Site icon Sanchika

కలకాలం నిలిచే ‘బైసైకిల్ థీవ్స్’

[box type=’note’ fontsize=’16’] “కొత్తగా సినెమా తీద్దాం అనుకునే యువతరం దీని షాట్ కంపోసిషను, స్థూల కథనం, సూక్ష్మ కథనం అన్నీ పరీక్షగా చూసి తమ స్కిల్స్ ను మెరుగుపెట్టుకోవచ్చు” అంటున్నారు పరేష్ ఎన్ దోషి క్లాసిక్ చిత్రం ‘బైసైకిల్ థీవ్స్’ గురించి. [/box]

ప్రతివారం వొక సినెమా సమీక్ష వ్రాస్తున్నా. ముందే వొకటి అనుకునున్నాను, సినెమా లో కనీస విలువలు (minimum standards) వుంటేనే వ్రాస్తాను. లేదంటే చూసినపుడొకసారి గురైన బాధ, వ్రాసేటప్పుడు మరోసారి గురి కావాలి (ఈ వారం చూసిన సవ్యసాచి మాదిరిగా). అలా యే వారమన్నా సినెమా చర్చించతగ్గదిగా లేనప్పుడు యేదేని క్లాసిక్ గురించి వ్రాద్దామని కూడా అనుకున్నా. అలాగే ఈ వారం విట్టోరియో డెసికా తీసిన ఇటాలియన్ చిత్రం ” బైసైకిల్ థీవ్స్”.

1948 లో తీసిన ఈ చిత్రాన్ని నేను మొట్టమొదటి సారి 1990 లో FTII లో చూశాను. అప్పటినుంచీ అది వెంటాడుతూనే వుంది. మరలా ఈ పూట ఇది వ్రాయడానికి చూశాను. చిత్రం ప్రభావం అంతే వుంది. యెలాగూ ఇది రెండు సార్లు కనీసం చూడాల్సిన చిత్రమే. మొదటిసారి దృష్టంతా కథ వగైరాల మీద వుంటుంది. రెండవ మారు వొక్కో షాట్ ను నిశితంగా పరిశీలించే వీలు కోసం చూడాలి. 70 యేళ్ళ తర్వాత కూడా వొక సినెమా మనిషిని వూపేస్తుందంటే వూహించండి దాని బలం.

రెండవ ప్రపంచ యుధ్ధానంతర రోమ్‌లో పరిస్థితి యెలా వుందంటే మనుషులు పనిలేక, సంపాదన లేక అలమటించి పోతున్న కాలం. ఆ సమాజాన్ని వొక కుటుంబ నేపథ్యంలో మన ముందు వుంచుతాడు. యేక కాలంలో వో కుటుంబ గాథ, వో దేశ గాథ కూడానూ. రిచి వో మధ్యతరగతి సంసారి. భార్య, ఇద్దరు పిల్లలు. రెండవ సంతానం పసిది. ఇల్లు గడపడానికి వుద్యోగం ఆసరం వుంది. ప్రస్తుతం అతని కొడుకు బ్రూనో బహుశా పది పన్నెండేళ్ళుండవచ్చు వొక పెట్రోల్ పంప్ దగ్గర పనిచేస్తున్నాడు. రిచి కి ఉద్యోగం దొరుకుతుంది, గోడల మీద సినెమా పోస్టర్లు అంటించే పని. కాని షరతు యేమిటంటే అతని దగ్గర సొంత సైకిలుండాలి. అది లేదంటే ఆ ఉద్యోగం కొట్టేయడానికి చాలామందే వున్నారు. రిచి సైకిలు కుదువపెట్టబడి వుంది. దాన్ని విడిపించడానికి ఇంట్లో వున్న దుప్పట్లు కుదువ పెట్టి సైకిల్ ను విడిపించుకుంటారు. దాన్ని బాగు చేసి మర్నాడు పనికి బయలుదేరుతాడు రిచి. అతను నిచ్చెనెక్కి పోస్టర్లంటించే సమయంలో గోడకి ఆనించిన అతని సైకిల్ ను యెవరో దొంగలిస్తారు. ముందు అతన్ని వెంబడించి పట్టుకోలేకపోతారు. తర్వాత మిత్రుని సాయం కోరతాడు సైకిల్ ని వెతికి పట్టుకోవడంలో. ఇలాంటివి వెంటనే సెకండ్ హేండ్ మార్కెట్లో అమ్మేస్తారు, అక్కడికెళ్ళి వెతుకుదామని చూస్తారు. దొరకదు. యే పార్ట్ కి ఆ పార్ట్ విడదీసి అమ్మితే మనం పట్టుకోలేమని నిరాశ చెంది ప్రయత్నం మానుకుంటారు. వో చోట ఆ దొంగ కనబడ్డా సరైన సాక్ష్యాధారాలు లేవని పోలీసు అతన్ని అరెస్టు చేయడు. ఇలా రకరకాల frustrations కు లోనై వో సారి కొడుకు మీద అకారణంగా చేయి చేసుకుంటాడు. చిన్నబోయిన ఆ మోమును చూసి మరింత అపరాధ భావన కు గురై, అతని అలక తీర్చి హోటెల్‌కి తీసుకెళ్ళి తినిపిస్తాడు. అక్కడ తిండి మీద కూడా మనసుండదు అతనికి. ఆ ఉద్యోగం వుంటే కుటుంబం యే రకంగా నడిపేవాడో అని లెక్కలేసుకుంటాడు. రేపటి ఆలోచన మనసును దిగులుతో నింపేస్తుంది. బయటికొచ్చాక అతనికి వో చోట గోడకానించి పెట్టిన సైకిల్ కనిపిస్తుంది. కొడుకును, డబ్బులిచ్చి, బుస్సులో వెళ్ళమంటాడు. తర్వాత తను వెళ్ళి ఆ సైకిల్ ను తీసుకుని వేగంగా పారిపోవాలని చూస్తాడు. ఆ సైకిల్ యజమాని చూసి కేకలేసి జనాలను పోగేసి, వెంటపడి రిచి ని పట్టుకుంటాడు. జనం తలో చెయ్యి చేసుకుంటారు అతని మీద. బ్రూనో బస్సును అందుకోలేకపోతాడు, ఈ లోగా ఈ గోల వినబడి వచ్చి చూస్తే తండ్రిని అందరూ కలిసి కొడుతున్నారు. వెళ్ళి తండ్రి కోటుపట్టుకుని లాగుతూ యేడుస్తాడు. ఆ అబ్బాయి మొహం చూసి సైకిల్ యజమాని పోలీసు కు ఫిర్యాదు ఇవ్వను, సైకిల్ దొరికింది చాలు అంటాడు. అన్నివిధాలా భంగపడ్డ రిచి కొడుకు ముందు ఈ వేషంలో పట్టుబడినందుకు వెక్కి వెక్కి యేడుస్తాడు. బ్రూనో కన్నీళ్ళు నిండిన కళ్ళతో తండ్రిని చూసి, అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు.

ప్రపంచ దర్శకులెందరినో ప్రభావితం చేసిన ఈ చిత్రం ఇప్పటికీ వో స్టడీ చేయతగ్గ చిత్రమే. మన దగ్గర సత్యజిత్ రాయ్, బిమల్ రాయ్ లాంటి వాళ్ళనుకూడా ప్రభావితం చేశాడు. డెసికా ఈ చిత్రాన్ని నిజమైన లొకేషన్లలో (స్టుడియోల్లో కాకుండా) చిత్రీకరించాడు. తీసుకున్న నటులు కూడా మామూలు జనం లోంచి యెంపిక చేసినవాళ్ళే. రిచీ వాస్తవంలో వో కర్మాగారంలో కార్మికుడు. బ్రూనో నిజ జీవితంలో తండ్రిని పూలు అమ్మే పనిలో సాయపడే కొడుకు. బహుశా అందుకేనేమో వాళ్ళు ఆ పాత్రలలో అంత లోతును ప్రదర్శించగలిగారు. బ్రూనో గా చేసినతన్ని మాత్రం అస్సలు మరవలేము! ఇక వొక్కో దృస్యం వొక్కో తెలుపు నలుపు రంగుల్లో చిత్రంలా వుంటుంది. చాయా చిత్రణం తర్వాత సంగీతం అంతే ప్రభావవంతంగా వుంది. వొకోసారి చార్లీ చాప్లిన్ చిత్రాలు, కొన్ని సార్లు బిమల్ రాయ్ చిత్రాలూ గుర్తుకొస్తాయి.

సైకిల్ పోగొట్టుకున్న వ్యక్తి దాన్ని వెతికే క్రమంలో తిరిగే ప్రదేశాలు : పోలీసు స్టేషను, సెకండ్ హేండ్ వస్తువులమ్మే ఆదివారం బజార్లు, దొంగను వెంబడిస్తూ వో వేశ్యావాటిక, వో సారి చర్చిలో ఇలా ప్రతి చిన్న డీటేల్ ను పట్టుకున్నాడు. యెక్కడా అతిగా సెంటిమెంటాలిటీ వుండదు, అనవసర ప్రసంగం, నాటకీయతా వుండవు; కాని చెప్పాల్సినవన్నీ క్లుప్తంగా ఇండైరెక్ట్‌గా చెబుతాడు. మొదట్లో భార్య వో జోస్యం చెప్పే ఆవిడదగ్గరికి పాత బాకీ చెల్లించడానికి వెళ్ళినప్పుడు చదువుకున్న నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా, ఆ డబ్బు ఇంకోచోట ఖర్చు పెట్టు అని లాక్కెళ్ళినవాడే చివరికి నిస్సహాయుడైనప్పుడు తనే ఆమె దగ్గరికి వెళ్తాడు : తనకు ఆ సైకిలు దొరికే అదృష్టముందా లేదా జోస్యం చెప్పించుకోవడానికి. ఇక పరిస్థితులు అతన్ని దొంగగా మార్చడం, పట్టుబడడం, దెబ్బలూ తిట్లూ తినడం, ఇదంతా కొడుకు కంటపడటం మనల్ను నిలువనీయదు. యెప్పటికీ మరిచిపోలేని దృశ్యానుభవం అది!

ఈ కథంతా రిచీ అతని కొడుకుకు సంబంధించినవేనా? వ్యక్తి కథను సమూహంతో యెలా జత చేశాడో చూద్దాం. రిచి ఉద్యోగ కష్టాల్లో భాగంగా వున్న వొకే పోస్టర్ల ఉద్యోగానికి పెద్ద సమూహంతోనే పోటీ. ఇంటికెళ్తే బయట నల్లా దగ్గర scarce resources (water) కోసం అతని భార్య రెండు బక్కెట్లతో మిగతా ఆడవాళ్ళతో పోటీ. సైకిల్ విడిపించడానికి ఆమె దుప్పట్లన్నీ తీసి మూట కడుతుంది (ఆ చలి ప్రదేశంలో దుప్పటిలేకుండా పడుకోవడం యెలాంటి కష్టమో వూహించుకోవచ్చు) కుదువ పెట్టడానికి. మొత్తం ఆరు అందులో రెండు అసలు వాడనివి. 7500 లభిస్తాయి. అందులో డబ్బుతో అక్కడే సైకిల్ ను విడిపించుకుంటారు. వో పక్క ఇతను సైకిల్ను బయటకు తీసుకొస్తుంటే, మరోపక్క వీళ్ళ దుప్పట్ల మూటను వో ఉద్యోగి లోపలున్న పెద్ద గోడౌన్ లో వరసగా పెట్టివున్న రాకుల దగ్గరకెళ్ళి యెక్కి పైన పెడతాడు. అక్కడ అలాంటి మూటలు వందల కొద్దీ వుంటాయి. సైకిళ్ళు కూడా. అంటే ఆ సామాజిక పరిస్థితి యెలాంటిదో వూహించుకోండి. యేం ఆస్తులున్నాయి వాళ్ళకు, కుదువ పెట్టుకోవడానికిగాని, విడిపించుకోవడానికి గాని, దుప్పట్లు, సైకిలూ తప్ప? తమ ఆస్తిని తాము యెంత ప్రియంగా చూసుకుంటారో చెప్పడానికి దుప్పట్లు కుదువపెట్టేటప్పుడు ఆ ఉద్యోగి 7000 మాత్రం వస్తాయి వాడిన దుప్పట్లు కదా అంటే, కాదు అందులో రెండు కొత్తవి, అన్నీ కాటన్, సిల్కువి, కొన్ని తన పుట్టింటివాళ్ళు ఇచ్చినవి అంటుంది. అతను సరే 7500 ఇస్తానంటే ఆమె కళ్ళు మెరుస్తాయి. సైకిలు ఇంటికి తెచ్చాక బ్రూనో దాన్ని తుడుస్తూ అంటాడు : నాన్నా ఇక్కడ చూడు సొట్టబోయింది, వాళ్ళు వడ్డీ బాగానే తీసుకుంటారు వస్తువును మాత్రం జాగ్రత చేర్యరు, నువ్వు దెబ్బలాడాల్సింది. యెక్కడ చూసినా సమూహాలు, అందరివీ దాదాపు వొకేలాంటి కష్టం. ఇది కేవలం వొక ఉదాహరణంగా తీసుకుని వివరంగా వ్రాశాను. ఇలా ప్రతి సన్నివేశం గురించీ వ్రాయొచ్చు, అది వో పుస్తకంగా తయారవుతుంది అన్న భయం తప్ప. ఇక కొత్తగా సినెమా తీద్దాం అనుకునే యువతరం దీని షాట్ కంపోసిషను, స్థూల కథనం, సూక్ష్మ కథనం అన్నీ పరీక్షగా చూసి తమ స్కిల్స్ ను మెరుగుపెట్టుకోవచ్చు.

ఇక ఆ తండ్రి కొడుకుల సంబంధం గురించి. కేవలం జీవితం వాళ్ళిద్దరిని పడేసిన విచిత్ర సన్నివేశాల్లో ఇద్దరి గురించీ, పేదరికం గురించీ, బాధ్యతను పంచుకోవడం గురించి, ఆసరాగా నిలవడం గురించీ అన్నీ వున్నాయి. పోయిన సైకిల్ ను పొందలేక, రేపటి చింత తొలుస్తూ వుంటే ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి కేవలం తన ఆలోచనల్లో మునిగి వుంటాడు. కొడుకు పడుతూ లేస్తూ వెంట నడుస్తూ వుంటాడు. వొక సారి వర్షంలో జారి పడతాడు. మరోసారి రోడ్డు క్రాస్ అతి కష్టంగా చేస్తాడు. ఇదంతా తండ్రి దృష్టిలో వుండదు. ఆ చిన్న వయసులోనే పెట్రోల్ పంప్ దగ్గర పనిచేసి ఆర్థికంగా ఆసరాగా వుండడం. (మిగతా పిల్లల పరిస్థితులూ అంతే. వొకడు అదుక్కుంటూ కనిపిస్తాడు, మరొకడు యేదో వాద్యం వాయిస్తూ అడుక్కుంటాడు.) చివరికి తండ్రి పరిస్థితి గమనించి ధైర్యం ఇస్తున్నట్టు తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకోవడం.

Exit mobile version