Site icon Sanchika

తిరుమలేశుని సన్నిధిలో… -21

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

వేంకట రమణుని సేవలో వేంకటరమణుడు

ఐ.ఎ.ఎస్. అధికారులు తమ 34 సంవత్సరాల సర్వీసులో జిల్లా కలెక్టరు మొదలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు పదోన్నతులు పొందుతారు. కాని, డైరక్టరు/కమీషనరు, కార్యదర్శి పదవులకంటే మిన్నగా వారు భావించేది తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా పనిచేయడం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన వందలాది ఐ.ఎ.ఎస్. అధికారులలో కేవలం 26 మంది మాత్రమే 1933 నుండి 2019 వరకు టి.టి.డి. కార్యనిర్వహణాధికారి కాగలిగారు. అది కేవలం భగవత్ కృపగా భావిస్తారు.

డా. కె.వి. రమణాచారి వైష్ణవ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. తిరుమలేశుని సేవలో తరించిన ఏకైక వైష్ణవ ఐఎఎస్ అధికారి ఆయనే. రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలలో ఉత్తీర్ణులై ఆర్.డి.ఓ.గా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో ప్రజా సేవ చేస్తూ ప్రజల కలెక్టర్‌గా పేరు తెచ్చుకొన్నారు. 1994-95 మధ్య కాలంలో కడప జిల్లా కలెక్టరుగా పనిచేశారు. ఆ సమయంలో నేను కడప ఆకాశవాణి డైరక్టర్‍గా ఉన్నాను. అప్పటి నుండి మా మైత్రీబంధం గట్టిపడింది.

హైదరాబాద్ అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటిలో పనిచేసినా, కులీ కుతుబ్‌ షా డెవెలప్‍మెంట్ బోర్డులో పనిచేసినా, సమాచార శాఖ కమీషనర్‍గా ఉన్నా, సాంస్కృతిక శాఖకు సారధ్యం వహించినా, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఉన్నా ఆయన ఎన్నడూ అధికార దర్పం ప్రదర్శించలేదు. ఆయన బదిలీ మీద వెళ్తుంటే బదిలీ రద్దు చేయాలని ప్రజలు ధర్మాలు చేశారు.

సింగపూర్ టౌన్‌షిప్ వంటి సంస్థలకు ప్రాణం పోసింది ఆయనే. జంటనగరాల సాంస్కృతిక సంస్థలకు జవసత్వాలు కల్పించిన కాయకల్ప చికిత్సా వైద్యుడు. సురభి నాటక సంస్థల పునరుజ్జీవానికి అశేష సౌజన్యాన్ని అందించిన వ్యక్తి. అటువంటి సహృదయుడు 2007-2009 మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు. పదవీ విరమణకు ముందు ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ఎండోమెంట్స్)గా వ్యవహరించారు.

తిరుమలలో పనిచేయడం భాగ్యంగా భావించిన ఆయన పదవీకాలంలో రెండు చారిత్రాత్మక సంఘటలు జరిగాయి. వాటి రూపకల్పనకు ఆయన శ్రమించారు. దానికి తోడు అప్పటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి సంకల్పబలము, ప్రోత్సాహము సహకరించాయి.

అన్నమయ్య 600 జయంతి:

ఇదొక విశిష్ట కార్యక్రమం. 19 మే 2008న తాళ్ళపాకలో అన్నమయ్య 600 జయంతిని ఘనంగా జరపాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది. దాదాపు ఆరు నెలల పాటు వందలాది మంది దేవస్థానం అధికారులు దీనికి విశేష కృషి చేశారు. ఎన్నో అధికార సమావేశాలు జరిగాయి. కరుణాకరరెడ్డి, రమణాచారి కృష్ణార్జునుల వలె ఆ మహా యజ్ఞ నిర్వాహకులయ్యారు. ఆ సందర్భంగా ఒక పెద్ద అన్నమయ్య విగ్రహాన్ని తాళ్ళపాక కూడలిలో నిర్మించారు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణ చేశారు. హెలికాప్టర్ ద్వారా పూల వర్షం విగ్రహంపై కురిపించారు.

పలువురు పీఠాధిపతులు, గాయకగాయనీమణులు, సినీతారలు వందల సంఖ్యలో కొలువుదీరారు. కడప జిల్లా యంత్రాంగం కలెక్టరు యం.టి. కృష్ణబాబు నేతృత్వంలో విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. దేవస్థానం మూడు రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించింది.

సప్తగిరి సంకీర్తనా గోష్ఠీగాన యజ్ఞం:

తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కీర్తనలను వేలాదిమంది గాయకులు గానం చేస్తారు. ఏటా జరిగే ఆ కార్యక్రమాన్ని దూరదర్శన్, ఆకాశవాణి – జాతీయ స్థాయిలో ప్రసారం చేస్తాయి. అదే తరహాలో అన్నమయ్య రచించిన సప్తగిరి సంకీర్తనలను వందమంది ప్రసిద్ధ గాయకులతో ప్రత్యేక వేదికపై గానం చేయిద్దామని రమణాచారి నాతో ప్రస్తావించారు. ఆ కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో దూరదర్శన్, ఆకాశవాని ప్రసారం చేసేలా చూడమన్నారు. వాణిజ్య ప్రసార విభాగం ద్వారా వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయించాము.

గాయకగాయనీమణులు ఎవరైనా పాల్గొనవచ్చని ప్రకటించాము. వారికి రవాణా ఖర్చులు, వసతి, తిరుమల దర్శనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పేర్లు నమోదు చేసుకొనే కార్యక్రమం నెలరోజుల పాటు జరిగింది. అన్నమాచార్య ప్రాజెక్టు డైరక్టరు డా. మేడసాని మోహన్ పటిష్ఠ నిర్వహణలో ఆ పని చేపట్టాము.

2008 మే 10 నాటికి ఆ సంఖ్య వెయ్యి దాటింది. వివిధ రాష్ట్రాల నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి అసంఖ్యాకంగా కళాకారులు పేర్లు నమోదు చేసుకొన్నారు. వారికి వసతి సౌకర్యం తలకి మించిన భారం అయ్యింది. శ్రీనివాసంలో అన్ని రూములు వారికి కేటాయించే బాధ్యతను ఎస్టేటు ఆఫీసరు రామిరెడ్డి పకడ్బందీగా చేశారు. 18 ఉదయానికే వేల సంఖ్యలో గాయకులు వచ్చారు. ఆ మధ్యాహ్నం మహతి ఆడిటోరియంలో రిహార్సల్సు జరిపాము.

విశాలమైన వేదిక:

గాయకులు, వాద్య నిపుణులు బారులు తీరి కూర్చునే రీతిలో తాళ్ళపాకలో సూపరింటెండింగ్ ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి వేదిక విశాలంగా కట్టించారు. ముందువరుసలో వీణా, వయొలిన్ తదితర కళాకారులను కూర్చోబెట్టారు. వేదిక నిండిపోయింది. మే నెల ఎండలు. కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి ప్రారంభమైంది. పీఠాధిపతులు, రాజకీయ నాయకులు, అధికారులు వేదిక ముందు భాగంలో షామియానాల్లో కూచున్నారు. మిట్ట మధ్యాహ్నం కార్యక్రమం పూర్తి అయింది.

ఆ రోజు ఉదయమే రాజంపేట నుండి తాళ్ళపాక కూడలి వరకు నగర సంకీర్తన వలె సినీతారలు, అధికార అనధికారులు పాదచారులై వచ్చారు. శోభాయమానంగా కార్యక్రమం ముఖ్యమంత్రి ఆగమనంతో పులకించిపోయింది.

గాయకుని వింత కోరిక:

సంకీర్తనా యజ్ఞం పూర్తి అయింది. ఆ సాయంకాలం వేయిమందికి పైగా తిరుమల దర్శనం ప్రత్యేక బస్సులలో తీసుకెళ్ళి (ఆర్‌టిసి బస్సులు) ఏర్పాటు చేయగలిగాం. అయితే మధ్యాహ్నం కార్యక్రమం పూర్తికాగానే ఆ గాయకులలో ఒకరు, రమణాచారిగారికి ఒక చీటీ పంపారు.

“సార్! కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఒక్కొక్క గాయకుడికి ఒక లడ్డూ స్వామివారి ప్రసాదంగా ఇప్పించగలరు.” అని సారాంశం.

వేదిక వద్ద మెట్లపై రమణాచారి, జె.ఇ.వో. ధర్మారెడ్డి, వారి పక్కనే నేను, మేడసాని మోహన్ కూర్చుని ఉన్నాం. ఆయన నా చేతికి ఆ కాగితం ఇచ్చారు. నేను ధర్మారెడ్డికి చూపించాను. “వెయ్యి లడ్లు సృష్టించడానికి నేను బాబాను కాను” అన్నారు ఆయన ఛలోక్తిగా. నా పక్కనే వున్న మోహన్ – “సార్! అన్నమాచార్య ప్రాజెక్టు కోసం వెయ్యి లడ్లు తెప్పించినవి ఉన్నాయి. ఇద్దాం” అన్నారు.

ప్రత్యేక కౌంటర్లలో జిల్లాల వారిగా వచ్చినవారికి రాకపోకల ఛార్జీలు ఇచ్చాము. వాటితో బాటు లడ్డూ ప్రసాదం అందించాం. కళాకారుల ఆనందానికి అవధులు లేవు. అంతా స్వామి లీలలు. వెయ్యి లడ్లు ప్రాజెక్టులో వుండటం ఆశ్చర్యం!

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్:

రమణాచారి నిరంతర సాంస్కృతిక కృషీవలుడు. ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలలో భాగంగా తిరుమలేశునికి ఒక ప్రత్యేక ఛానల్ వుంటే బాగుంటుందని దేవస్థాన ధర్మకర్తల మండలి 2007 చివరి భాగంలో తీర్మానించింది. అప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర దృశ్యశ్రవణ ప్రాజెక్టు కో-ఆర్డినేటరుగా పని చేస్తున్నాను. సమాచార ప్రసార మంత్రిత్వశాఖ అధికారులతో సన్నిహిత పరిచయాలు వున్న నాకు ఆ పనిభారాన్ని రమణాచారి అదనంగా అప్పగించారు.

ఛానల్‌కు మూలనిధిగా దృశ్య శ్రవణ ప్రాజెక్టు మూడు కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక కంపెనీగా రిజిస్టరు చేయించాము. పి.వి.ఆర్.కె. ప్రసాద్, ఐ.వి. సుబ్బారావు, రమణాచారి హైదరాబాదు సచివాలయంలొ దీని విషయంగా సమావేశమనప్పుడు నేనూ భాగస్వామిని. ఛానల్ లైసెన్స్ కొసం ఢిల్లీకి మూడు, నాలుగు సార్లు నేను వెళ్ళవలసివచ్చింది.

అప్ లింక్ కోసం బెంగుళూరులోని ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్‌ను కలిశాను. ఢిల్లీలోని ఒక ప్రైవేటు సంస్థతో లింక్ అప్ ఒప్పందం తక్కువ రేటుతో కుదుర్చుకున్నాం.

సిబ్బందిలో తొలి వ్యక్తిగా నేనే ఉన్నాను. ఛానెల్ సీ.ఇ.ఓ.గా కె.యస్.శర్మను నియమించారు. పత్రికా ప్రకటన ద్వారా దాదాపు 80 మందిని ఎంపిక చేశారు. అలిపిరి గెస్ట్ హౌస్‌లోనూ, తిరుమల యస్.వి. గెస్ట్ హౌస్‌లోనూ కార్యాలయాలు, తాత్కాలిక స్టూడియోలు నిర్మించారు. సిబ్బంది చేరారు. హైదరాబాద్ బాలాజీ భవన్‌లో మరో కార్యాలయం ఏర్పడింది.

కార్యక్రమ రూపకల్పన, రికార్డింగ్ ఆరంభమయ్యాయి. 2008 బ్రహ్మోత్సవాలకు లోపు ఛానల్ ప్రారంభించే గురుతర బాధ్యతను రమణాచారి నాకప్పగించారు. సమాచార శాఖ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ సంతకాలు చేశారు. సుముహూర్తంలో ఛానల్ ప్రారంభించాలని నిర్ణయించారు.

భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ పవిత్ర హస్తాల మీదుగా తిరుమల ఆలయ మహాద్వారం ముందు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ 7 జూలై 2008న ప్రారంభమైంది. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకున్న ఈ ఛానల్ లక్షలాది ప్రేక్షకుల హృదయాలను చూరగొంది. 2018లో తమిళ ఛానల్ కూడా ఆరంభించారు. ఇది అంతా రమణాచారి సంకల్పబలము, కార్యదీక్ష, భక్తి తత్పరత వల్లనే నని నా దృఢ నమ్మకం.

Exit mobile version