[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
తిరుపతి వేంకటకవుల కవితా వైభవం
[dropcap]‘తి[/dropcap]రుపతి వేంకట కవులు’ గా ప్రసిద్ధి కెక్కిన దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కవులలో, శ్రీ తిరుపతి శాస్త్రి గారు 1872 మార్చి 26న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం దగ్గర యండగండి గ్రామంలో జన్మించారు. ఈనాడు ఆయన జయంతి. ఈ సందర్భంగా యువభారతి ప్రచురణ ‘తిరుపతి వేంకట కవుల కవితా వైభవం’ గురించి సమీక్ష.
రాజాస్థానాలకు, పండిత కదంబాలకూ, వైయక్తికమైన కవిసాధనలకూ, గ్రంథాలయాలకూ కట్టుబడిపోయి, అసూర్యంపశ్యగా ఉన్న తెలుగు కవితావాణిని ప్రజాసందోహానికి అందించి కవిత్వోద్యమ ప్రగమనానికి ఘంటాపథాలు ఏర్పరచిన జంట కవులు – తిరుపతి వెంకట కవులు.
వారి శిష్య పరంపర – తామరతంపరగా భాషాభిమానుల హృదయ సరోవరాల్లో అల్లుకునిపోయారు. అప్పట్లో రాష్ట్రంలోని సంస్థానాల్లోనూ, ప్రసిద్ధ నగరాల్లోనూ, అష్టావధాన, శతావధానాది సాహిత్య గోష్ఠులను రస సముజ్జ్వలంగా నిర్వహించి, కవిత్వాన్ని ప్రజాయత్తం చేసిన విద్వత్కవులు.
పాండవోద్యోగ, పాండవ విజయాది నాటకాల ద్వారా ఛందోబద్ధమైన పద్యాన్ని ప్రజల దైనందిన జీవితాల్లోకి ప్రవేశపెట్టిన సరస కవులు.
గిడుగు వారి వ్యావహారిక భాషా వాదాన్ని పరిశీలించి, పద్య కవనంలోనూ, పాఠశాలలలోనూ, పాఠ్య గ్రంథాలలోనూ, గ్రాంథిక భాష ఉండాలనీ, వచన రచనకూ, సాహిత్యానికీ వ్యావహారిక భాష ఉపాధేయమనీ, వారు అంగీకరించారు. కావ్యాల్లో కూడా రసవంతంగా ఉండేటట్లు వ్యావహారిక పదాలు ప్రయోగించినా దోషం లేదని వారి అభిమతం. అన్యదేశ్యాలను తమ రచనల్లో విచ్చలవిడిగా వాడిన విశాల హృదయం వారిది.
“కవుల మున్పటి రూల్సుకు కట్టుబడము
ఘనులు పండితరాయాది కవులు చూపు
త్రోవలంబట్టి పోదుము దేవునిన
లక్ష్యపెట్టము…………”
“తనకు నాల్గు నిఘంటు పదములు వచ్చు
ననుచు బదిమందికి దెలియగ మారు
మూల పదముల గుప్పిన ముచ్చటగునె?
ప్రతి పదంబున రసముట్టి పడిన గాక!”
అన్నది వీరి కవితా శైలికి సంబంధించిన ప్రతిజ్ఞ.
ఒక్క వాక్యంలో చెప్పాలంటే – తిరుపతి వేంకట కవుల జీవితాలతో పరిచయం, నిన్న మొన్నటి తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన కవిత్వంతో పరిచయం.
వారి కావ్యాలలో ప్రసిద్ధమైన కొన్ని పద్యాలకు – ప్రథమాంధ్ర మహా పురాణము మార్కండేయ పురాణాన్ని గూర్చి పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందిన వారు, వీర రసాన్ని పర్యాలోకించి, ఆంద్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి బహుమతి నందుకొన్నవారు, యువభారతి గౌరవ సభ్యులు, మా ప్రచురణలకు ప్రధాన సంపాదకులు, డాక్టర్ జి వి సుబ్రహ్మణ్యం గారి కమనీయమైన వ్యాఖ్యానం – ఈ పుస్తకం.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.