Site icon Sanchika

తిరుమలేశుని సన్నిధిలో… -24

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

అన్నమయ్య

[dropcap]తి[/dropcap]రుమలలో శ్రీవేంకటేశ్వరుని ఆరాధించి తరించిన వారిలో తాళ్లపాక వంశీయులు ప్రథమస్థానంలో నిలుస్తారు. ‘హరి యవతార మీతడు అన్నమయ్య’ అని, ‘అప్పని వరప్రసాది అన్నమయ్య’ అని చెబుతారు. అన్నమయ్య శ్రీమహావిష్ణువు నందకాంశ (ఖడ్గ) సంభూతుడు. అన్నమయ్యపై పరిశోధనలు విశేషంగా జరిగాయి.

తిరుమలేశుని సన్నిధిలో 2005 మే 2010 జూన్ వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసే భాగ్యాన్ని పదవీవిరమణానంతరం ఆ శ్రీనివాసుడు అప్పటి కార్యనిర్వహణాధికారి శ్రీ ఏ.పి.వి నారాయణశర్మ ద్వారా నాకు కల్పించాడు. శ్రీవేంకటేశ్వర దృశ్యశ్రవణ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా 2005 – 2007 మధ్య శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ కోఆర్డినేటర్‌గా 2007 – 2010 మధ్య అన్నమయ్య పాటల ఆడియో, వీడియో రికార్డింగుల బృహత్ కార్యక్రమంలో భాగస్వామినయ్యాను. నా శ్రీమతి శోభాదేవి అన్నమయ్య పై మూడు గ్రంధాలు వెలువరించింది.

తాళ్లపాక అన్నమాచార్యుల పూర్వీకులు క్రీశ. 10వ శతాబ్దిలో కాశీక్షేత్రం నుండి కర్నులు జిల్లాలోని నందవరం గ్రామానికి వలస వచ్చారు. అప్పుడు అక్కడి రాజు నందుడు. అప్పటి నుండి వీరిని నందచరీక బ్రాహ్మణులుగా పిలవసాగారు. ఆ తర్వాత వీరు కడప జిల్లాలోని రాజం పేట సమీపంలోని తాళ్లపాకలో స్థిరపడ్డారు.

తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరునకు నారాయణసూరి మొక్కగా స్వామి కలలో కన్పించి నందకఖడ్గాన్ని ప్రసాదించాడు. ఆ వరప్రసాదిగా అన్నమయ్య క్రీశ. 1408లో వైశాఖమాసంలో విశాఖ నక్షత్రంలో మూడు గ్రహాలు ఉచ్చదశలో వుండగా జన్మించాడు.

బాల్యంలో తిరుమల పయనం:

నిరంతర భగవద్ధ్యానంలో అన్నమయ్య బాల్యం గడిపాడు. కుటుంబీకులు ఆయనకు ఒకనాడు పశువుల గడ్డి కోయడానికి పొలానికి పంపారు. కొడవలితో చేతి వేలు తెగింది. ‘హరి హరీ!’ అని భగవంతుని స్మరించాడు. అదృష్టవశాత్తు స్వామి కృప వలన తిరుమలకు నడిచి వెళ్లే పరుసగుంపు కన్పించింది. వారితో కలిసి “ గుంపులో గోవిందా!’ అని అన్నమయ్య తిరుమల ప్రయాణమయ్యాడు. అలిపిరి మార్గం గూండా ప్రయాణం కొనసాగించారు. గోవింద నామస్మరణతో ఆకలి దప్పులు తెలియని రీతిలో మోకాళ్ల పర్వతం దాకా నడిచాడు అన్నమయ్య. అప్పుడాయన వయసు పదహారు వుండవచ్చు.

అలివేలుమంగ ప్రసాదం :

తెలియక పాదరక్షలతో కొండ నెక్కతూ మోకాళ్ల పర్వతం వద్ద అన్నమయ్య సొమ్మసిల్లాడు. అది వెదురు పొద వద్ద బండరాయి. మైమరచిన బాలుని వద్దకు అలివేలు మంగ వచ్చి ఊరడించి దివ్యప్రసాదం అందించింది. చెప్పుల వదలి కొండ నెక్కమని సూచిందింది. అన్నమయ్య ఆశువుగా అలివేలుమంగపై ‘శ్రీవెంకటేశ్వరా! ’ మకుటంలో శతకం చెప్పాడు.

“అమ్మకు తాళ్లపాక ఘనుడన్నడు పద్యశతంబు సెప్పె గై
కొమ్మని వాక్ ప్రసూనముల కూరిమితో అలమేలు మంగకున్
నెమ్మది నీవు చేకొని అనేక యుగంబులు బ్రహ్మకల్పముల్
సమ్మదమంది వర్థిలుము జవ్వని లీలల వేంకటేశ్వరా!” అన్నాడు.

అన్నమయ్య తిరుమలలో పుష్కరిణి స్నానం చేసి వరాహస్వామిని దర్శించి ఆనంద నిలయంలో మూల విరాట్టుని సేవించాడు. ఆనంద విమాన వేంకటేశ్వరుని కీర్తించాడు. తల్లిదండ్రులు అన్నమయ్యను వెదుకుతూ తిరుమల చేరుకున్నారు. అప్పటికే వైష్ణవయతి అన్నమయ్యకు పంచసంస్కారములు చేసి ముద్రాధారణతో వైష్ణవుడయ్యాడు. వైష్ణవ దీక్షతో శంఖచక్ర ముద్రికలతో స్వామిని కీర్తిస్తున్న తమ కుమారుని చూచి తల్లిదండ్రులు పరవశులయ్యారు. కడుపుతీపితో తమ వెంట తాళ్లపాక రమ్మని బ్రతిమాలారు. స్వామి కలలో ఆ రాత్రి కన్పించాడు. “తాళ్లపాకకు వెళితే శుభాలు కలుగుతాయి” అని ఆశీర్వదించాడు.

ఆదివన్ శఠకోప యతీంద్రులు తిరుమల సందర్శించారు. అప్పుడు అన్నమయ్య యతీంద్రుల శిష్యరికం చేయాలని నిర్ణయించుకొన్నాడు. యతీంద్రుల ఆశ్రమవాసమైన అహోబిలం వెళ్లి సాష్టాంగప్రణామం చేశాడు. యతీంద్రులు అన్నమయ్యకు నరసిహమంత్రం ఉపదేశించాడు.

అన్నమయ్య అహోబిలనారసింహుని పైన కీర్తనలు రచించాడు. గురువు అనుమతితో అన్నమయ్య తీర్థయాత్రలకు బయలుదేరాడు. కంచి వరదరాజస్వామిని, శ్రీరామనుజుల పెరంబుదూరును, శ్రీరంగనాథుని శ్రీరంగాన్ని దర్శించి సేవించి అనేక కీర్తనలు రచించాడు. సకల వేదాలు శాస్త్రాలను అధ్యయనం చేశాడు. తల్లిదండ్రులు అన్నమయ్యకు తిరుమలమ్మ, అక్కలమ్మ అనే ఇరువురు కన్యలతో వివాహం చేశారు. క్రమంగా అన్నమయ్య కీర్తి నలుదిశలా ప్రసరించింది.

చెరసాలలో అన్నమయ్య :

అప్పుడు విద్యానగరాధీశ్వరుడుగా సాళువ నరసింహరాయలు పరిపాలిస్తున్నాడు. అతడు టంగుటూరును పరిపాలిస్తున్న సమయంలో అన్నమయ్య అక్కడికి చేరాడు. అతనికి హితుడైనాడు. ప్రభువు పెనుగొండకు మారాడు. అతనితో బాటు అన్నమయ్య పెనుగొండ చేరాడు.

అలమేలుమంగ వేంకటేశ్వరులపై శృంగార కీర్తనలు గానం చేశాడు అన్నమయ్య. “ఏమొకో చిగురుటధరమున యెడనెడ కస్తురి నిండెను” వంటి కీర్తనలు విన్న నరసింహరాయడు తన పైన కూడ ఒక శృంగార కీర్తన అటువంటిదే పాడమని అనమయ్యను నిర్భంధించాడు. అన్నమయ్య ‘హరి హరీ’ అని చెవులు మూసుకొన్నాడు. కోపించిన నరసింగరాయడు అన్నమయ్యను మూరరాయరగండ అనే పేరుగల సంకెలతో బంధించి చెరసాలలో పెట్టాడు.

శ్రీనివాస భక్తి ప్రపత్తులతో అన్నమయ్య సంకెలలను విడిపించుకొన్నాడు. నరసింగరాయలు పశ్చాతప్తుడై శరణు వేడి అన్నమయ్యను పల్లకి ఎక్కించి తానే స్వయంగా మోశాడు. వెంటనే రాజశ్రయం వదలి తిరుమల చేరుకొన్నాడు. అన్నమయ్యకు ఎన్నో దివ్య శక్తులు లభించాయని ఆయన మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. ప్రజలు ఆ దివ్యశక్తులు చూచి తమ ఆపదలు పొగొట్టమని అన్నమయ్య వెంటబడ్డారు.

అన్నమయ్య యాత్రా సంచారం చేస్తూ కడప, కర్నులు, అనంతపురం, బళ్లారి, చిత్తూరు, చెంగల్పట్టు, అర్కాడు, తంజావూరు, తిరుచారాపల్లి, నెల్లూరు, గుంటూరు ఆలయాలు సందర్శించాడు. దాదాపు 32వేల కీర్తనలు రచించాడు. యోగ, వైరాగ్య, శుంగార కీర్తనలు ప్రబోధాత్మకంగా వ్రాశాడు.

95 సంవత్సరాలు జీవించాడు. రోజూ కొకటి తక్కువ కాకుండా అనేక కీర్తనలు వ్రాశాడు. అన్నమయ్య ద్వాత్రింశాక్షరి (32 అక్షరాల) మంత్రాన్ని శఠకోపయతి నుండి స్వీకరించాడు. అక్షరానికి వేయి చొప్పున 32 వేల కీర్తనలు వ్రాసి వుండవచ్చునని పరిశోధకులు గౌరి పెద్ది రామసుబ్బశర్మ భావించారు. అన్నమయ్య దుందుభి నామ సంవత్సర బహుళ ద్వాదశినాడు దివ్యధామం చేరుకొన్నాడు.

తాళ్ళపాక కవులు :

విజయనగర సామ్రాజ్యపు రాజులు తిరుమల క్షేత్రానికి చేసిన సేవ ఒక ఎత్తు; తాళ్లపాక వంశీయులు చేసిన సేవ మరొక ఎత్తు. సాళువ నరసింగరాయని కాలము నుండి సదాశివరాయల కాలం వరకు తాళ్లపాక వంశీయులు సంగీతసాహిత్యాలకు ఎనలేని సేవ చేశారు.

తాళ్లపాక తిమ్మక్క :

ఈమె అన్నమయ్య భార్యలలో ఒకరు. తొలి తెలుగు కవయిత్రిగా సాహిత్య పరిశోధకులు నిర్థారించారు. మంజరీద్విపదలో ఈమె సుభద్రా కల్యాణం రచించింది. ఈమె కుమారుడు నృసింహకవి. తిమ్మక్క సంగీత సాహిత్యాచతుర మహా భారతములోని సుభద్రార్జునుల వివాహాన్ని ఆమె ఈ కావ్యంలో ప్రస్తుతించారు. నన్నయ మహాభారత కథ ఆధారంగా ఈ రచన కొనసాగింది. శ్రీనాథుని హంసదూత్యంలా సుభద్రార్జునుల ప్రణయసాఫల్యానికి తిమ్మక్క చిలుకను పాత్రగా ప్రవేశపెట్టింది.

ఈమె రచన ననుసరించి చేమకూర వేంకటకవి విజయవిలాసమున అర్జునుని “ఎగుభుజంబులవాడు” అని వర్ణించాడు.

తాళ్లపాక వంశంలో ఇతర కవులు :

  1. నరసింగన్న (క్రీశ 1454 – 1546) తిమ్మక్క కుమారుడు. ఇతడు స్వామి కైంకర్యాలకు చందలూరు, మల్లవరం గ్రామాలు కైంకర్యం చేశాడు.
  2. పెదతిరుమలాచార్యులు (క్రీశ 1458 – 1554) అన్నమయ్య చిన్న భార్య అక్కలాంబ కుమారుడు. ఇతని కుమారుడు చినతిరుమలయ్య. ఈయన శృంగార, ఆధ్యాత్మ కీర్తనాదులు రచించాడు. వేంకటేశ్వరోదాహరణం ప్రసిద్ధం.
  3. చినతిరుమలాచార్యులు (క్రీశ 1488 – 1562). ఇతడు అన్నమయ్య మనుమడు. శృంగారాధ్యాత్మ కీర్తనలు వ్రాశాడు. రాజాశ్రయాన్ని తిరస్కరించాడు. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు 1540లో ఏర్పాట్లు చేశాడు.
  4. చిన్నన్న (క్రీశ 1500 – 1558). పెదతిరుమలయ్యకు నాల్గవ కుమారుడు. విద్వత్ కవి. పరమయోగి విలాస కావ్యరచయిత. అష్టమహిషీ కల్యాణం, ఉషాపరిణయం ప్రసిద్ధాలు. అన్నమయ్య చరిత్రను ఇతడు వ్రాశాడు.
  5. తిరువేంగళప్ప (క్రీశ 1515 -1565). చినతిరుమలయ్య కుమారుడు. ఈ విధంగా పలువురు తాళ్లపాక వంశీయులు శ్రీనివాసుని సేవలో తరించారు.

అట్టి మహనీయులు సంస్మరణతో ‘తిరుమలేశుని సన్నిధి’కి స్వస్తి.

స్వస్తి. శుభమస్తు.

Exit mobile version