[dropcap]నం[/dropcap]దగోప మహారాజుగారి నల్లకిట్టయ్య ఆకతాయి అల్లరిపిడుగు. గొల్లపెద్దలంతా తమ ఆడపిల్లలను అతగాడితో కలవనివ్వక కట్టడి చేశారు. వర్షాభావం, క్షామం వల్ల బీడుబారిన పొలాలు, ఎండిన పంటచెరువులు , పచ్చికబయళ్ళు , మేతకు పచ్చిక లేక ఆకలితో అలమటిస్తున్న పశుసంపదను చూచి, దుఃఖితులైన గొల్లపెద్దలు తమ ఆడపిల్లలు వైభవంగా భగవానుని కటాక్షం కోసం వ్రతం చేస్తే ఫలం దక్కుతుందేమో , నాలుగు తుంపరలు పడి నేల చిగురిస్తుందన్న ఆశతో తమ పిల్లలను నోము పట్టమని ఆదేశించారు. గోపికలంతా ఎగిరి గంతేశారు. ఈ సాకుతోనైనా కృష్ణసాన్నిధ్యం దొరుకుతుందని బ్రహ్మానందపడిపోయారు. తమ ప్రియాతిప్రియమైన రాజగోపాలుణ్ణి చూడటానికి, మాటాడటానికి అనుమతిచ్చిన పెద్దల మీద ఆ పిల్లలకు కృతజ్ఞతాభావం పెల్లుబికింది. వారి మాట కోసమైనా కృష్ణయ్యను అర్థించి వ్రతం దిగ్విజయంగా పూర్తిచేసి తీరాలని నిశ్చయించుకున్నారు.
శ్రీకృష్ణుని పొందటానికి గోకులంలో గోపికలందరిలాగే కృష్ణప్రేమలో తలమునకలైన ఆండాళ్ అనే తరుణవయస్సు బాలిక తనను తాను గోకులంలో గొల్లపడుచులా భావించుకుని, కృష్ణుడిని పొందటానికి నోము నోచాలనుకుంది. ఏ పనైనా నలుగురూ చేరితే సానుకూలం అవుతుంది కాబట్టి ఆమె తన తోటి గొల్లపిల్లలందరిని కూడగట్టింది. ఆమె గోపికలకు బోధించిన వ్రతవిధానం, అవలంబించవలసిన నియమనిష్ఠలు సామాన్యులు మాటాడుకునే వ్యావహారిక తమిళంలో కూర్చినా అవి మహోన్నతమైన దివ్యపాశురాలుగా, వేదోపనిషత్తుల, ఇతిహాస, పురాణాల సారాంశంగా, మహామంత్రార్థ సారంగా వినుతికెక్కాయి. రోజుకొక్క పాశురంగా ఆండాళ్ 30 రోజులపాటు ధనుర్మాస వ్రతం పేరిట ఈ 30 పాశురాలను రచించి, ఆ పాటలకు ఆనాటి కవిసంప్రాదాయం పాటిస్తూ ‘సంగత్తమిళ మాలై ముప్పత్త్’ అని పద్యాల సంఖ్యను బట్టి ప్రబంధానికి నామకరణం చేసుకుంది. కాలక్రమేణా ఆచార్యవర్యులు ఈ పాశురమాలకు ‘తిరుప్పావై’గా పేరు స్థిరపరచి సంభావించారు.
ఈ మార్గశిరమాసంలో ఆస్తికులంతా ప్రతిరోజూ పారాయణం చేసే ‘తిరుప్పావై’ యుగాల క్రితం ఆండాళ్ కూర్చినదైనా నేటి అత్యాధునిక యుగానికి కూడా వర్తిస్తుందన్నది ఒక అద్భుత విషయం. అందుకే ‘సంగం కవుల’ కాలం నాటి ఈ మహాకావ్యం ‘సజీవ సాహిత్యం’ గా పేరుపొందింది. నేటి సమాజానికి వర్తించే విశేషాలెన్నో యుగయుగాల క్రితం ఆండాళ్ అన్యాపదేశంగా తన ‘పల్లెపద్యాల’లో ప్రస్తావించింది.
‘తిరుప్పావై’ (శుభప్రదమైన వ్రతం) పద్య ప్రబంధాన్ని నేటి పరిభాషలో ఒక ‘నిర్వాహణా మార్గదర్శిని’ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత బహుళజాతీయ,తదితర సంస్థలలో నిర్వాహక పదవులలో (మేనేజర్లుగా) పనిచేసే ఉన్నత విద్యావంతులు నేడు అవలంబిస్తున్న మౌలిక సూత్రాలు ఎప్పుడో ఎనిమిదవ శతాబ్దంలో ఒక చిన్న పల్లెటూరిపిల్ల ఆడుతూ, పాడుతూ వ్యావహారిక భాషలో చెప్పియుండటం అద్భుతమైన విషయం కదూ! ఒక వ్యక్తి ఒక ధ్యేయాన్ని ఏర్పరచుకుని, సూటిగా ఆ దిశలో పురోగమించి, అనుకున్న సమయానికి, అనుకున్న విధంగా ఆ ధ్యేయాన్ని సాధించటం ఎలా సాధ్యమౌతుందో ఆండాళ్ పామరులకు సైతం అర్థమయ్యేటట్లు ఆనాడే విడమరచి చెప్పింది.
ఈనాటి నిర్వాహణా నియమావళి ధ్యేయమనేది ఏమిటో, ఎందుకు ఏర్పరచుకున్నారో మొదట్లోనే స్పష్టంగా అర్థం చేసుకొమ్మని చెబుతుంది. ధ్యేయాన్ని సాకారం చేసే బృందంలో పాల్గొనే సభ్యులందిరికీ అలా పాటుపడటం వల్ల ఒనగూడే ప్రయోజనాల గురించి బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే సమకూరే ప్రయోజనం పట్ల సభ్యులకు తగినంత ఆసక్తి ఉండటం కార్యసిద్ధికి ఆవశ్యకం కదా. తరువాత, ధ్యేయాన్ని సాధించేందుకు అవలంబించే ప్రక్రియ గురించి బృందానికి విశదంగా తెలియాలి. అందుకు అవసరమైన క్రమశిక్షణను అమలు చెయ్యటం, ధ్యేయనిష్ఠను పటిష్టం చెయ్యటం నిర్వహణాధికారి బాధ్యత. బృందంలో పాల్గొనే అభ్యర్థుల(సభ్యుల) యోగ్యతలను పరిశీలించి వారిని ఎన్నుకోవటం, బలహీనతలను గుర్తించటం, తగిన విధంగా ప్రోత్సహించి దిద్దుబాటు నిర్వహించటం కూడా అధికారి గురుతర బాధ్యతలలో ఒకటి. బృందసభ్యులు చిత్తశుద్ధితో కార్యోన్ముఖులు కావాలంటే నాయకుడైన అధికారి సమర్థుడై ఉండాలి. బృందాన్ని సామరస్యంగా ఒక్కమాట మీద నడిపిస్తూ, వచ్చే అడ్డంకులను అధిగమిస్తూ, సభ్యులంతా ధ్యేయతత్పరతతో ఆశయసాధన కోసం పాటుపడేలా దారిచూపాలి. తిరుప్పావైలో ఆండాళ్ ఈ నియమావళిని ఏ విధంగా అమలుపరచి తన ధ్యేయాన్ని విజయవంతంగా, పదుగురికీ పనికివచ్చే విధంగా సాధించిందో అర్థం చేసుకుందాం.
ఆండాళ్ ఒక కార్యసాధన నిర్వాహకురాలని అనుకుందాం (ప్రాజెక్ట్ మేనేజర్). ఆమె చేయదలచిన పని ఉన్నతమైనది, ఉదాత్తమైనది – భగవానుని సాయుజ్యాన్ని పొందటం ఆమె ధ్యేయం. ఆమె ఒంటరిగానే భగవంతుని పొందగలిగే సమర్థురాలు. భగవంతుడు అందరివాడని, అందరికీ అవసరమైనవాడని, ఆయన అందరితో పంచుకోవలసిన గొప్ప ఐశ్వర్యమని ఆమె నమ్మకం. అందుకే ముందుగా అందరినీ కూడగట్టుకునే ప్రణాళిక వేసుకుంది. రెండవది – తనవంటి సహధర్మిణుల సాంగత్యం ఎంతో సహాయకారి కావటం చేత ఆ సాంగత్యం సత్వరమే భగవానుని చేరువకు తీసుకు వెళ్తుంది. మూడవ విషయం – రుచికరమైన పదార్థాలను ఒంటరిగా భుజించరాదని పెద్దలు చెప్పారు. భోజ్యవస్తువులకే ఈ నియమం ఉన్నప్పుడు, అన్నింటికంటే మధురమైన భగవన్నామస్మరణ నలుగురితో కలిసి చెయ్యటంలో ఉన్న ఆనందం వర్ణనాతీతం అని ఆండాళ్ భావన. అందుకే గోకులంలో గొల్లపడుచులందరిని మార్గశిర స్నానానికి ఆహ్వానిస్తుంది ఆండాళ్. పాడిపంటలు, పశుసంపదలనే అంతులేని ఐశ్వర్యంతో అలరారుతున్న గోకులంలోని గోపికలను ‘భూషణాలంకృతులైన అందగత్తెలారా’ అని సంబోధిస్తుంది. ఆమె భావనలో ఆ అమాయక గొల్లపిల్లల శమదమాలు, పరిశుద్ధ అంతరంగాలు వారికి పెట్టని ఆభరణాలు. భగవానుని ఆకర్షించే ఆభూషణాలు అవే!
ఆండాళ్ ప్రస్తావించే ‘పర’ పదానికి ఎన్నో విశేషార్థాలు. భేరీవాద్యం, ఢక్క అనేది ఒక అర్థమైతే పరమపదమని, సాయుజ్యమని, భగవత్సమాగమమని మరొక అర్థం. ‘ఈ పర అనే వరాన్ని భగవానుడు కటాక్షిస్తే కనుక లోకమంతా ఏకమై మనలను ప్రశంసిస్తుంది’ అని చెలులతో చెబుతుంది ఆండాళ్. పాశురమాలలో మొదట ఈ విషయం చెప్పి మరీ తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతుంది ఆమె. తాను వ్రతాచరణకై ఏర్పరచిన నియమనిష్ఠలను చెలులకు వినసొంపైన పాటలుగా విన్పిస్తుంది. ధ్యేయనిష్ఠ, క్రమశిక్షణ లేకుండా ఎటువంటి యోజన సాకారం కాదు. ‘తెల్లవారుఝామున నదీస్నానం చేస్తాము. నెయ్యి, పాలు వంటి సమృద్ధమైనవి ఈ వ్రతసమయంలో దూరంగా ఉంచుతాము. శారీరక అలంకారాలైన కాటుక, పువ్వులతో అలంకారం చేసుకోము. వ్రతదీక్షలో ఉన్న మేము ఇతరులకు అపకీర్తి కలుగజేసే దుష్ప్రచారాలు చెయ్యము, అకృత్యాలకు,కల్లలకు దూరంగా ఉంటాము. ఉదారబుద్ధితో దానధర్మాలు చేస్తాము. సంతృప్తులుగా జీవించేందుకు నిష్కాపట్యమైన జీవనవిధానాలను (బతుకుతెరువులను) మాత్రమే అవలంబిస్తాము.’
నేటి ప్రపంచంలో, అన్ని సమాజాలలో ఆధ్యాత్మిక గురువుల ప్రాముఖ్యం అందరమూ టీవీలలో, నిజజీవితంలోను చూస్తున్నదే. యువత కూడా సకారాత్మక ధోరణి, ధ్యానము, (Meditation, Positive Thinking, Self- Help) ప్రాణాయామం, యోగము మొదలైనవాటి పట్ల ఆకర్షితులౌతున్నారు. బహుళ జాతి సంస్థలు తమ ఉద్యోగుల మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్నాయి, శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఉద్యోగులు సమర్థవంతంగా ఆలోచించి పనిచేస్తే తప్ప సంస్థలు పురోగమించవని అవి తెలుసుకున్నాయి. సత్సంగాలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పడుతున్నాయి. మంచిమాటలు వినాలని అందరూ కోరుకుంటున్నారు. కార్పోరేట్ వ్యవస్థలు సమాజహితం పట్ల తమ వంతు బాధ్యతను నిర్వర్తించే తీవ్రప్రయత్నం చేస్తున్నాయి (Corporate Social Responsibility ). భక్తి, విశ్వమానవ ప్రేమ, సౌశీల్యమే తన పెట్టుబడిగా ఆండాళ్ ఆ యుగంలోనే తనకున్న పరిధిలో ఉన్నతాశయం సాధించటానికి వలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోసం తన సాటి గోపికలకు ఈ ఉన్నతమైన నియమనిష్ఠలన్నీ తప్పనిసరిగా పాటించవలసిందని ఆదేశిస్తున్నది. మరి ఆధ్యాత్మిక పరిణతి వల్లనే కదా ఉదాత్తమైన ధ్యేయాలు సాకారమయ్యేది.
వ్రతనిరతలైన గోపికలు నిరుత్సాహపడి వెనుకంజ వెయ్యకుండా ఆండాళ్ ఈ నోము నోచటం వల్ల లభ్యమయ్యే లౌకిక ప్రయోజనాలను ఏకరువు పెడుతుంది. ‘చెలులారా, మనమంతా ఈ వ్రతం చేయటం వల్ల రామరాజ్యంలోలాగా నెలకు మూడువానలు కురిసి కరువుకాటకాలు నశిస్తాయి. చెరువులు నీటితో నిండి చేపలు తుళ్ళుతూ ఎగురుతూ ఆనందిస్తాయి. వికసించిన పుష్పాలు తుమ్మెదలను ఆకర్షిస్తాయి. తుమ్మెదలు ఎక్కువగా మధువును గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. పొదుగుల నిండా పాలతో పశువులు బయళ్లలో తిరుగుతుంటాయి. ఒక్కమాటలో మన వ్రేపల్లె పాడిపంటలతో విలసిల్లుతుంది.’ ఇలా వ్రతాచరణ లాభాలు తన చెలులకు వివరంగా చెప్పి ఆండాళ్ రెండు ప్రయోజనాలను ఆశిస్తున్నది. తన చెలులకు, తద్వారా ప్రపంచానికి తాము సంకల్పించిన వ్రతం ఒనగూర్చే గొప్ప మేలు తమకు మాత్రమే గాక యావత్ సమాజహితం కోసమని; తన చెలులు తాను ఏర్పరచిన నియమాలను తు.చ. తప్పక, ఇష్టంగా పాటించాలని, అలా పాటించి సంఘశ్రేయస్సుకు వాళ్ళు కూడా పరికరాలు అవాలని!
వర్షం వల్ల పల్లెపట్టుకు చేకూరే లాభాలను పేర్కొన్న తరువాత ఆండాళ్ భగవానుని అనుగ్రహవర్షం తమ మీద కురిసి గతంలో, వర్తమానంలో పేరుకుపోయినవే గాక భవిష్యత్తులో వచ్చిపడే ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలన్నీ మంటలకు ఆహుతైన కట్టెలవలె భస్మీపటలం కాగలవని బోధిస్తుంది. అయితే అందుకు పరిపూర్ణమైన పవిత్రభావంతో, విధేయతతో ప్రార్థించటం ఆవశ్యకమని చెబుతుంది. వ్రతం వల్ల చేకూరే ఆధ్యాత్మిక ప్రయోజనం గురించిన ప్రస్తావన ఇది. ఆమె తన ఆశయాలను ప్రోత్సహించి, సహకరించి సార్థకం చేసే కార్యసాధకులను కూడగట్టుకుని వారిని వ్రతానికి సమాయత్తపరుస్తున్నది. ఆండాళ్ ఇక్కడ ఒక మంచి నిర్వాహకురాలిగా, (Manager) సుస్పష్టమైన ఉద్దేశాలతో, తన ధ్యేయంపై ఏకాగ్రదృష్టి నిలిపి, తన బృందసభ్యుల నిష్ఠ, ఆసక్తి చెదరకుండా వారిని ప్రోత్సహిస్తూ, జరగబోయే మంచిని సూచిస్తూ, ఆశ కల్పిస్తూ వారికి పాపనిర్మూలనం, భగవానుని అనుగ్రహవర్షమనే స్వప్రయోజనమే గాక సంఘసేవాభాగ్యం కూడా కలుగుతుందనే లౌకిక ప్రయోజనాన్ని సూచిస్తున్నది. ఇక ఆమె తాను చేపట్టబోయే ఘనకార్యానికి, అంటే భగవానుని అనుగ్రహం కోసం పడే ప్రయాసలో పాలుపంచుకునేందుకు యోగ్యులైన గోపికలను బృందంలో భర్తీ చేసుకోబోతున్నది. ఒక్కొక్కరే ఆమె మేలుకొలుపుతో మేలుకుని ఆమె బృందంలో చేరిపోతారు.
నిద్రిస్తున్న గోపికలను ఒక్కొక్కరిని, వారివారి స్వభావాలకు తగిన విధంగా సంబోధించి, ప్రశంసిస్తూ, బయట లోకంలో జరుగుతున్న కాలక్రియలు తెలియజెపుతూ నిద్ర లేపుతుంది. వీరు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్వభావం, ఒక్కొక్క విలక్షణత గలవారు. ఆండాళ్ ఒక్కొక్కరినీ వారివారి స్వభావాలకు తగినట్లు సమీపించి ఉత్సాహపరుస్తుంది. ప్రపంచంలో అన్నిరకాల మనుషులు, మనస్తత్వాలు ఉన్నట్లే గోకులంలో ఆండాళ్ మేల్కొల్పబోయిన చెలులు రకరకాల ప్రవృత్తులు కలవారై ఉంటారు. వారినందరినీ బుజ్జగించి, బతిమిలాడి, ఆటపట్టించి, నొచ్చుకోకుండా సంభావించి తన జట్టులో చేర్చుకుంటుంది ఆండాళ్.
ఈ విధంగా ఆండాళ్ వివిధ పద్ధతులలో తన వాక్చాతుర్యాన్ని వినియోగించి కృష్ణప్రేమికలైన పది మంది గోపికలను తాను ఆచరించబోయే మార్గళి వ్రతంలో పాలుపంచుకునేందుకు సంసిద్ధులను చేస్తుంది. తాను సంకల్పించిన నోము యొక్క విధానాన్ని, అందుకోబోయే లక్ష్యాన్ని వివరించటం, ఒనగూడే లాభాన్ని సంక్షిప్తంగా తెలియజెప్పటం ఆమె ప్రత్యేకత.
ఒక మంచి సమర్థవంతమైన భక్తబృందం లేదా గోష్ఠి (అభ్యర్థులు/ఉద్యోగుల సమూహం) ఏర్పరచుకున్న తరువాత ఆండాళ్ యథాక్రమంగా, ఒకటి తరువాత ఒకటిగా, తన ‘పని’ తాను చేసుకుంటూ పోతుంది. ఇది అనాది నుంచీ ప్రాజ్ఞులు సూచిస్తూ వచ్చిన సక్రమ పద్ధతి. లౌకిక, ఆధ్యాత్మిక విషయాలలో ఈ క్రమపద్ధతి బహుధా ఆచరణీయమని జనవాక్యం.
మొదటగా బృందం నందగోప మహారాజు రాజప్రాసాదానికి చేరుకుని, మహాద్వారాలకు కాపలా ఉన్న కావలిభటుడి సహాయం అర్థిస్తుంది. ఆండాళ్ తాను, తన చెలులైన గోపికలు పవిత్రమైన అంతఃకరణంతో అక్కడికి వచ్చామని, కృష్ణుడే వ్రతసామగ్రి వాగ్దానం చేసాడని, గోకులం క్షేమం కోసం, క్షామాన్ని అరికట్టటానికి వ్రతం చెయ్యమని కులపెద్దలు తమను నియమించారని కాపలాభటుడితో చెబుతుంది. గోపికలు కాపలాభటుడిని వినయంగా అనుమతి అర్థించటమే గాక ఆతడిలోని కారుణ్యభావాన్ని తట్టిలేపుతూ, ఎంతో ప్రేమపూర్వకంగా ‘తల్లివంటి కారుణ్యమూర్తి’ అనే భావం వచ్చే మాటలలో సంబోధిస్తారు. కావలిభటుడు ఆ గొల్లపిల్లల పట్ల సానుభూతి, వాత్సల్యాలతో ద్వారాలు తెరిచి లోపలికి అనుమతిస్తాడు. లోపలికి వెళ్లిన గోపికల బృందం ప్రభువైన నందగోపుడిని, యశోదాదేవిని, బలరాముడికి మేల్కొల్పుతూ వారికి శుభము, మంగళము కాంక్షిస్తూ వారి ఔన్నత్యాన్ని, విశిష్టతలను పేర్కొని ప్రశంసిస్తారు. నందగోపుని దాతృత్వాన్ని, యశోదాదేవి సౌశీల్యాన్ని, సౌభాగ్యాన్ని, బలరామదేవుని శౌర్యపరాక్రమాలకు చిహ్నమైన అతడి కాలి కంకణాన్ని గోపికలు స్తుతిస్తారు.
ఈ పెద్దలు ముగ్గురినీ సన్నుతించి (అనుమతి పొందిన తరువాత) కృష్ణస్వామి దేవేరి ఐన ‘నప్పిన్న’ (నీళాదేవి అవతారంగా ప్రసిద్ధం) మందిరానికి చేరి ఆమెకు సుప్రభాతం పాడతారు. నప్పిన్న కృష్ణుని మేనమామ కూతురు. పోటెత్తిన భయంకరమైన కోడెలను అదుపుచేసి పెళ్ళిపందెంలో ఆమెను గెలుచుకుని వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణుడు. గోకులంలో నప్పిన్న కృష్ణునికి అత్యంత ప్రియతమురాలిగా ప్రసిద్ధురాలు. ఆమె కటాక్షం ఆండాళ్, తదితర గోపికలకు అత్యంత కీలకం. ఆమె మాత్రమే కృష్ణునికీ (పరమాత్మునికీ) గోపికలకు (భక్తులకు) సంధానకర్త. దీనిని శ్రీవైష్ణవ ఆధ్యాత్మిక పరిభాషలో ‘పురుషకారం’ అంటారు. (స్వామితో ప్రపన్నుల పక్షాన విన్నపం చేసి ఆయన కటాక్షాన్ని ఒనగూర్చే తల్లి!) నప్పిన్నను ఉద్దేశించి –
‘అమ్మా, మదపుటేనుగులను సైతం నిలువరించగల మహాబలశాలి నందుని కోడలా! ఎంతటి అందమైన, నల్లని, పరిమళభరితమైన కురులమ్మా నీవి! చేతిలో పూలబంతితో క్రీడిస్తూ రసికతతో విలసిల్లుతావు. ఎర్రని కలువకాంతుల సున్నితత్వంతో నీ అరచేతులు కలువమొగ్గలేననిపిస్తాయి. నీ ముంజేతులు ఆభరణాల ధగధగలతో విరాజిల్లుతాయి.’ ఇలా నప్పిన్నను తన స్తోత్రంతో ప్రసన్నురాలిని చేసుకుంటూ ఆండాళ్ కృష్ణుడినీ, నప్పిన్ననూ ఒకరి తరువాత ఒకరిని తన విన్నపాలతో కదిలించి వేస్తుంది.
కృష్ణుని సుముఖుడిని చేసుకోవాలంటే ఆయనకు ప్రియమైన దేవేరి అనుగ్రహం తమకు కీలకమని ఆండాళ్ ఎరుగును. నప్పిన్నకు కృష్ణుడు వశుడు (భక్తసులభుడు). మానసికశాస్త్రం పట్ల అపూర్వమైన అవగాహన గల ఆండాళ్ నప్పిన్న మనసు కరిగే మాటలతో ఆమెను దీనంగా ప్రార్థిస్తుంది. ఆండాళ్ తనకొక అద్దం, వింజామర, ‘ఆ రెంటితో పాటు నీ ప్రాణవిభుడైన శ్రీకృష్ణుని మాకు వ్రతాచరణ కోసం అనుగ్రహించమ్మా’ అని ప్రాధేయపడుతుంది. ఈ విన్నపంతో అంతిమ ఉపాయంగా ఆండాళ్, ఆమె సఖులు శోకాకుల హృదయాలతో తమను దయ చూడమని, నోము ఫలప్రదం చెయ్యటానికి సహకరించమని ప్రార్థిస్తారు. కృష్ణ భగవానుడు మేల్కొని, లేచి వారి వైపు రావటం చూచి ఆనందపారవశ్యంతో వివిధ అవతారాలలో ఆయన ప్రదర్శించిన అద్భుత లీలలను గానం చేస్తారు.
తరువాత కృష్ణునితో తాము కోరిన ‘పర’ (ఢక్క/భేరీ) ప్రసాదించమని విన్నవించుకుంటారు. శ్రీకృష్ణుడు తమ వంక కృపాదృష్టితో చూడటం, అనుకూలంగా స్పందించటంగా భావించిన గోపికలు తమకు కావలసిన ఇతరములైన వ్రతసామగ్రి – శంఖం, ఛత్రం, దీపస్తంభాలు ఇప్పించమని ఏకరువు పెడతారు. కృష్ణుడు వారు కోరినవి ప్రసాదించటంతో గోపికలు హర్షాతిరేకంతో ఆయనను స్తోత్రం చేసి, తాము ఆతని పరత్వాన్ని ఎఱుగక ఆడిన మాటలను, చేసిన తప్పులను, అనుచిత ప్రవర్తనను మన్నించమని క్షమాభిక్ష వేడుకుంటారు. అంతిమంగా ఆండాళ్, గోపికలు తమను తాము భగవానునికి దాసానుదాసులుగా సమర్పించుకుని, తమకు శాశ్వత కైంకర్యం మాత్రమే కావాలని, అది కాక ఇతరములైన కోరికలన్నీ తమలో పొడసూపకుండా నిర్మూలించమని శరణు వేడుకుంటారు.
ఆండాళ్ ఇక్కడ తాను సంకల్పించిన కార్యాన్ని విజయవంతంగా సాధించింది. తిరుప్పావై పాశురాల ఫలశ్రుతిలో ఆమె ఈ పాశురాల పఠనం భగవానుని అపార కృపాకటాక్షాలను ఒనగూరుస్తుందని వాగ్దానం చేస్తుంది. ఆండాళ్ ఈ దివ్యప్రబంధం ద్వారా ఒక అత్యున్నతమైన సజీవ సాహిత్య సంపదను ప్రపన్నులకే గాక పాఠకలోకానికి కానుక చేసింది. అన్ని కాలాలకు వర్తించే లోతైన మానసికతత్త్వ పరిశీలన అనే అంశం ఈ పాశురగ్రంథంలో ఆండాళ్ వ్యక్తం చేసే ఎన్నెన్నో అద్భుత అంశాలలో ఒకటి మాత్రమే!
నిజానికి పల్లెపదాలైన ఈ పాశురాలు ‘ప్రపత్తి’ లేదా శరణాగతి అనే ఉదాత్తమైన అంశానికి సంబంధించినవైనా, నేటికీ ఉపకరించే ఆధునికమూ, విశ్వజనీనమునైన విలువలను ప్రబోధిస్తాయి. పెద్దలకే గాదు, పిల్లలకూ పరహితం, సేవ, సహకారం, మానసిక ,శారీరక క్రమశిక్షణ వంటివి ఈ ప్రబంధాన్ని అర్థం చేసుకోవటం ద్వారా కలుగుతాయి.
ఆండాళ్ తిరువడిగళే శరణం.
***
గురుదేవులు కీ.శే. శ్రీమాన్ మద్రాస్ కృష్ణస్వామి శ్రీనివాసగారికి అంకితం.
చిత్రాలు: కేశవ్ వేంకటరాఘవన్ అనుమతితో –