Site icon Sanchika

తిరుమలేశుని సన్నిధిలో… -12

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

తిరుమలలో ప్రత్యేక దర్శనాలు:

[dropcap]తి[/dropcap]రుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి సాధారణ భక్తులు నిత్యం వేల సంఖ్యలో యావత్భారతదేశం నుంచి విచ్చేస్తారు. రోజూ 70 వేల నుంచి లక్షమంది వరకు దర్శనం చేసుకుంటారు. ఆనంద నిలయం తలుపులు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మూసివేస్తారు. ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిలి, వెండి వాకిలి వగైరాలు మూసివేసే ప్రక్రియ వుంది. దానికి ఒక అధికారికి ‘సీలింగ్ డ్యూటీ’ వేస్తారు. ఆయన రాత్రి 9 గంటలనుండి క్యూ లైన్లను పర్యవేక్షించి, సుమారు ఒంటిగంట ప్రాంతంలో క్యూ లైన్‌లను నిలిపివేస్తారు. మిగిలిన భక్తులు మరుసటి దినము ఉదయం వరకు కంపార్ట్‌మెంట్లలో వుండిపోతారు. ఏకాంత సేవ పూర్తిచేసి బంగారు వాకిలికి ‘సీలు’ వేస్తారు. ఒక తాళం కార్యనిర్వహణ అధికారి ప్రతినిధి సీలు చేసి ఒక పెట్టెలో పెడతారు. మరొకటి పెద్ద జీయర్ పక్షాన ఏకాంగి సీల్ చేసి పట్టుకు వెళ్తాడు. మరో 20 నిమిషాల్లో సుప్రభాత సేవకు వచ్చిన డాలర్ శేషాద్రి బృందం సిద్ధంగా వుంటుంది. ఈ సీలింగ్ డ్యూటీ నెలలో 15 రోజుల మాటు ఒక అధికారికి లభిస్తుంది. అలా నేను రెండు సంవత్సరాలు సేవ చేశాను.

ఏతావాతా స్వామివారు 30 నిమిషాల లోపు విశ్రాంతి తీసుకొని మళ్లీ  సుప్రభాతానికి సిద్ధమవుతారు. సుప్రభాతము, అర్చనాదులు పూర్తి అయిన తర్వాత నైవేద్య ఘంట మ్రోగుతుంది. అప్పటికే రంగనాయక మండపంలో వి.ఐ.పి.లు బ్రేక్ దర్శనానికి సిద్ధంగా వుంటారు.

1. వి.ఐ.పి బ్రేక్ దర్శనాలు:

దేశవ్యాప్తంగా ఉన్న అధికార ప్రముఖులకు, ప్రత్యేక హోదా గల మంత్రులు మొదలైన వారికి తిరుమలలో ఉన్న సంయుక్త కార్యనిర్వహణాధికారి పాస్‌లు విడుదల చేస్తారు. వీటిని L1, L2, L3 – అని మూడు విభాగాలుగా రోజు మంజూరు చేస్తారు. దాదాపు వందలాది మందికి ఈ దర్శన సౌకర్యం కలుగుతుంది. ఒక్కొక్కరు 500 రూపాయలు చెల్లించి ఈ వసతి పొందుతారు. దీనిని ‘లెటర్’ల దర్శనంగా భావించాలి. శని ఆదివారాలలో ఈ దర్శనాలు వుండవు. వీరు కులశేఖరాళ్వారుపడి వరకు వెళ్తారు. హారతులందుకొన్న స్వామిని దర్శిస్తారు.

2. సర్వదర్శనం:

ఇది ఉచిత దర్శనం. రకరకాల ప్రయోగాల ద్వారా ఎక్కువ మంది భక్తులకు దర్శనం కలిగించడానికి దేవస్థానం ప్రయత్నిస్తోంది. సర్వదర్శనం భక్తులకు కూడా రాములవారి మేడ (ఆనంద నిలయం లోపలి భాగం) వరకు వెళ్లే అవకాశం వుండేది. ఇప్పుడు జయవిజయుల వద్ద దర్శనం కలిగిస్తున్నారు. ఆనంద నిలయం లోపలికి ప్రవేశించగానే భక్తులు మూడు వరుసలలో ముందుకు కదులుతారు. గరుడాళ్వారు నుండి ఎత్తయిన బల్ల మీదుగా నడుస్తూ మూలవిరాట్టుని కొన్ని సెకన్లు సేవిస్తారు. అక్కడ నిల్చున్న పరివారం భక్తులను లాగి వేస్తారు – అయినా 15 గంటలు పడుతుంది దర్శనానికి.

ఉచిత దర్శన్ భక్తులను కంపార్టుమెంట్లలో నిలిపి, వారి వరుస రాగానే (వైకుంఠం క్యూ కాంప్లెక్స్-II ద్వారా) వదులుతారు. ఉచిత ప్రసాదము, మంచినీరు 24 గంటలు అందజేస్తారు. పాలు కూడా అందిస్తారు. ఇలాంటి కంపార్ట్‌మెంట్లు 26 ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ దర్శనానికి నిర్దిష్ట సమయాన్ని కేటాయించే ‘యాక్సెస్ కార్డ్స్’ అందిస్తున్నారు. ఒక భక్తునికి ఉదయం 10 గంటలకు దర్శన సమయం కేటాయిస్తే అతడు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు 10 గంటలకు వెళితే చాలు, వేచి ఉండే సమయం వుండదు.

3. దివ్య దర్శనం:

వేలాది మంది భక్తులు తిరుమల కొండకు నడిచి వస్తామని ముక్కులు మొక్కుతారు. వారు తిరుపతిలోని అలిపిరి మార్గంలో 7.8 కిలోమీటర్లు కొండను ఎక్కుతారు. ఓ మార్గంలో శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు గుండా 2.1 కిలో మీటర్లు  కొండ ఎక్కుతారు. బిపి, హృద్రోగ సంబంధ వ్యాధులు ఉన్నవారు నడక మార్గంలో కొండ ఎక్కడం భావ్యం కాదని దేవస్థానం సూచించింది.

కాలినడకన కొండను ఎక్కే భక్తులకు అనేక సదుపాయాలు కల్పించింది. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్‌లో యాత్రికుల వసతుల హాలు ఏర్పరిచారు. అలాంటివి రెండో సత్రం (రైల్వే స్టేషన్ పక్కన), భూదేవి కాంప్లెక్స్ లోనూ ఉన్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అలిపిరికి, శ్రీవారి మెట్టుకు ఉచిత బస్సు సౌకర్యం వుంది. భక్తుల సామాన్లు కొండ మీదికి చేర్చే ఏర్పాటు కూడా దేవస్థానం కల్పించింది. ఈ నడక మార్గంలో వచ్చే భక్తులకు -అలిపిరి మార్గం గుండా వచ్చేవారికి రోజు 14 వేల టోకెన్లు, శ్రీవారి మెట్టు గుండా వచ్చే ఆరు వేల మందికి దర్శన సమయం టోకెన్లు ఇస్తారు. దీనిని దివ్య దర్శనం అంటారు.

4. రూ.300/- ప్రత్యేక దర్శనం:

2009 సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అంటే ఒక దశాబ్ది కాలం క్రితం ఈ దర్శన సదుపాయం కలిగించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయాలలో తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకునే వారికి ఈ వసతి కల్పించారు. క్యూలైన్లలో నిలబడి గంటల తరబడి వేచి వుండకుండా ముందుగా ఆన్‌లైన్ విధానం ద్వారా ఈ-దర్శన్ కౌంటర్లలో, పోస్టాఫీసులలో, తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్ కౌంటర్ ద్వారా ముందు వచ్చిన వారికి ప్రత్యేకత (ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్‌డ్ బేసిస్) పద్ధతిపై రూ.300 చెల్లించి ఈ దర్శనం టికెట్ పొందవచ్చు. ఆ రోజు ఎన్ని గంటలకు వీరు ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లాలో తెలియజేస్తారు. కొద్ది గంటలలో వీరికి దర్శనం కలుగుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా ముందుగా బుక్ చేసుకోవచ్చు.

ప్రతి వారం ఒక లక్షా 40 వేల టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా లభిస్తాయి. తిరుగు ప్రయాణాన్ని తదనుగుణంగా బుక్ చేసుకోవచ్చు.

5. వృద్ధులకు ప్రత్యేక దర్శనం:

వికలాంగులకు, సీనియర్ సిటిజన్లకు ఒక ప్రత్యేక దర్శన ద్వారం ద్వారా ఈ దర్శనం ఏర్పాటు చేశారు. తిరుమల నుంచి ఆలయానికి ఎదురుగా ఒక ద్వారం తెరిచి వీరిని దర్శనానికి అనుమతిస్తారు. ఒక్క శుక్రవారం నాడు మాత్రం మధ్యాహ్నం మూడు గంటల దర్శనం ఉంటుంది. మిగతా రోజులలో నిత్యం ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు టోకెన్లు ప్రతి పూట 750 ఇస్తారు. ఆధార్ వంటి వయో నిర్ధారణ పత్రాలు చూపి టోకెన్లు పొందవచ్చు. 65 సంవత్సరాల వయసు దాటిన వారికి ఈ సౌకర్యం ఉంది. వీరికి విశ్రాంతి సౌకర్యము, ఫలహారము, పాలు అందిస్తారు. ఈ విధంగా వయోవృద్ధులు, వారి సహాయకుడొకరు దర్శనం సులభంగా పొందగలరు. ఇది ఉచిత దర్శనం.

6. చంటిపిల్లల తల్లిదండ్రులకు దర్శనం:

వైకుంఠం-I, వైకుంఠం-II ద్వారాలు కాకుండా గత కొద్ది సంవత్సరాలుగా కళ్యాణోత్సవ సేవా టిక్కెట్ల వారిని ‘సుపథం’ ద్వారా పంపుతున్నారు. ఆ ద్వారం గుండా ఉదయం 10 గంటల తరువాత చంటి పిల్లల తల్లిదండ్రులను దర్శనానికి అనుమతిస్తారు.

తల్లిదండ్రుల ఆధార్ కార్డుల వంటివి, బిడ్డ జనన తేదీ ధ్రువీకరణ పత్రము గేటు వద్ద అధికారికి చూపాలి. ఇది ఉచిత దర్శనం. ఒక సంవత్సరంలోపు తల్లిదండ్రులకు మాత్రమే పరిమితం.

క్యూలైన్లలో తొక్కిసలాటలో బిడ్డలతో నిలబడడం కష్టమని దేవస్థాన పాలకవర్గం ఈ ప్రణాళికను ప్రవేశపెట్టింది.

7. నూతన వధూవరులకు దర్శనం:

తిరుమలలోని ప్రత్యేక కల్యాణ వేదికపై వధూవరులు ఉచిత కళ్యాణ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. పురోహితుని దేవస్థానం ఏర్పరుస్తుంది. ఇతర సేవలకు రుసుము చెల్లించాలి. కళ్యాణ వేదికపై వివాహం చేసుకున్న దంపతులకు, వారి ఉభయ తల్లిదండ్రులకు ఆరు మందికి ‘సుపథం’ ద్వారా ఉచిత దర్శనం సౌకర్యం వుంది.

www.ttdsevaonline.com ద్వారా మూడు నెలలు ముందుగా ఈ వేదికపై వివాహానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. రూ.300/- ప్రత్యక్ష దర్శనం ద్వారం గుండా ఆరుగురిని దర్శనానికి పంపుతారు. ఈ కుటుంబానికి 50 రూపాయల వసతి గది. పసుపు, కుంకుమ, కంకణాలు, 10 ఉచిత లడ్డూలు అందిస్తారు.

వివరాలకు 0877-2263433 నెంబరులో సంప్రదించగలరు.

8. విదేశాలలో నివసిస్తున్న భారతీయులు, సైనిక దళాల వారికి దర్శనం:

విదేశీ భారతీయులకు, సైనిక దళాలలో వారికి రూ.300/- చెల్లింపు ద్వారా ప్రత్యేక దర్శనం లభిస్తుంది. పాస్‌పోర్టు తదితర గుర్తింపు కార్డులు చూపి ఈ టిక్కెట్లను పొందవచ్చు.

9. అంగ ప్రదక్షిణ భక్తులకు దర్శనం:

కొందరు భక్తులు చుట్టూ ‘పొర్లుడు దండాలు’ (అంగప్రదక్షిణ) చేస్తామని మొక్కుకుంటారు. ఆపదమొక్కులవాడయిన ఆ శ్రీనివాసుడు వారి కోర్కెలు తీరుస్తాడు. తిరుమలలోని కేంద్రీయ రిసెప్షన్ ఆఫీసు వద్ద బయోమెట్రిక్ విధానం ద్వారా ఆధార్ కార్డు చూపి టోకెన్ సంపాదించవచ్చు. రోజుకు 750 టోకెన్లు మాత్రమే ఇస్తారు. శుక్రవారం అభిషేకం దృష్ట్యా అంగ ప్రదక్షిణ టోకెన్లు గురువారం రాత్రి జారీ చేయరు. అలాగే ఉత్సవ సమయాలలో కూడా ఈ సౌకర్యం లేదు.

ఈ టోకెన్లు గల భక్తులు ముందుగా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి ఆ తరువాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్-I వద్ద నిర్ధారిత సమయంలో వేకువజామున తయారుగా ఉండాలి. అంగ ప్రదక్షిణ తర్వాత దర్శనం చేసుకుంటారు.

ఈ రకాలే గాక శ్రీవారి సేవకులు, పరకామణి సేవకులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ దర్శన సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. మహా ద్వార దర్శనం పరిమితంగా పీఠాధిపతులకు, తదితర హోదా గల వ్యక్తులకు లభిస్తుంది. దేవస్థానం ఉద్యోగులలో డ్యూటీ మీద మహాద్వారం గుండా వెళ్ళే పాసులు ఇస్తారు. ఆ సౌకర్యాన్ని నేను నాలుగేళ్లు పొందడం నా అదృష్టం.

Exit mobile version