[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
హిందూ ధర్మ ప్రచార పరిషత్:
[dropcap]శ్రీ [/dropcap]వేంకటేశ్వర భక్తి తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి హిందూ సనాతన ధర్మాన్ని ప్రోత్సహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 1969లో ‘హిందూ ధర్మ ప్రతిష్ఠానం’ అనే అనుబంధ సంస్థను స్థాపించింది. తరువాత దీనికి ‘ధర్మ ప్రచార పరిషత్’ అని నామకరణం చేశారు. 2007లో దీనినే ‘హిందూ ధర్మ ప్రచార పరిషత్’గా బోర్డు పునరుజ్జీవితం చేసింది. సంక్షిప్తంగా దీనిని హెచ్.డి.పి.పి. అని పిలుస్తారు.
తొలిరోజుల్లో ఈ సంస్థ కార్యదర్శిగా డా. డి. అర్క సోమయాజి వ్యవహరించారు. ఆయన భీమవరం డి.యన్.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేసేవారు. తిరుమల తిరుపతి దేవస్థానాల అధికారిక ధార్మిక సంస్థగా ఇది ప్రచార కార్యక్రమాల ద్వారా సనాతన ధర్మాన్ని పరిరక్షించడం, ప్రచారం చేయడం తన బాధ్యతగా స్వీకరించింది. ఆధ్యాత్మిక ప్రవచనాలు, ధార్మిక కార్యక్రమాలు, భక్తి ప్రచారం కొనసాగిస్తోంది.
శ్రీ వేంకటేశ్వర వేద రికార్డింగ్ ప్రాజెక్టు ద్వారా ఈ సంస్థ నాలాయిర దివ్య ప్రబంధాన్ని ఆడియో క్యాసెట్లుగా విడుదల చేసింది. దివ్య ప్రబంధం, పాశురాలు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సంప్రదాయంలో భాగంగా వీటిని ప్రచారం చేశారు. దేవస్థాన కార్యకలాపాలను ప్రచారం చేయడానికి భగవంతునికీ భక్తునికీ మధ్య అనుసంధానంగా ఈ సంస్థ కృషి చేస్తోంది.
ఈ సంస్థ స్వర్ణోత్సవ సంవత్సరమిది. ఈ సంస్థలో కార్యదర్శి నేతృత్వంలో కొద్దిపాటి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి పదోన్నతులు ఈ సంస్థలోనే ఉంటాయి. వీరిని దేవస్థాన ఉద్యోగులతో సమానంగా భావిస్తారు. దేవస్థాన ఉద్యోగుల పదోన్నతి క్రమంలోకి వీరు చేరరు. గత 50 సంవత్సరాలలో ఈ సంస్థ బడ్జెట్, కార్యకలాపాలు విస్తృతమయ్యాయి. దీనికిగా ప్రత్యేకంగా ఒక సలహా మండలి కార్యనిర్వహణాధికారి/ బోర్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
గతంలో కార్యదర్శులు: సముద్రాల లక్ష్మణయ్య సుదీర్ఘకాలం కార్యదర్శి. డా. పమిడికాల్వ చెంచుసుబ్బయ్య, డా. రాళ్లబండి కవితా ప్రసాద్, డా. చిలకపాటి విజయ రాఘవాచారి, కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రయాగ రామకృష్ణ తదితరులు కార్యదర్శులుగా వ్యవహరించారు.
బాలాజీ కళ్యాణాలు:
మలయప్ప స్వామి విగ్రహాలకు తిరుమలలో నిత్యం కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. వాటిని వీక్షించే భాగ్యం కొద్దిమందికే పరిమితం. ఆ భాగ్యాన్ని దేశవ్యాప్తంగా, ఇతర దేశాలలోనూ వున్న భక్తులకు కల్పించడానికి శ్రీ ఏ.పీ.వి.యన్. శర్మ కార్యనిర్వహణాధికారిగా ఉన్న సమయంలో 2007లో ఊరురా బాలాజీ కళ్యాణోత్సవాలు ఈ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం మొదలు పెట్టారు. ప్రత్యేకంగా శ్రీదేవీ భూదేవీ సమేత మలయప్ప స్వామి దివ్య విగ్రహాలు తయారు చేయించి వాటిని పలు ప్రాంతాలలో ఆలయ అర్చకుల ద్వారా కళ్యాణోత్సవాలు – ఢిల్లీ, హైదరాబాదు, మదరాసు, బెంగుళూరు తదితర నగరాలలోనే గాక పలు పట్టణాలలో నిర్వహించారు. స్థానిక భక్తుల ఉత్సాహాన్ని అనుసరించి వారి సహకారంతో వందలాది కళ్యాణాలు జరిపారు. లక్షలాది భక్తులు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సోరోత్సవ శోభితుడైన మలయప్ప స్వామి కళ్యాణాన్ని వీక్షించే సదుపాయం కలిగింది. అమెరికాలోనూ ఈ కళ్యాణాలు వివిధ రాష్ట్రాలలో గత దశాబ్ది కాలంగా నిర్వహించారు. వీటికిగా ‘కళ్యాణోత్సవ ప్రాజెక్టు’ ప్రత్యేకంగా ఏర్పాటుచేసి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు.
మన గుడి:
ప్రజానీకానికి ప్రత్యేకించి యువతలో మన దేవాలయాలలో నిక్షిప్తమైన సంప్రదాయ విలువలను ప్రచారం చేయడానికి ధర్మ ప్రచార పరిషత్ ‘మన గుడి’ పేర ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా బహుళ ప్రజానీక భాగస్వామ్యాన్ని దేవస్థానం సంపాదించగలిగింది. రాష్ట్రంలోని వేలాది ఆలయాలలో ఈ కార్యక్రమాన్ని సంవత్సరానికి రెండు సార్లు పవిత్ర మాసాలలో నిర్వహిస్తున్నారు. శ్రావణ, కార్తీక మాసాలలో వీటిని జరిపి ప్రజలలో భక్తి చైతన్యం కలిగించారు.
శుభప్రదం:
విద్యార్థులలో మానవీయ విలువలను పెంపొందించడానికి ఈ పథకం చేపట్టారు. 10, 11, 12వ తరగతుల విద్యార్థులకు వేసవి సెలవులలో వారం రోజులపాటు నైతిక విలువలను ప్రబోధించి పరీక్షలు నిర్వహిస్తారు. దీనికిగాను ప్రత్యేకంగా గ్రంథాలను ప్రచురించారు. ఇదొక ప్రసిద్ధ కార్యక్రమం. బహుళవ్యాప్తిలోకి వచ్చింది. అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు దీనికి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇదే విధంగా క్రింది తరగతుల విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సౌభాగ్యం పేరుతో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో 2012 నుండి గాజులు, పసుపు, కుంకుమ, పూలను తిరుపతి పరిసర గ్రామాలలోని సౌభాగ్యవతులకు వరలక్ష్మీ వ్రతం నాడు, కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచిపెట్టారు.
సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు:
దేవస్థానాల వారు భారతీయ ధార్మిక చైతన్య ప్రచారానికి, వికాసానికి, పరిరక్షణకు జరుపుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం ధార్మిక విజ్ఞాన పరీక్షలు 35 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి ప్రశంసా పత్రాలు, విలువైన బహుమతులు అందిస్తున్నారు. ఉన్నత పాఠశాల విద్యార్థులలో ధార్మిక ప్రచారం కలిగిస్తే అది వారి భావి జీవితాల్లో ఆస్తికతను, రుజువర్తనం కలిగించి ఉత్తమ సంస్కారవంతులుగా చేయడానికి సహకరిస్తుంది.
6, 7, 8 తరగతుల వారికి ధర్మ పరిచయాలు, 9, 10, ఇంటర్ విద్యార్థులకు ధర్మ ప్రవేశిక గ్రంథాలను 60 వేల ప్రతుల చొప్పున ప్రచురించి ఉభయ రాష్ట్రాల్లో పాఠశాలలకు అందించింది. తరువాత ధర్మ ప్రబోధ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు ప్రత్యేకాధికారిగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో వ్యాసాలు రాయించి ప్రచురించారు. ఈ రచయిత కూడా వ్యాసం వ్రాశాడు.
ఇతర కార్యక్రమాలు:
ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ఏటా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా (1) పద్యం ద్వారా పరమార్థం (2) కైశిక ద్వాదశి (3) యువాలయం (4) కళా నీరాజనం (5) భక్తి చైతన్య యాత్రలు ముఖ్యం.
నాదనీరాజనం:
2008లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రాచుర్యంలోకి వచ్చింది. కాని కార్యక్రమాల రూపకల్పన కోసం బయట ప్రొడ్యూసర్లకు లక్షలాది రూపాయల వితరణ జరుగుతుండేది. 2009లో కార్యనిర్వహణాధికారిగా ఐ.వై.ఆర్. కృష్ణారావు వచ్చిన తరువాత ఒక వినూత్న కార్యక్రమానికి నాంది ప్రస్తావన జరిగింది. దేశం మొత్తంలో ఉన్న సంగీత, నృత్య కళాకారుల ద్వారా మహాద్వారానికి ఎదురుగా తిరుమలలో ఒక వేదిక పైన కచేరీలు/నృత్య ప్రదర్శనలు 90 నిమిషాల సేపు ఏర్పాటు చేయాలని ఆలోచించారు. ఆయా కళాకారుల వివరాల సేకరణకు ఈ రచయిత ఢిల్లీ ఆకాశవాణి, ఐసిసిఆర్, సంగీత నాటక అకాడమీ అధికారులను కలిసి గ్రేడెడ్ ఆర్టిస్టుల వివరాలు సేకరించి వచ్చారు. వారి ద్వారా నాదనీరాజనం అనే పేర ఒక లైవ్ ప్రోగ్రాం 2009 ఆగస్టు 15 న అవసరాల కన్యాకుమారి వయోలిన్ వాదనతో ప్రారంభమై గత దశాబ్ది కాలంగా దిగ్విజయంగా జరుగుతోంది.
ఎస్‌విబిసి వారు దీనిని లైవ్‌గా ప్రసారం చేస్తున్నారు. సుప్రసిద్ధ గాయనీగాయకులు, నృత్య కళాకారులు, భజన బృందాలు ఇందులో పాల్గొనడం ఒక గర్వకారణంగా భావిస్తున్నారు. అనూరాధా పౌడ్వాల్ అనే గాయని తనకు ఇచ్చిన పారితోషికాన్ని అన్నదానానికి సమర్పించడం ఈ రచయితకు గుర్తు. నాదనీరాజన వేదికను మాగుంట శ్రీనివాసుల రెడ్డి వదాన్యతతో అద్భుతంగా నిర్మించారు. ఇది రికార్డులకెక్కిన లైవ్ కార్యక్రమం. యువ కళాకారుల మొదలు ప్రఖ్యాత కళాకారులు ఇందులో పాల్గొన్నారు.
ధార్మిక ప్రసంగాలు కార్యక్రమాలు:
ధర్మ ప్రచార పరిషత్‌కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో సమన్వయకర్తలు (కోఆర్డినేటర్లు) నియమించబడ్డారు. వీరి ఆధ్వర్యంలో జిల్లాలలోని వివిధ ప్రాంతాలలో ప్రవచనాలు, హరికథలు ఏర్పాటు చేస్తున్నారు. వేదాలు, ఆగమాలు, స్మార్త సంప్రదాయాలకు సంబంధించిన శిక్షణా సంస్థలకు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. హరికథకులకు ఇదొక ఉపాధి కార్యక్రమం. వివిధ ఆలయాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహిస్తున్నారు.
హిందూ ధర్మ ప్రతిష్ఠానం:
ఒక అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈ సంస్థ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిధులను ధర్మ ప్రచార పరిషత్ అందిస్తోంది. ఇటీవలి కాలంలో విస్తృత సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టారు. గిరిజన అర్చక శిక్షణ కార్యక్రమం ప్రధానం.
హరిజన వాడలో శ్రీవారి కల్యాణం నిర్వహించడం గొప్ప ఎత్తున చేపట్టారు. అధికారులు అక్కడే నిద్ర చేసే ఉద్యమం కూడా కొనసాగింది. భగవంతునికి సేవ చేసుకుని అవకాశం వివిధ భక్తులకు ఈ సంస్థ కార్యకలాపాల ద్వారా లభిస్తోంది. సదాచారం పేర చాగంటి వారి ప్రసంగాలు ఏర్పాటు చేశారు.
ధర్మ ప్రచార పరిషత్ సెంటర్లు:
ఉభయ రాష్ట్రాలలో ఇంచుమించు అన్ని జిల్లాలలో దీని విభాగాలు – కరపత్రాల పంపిణీ, ప్రవచనాలు, కార్యక్రమాల ఏర్పాట్లు చూస్తున్నాయి. అఖండ హరినామ సంకీర్తన, పుస్తక ప్రసాదము, గీత జయంతి, పురాణ వాఙ్మయ పరీక్ష, భజన మండలి, దర్మ రథ యాత్ర, సంస్థలకు ఆర్థిక సహకారం – పరిషత్ విధులు.
ధర్మ ప్రచార పరిషత్ వారి ఈ-మెయిల్ అడ్రస్: hdpp@tirumala.org. టెలిఫోన్ నెంబరు: 0877-2230893.