Site icon Sanchika

తిరుమలేశుని సన్నిధిలో… -14

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

వార్షిక సేవలు:

“పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్‌
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌.”

అని నిత్యమూ సుప్రభాత సేవ లందుకునే ఆనందనిలయవాసుడైన తిరుమలేశునికి నిత్యోత్సవాలే గాక సంవత్సరం పొడుగునా వివిధ ఉత్సవాలు జరుపుతారు. బ్రహ్మ ముందు నిలిచి జరిపేవి బ్రహోత్సవాలు. అవి ఆశ్వయుజ మాసంలో దసరాలలో వస్తాయి. రెండేళ్లకొకసారి అధిక మాసం వచ్చినప్పుడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

తెప్పోత్సవాలు:

ఈ తెప్పలపై ఉత్సవాలను 16వ శతాబ్ది వాడైన సాళువ నరసింహరాయలు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. ఐదు రోజుల పాటు స్వామి పుష్కరిణిలో తెప్పలపై వివిధ ఉత్సవమూర్తులు ఊరేగుతారు. తెప్పలపై నాదస్వర విద్వాంసులతో బాటు వేదపండితులు, అన్నమాచార్య కీర్తనా కళాకారులు, ఆలయ అధికారులు కూర్చోంటారు. మధ్య మధ్యలో హారతులందిస్తారు.

మొదటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహ రూపంలో నవవీత నృత్య భంగిమలో తెప్పలపై విహరిస్తాడు. రెండవ నాటి రాత్రి శ్రీరామచంద్రమూర్తి సంచరిస్తాడు. మూడు, నాలుగు, ఐదు రోజులలో శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామి విలాసంగా విహరిస్తాడు. రంగనాయక మండపం నుండి సర్వాభరణ భూషితమైన విగ్రహాలను ఉత్సవంగా స్వామి పుష్కరిణి వద్దకు తీసుకువస్తారు. తెప్పోత్సవాలు దర్శించడానికి ఆర్జిత సేవా టికెట్లు లభిస్తాయి. పుష్పాలంకృతమైన తెప్పలపై స్వామి మూడు, ఐదు, ఏడు పర్యాయాలు వరుసగా (రోజువారిగా) విహరిస్తారు.

వసంతోత్సవము:

దీనికిగా తిరుమలలో ఆనంద నిలయానికి వెనక పడమట మాడ వీధిలో ప్రత్యేకంగా నూతన వసంత మండపం పది సంవత్సరాల క్రితం నిర్మించారు. అందులో మూడు రోజుల పాటు చైత్ర శుధ్ధ త్రయోదశి, పూర్ణిమలలో వసంతోత్సవాలు జరుపుతారు. మూడు రోజులు శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్పస్వామివార్లను ఉత్సవంగా వసంత మండపం వద్దకు తెస్తారు. మంగళ వాద్యఘోషలు, వేదమంత్రోచ్చారణల మధ్య అభిషేకం జరుపుతారు.

చివరిరోజైన మూడో రోజు మలయప్పస్వామితో బాటుగా సీతారామలక్ష్మణ హనుమదాదులను, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వాముల విగ్రహాలను ఉత్సవంగా వసంత మండపానికి తెస్తారు. ఇది ఆర్జిత సేవ. సేవానంతరం దర్శన సౌకర్యం, ప్రసాద వితరణ వుంటాయి.

పద్మావతీ పరిణయం:

1992లో ఈ పరిణయోత్సవాలు తిరుమలలో ప్రారంభించారు. వైశాఖ శుద్ధ దశమినాడు అంగరంగ వైభవంగా ఇది నిర్వహిస్తారు. నారాయణగిరి తోటలో ప్రత్యేకంగా నిర్మించిన విశాల వేదికపై ఈ ఉత్సవం సాయంకాలం వేళ చేస్తారు. మూడు రోజుల పాటు స్వామివార్లను ఊరేగింపుగా ఆలయం నుండి మంగళ వాద్యఘోషల మధ్య తరలిస్తారు. తొలిరోజు సాయంకాలం శ్రీ వెంకటేశ్వరుడు, ఆయన దేవేరులు కొలువుదీరుతారు. రెండవరోజు మలయప్ప అశ్వవాహనంపై కన్పిస్తాడు. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వేద మంత్ర ఘోషల మధ్య వాద్య విశేషాల సంబరాల మధ్య పరిణయోత్సవం పూర్తి అవుతుంది. అన్నమాచార్య కీర్తనల బృందగానము, హరికథా కాలక్షేపము భక్తులను ఆనంద పరుస్తాయి. ఇది ఆర్జిత సేవ.

పద్మావతీ శ్రీనివాసులు తొలుత తోటలో కలుసుకున్నట్లు వేంకటాచలమహత్యం చెబుతోంది. ఉత్సవమూర్తులను ఎదురెదురుగా నిలిపి పూలచెండ్లు ఒకరి పక్షాన ఒకరు విసురుతున్నట్లు ఎదురుకోల నిర్వహిస్తారు. కార్యనిర్వహణాధికారి, తదితరులు ఇందులో ఉత్సాహంగా రెండు గంటలపాటు పాల్గొంటారు.

తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యంలో పద్మావతీ శ్రీనివాసుల పరిణయాన్ని వైభవంగా వర్ణించింది.

“హరి చిరునవ్వునగుచు, పద్మావతి కరంబు పట్టి తోడ్కని సకలవైభవంబుతోడ వచ్చి పూర్వ వివాహమందిరంబు జేరె, అందు మంగళస్నాన పూర్వకంబుగా వస్త్రభూషణాద్యలంకృతుండై, రత్న పీఠంబు మీద లక్ష్మీ పద్మావతీ సమేతుండై కూర్చొండి యుండె.”

“ఆ తర్వాత పురోహితులు నాకబలి, దేవతార్చనలు, నీలమణిధారణలు చేటలదానము, వసంతోత్సవము, పాన్పుపై దంపతులు పేర్లు చెప్పడం, తాంబులాలు అందించడం, నాందీ నిసర్జన చేశారు. అత్రి, వసిశ్ఠుల ఆధ్వర్యంలో అవి జరిగాయి. ఆ పైన దంపతి పూజలు చేసి వస్త్రాభరణాలు బహుకరించారు. విందు భోజనాలు పెట్టించారు. సాయంకాలం నాడు ఐరావతం మీద హరిని, సిరిని పద్మావతిని ఉత్సవంగా వీధి ప్రదక్షిణలు చేయించారు.”

అచ్చమైన తెలుగు వారి పెండ్లి సంబరంగా వెంగమాంబ చిత్రించింది.

అభిధేయక అభిషేకం:

దీనినే జ్యేష్ఠాభిషేకంగా జ్యేష్ఠమాసంలో మూడురోజులు జరుపుతారు. పవిత్రంగా దీనిని కల్యాణ మండపంలో భక్తుల మధ్య నిర్వహిస్తారు. వివిద పూజలు, మంత్రాలు మద్య ఉత్సవమూర్తుల పరిరక్షణకు సరియైన పద్ధతిలో ఈ కార్యక్రమం ఏర్పరచారు. విగ్రహాలలో కొద్దిపాటి లోపాలను, తరుగుదల, అరగుదలలను సరిచేస్తారు. తొలిరోజు స్వామివారి స్వర్ణకవచాన్ని తొలగించి అభిషేకము, స్నపన తిరుమంజనము చేస్తారు. ఆ తర్వాత వజ్రకవచ సమర్పణంతో స్వామి వెలిగిపోతాడు. స్వామిని ముత్యాలకవచంతో అలంకరించి తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. మూడవరోజు తిరుమంజనం తర్వాత స్వర్ణకవచం సమర్పిస్తారు.

పుష్పపల్లకి:

ప్రతి సంవత్సరం జులై నెలలో ఆణివర ఆస్థానం నాడు జరుపుతారు. దక్షిణాయన పుణ్యకాలంలో ఆణిమాసంలో తొలిరోజు మలయప్పస్వామిని పుష్పపల్లకిలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఉద్యానవన విభాగం వారు ప్రత్యేకించి పుష్పపల్లకిని అలంకరిస్తారు.

పవిత్రోత్సవము:

ఆలయంలో నిత్యం జరిగే పూజలు, సేవలు జరపడంతో ఏమరపాటున దొర్లిన తప్పులు సవరించుకోవడానికి ఈ పవిత్ర కార్యక్రమం ఉద్దేశించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో విశేషంగా వైభవంగా దీనిని ఆచరిస్తారు.

పుష్పయాగం:

కార్తీక మాసంలో ఈ ఉత్సవం ప్రధానం. తిరుచానూరులో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 15వ శతాబ్దిలో తొలిసారిగా ఈ ఉత్సవం ఆరంభించారు. మధ్యలో కొంత కాలం ఆగిపోయీయి. 1980 నుండి మళ్లీ పునరుద్ధరించారు. రెండు అర్చనలు, రెండు నైవేద్యాలు జరిగిన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిని కల్యాణమండపానికి ఉత్సవంగా తీసుకొస్తారు. మధ్యాహ్నసమయంలో వివిధ రకాల పుష్పాలతో వైభవంగా అర్చిస్తారు. పుష్పార్చన 20 సార్లు జరిపి హారతులిస్తారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం:

ఆనంద నిలయం లోపల ఆలయ పరిశుభ్రత కోసం ఈ కార్యక్రమం సంవత్సరంలో నాలుగు పర్యాయాలు చేస్తారు.

  1. ఉగాది
  2. ఆణివర ఆస్థానము
  3. బ్రహ్మోత్సవాలు
  4. వైకుంఠ ఏకాదశుల ముందు వచ్చు మంగళవారం ఈ కార్యక్రమం వుంటుంది.

మొదటి గంట పూర్తి కాగానే ఉత్సవమూర్తులు కాకుండా ఇతర చిన్న చిన్న మూర్తులు, అఖండ దీపస్తంభము తదితర వస్తువులను పక్క గదిలోకి మారుస్తారు. గర్భగృహంలో మూర్తులు లేకుండా చేసి కుంకమ, కర్పూరం, గంధంతో మిశ్రమాన్ని గోడలకు పూస్తారు. తద్వారా గర్భగృహంలో క్రిమికీటకాదులు నశిస్తాయి. తర్వాత నీటిలో గోడలు పరిశుభ్రం చేస్తారు.

మూల విరాట్టుకు వున్న water proof తొడుగును తొలగించి లఘు తిరుమంజనం చేస్తారు. అలానే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి సేవ జరుగుతుంది. రెండో గంట సమయంలో నైవేద్య సమర్పణ చేస్తారు.

స్వామి వారికి సమర్పించిన పులిహోర, దధ్యోజనం, పొంగలి దర్శనానంతరం వెళ్లిపోతున్న భక్తులకు ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ విధంగా సంవత్సరం పొడుగునా శ్రీనివాసుని వైభవం కొనసాగుతునే వుంటుంది.

కేవలం మనుషులు, ఋషులు, తపస్వులే గాక దేవతలు, బ్రహ్మాదులు వేంకటేశ్వరుని అర్చించారని వెంగమాంబ వివరించింది.

సూతుడు శౌనకాది మహామునులతో ఇలా అన్నాడు – “పూర్వము బ్రహ్మ, శివులకు హరి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు బ్రహ్మ వైఖానస సూత్రక్రమంగా అర్చన చేశాడు. కన్యామాసంలో రథోత్సవం కొనసాగించాడు. బ్రహ్మ తర్వాత విఖనస మహర్షి అర్చించాడు. ఆ ముని ఆదేశం మేరకు మరీచి మహర్షి తర్వాత అత్రి, కశ్యపుడు, భృగుడు, ఫుల్లముని, యక్షులు, స్వాయంభువ మనువు వరుసగా శ్రీవేంకటేశుని కొలిచారు.”

సప్తర్షులు స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆనందనిలయవాసుని దర్శించుకొన్నట్లు కళాపూర్ణోదయంలో పింగళి సూరన వర్ణించాడు. అంటే 16వ శతాబ్ది నాటికే తిరుమల క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. పురాణకాలం నుండి తిరుమల భక్తజనుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది. లక్షలాది సంవత్సరాల నుండి తిరుమలేశుడు పూజలందుకుంటూ భక్తుల కోర్కెలు తీరుస్తూ వున్నాడు. వడ్డికాసులవాడుగా, ఆపద మొక్కులవాడుగా ప్రసిద్ధి కెక్కాడు.

Exit mobile version