తిరుగులేదని విర్రవీగుతున్న మానవుడిని అవహేళన చేస్తున్న కరోనా

0
2

[dropcap]చై[/dropcap]నాలో చాలా కంపెనీలు అనేక వస్తువులను అంతర్జాతీయ విపణుల కోసం తయారూ చేస్తూ ఉంటాయి. సాధారణ పరిస్థితులలో ఈ సరఫరాల సమయంలో ఎటువంటి అవరోధాలూ ఉండవు.

‘అమెరికా ఫస్ట్’ అన్న డోనాల్డ్ ట్రంప్ ధోరణి, అమెరికాలో సంబంధిత సామాగ్రి తయారీ, నైపుణ్యాల కొరత వంటి వివిధ అంశాల నేపథ్యంలో ట్రంప్ దుందుడుకు వైఖరి పరాకాష్ఠకు చేరడం జరిగింది. ఇప్పటికిప్పుడు వైద్య పరికరాలు, రక్షణ కవచాల కొరతను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి ఆయనకు ఇది ఒక సులభతరమైన పరిష్కారమార్గంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ప్రాథమికంగా పెట్టుబడీదారీ వ్యవస్థకు చెందిన వ్యక్తి. ఆ కారణంగా ఎంత సొమ్మైనా చెల్లించి మిగిలిన దేశాల నుండి మాస్కులు, పరీక్షల కిట్లు వంటి వాటిని అవసరాలకు సరిపడా సమకూర్చుకోవాలన్నది ఆయన ఆలోచన.

ఈ నేపథ్యంలోనే ఆయన ‘డిఫెన్స్ ప్రొడక్షన్ చట్టం’ ఆయుధాన్ని ‘3.M’ లాంటి కంపెనీలపైకి సంధిస్తున్నారు. సంక్షోభ సమయంలో దేశీయ అవసరాల కోసమే మాస్కులు, వెంటిలేటర్ల వంటి ఉపకరణాలను తయారు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే మూల్యం చెల్లించక తప్పదనీ హెచ్చరిస్తున్నారు. సాధారణ పరిస్థితులలో అమెరికాకు విస్తారంగా మార్కెట్లు కావాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం అమెరికాకు తన ప్రయోజనాల ముందు మరే దేశపు ప్రయోజనాలూ దిగదుడుపుతో సమానం.  ఆ సందర్భాలలో మార్కెట్లు తమ అవసరాలను కాదని త్యాగం చేసి అమెరికా అవసరాలకు దాసోహం అనాలి. అదీ అమెరికా ద్వంద్వ నీతి.

‘క్యూర్‌వేక్’ జర్మనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ కరోనా వైరస్‌కు వేక్సిన్ తయారీలో నిమగ్మమై ఉంది. పరిశోధనల దశలనన్నింటినీ దాటుకొని వేక్సిన్ రూపకల్పనకు దగ్గరగా వచ్చేసింది. ఆ కంపెనీని అమెరికా అధ్యక్షుడు ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తడం ఇటీవలి సంక్షోభ కాలం నాటి సంగతే. ఆ విషయమై ఆయన అనేక విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది కూడా.

‘3.M’ అమెరికాకి చెందిన కంపెనీ. ఈ కంపెనీ చైనాలో తయారీ బాగంలో చైనాలో – వైరస్ నిరోధానికి ఉపయోగపడే రెండు లక్షల N.95 మాస్కులను బెర్లిన్‌తో కుదురుచుకున్న ఒప్పందం ప్రకారం తయారు చేసింది. ఈ మాస్కులను బెర్లిన్ చేరవేయడానికి బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌ నుండి బయలుదేరిన విమానాన్ని శ్వేతసౌధం యు.ఎస్.‌కు దారి మళ్ళించిందని ఆరోపణలు చెలరేగాయి. ఆ మాస్కులను బెర్లిన్ తన పోలీస్ యంత్రాంగం కోసం ఆర్డరు చేసింది. ఆ ఆర్డరు తాలూకు కన్‌సైన్‌మెంట్ మొత్తం యు.ఎస్.కు మరలించడంతో – అసలే ‘కరోనా వేక్సిన్’కు సంబంధించిన వ్యవహారంతో అమెరికాపై గుర్రుగా ఉన్న జర్మనీ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది.

సంక్షోభ సమయాలలో సైతం ఇటువంటి కూటనీతులు అనుసరించడం గర్హనీయాలని అంతర్జాతీయ నిబంధనలను గౌరవించవలసిదిగా అమెరికాను గట్టిగా నిలదీయాలని జర్మనీ ప్రభుత్వాన్ని బెర్లిన్ కోరుతోంది. బెర్లిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆండ్రియా గైసెల్ ఈ విషయాన్ని పత్రికలకు వెల్లడించడం కూడా జరిగింది.

కెనడా, బ్రెజిల్ వంటి మరికొన్ని దేశాలు కూడా తమ కాంట్రాక్టులను ఎక్కువ ఆశ చూపి అమెరికా తన్నుకుపోతోందని ఆరోపిస్తున్నాయి.

అయితే ట్రంప్ బాధలు ట్రంప్‌వి. ఆయన పరిస్థితి ఏ రోజూ పెనం పైన ఉన్నట్టే ఉంటోంది. కరోనా వైరస్ వ్యాపించగలదన్న హెచ్చరికలు ఆయన చాలా తేలికగా తీసుకున్నారనీ, ముప్పు ముంచుకొచ్చేవరకు నిర్లక్ష్యం వహించారనీ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. ఎన్ని హెచ్చరికలు, జాగ్రత్తలు వచ్చినప్పటికీ శ్వేతసౌధం ముందు జాగ్రత్త చర్యలతో సన్నద్ధంగా లేకపోవడం పట్ల అనేకులు ఆయన పట్ల గుర్రుగా ఉన్నారు. మృతుల సంఖ్య 7000 దాటిపోయిన నేపథ్యంలో ఆయనది ఎటూ పాలుపోని స్థితి.

‘అంతా సవ్యంగా ఉంది, సప్లయిస్ బావున్నాయి. పరిస్థితులు అదుపులో ఉన్నాయి’ వంటి ట్రంప్ స్టేట్‌మెంట్‌లను వారు ఖండిస్తున్నారు. వాషింగ్టన్, మిగిలిన రాష్ట్రాల అధికార గణాల నడుమ పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. ప్రజల క్రోధాగ్నిని ఎదుర్కోవడానికి ఆ రాష్ట్రాలు సైతం వాటితో అవి పోటీ పడి ఎక్కువ చెల్లించి వ్యాధి నిరోధక సామాగ్రిని, కిట్లను కొనుగోలు చేసే పరిస్థితి నడుస్తోంది.

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా రోజుకో యుద్ధ నౌకను, గంటకు ఒక యుద్ధ విమానాన్ని తయారు చేయగల సామర్థ్యంతో తన సత్తాను చాటుకుంది. కరోనా వైరస్ దేశాన్ని చుట్టుముట్టిన సంక్షోభ సమయంలో మాస్కులు, వెంటిలేటర్లు, చేతి తొడుగులు వంటి వ్యాధి నిరోధక వస్తువులు, పరీక్షల కిట్లు వంటి వైద్య పరికరాలు వంటి అతి సాధారణమైన వస్తువుల కొరతతో అల్లాడుతోంది. ఎంత విచిత్రం!

ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు వంటి వాటికి ‘ఎంచుకోవడం’ అన్న ప్రక్రియ ఉండదు. గోడలు, సరిహద్దులు, వివక్షలు వాటికి ఉండవు. పరిమితుల లెఖ్ఖా లేదు. ఈ విషయం ఎన్నిసార్లు ఋజువైనా మనిషి విర్రవీగుతూనే వున్నాడు. కరోనా సంక్షోభం మనిషికి ఒక గర్వభంగం లాంటిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here