తిరుమలేశుని సన్నిధిలో… -10

0
4

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

పురాణ పండిత శిక్షణా సంస్థ:

[dropcap]తి[/dropcap]రుమల తిరుపతి దేవస్థానం వారు పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి హయాంలో పురాణ పండితులను ఎంపిక చేశారు. వారికి శిక్షణ నిమిత్తం ప్రముఖ పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారిని ప్రిన్సిపాల్‌గా నియమించారు. దాదాపు 25 మంది పురాణ పండితులకు వారు ఉత్తమ శిక్షణనిచ్చారు. వారిని ధర్మ ప్రచార పరిషత్ జిల్లా సెంటర్లలో నియమించారు. నెలలో దాదాపు 20 రోజులు వారు వివిధ ప్రాంతాలలో ఆలయాలలోనూ, వివిధ వేదికల మీద వివిధ పురాణ గాథలను శ్రోతలకు వినిపించేవారు. క్రమంగా వీరు రిటైరయినందున ఈ వ్యవస్థ క్షీణించింది. బయటివారి చేత పురాణాలు ఏర్పాటు చేసి పారితోషికం ఇస్తున్నారు.

అన్నమాచార్య ప్రాజెక్టు:

శ్రీ పి.వి.ఆర్.కె. ప్రసాద్ సంకల్పించిన బృహత్తర ప్రణాళికలలో ఇది అత్యుత్తమం. 15వ శతాబ్దికి చెందిన వాగ్గేయకారుడు అన్నమాచార్యులు శ్రీ వేంకటేశ్వరునిపై 32 వేల సంకీర్తనలు వ్రాశాడు. కడప జిల్లా రాజంపేట మండలానికి చెందిన తాళ్ళపాకలో  ఈ అన్నమాచార్య కుటుంబం ప్రసిద్ధం. వారి కుటుంబంలో అన్నమయ్యతో పాటు పెద తిరుమలాచార్యులు, చిన తిరుమలాచార్యులు, తిమ్మక్క పండితులు. అన్నమయ్య సంకీర్తనా సంప్రదాయాన్ని వ్యాప్తం చేశాడు. తర్వాత త్యాగయ్య, క్షేత్రయ్య, పురంధరదాసు వంటి ప్రముఖులు ఈ భక్తి సంకీర్తనా వాఙ్మయాన్ని పరిపుష్ఠం చేశారు.

మధురభక్తిని, శరణాగతితత్వాన్ని ప్రచారం చేసి శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని చాటి చెప్పడానికి 1978లో తి.తి.దే.వారు అన్నమాచార్య ప్రాజెక్టును స్థాపించారు. దీని ఉద్దేశాలు ప్రధానంగా మూడు – సంగీత ప్రచారము, పరిశోధనతో గూడిన ప్రచురణలు, సంకీర్తనల రికార్డింగు. తొలి డైరక్టరుగా శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో తెలుగు శాఖ ఉపన్యాసకులు, చక్కని కంఠస్వరం గల కామిశెట్టి శ్రీనివాసులును నియమించారు. వారి తర్వాత దాదాపు మూడు దశాబ్దుల పాటు సహస్రావధాని డా. మేడసాని మోహన్ డైరక్టరుగా వ్యవహరించారు. 2018లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ తెలుగుశాఖ ఆచార్యులు బి. విశ్వనాథ్ ఈ పదవికి ఎంపికయ్యారు.

సంగీత విభాగం:

అన్నమాచార్య సంకీర్తనా ప్రచారానికిగా యువ కళాకారులను దేవస్థానం పక్షాన ఈ విభాగంలో గాయనీ గాయకులుగా నియమించారు. తొలి సంవత్సరాలలో శ్రీయుతులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, శోభారాజు నియమింపబడ్డారు. ఆ తర్వాత పారుపల్లి రంగనాథ్, నాగేశ్వరనాయుడు, మధుసూదనరావు, విశాలాక్షి, చిట్టెమ్మ ఈ విభాగంలో చేరారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోనూ, తదితర పట్టణాలలోనూ విస్తృతంగా పర్యటించి అన్నమాచార్య కీర్తనలు గానం చేసి ప్రచారం చేశారు.

గాయకులను, వాద్య సంగీత కళాకారుల బృందాలను ఎంపిక చేసి రిజిస్టరు చేసి, వారి చేత ప్రధాన పుణ్యక్షేత్రాలలో, ఆలయాలలో, విద్యాసంస్థలలో, గ్రామాలలో, సాంస్కృతిక సంస్థలలో ఈ బృందాల ద్వారా గత నాలుగు దశాబ్దులుగా ప్రచారం చేస్తున్నారు. దేవస్థాన కళాకారులు పర్యటనలకు వెళ్ళడానికి ప్రత్యేక వాన్ కూడా ఏర్పాటు చేశారు.

అన్నమయ్య జయంతులు, వర్ధంతులు:

ఏటా అన్నమయ్య జయంతిని వైశాఖమాసంలోనూ, వర్ధంతిని ఫల్గుణమాసంలోనూ ఘనంగా జరుపుతారు. సభలు, సమావేశాలు, గోష్ఠులు ఏర్పాటు చేస్తారు. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయంగా అన్నమయ్య కీర్తనలకు ఖ్యాతి లభించింది. తాళ్ళపాకలో, తిరుపతిలో, తిరుమలలో, వీటిని పెద్ద ఎత్తున జరుపుతారు. అన్నమయ్య ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించి, సప్తగిరి సంకీర్తనల గోష్ఠీగానం ఏర్పాటు చేస్తారు.

తిరుమలలో ప్రతి సాయంకాలం జరిగే ఊంజల సేవలో – సహస్రదీపాలంకార సేవలో గాయకులు అన్నమాచార్య కీర్తనలు గానం చేస్తారు. అలాగే దేవస్థానానికి చెందిన ఇతర దేవాలయాలలోనూ ఈ కీర్తనలు పాడుతారు. అన్నమయ్య జానపద బాణీలో జాజరలు, దంపుళ్ళ పాటలు, ఎల పదాలు, యుగళగీతాలు రచించాడు. వాటిని స్వరపరిచి గానం చేస్తున్నారు.

హరికథలు, జానపద సంగీత కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ పేర సినీదర్శకులు కె. రాఘవేంద్రరావు మార్గదర్శనంలో ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గత మూడు సంవత్సరాలుగా వందలాది కీర్తనలను ప్రసిద్ధ గాయకులచే పాడిస్తున్నారు. వర్ధమాన కళాకారులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం బహుళ జనాదరణ పొందింది.

అన్నమాచార్య కీర్తనల ప్రాచుర్యానికి దేవస్థానం ఎంతో కృషి చేస్తోంది. ఈనాడు అంతర్జాతీయంగా ఈ కీర్తనలు బహుళ వ్యాప్తిలోకి వచ్చాయి. చికాగోలో డా. శారదా పూర్ణ శొంఠి – SAPNA – శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికాను 1989లో స్థాపించి ఏటా ఉత్సవాలు జరుపుతున్నారు. 2002లో అక్టోబరు 5న చికాగోలో జరిగిన సభలో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. 2008లో ప్రసంగం చేశాను.

హైదరాబాదులో మాదాపూరులో శ్రీమతి శోభారాజు అన్నమాచార్య పీఠాన్ని స్థాపించి వివిధ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వందలాది శిష్యులను తయారు చేశారు. గురు కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య కీర్తనా గాన సంప్రదాయానికి ఊతమిచ్చారు.

పరిశోధన – ప్రచురణల విభాగం:

డా. మేడసాని మోహన్ ఈ ప్రాజెక్టులో పరిశోధకులుగా చేరి మదరాసు విశ్వవిద్యాలయం నుండి అన్నమాచార్య భాషపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. ఎందరో అన్నమయ్యపై వివిధ విశ్వవిద్యాలయాలలో దాదాపు 60 పరిశోధనా గ్రంథాలు వెలువరించారు. వందల సంఖ్యలో అన్నమయ్య సంగీత, సాహిత్యాలపై దక్షిణాది భాషలలో గ్రంథాలు వెలువడ్డాయి. అన్నమయ్య సంకీర్తనలను వేటూరి ప్రభాకరశాస్త్రి, గౌరిపెద్ద రామసుబ్బశర్మ వంటి పండితులచే 1977లో సంపుటాలుగా ప్రచురించారు. 1998లో పునర్ముద్రణ జరిగింది. తొలుత 1935-38 లో కొన్ని సంపుటాలు వచ్చాయి. ఆ తరువాత 1947-65 మధ్య మరికొన్ని వచ్చాయి. 1975-86 మధ్య తాళ్ళపాక కవుల సంకీర్తనల సంపుటాలు, ఆధ్యాత్మ సంకీర్తన సంపుటాలు వచ్చాయి. సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి, పండిత విజయరాఘవాచార్య, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, పి.టి. జగన్నాథరావు, ఉదయగిరి శ్రీనివాసాచార్యులు ఈ మహా యజ్ఞంలో పాల్గొన్నారు.

డా. మేడసాని మోహన్ ఆధ్వర్యంలో శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు పక్షాన ఇప్పుడు అన్ని సంపుటాలలో కీర్తనకలకు సరళ వ్యాఖ్యానం వ్రాయించే ప్రయత్నం 2018లో మొదలెట్టారు. నాకు ‘శృంగార సంకీర్తనలు – సంపుటి 18’వ భాగానికి వ్యాఖ్యానం వ్రాసే అవకాశం లభించింది. 363 ఆధ్యాత్మ కీర్తనలు, 1921 శృంగార కీర్తనలు (అన్నమయ్యవి) గ్రంథరూపంలో సంపుటాలుగా వచ్చాయి.

రికార్డింగు విభాగం:

అన్నమాచార్య కీర్తనల ప్రాచుర్యానికై శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు సహకారంతో అన్నమయ్య ప్రాజెక్టు ఆడియో క్యాసెట్లు విడుదల చేసింది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులే గాక, సుప్రసిద్ధ గాయనీగాయకులను కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. సంగీత విద్వాంసులైన భారతరత్న యం.యస్. సుబ్బలక్ష్మి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వోలేటి వెంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన్నసత్యనారాయణ, మణికృష్ణస్వామి, వాణీ జయరాం, శోభారాజు ఈ కీర్తనలను ఆలపించి రికార్డు చేశారు. అవి స్టాల్స్‌లో బాగా అమ్ముడుపోయాయి.

అన్నమయ్య 600 జయంతి:

2008 మే నెలలో తాళ్ళపాకలో అన్నమయ్య 600 జయంతి ఉత్సవాలను తి.తి.దే. అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి డా.కె.వి.రమణాచారి నేతృత్వంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు.

అన్నమయ్య జయంతి రోజు వెయ్యిమంది సంగీత కళాకారులతో విశాలమైన వేదికపై సప్తగిరి సంకీర్తనాగోష్ఠీగానం అత్యద్భుతంగా జరిగి, దేశవ్యాప్తంగా అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒక గంటసేపు ప్రసారం చేశాయి. త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కీర్తనల గానం వలె ఈ గోష్ఠి ఒక రికార్డుగా నిలిచిపోయింది.

సంగీత, నృత్య కార్యక్రమాలు మూడు రోజులు వైభవంగా జరిగాయి. వేలాదిమంది రాజంపేట నుండి తాళ్ళపాక వరకు ఉత్సవంగా నడిచారు. సంగీత కళాకారులు, సినీ నటీనటులు, ప్రసిద్ధ రచయితలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు. అదొక విశేషానుభూతి.

తిరుపతిలోని అన్నమయ్య కళామందిరం నిత్యం సాహితీ సాంస్కృతిక కార్యకలాపాలకు నెలవైంది. భక్తి సంగీత చైతన్యానికి ఈ ప్రాజెక్టు నాలుగు దశాబ్దుల కృషి అనన్యసామాన్యం. వందలాది కళాకారులు సంగీత, నృత్య కార్యక్రమాలలో అన్నమయ్య కీర్తనలు ప్రదర్శించడం శ్రీనివాసుని కళావైభవం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here