Site icon Sanchika

తింగరబుచ్చి

[dropcap]వై[/dropcap]జాగ్ చాలా మారిపోయింది. అక్కడ చెంగల్రావు పేట కూడా బాగా ఆధునికం అయింది. వీధులు గుర్తుపట్టలేనంతగా మారాయి. నేను, రాజారాం అద్దె కోసం ఇళ్ళు వెతుక్కుంటూ పోతూ ఉంటే ఒక వీధిలో ఒక వరుస అన్నీ పెరళ్ళు. అలా ఒక ఇంటి పెరట్లో ఒక మధ్య వయస్కురాలు బట్టలు ఉతుకుకుంటూ ఉన్నది.

“పిన్నిగారూ! అద్దెకి ఇళ్ళు ఏమైనా ఉన్నాయా?” అని అడిగాను.

ఇంతలో ఇంట్లోంచి ఒక పదహారేళ్ల పిల్ల- రెండు జడల సీత- అక్కడికి వచ్చింది.

“ఎవరు మీరు? ఏం కావాలి?” అని అడిగి, సమాధానం చెప్పే లోపలే “ఒక రూము ఉన్నది కాని బ్యాచిలర్స్‌కి ఇవ్వరు. ఇచ్చినా బ్రాహ్మలకే” అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.

నేను “సరే చూపించండి” అన్నాను.

“మీరు ఏం చేస్తూ ఉంటారు?” అని అడిగింది.

పెద్దావిడని మాట్లాడనివ్వకుండా ఆ అమ్మాయే గలగల మాట్లాడేసింది.

“నాకు దగ్గర్లో కాలేజీలో లెక్చరర్‌గా పోస్టింగ్ వచ్చింది. జాయిన్ అవ్వాలి. వీడు మెడికల్ రిప్రజెంటేటివ్. పట్టుమని పది రోజులు కూడా ఇంట్లో ఉండడు.”

“మీ జీతం ఎంత?” అని అడిగింది.

నేను చెప్పబోతుంటే మిత్రుడు రాజారామ్ నా కాలు తొక్కాడు. అది ఆమె చూసింది.

“ఏం చెప్పవద్దు అనా?” అని వాడిపై ఉరిమింది.

“అది కాదండీ! అమ్మాయిల వయస్సు, అబ్బాయిల జీతం అడగకూడదు అంటారు కదా?” అన్నాను నేను.

“ఓహో మంచి మాటకారులే” అని ఆమె లోనికి దారితీసింది.

“మావాడు మంచి రచయిత లెండి” అని పుసుక్కున అనేసి నాలిక కరుచుకున్నాడు రాజారాం. ఆమె విననట్లుగా నటించి రూం చూపించింది.

నీళ్లు జాగ్రత్తగా వాడాలి. రాత్రి 10 దాటితే తలుపు గడియ తియ్యము-వగైరా వగైరా అంటూ లక్ష కండిషన్లు చెప్పింది.  మేము  అడ్వాన్స్ సమర్పించాము.

పెద్దావిడ వచ్చి “ఇది ఒట్టి వాగుడుకాయ. దీని మాటలు పట్టించుకోకండి నాయనా” అని నవ్వుతూ సర్ది చెప్పింది.

“రేపు దిగడానికి మంచి రోజు” అని ఆ అమ్మాయి చెప్పింది.

మేమిద్దరం బ్రతుకు జీవుడా అని బయట పడ్డాము.

***

రెండు వారాల తర్వాత

ఆ అమ్మాయి సుడిగాలిలా లోపలికి వచ్చింది.

“పక్కింటి పార్వతి వచ్చి మీకు ఏమిటి ఇచ్చింది? మీతో ఏమిటి మాట్లాడుతూంది?” అని నిలదీసింది.

నేను ఆ తర్వాత అపరాధిలా తలవంచుకుని నిలబడి “అబ్బే! ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పులిహార చేసుకున్నారట. తెచ్చి ఇచ్చింది. అంతే ఇంకేమీ మాట్లాడలేదు” అన్నాను.

“నేను నమ్మను. అది వట్టి నంగనాచి” అన్నది.

“ఆడపిల్లలు అశ్లీలాలు కూడా మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది” అన్నాను.

“ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నానని?” అని ఎదురు ప్రశ్న వేసింది.

“భాష చాలా చిత్రమైనది. మనం మామూలుగా మాట్లాడే మాటల్లో కూడా తప్పులు దొర్లి అపార్థాలు చోటు చేసుకుంటాయి” అన్నాను

“మహాప్రభో ,మీరు భాషాశాస్త్రవేత్తలు అని ఒప్పుకుంటాను. కాని, నేను మాట్లాడినదాంట్లో తప్పు ఏమిటో చెప్పండి” అని నిలదీసింది.

“సరితా. నువ్వు ఎస్. ఎస్.ఎల్.సి హిందీతో పాస్ అయ్యావు అని అనుకుంటాను”

“కరెక్ట్. అయితే?”

“నాచ్ అంటే ఏమిటి?”

“నాట్యం చేయటం”

“మరి నంగా అంటే?”

“ఛీ. మీతో మరి ఎప్పుడూ మాట్లాడను”– అని సిగ్గుల మొగ్గ అయి తుర్రున పారిపోయింది.

ఆ రాత్రి రాజారామ్ నాకు హెచ్చరిక చేశాడు. “ఆ అమ్మాయి అగ్గిబరాటా. జాగ్రత్త రోయ్”అని.

***

ఆ తర్వాత వారం రోజుల వరకు ఆమె మళ్ళీ కనబడలేదు. సడన్‌గా ఒక రోజు ఒక స్పురద్రూపి అయిన ఒక యువకునితో కలిసి చెట్టా పట్టా లేసుకుంటూ వచ్చింది.

అసలేం జరగనట్టు ప్రారంభించింది. “వీడు నా బావ. యూఎస్ నుంచి సెలవులకు వచ్చాడు.” అని.

వెనువెంటనే వాళ్ళ అమ్మ వచ్చి “వీళ్ళ ఇద్దరికీ వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం కుదిరింది బాబూ. మీరిద్దరూ దగ్గరుండి పెళ్లి జరిపించాలి” అని చెప్పింది.

“శుభం! సమస్త సన్మంగళాని భవంతు” అని దీవించాను.

ఆ తింగరబుచ్చి ఇలాంటి షాక్ ఇస్తుందని ఎప్పుడో గ్రహించాను. అందువల్ల నిర్వికారంగా చిద్విలాసంగా ఉండిపోయాను.

ఆడువారి మాటలకు అర్థాలే వేరులే – అనే పాట ప్రారంభించాడు నవ్వుతూ రాజారామ్.

Exit mobile version