. వృద్ధులు తమ పనులు తాము చేసుకోగలిగినంతవరకు తమ ఇంట్లోనే ఉంటారు. లేదంటే సహాయకులను పెట్టుకుంటారు లేదా వృద్ధాశ్రమాలలో ఉంటారు.

‘This is Us’ లో జాక్, రెబెకా ముఖ్య పాత్రలు. రెబెకా ఏడు నెలల గర్భవతి. ఆమె కడుపులో ఉన్నది ముగ్గురు పిల్లలు. అమెరికాలో లింగవివక్ష లేదు కాబట్టి లింగనిర్ధారణ పరీక్షలు చట్టబద్ధమే. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల అని వారికి తెలుసు. ఆరోజు జాక్ పుట్టినరోజు. ప్రతి సంవత్సరం లాగే వారు చిలిపి చేష్టలతో జాక్ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. ఇంతలో రెబెకాకి నొప్పులు మొదలవుతాయి. ఆసుపత్రికి వెళతారు. ఏడున్నర నెలలకే ఆమె ప్రసవిస్తుంది. ఒక మగపిల్లవాడు గర్భంలోనే మరణిస్తాడు. తన మూడో బిడ్డ మరణించిన దుఃఖంలో ఉన్న జాక్ ఆ ఆసుపత్రిలో తన పిల్లలతో పాటే ఉన్న ఒక అనాథ పసికందుని చూసి అతన్ని పెంచుకోవాటానికి నిర్ణయించుకుంటాడు. రెబెకా కూడా ఒప్పుకుంటుంది. జాక్, రెబెకా తెల్లజాతివారు. ఆ అనాథ బిడ్డ నల్లజాతివాడు. వీరి జీవితాల కథే ‘This is Us’.

కథ సూటిగా సాగదు. కాలంలో ముందుకీ వెనక్కీ వెళుతూ ఉంటుంది. జాక్ పుట్టినరోజే అతని ముగ్గురు పిల్లల పుట్టినరోజు. కాలంలో ముందుకి వెళ్ళి చూస్తే ఆ పిల్లలు 36వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటారు. పెద్దబ్బాయి కెవిన్ నటుడు. అతనికి విడాకులు అయ్యాయని మనకి తర్వాత తెలుస్తుంది. ఒక చవకబారు కామెడీ సీరియల్లో నటిస్తూ ఉంటాడు. అమ్మాయి పేరు కేట్. కెవిన్‌కి అసిస్టెంట్. ఊబకాయంతో సతమతమవుతూ ఉంటుంది. పెళ్ళి కాలేదు. వారి పెంపుడు తమ్ముడు ర్యాండల్. ఒక ఉన్నతోద్యోగి. ఒక నల్లజాతి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు.

కెవిన్ ఆ చవకబారు సీరియల్లో నటించలేక షూటింగ్ జరుగుతుండగానే గొడవ చేసి ఇక ఆ సీరియల్లో నటించనని వచ్చేస్తాడు. కేట్ ఒక ఊబకాయుల సపోర్ట్ గ్రూప్‌లో సభ్యురాలు. ఇలాంటి సపోర్ట్ గ్రూపులు అమెరికాలో మామూలే. ఒకే సమస్యతో బాధపడుతున్నవారందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇలా తన ఊబకాయంతో సతమతమౌతూనే ఆమె ఒక మంచి భర్త, పిల్లలు ఉండాలని కోరుకుంటుంది. గాయని కావాలని ఒకప్పుడు కలగనేది. సపోర్ట్ గ్రూప్‌లో ఆమెకి టోబీ పరిచయమౌతాడు. ఆమెని ఎంతో ఆకట్టుకుంటాడు. పాటలు పాడమని ప్రోత్సహిస్తాడు. పార్టీకి వెళితే వారిని చూసి అందరూ నవ్వుతున్నా ఆమెని తనతో డ్యాన్స్ చేసేలా చేస్తాడు.

ర్యాండల్ తన తలిదండ్రులెవరో తెలుసుకోవాలని ప్రయత్నించి తన తండ్రి జాడ కనుగొంటాడు. అతని పేరు విలియమ్. అతని దగ్గరకు వెళ్ళి నన్ను వదిలేశావుగా, ఇప్పుడు చూడు నా జీవితం ఎంత బావుందో అంటాడు ర్యాండల్. అనాథ పిల్లలకి ఇలాంటి కోపాలు ఉండటం సహజమే. పెంచలేనప్పుడు ఎందుకు కన్నారు అంటారు. ఆ కోపమే ప్రదర్శిస్తాడు. విలియమ్ తాను అప్పట్లో డ్రగ్స్‌కి అలవాటు పడ్డానని, ర్యాండల్ తల్లి అతన్ని కని కన్ను మూసిందని చెబుతాడు. ఉండటానికి ఇల్లు కూడా లేని స్థితిలో గత్యంతరం లేక బిడ్డని వదిలేశానని అంటాడు. కోపమున్నా అతనికి అతని మనవరాళ్ళని చూపించాలని ఇంటికి తీసుకువస్తాడు ర్యాండల్. ఇంటికి వచ్చాక అతనికి క్యాన్సర్ అని తెలుస్తుంది. ఆ పరిస్థితిలో విలియమ్‌కి సరైన వైద్యం అందించాలని అనుకుంటాడు ర్యాండల్.

ఈ సీరియల్లో చాలా సున్నితమైన విషయాలు స్పృశించారు. జాక్ తండ్రి కరకువాడు. అతని తల్లిని కొట్టేవాడు. జాక్ మీద, అతని తమ్ముడి మీద ప్రేమ చూపించేవాడు కాదు. తల్లిని కాపాడి బంధువుల ఇంటికి చేరుస్తాడు జాక్. ఇలాంటి కుటుంబంలో పెరిగిన జాక్ తన పిల్లలను ప్రేమగా పెంచాలని నిశ్చయించుకుంటాడు. కానీ గతం ప్రభావం ఉంటుందిగా! ఆ ఒత్తిడిలో తన బాధ్యతలను నిర్వహించగలడా?

ర్యాండల్ చిన్నప్పటి నుంచి గందరగోళంలో పెరిగాడు. జాక్, రెబెకా అతనికి ఏ లోటూ చేయలేదు. అయినా తానెందుకు నల్లగా ఉన్నాడో, తన కుటుంబంలో అందరూ ఎందుకు తెల్లగా ఉన్నారో అర్థం కాకుండా పెరిగాడు. ఒక వయసు వచ్చాక అతను పెంపుడు కొడుకని తలిదండ్రులు చెబుతారు. అది కాక నల్లజాతివారి మీద వివక్ష ఓ పక్క. అన్నదమ్ముల కలహాలు ఓ పక్క.

కేట్ చిన్నప్పటి నుంచి లావుగా ఉంటుంది. ఆమె శరీరతత్వమే అంత. జాక్‌కి కేట్ అంటే గారాబం. రెబెకాకి ర్యాండల్ అంటే ప్రేమ. కెవిన్‌కి అసూయ కలుగుతుంది. ఏ కుటుంబం లోనైనా ఇలాంటి సమస్యలు ఉంటాయి. పెద్దయ్యాక ఎప్పుడైనా కోపాలొస్తే పాత విషయాలన్నీ తవ్వుకుని గొడవపడతారు. మళ్ళీ కలిసిపోతారు.

సీరియల్లో కొన్ని అసహజమైన విషయాలు లేకపోలేదు. విలియమ్ తాను ఎంతో కాలం బతకనని అంటాడు. పైకి మాత్రం మామూలుగా కనపడతాడు. క్యాన్సర్ రోగులు నిజానికి చివరి దశలో ఎంతో బలహీనపడతారు. కొందరు కదలలేని స్థితిలో ఉంటారు. విలియమ్ ర్యాండల్ ఇంట్లోనే నివసించటం మొదలుపెడతాడు. రోజూ ఎక్కడికో వెళ్ళి వస్తుంటాడు. ర్యాండల్ భార్య అతను ఇంకా డ్రగ్స్ వాడుతున్నాడేమో అని అనుమానిస్తుంది. తనకో పెంపుడు పిల్లి ఉందని, దాని కోసం వెళుతున్నానని అంటాడు విలియమ్. ఇది కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.

జాక్, రెబెకా ముగ్గురు పిల్లలతో సతమతమౌతూ కూడా జాక్ తల్లిని సాయం కోసం రమ్మనకపోవటం వింతగా అనిపిస్తుంది. రెబెకా తలిదండ్రులకు వారి పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి వారు రారు. జాక్ తల్లి పుట్టబోయే పిల్లల కోసం ఊలు దుస్తులు అల్లి పంపిస్తుంది. మరి ఆమెని పిలవకపోయటానికి కారణం ఏమిటి? ఆమెకి శ్రమ కలగించకూడదనా? సంస్కృతిలో ఎన్ని తేడాలున్నా ఇది మింగుడుపడదు.

ఇలాంటి విషయాలు పక్కన పెడితే తమ జీవితాలలో ఎదురయ్యే ఒడిదుడుకులను వీరందరూ ఎదుర్కొని, ఒకరికొకరు తోడుగా నిలిచే తీరు కుటుంబం విలువని తెలియజేస్తుంది. తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతారు. కెవిన్ సీరియల్ నుంచి వైదొలగటానికి చానల్ వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పందం ప్రకారం ఇంకో రెండేళ్ళు పని చేయాల్సిందే అంటారు. అయినా తనికిష్టం లేని పని చేయవద్దని కేట్, ర్యాండల్ అతనికి చెబుతారు. ఎంతమంది ఇలా ఆలోచిస్తారు?

అందరికీ ఏదో ఒక అభద్రతా భావం ఉంటుంది. కెవిన్ తాను మంచి నటుడిని కాదేమో అనుకుంటాడు. కేట్ తన ప్రియుడు టోబీ మాజీ భార్య అందగత్తె అని తెలిసి అతను తననెందుకు ఇష్టపడుతున్నాడో తెలియక కలవరపడుతుంది. ర్యాండల్ జాతివివక్షను ఎదుర్కొంటూ ఉంటాడు. తన పట్ల వివక్ష ఉందని తెలిసి కూడా సర్దుకుపోతుంటాడు. ఉదాహరణకి అతను షాపింగ్ చేసినపుడు క్రెడిట్ కార్డ్ ఇస్తే అతన్ని ఏదైనా ఐడీ చూపించమని అడుగుతారు. ఇతరులని అడగరు. అంటే అతను క్రెడిట్ కార్డ్ దొంగిలించాడని అనుమానం. కేవలం ఒంటి రంగు చూసి వివక్ష చూపిస్తారు. ర్యాండల్ చూసీ చూడనట్టు ఊరుకుంటాడు. ఎందుకంటే ఇవన్నీ పట్టించుకుంటే మనశ్శాంతి ఉండదంటాడు. నిజమే! కేట్ కెవిన్‌కి ఏదైనా సమస్య వస్తే అతనికి సాయం చేయటం కోసం అన్నీ వదిలేసి వెళుతుంది. ఇది టోబీకి నచ్చదు.

అందరిలో లోపాలున్నా ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. అది కంటతడి పెట్టిస్తుంది. ఈ సీరియల్ చూసేటపుడు ఎన్నిసార్లు నా కళ్ళు చెమర్చాయో లెక్కే లేదు. ర్యాండల్ అంతటి మంచివాడు ఎక్కడా ఉండడేమో అనిపిస్తుంది. విలియమ్‌కి క్యాన్సర్ అని తెలిసి అతన్ని ముందే ఎందుకు వెతికి పట్టుకోలేకపోయానని బాధ పడతాడు. ర్యాండల్ మానసికంగా కుంగిపోతే కెవిన్ ఫోన్లోనే అది గ్రహించి అతని కోసం తన పనిని వదులుకుని అతన్ని ఓదార్చటానికి వెళతాడు.

జాక్ ప్రభావం అతని పిల్లలందరి మీదా ఉంటుంది. తన తండ్రి లాంటి భర్త కావాలని కేట్ కోరుకుంటుంది. ర్యాండల్‌కి జాక్ మీద ఆరాధనాభావం ఉంటుంది. కెవిన్‌కి తనకి దక్కవలసినంత ప్రేమ దక్కలేదని కోపం ఉంటుంది. ఇంతకీ పిల్లలు పెరిగాక జాక్, రెబెకా ఏం చేస్తున్నారు? జాక్ మరణించాడని కొన్ని భాగాల తర్వాత తెలుస్తుంది. రెబెకా ఇంకో పెళ్ళి చేసుకుంది. ఇంకా చాలా ప్రశ్నలకు మొదటి సీజన్‌లో సమాధానాలు లభిస్తాయి. జాక్, రెబెకా ఎలా కలిశారు? వారి కాపురంలో కలతలు వస్తే ఏం చేశారు? పిల్లల్ని ఎలా పెంచారు? కెవిన్ విడాకుల కథ ఏమిటి? ర్యాండల్ వ్యక్తిగత జీవితం ప్రభావం అతని ఉద్యోగంపై ఎలా పడింది? విలియమ్‌ని కలిసినపుడు రెబెకా ఎలా స్పందిస్తుంది? కేట్, టోబీల పరిచయం ఎటు దారి తీసింది?

ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఎలాంటి సమస్యనైనా మనసు విప్పి మాట్లాడుకోవటం ద్వారా పరిష్కరించుకోవచ్చనే సందేశం. అవతలి వారిలో నచ్చనిదుంటే కోపం ప్రదర్శించటం కంటే ప్రశాంతంగా మాట్లాడుకుంటే మంచిది. నచ్చిన గుణాలను మర్చిపోకూడదు. అమెరికన్లు పిల్లల ఎదుట సాధారణంగా గొడవపడరు. వాళ్ళకి ఆందోళన కలుగుతుందని గ్రహించి మసలుకుంటారు. పిల్లల ఎదుటే కీచులాడుకునే మన దేశంలోని దంపతులు దీని నుంచి ఎంతో నేర్చుకోవాలి. అయితే కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి. అవి బయటపడితే పరిణామాలు ఎలా ఉంటాయనేది పాత్రలని మథనపెడుతుంది. నీ మంచి కోసమే అలా చేశాను అంటే అర్థం చేసుకోగలరా?

సీరియల్లో ఒక్కోసారి మంచితనం డోసు ఎక్కువైందా అనిపిస్తుంది. మూడో పిల్లవాడు చనిపోయినపుడు జాక్ బాధ పడుతుంటే డాక్టర్ ఓదారుస్తాడు. తాను కూడా ఒక బిడ్డను కోల్పోయానని అంటాడు. జీవితంలో ఒక్కోసారి తట్టుకోలేని దుఃఖం వస్తుంది. దాన్ని తట్టుకుని నిలబడాలి అంటాడు. “When life throws lemons at you, make lemonade” అని ఆంగ్లంలో నానుడి. పుల్లటి నిమ్మకాయలు మాత్రమే ఉంటే, నిమ్మరసం చేసుకోమని అర్థం. పుల్లగా ఉన్నాయి కదా అని ఏడుస్తూ కూర్చోకూడదు. కష్టాలు వచ్చాయని బతకటం మానకూడదు. అదే మాట డాక్టర్ చెబుతాడు. ఆ తర్వాత ఆ డాక్టర్‌కి ఆపరేషన్ జరుగుతున్నపుడు జాక్ కుటుంబం అతనికి అండగా ఉంటుంది. అయినా పగలు, ప్రతీకారాలు, నేరాలు, హత్యలు లాంటి చెడ్డ విషయాలు అతిగా చూసే మనకు మంచితనం డోసు ఎక్కువైతేనే మంచిదేమో!

రామాయణంలో అన్నట్టు భార్య దూరమైతే ఇంకో భార్యను చేపట్టవచ్చు. స్నేహితులు దూరమైతే వేరే స్నేహితులు దొరుకుతారు. కానీ తోబుట్టువులు దూరమైతే కొత్త తోబుట్టువులు దొరకరు. అదే కుటుంబం విలువ. మనుషులని ప్రేమించాలి, వస్తువులని వాడుకోవాలి. స్వార్థాలు పెరిగిపోయిన ఈరోజుల్లో మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. ఈ సీరియల్ చూసి కుటుంబమంటే ఎలా ఉండాలో నేర్చుకోవచ్చు. కలతలొస్తాయి, ఉద్యోగాలలో ఒడిదుడుకులొస్తాయి, అయినవారిని మృత్యువు కబళిస్తుంది. అన్నీ తట్టుకుని నిలబడాలంటే కుటుంబమే ఆధారం.

ఈ సీరియల్లో ఎడిటింగ్ అత్యద్భుతంగా ఉంటుంది. కథ కాలంలో ముందుకీ వెనక్కీ వెళుతున్నా అయోమయం ఉండదు. సంభాషణలు మనసుకు హత్తుకుంటాయి. నటీనటులందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా ర్యాండల్‌గా నటించిన స్టెర్లింగ్ బ్రౌన్ ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. బాలనటులు ఆకట్టుకుంటారు. ఇలాంటి కథలు ఏళ్ళ తరబడి ఆసక్తికరంగా నడిపించటం కష్టం. అందుకని కొత్త సమస్యలని ప్రతి సీజన్ లోనూ ప్రవేశపెడుతుంటారు. ఒక్కోసారి అవి ‘సినిమా కష్టాల’ లాగా అనిపించినా జీవితపాఠాలను మనకందిస్తాయి.

మొదటి సీజన్ లోని ఒక ట్విస్ట్ గురించి కింద ప్రస్తావిస్తాను. ఇదేమీ పెద్ద ట్విస్ట్ కాదు. అయినా తెలుసుకోకూడదనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు.

విలియమ్‌ని రెబెకా మొదటిసారి కలిసినపుడు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటారు. వారిద్దరికీ ముందే పరిచయం ఉందని మనకి తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే రెబెకా ప్రసవం తర్వాత పిల్లలని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్ళేటపుడు విలియమ్ అక్కడ తచ్చాడుతుంటాడు. రెబెకా అతన్ని చూస్తుంది. పిలిచినా వినిపించుకోకుండా పారిపోతాడు. ర్యాండల్ తన బిడ్డ కాడనే భావం తొలుస్తూ ఉండటంతో రెబెకా ఏం చేయాలో పాలుపోక విలియమ్‌ని వెతికి పట్టుకుంటుంది. ఈ విషయం జాక్‌కి తెలియదు. విలియమ్ డ్రగ్స్ వ్యసనంతో బాధ పడుతుంటాడు. అతని పరిస్థితి చూసి అతను ఇంకెపుడూ ర్యాండల్‌ని కలుసుకోవటానికి ప్రయత్నించకూడదని కోరుతుంది. తొమ్మిదేళ్ళ తర్వాత ర్యాండల్ తన నిజమైన తలిదండ్రుల గురించి అడగటం మొదలుపెడతాడు. అప్పుడు మళ్ళీ రెబెకా విలియమ్‌ని కలుస్తుంది. ఈసారి కూడా జాక్‌కి తెలియదు. విలియమ్ డ్రగ్స్ మానేసి చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడని తెలుస్తుంది. తన కొడుకుని చూడాలని అతను ఆరాటపడతాడు. అయితే ర్యాండల్ తనకు దూరమైపోతాడని భయపడి ఆమె విలియమ్‌కి తెలియకుండా అక్కడి నుంచి బయటపడి వెళ్ళిపోతుంది. విలియమ్ ఇప్పుడు డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడ్డాడు కాబట్టి తన బిడ్డ తనకి కావాలని అడిగితే చట్టం ప్రకారం అతనికి ఇచ్చేయాలి. ర్యాండల్ మీద మమకారం పెంచుకున్న రెబెకాకి ఇది సాధ్యం కాని విషయం. జాక్‌కి చెబితే అతను మంచితనంతో విలియమ్‌కి బిడ్డని అప్పగిస్తాడేమోనని భయం. ఏం చేస్తుంది పాపం? రెబెకాకి విలియమ్ ముందే తెలుసన్న విషయం ర్యాండల్‌కి తెలుస్తుంది. సహజంగానే కోపం వస్తుంది. నా తండ్రి నన్ను వదిలేసినందుకు బాధపడ్డాడని నాకు ముందే తెలిసి ఉంటే అతని పట్ల కసిని పెంచుకునేవాడిని కాదు కదా అని బాధపడతాడు. తల్లిని అర్థం చేసుకోగలడా? అర్థం చేసుకుంటే క్షమించగలడా? అంత తేలికగా అందరూ క్షమించగలిగితే లోకంలో సగం సమస్యలు పరిష్కారమౌతాయి.

Exit mobile version