తిరుమలేశుని సన్నిధిలో… -13

0
3

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

నిత్యోత్సవ శోభితుడు:

[dropcap]తి[/dropcap]రుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ శోభితుడు. నిత్య కళ్యాణం – పచ్చ తోరణంగా ఆనంద నిలయవాసుడు సేవలందుకొంటాడు.

నిత్యసేవలు:

సుప్రభాతం:

శ్రీవారికి ఉదయం 3 గంటల ప్రాంతంలో సుప్రభాతం పేర మేలుకొలుపులు ప్రతినిత్యం జరుగుతాయి. అర్చక స్వాములు, ఏకాంగి, సుప్రభాత పాఠకులు, ఆర్జిత సేవ భక్తులు బంగారువాకిలి ముందు – జయవిజయుల ఎదుట చేరుకొంటారు. సన్నిధి గొల్ల కుంచెకోలతో తాళం తీయడానికి సిద్ధంగా వుంటాడు. ముందు రోజు రాత్రి 2 గంటల ప్రాంతంలో ఏకాంత సేవను తెల్లవారి జామున 2 గంటల ప్రాంతంలో పూర్తి చేసి బంగారు వాకిలి తలుపులు బిగిస్తారు. సర్కారు తాళము, జీయర్ స్వామి తాళము (డబుల్ లాకర్) వేసి వస్తారు.

సుప్రభాతాన్ని పండితులు చదువుతారు. ఈ సుప్రభాతాన్ని మణవాళ మాముని ఆశువుగా చెప్పారు. ఇందులో తొలి శ్లోకం వాల్మీకి రామాయణ బాలకాండ లోనిది. విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రుని మేల్కొల్పుతూ చెప్పిన మాటలే శ్లోక రూపం ధరించాయి.

కౌసల్యా సుప్రజా రామా

పూర్వా సంధ్యా ప్రవర్తతే.

ఉత్తిష్ఠ నరశార్దూల!

కర్తవ్యం దైవమాహ్నికమ్‌!

ఆ శ్లోకాన్ని యథాతధంగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో వాడుకొన్నారు.

సుప్రభాతము, ప్రపత్తి, మంగళాశాసనము పఠించిన అనంతరం దర్శనానికి అనుమతిస్తారు. దీనిని విశ్వరూప దర్శన మంటారు.

తోమాల సేవ:

ఈ సేవ ఆర్జిత సేవ. మూలవిరాట్టుకు వివిధ పుష్పాలతో అలంకరించి తోమాలలు అలంకరిస్తారు. ఈ పదం తమిళంలోని ‘తోడుత మాలై’ పదం నుండి వచ్చింది. ఈ తోమాలలను యమునా దురై నుండి పెద్ద జీయర్ స్వామి తరపున ఏకాంగి సంప్రదాయబద్ధంగా దివిటీ ముందు నడవగా, జేగంట మ్రోగగా, వైభవంగా ఆనంద నిలయంలోకి తీసుకెళ్తాడు. మంత్రపుష్పం శయన మండపంలో చదువుతూండగా స్వామిని పూలతో అలంకరిస్తారు.

అర్చన:

అర్చన సమయంలో సహస్రనామాలను పండితులు చదువుతారు. ఇందుకుగా పద్మనాభం – అనే అర్చకుని నిత్యం ఈ సేవలకు నియోగిస్తారు. ఇది కూడా ఆర్జిత సేవ. సుమారు 20 నిమిషాలు పడుతుంది. ఆర్జిత సేవల టిక్కెట్లు కొనుక్కున్న వారికి అర్చన అనంతరం దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు.

ఆ తరువాత నైవేద్య సమర్పణ జరుగుతుంది. గంటను మ్రోగిస్తారు.

కళ్యాణోత్సవం:

మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవిలకు వైవాహికోత్సవాన్ని ప్రతినిత్యం మధ్యాహ్నం 12 గంటలకు మొదలుపెడతారు. వైఖానసాగమోక్తమ పూర్వకంగా హోమం నిర్వహించి శాస్త్రోక్త వివాహం, మాంగల్య ధారణ, తలంబ్రాలు నిర్వహిస్తారు. దీనిని హిందూ సంప్రదాయానుసారం ప్రత్యేకంగా కళ్యాణ మండపంలో జరుపుతారు. ఆచారాన్ని అనుసరించి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, సంకల్పం, ప్రవరలు, తెరపచ్చడం, మాంగల్యధారణాధులు ఒక పురోహితుడు మంత్రాలు పఠించగా, మరొకరు వైదిక కార్యక్రమం పూర్తి చేస్తారు. వేయికి పైగా ఆర్జిత సేవా టికెట్లు రోజు విడుదల చేస్తారు. కొత్తగా పెళ్లి అయిన వధూవరులు, మొక్కులు ఉన్నవారు ఈ కల్యాణోత్సవ సేవలో పాల్గొంటారు.

డోలోత్సవం:

కళ్యాణ అనంతరం మూడు ఉత్సవ విగ్రహాలను – మలయప్పస్వామి, శ్రీదేవి భూదేవి – రంగనాయక మండపానికి ఎదురుగా ఉన్న అద్దాల మండపం (అయన మండపం) లోనికి తెచ్చి ఊయలపై కూర్చోబెడతారు. వేద పారాయణం, మంగళ వాద్యాల మధ్య కొద్ది నిమిషాల పాటు స్వామివారిని, దేవేరులను ఊయలలో ఊపుతారు. ఇది ఆర్జిత సేవ.

ఆర్జిత బ్రహ్మోత్సవం:

డోలోత్సవం తరువాత ఊరేగింపుగా ఉత్సవమూర్తులను వసంత మండపానికి చేరుస్తారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సంక్షిప్త రూపంలో బ్రహ్మోత్సవ వాహనాలైన స్వర్ణ పెద్దశేషవాహనం, వెండి గరుడ వాహనం, వెండి హనుమంత వాహనంపై ఉత్సవమూర్తులను కూచోబెట్టి మంత్రపూర్వకంగా హారతులిస్తారు. ఈ కార్యక్రమం మొత్తం 15 నిమిషాలలో పూర్తి అవుతుంది. ఇది ఆర్జిత సేవ.

వసంతోత్సవం:

వెంటనే ముగ్గురు మూర్తులను కూచోబెట్టి వసంతోత్సవం జరుపుతారు. ఏటా మూడు రోజులపాటు జరిగే వసంతోత్సవాలకు ఇది సంక్షిప్త రూపం. ఇది ఆర్జిత సేవ. భక్తులు ఈ సేవ పూర్తిచేసుకుని సుపథం ద్వారా దర్శనానికి వెళతారు. ఈ సేవలన్నీ లోపలే (మండపాలలో) జరుగుతాయి. సేవా టికెట్లు గలవారు మాత్రమే చూడగలరు.

సహస్రదీపాలంకార సేవ:

ఈ సేవ ఆరుబయట మండపంలో సాయంకాలం ఐదు గంటలకు మొదలై 30 నిమిషాల పాటు జరుగుతుంది. వేయి నేతి దీపాలను పరిచారకులు ముందుగానే వెలిగిస్తారు. 4.45 నిమిషాలకు వసంతమండపం నుండి (ధ్యాన మందిరం లేదా వాహన మండపం) ఉత్సవంగా బయలుదేరి ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి ఉయ్యాలపై కూర్చుంటాడు. డాలర్ శేషాద్రి ఆధ్వర్యంలో ఊయలను నలుగురు ఊపుతారు.

ముందుగా ఐదు నిమిషాలు వేద పఠనం జరుగుతుంది. ఆపైన అన్నమాచార్య ప్రాజెక్టు వారు నియమించిన గాయక గాయనీమణులలో ఒకరు రెండు, మూడు అన్నమాచార్య కీర్తనలను ఆలపిస్తారు. వెంటనే పురందరదాసు కీర్తన ఒకటి దాససాహిత్య ప్రాజెక్టు పక్షాన గానం చేస్తారు. చివరలో నాదస్వర కైంకర్యంతో హారతులు అందుకుంటారు మలయప్ప స్వామి. ఇది ఆర్జిత సేవ. విశేషంగా సామాన్య భక్తులు కూడా ఉచితంగా దర్శించుకోవచ్చు. వెంటనే మాడ వీధులలో ఉత్సవంగా బయలుదేరి మహాద్వారం గుండా సూర్యాస్తమయం లోపు మలయప్ప స్వామి రంగనాయక మండపానికి చేరుకుంటారు. అంతటితో సరిపోలేదు.

ఏకాంత సేవ:

దీనిని పాన్పుసేవా దర్శనం అంటారు – ఒకప్పుడు ఇది ఆర్జిత సేవ. ప్రస్తుతం సమయాభావం వల్ల దీనిని ఏకాంతంలో జరుపుతారు. ఈ సేవలో ఇద్దరు ప్రాచీన భక్తుల కైంకర్యాలు నడుస్తాయి. అర్థ మండపంలో ఊయలలో వెండి విగ్రహం అయిన భోగ శ్రీనివాసమూర్తిని పాన్పుపై పవళింపు చేస్తారు. అన్నమాచార్య సంతతికి చెందిన వ్యక్తి రోజూ ఒక కీర్తన స్వామికి ఆలపిస్తాడు. నైవేద్యంగా పాలు, జీడిపప్పు సమర్పిస్తారు. ఆ పళ్ళెంపై దశావతారాలలోని ఒక అవతారాన్ని ముత్యాలతో అలంకరిస్తారు. దానిని అన్నమయ్య లాలి – వెంగమాంబ హారతి అని పిలుస్తారు.

నైవేద్యంగా సమర్పించిన పాలు, జీడిపప్పులను ప్రసాదంగా అక్కడ చేరిన అధికార గణానికి, పరిచారకులకు అందిస్తారు. ఏకాంత సేవ డ్యూటీలో ఉన్న అధికారికి ఆ భాగ్యం లభిస్తుంది. నేను 2 సంవత్సరాలు నెలకు రెండు మార్లు ఆ మహద్భాగ్యాన్ని పొందాను. ఏకాంత సేవ పూర్తికాగానే బంగారు వాకిలి తలుపులు బిగిస్తారు. బయట హుండీలలో వచ్చిన కానుకలను సంచులలో కట్టి ఆ రాత్రి వరకు వచ్చిన వాటిని పరకామణి అరమరలో భద్రపరిచి ‘సీలు’ వేస్తారు.

భోగ శ్రీనివాసమూర్తి సంవత్సరంలో 11 నెలలు ఆ పాన్పుపై శయనించగా ధనుర్మాసంలో కృష్ణస్వామి నిద్రిస్తాడు. ఆ నెలలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై అధ్యయనం చేస్తారు.

వారోత్సవాలు:

విశేష సేవ:

ప్రతి సోమవారం వైఖానసాగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి విగ్రహాలను కళ్యాణ మండపానికి వేంచేపు చేసి హోమము, తిరుమంజనం జరుపుతారు. ఇది ఆర్జిత సేవ. 2 నెలలు ముందుగా బుక్ చేసుకోవాలి. ఈ సేవను 1991 ఏప్రిల్ 8 న ప్రారంభించారు.

అష్టదళ పాదపద్మారాధన:

రెండో అర్చన పూర్తికాగానే ప్రతి మంగళవారం 108 బంగారు పద్మాలతో మూలవిరాట్టుకు అర్చన జరుగుతుంది. ఇది ఆర్జితసేవా. తిరుమల తిరుపతి దేవస్థానం మండలి స్వర్ణోత్సవాల సందర్భంగా 1984లో ఈ సేవ ఆరంభించారు. భక్తిప్రపత్తులతో దీనిని దర్శిస్తారు.

సహస్ర కలశాభిషేకం:

ప్రతి బుధవారం భోగ శ్రీనివాస మూర్తికి 1008 వెండి బిందెలతో ఈ అభిషేకం నిర్వహిస్తారు. సర్వ దర్శనానికి ముందుగా ఇది జరుపుతారు.

తిరుప్పావడ సేవ:

ప్రతి గురువారం ఈ సేవ ఉంటుంది. విశేషంగా పులిహోరను నైవేద్యంగా సమర్పించడం (రాశిగా పోసి) ఇందులో ప్రత్యేకత. పులిహోరతో పాటు పాయసము, లడ్డు, జిలేబి, తెంతోళ, అప్పళం మొదలగునవి నివేదిస్తారు. పులిహోరను పిరమిడ్ ఆకారంలో (త్రిభుజాకారం) అమరుస్తారు. నారికేళాలు, పూలు, గంధము, కుంకుమ చుట్టూ చేరుస్తారు. వివిధ మంత్రోచ్చారణలతో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇది కూడా ఆర్జిత సేవ.

అభిషేకం:

ప్రతి శుక్రవారం మూలవిరాట్టుకు అభిషేకాన్ని కర్పూరము, కుంకుమ పూవు, పాలతో నిర్వహిస్తారు. స్వామివారికి పవిత్ర స్నానమిది. దీనిని దర్శించి తరించడానికి సంవత్సరాల తరబడి టికెట్ల కోసం వేచి వుండాల్సి వచ్చేది. ఇప్పుడు లాటరీ డిప్ ద్వారా కొద్దిమంది అదృష్టవంతులకు లభిస్తోంది. వేదమంత్రాలు, నాలాయిర దివ్య ప్రబంధ పఠనంతో అభిషేకిస్తారు. స్వామివారి వక్ష స్థలంలో ఉన్న లక్ష్మీదేవి కూడా శ్రీ సూక్త పఠనంతో అభిషేకం జరుపుతారు. మూలవిరాట్టుకు పట్టు పీతాంబరాన్ని, విశేష ఆభరణాలను అలంకరిస్తారు.

నిజపాద దర్శనం:

ప్రతి శుక్రవారం అభిషేకానంతరం భక్తులకు మూలవిరాట్టు పాదాలు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ఏ విధమైన ఆచ్ఛాదనా లేని స్వామి వారి పవిత్ర పాదాలు భక్తులు చూడవచ్చు. ఇతర సమయాలలో విశేషాభరణాలతో పాదాలు కప్పబడి ఉంటాయి.

ఈ విధంగా స్వామివారి నిత్యోత్సవ వారోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. మిగతా సేవలు మరువారం మరువం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here