Site icon Sanchika

తిరస్కృతి

[మాయా ఏంజిలో రచించిన ‘Refusal’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(దూరమైన భావోద్వేగ భాగస్వామి గురించి కావచ్చు. గతించిన వారి గురించీ కావచ్చు. పైకి కనిపించని విషాదపు జీర ధ్వనిస్తుందీ కవితలో!)

~

[dropcap]ప్రి[/dropcap]యతమా!
మరో జీవితం లోనో
మరే భూభాగాల్లోనో
నీ చేతులను
నీ పెదవులను
ధైర్యవంతమైన నీ చిరునవ్వును
కనుగొనగలనా నేను

నీపై నా ఆరాధన తీపిదనం
మరీ మితిమీరిపోయింది

మరో ప్రపంచంలోనో
తేదీలు తెలియని
భవిష్యత్ కాలాలలోనో
మనం మళ్ళీ కలుస్తామన్న
నమ్మకం ఏముంది
నా దేహపు తొందరపాటుతనాన్ని
ధిక్కరిస్తాన్నేను
మరొక్క మధురమైన కలయికని
వాగ్దానం చెయ్యకుండా
చచ్చిపోవాలనీ నేననుకోను!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయా మనోగతం:

1.నా జీవన నౌక ప్రశాంతమైన, అనుకూలమైన సముద్రాలలో ఆటుపోట్లు ఎరుగని ప్రయాణం చేసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. నా ఉనికినే సవాలు చేసిన రోజులు, వెలుగులు విరజిమ్ముతూ ఆశాజనకంగా ఉండవచ్చు, నిశీధి నీడలు అలుముకొని ఉండవచ్చు,

ఈదురు గాలులు వీచే తుఫానులలో, ఎండరోజుల్లోను బతుకులోని అత్యద్భుతమైన కాలంలోను, ఒంటరి ఏకాకి రాత్రుళ్ళలోను – నేను జీవితం పట్ల, నా చుట్టూ ఉన్న మనుషుల పట్ల కృతజ్ఞతా వైఖరినే కలిగి ఉన్నాను. దానినే ఎల్లకాలం కొనసాగిస్తాను.

••••••••••

2.ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నం తాము చేయాలని నేను ప్రోత్సహిస్తాను. అన్ని మానవధర్మాలలోకెల్లా అత్యంత ప్రాముఖ్యత కలిగినది ధైర్యసాహసాలను కలిగి ఉండడం. ధైర్యమే లేకుంటే, మీరు మరే ఇతర విలువలని ధర్మాన్ని స్థిరంగా ఆచరించలేరు. ధైర్యంగా, నిష్కపటంగా మీరు ఉన్నప్పుడే – అందరి పట్ల దయగా, న్యాయంగా, ఉదారంగా ఉండగలుగుతారు.

Exit mobile version