కాజాల్లాంటి బాజాలు-78: టిట్ ఫర్ టాట్

8
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మ[/dropcap]ధ్యాహ్నం ఒంటిగంటకి అన్నయ్య దగ్గర్నించి ఫోన్ వచ్చింది. అది అన్నయ్యకి ఆఫీసులో లంచ్ టైమ్. ఏవైనా విశేషాలు చెప్పాలంటే ఆ టైమ్ లోనే ఫోన్ చేస్తుంటాడు అన్నయ్య. వెంటనే అడిగేను, “ఏంటి అన్నయ్యా కబుర్లూ..” అంటూ.

“చెల్లాయ్, మీ వదిన మహా తెలివైందనీ, నన్నేదో ఆటబొమ్మని చేసి ఆడిస్తుందనీ నువ్వనుకుంటున్నావని నాకు తెల్సు.. కానీ నీ ఆలోచన తప్పని చెప్పడానికే ఇప్పుడు ఫోన్ చేసేను.”

అన్నయ్య మాటల్లో ఒకింత అతిశయం కనిపించింది నాకు.

“అసలేమైందన్నయ్యా..”

“పొద్దున్న మీ వదిన ఆన్‌లైన్‌లో చీరలు కొంటుంటే నా వాగ్ధాటితో కొనకుండా ఆపేసేను..”

వెంటనే నాకు అన్నయ్య ఆఫీసుకి వెళ్ళేక వదిన ఫోన్ చేసి జరిగిందంతా చెప్పడం గుర్తొచ్చింది.

“ఓహ్.. కంగ్రాట్స్ అన్నయ్యా..వదిన అంతా చెప్పింది.” అన్నాను నేను కూడా అన్నయ్య ఆనందంలో పాలు పంచుకుంటూ.

“చెప్పిందా.. హ హ .. సరే అయితే వుంటా మరి..” అంటూ ఫోన్ పెట్టేసేడు అన్నయ్య.

అన్నయ్య ఫోన్ పెట్టేసేక నాకు వదిన చెప్పిందంతా కళ్ళముందు దృశ్యంలా కదలాడింది.

రోజూలానే నేనూ, వదినా పనులయ్యేక ఫోన్‌లో కబుర్లు చెప్పుకుంటున్నాం..

“ఇవాళ మీ అన్నయ్యతో చిన్న వాదులాట అయింది స్వర్ణా.”

“ఏమైంది?” ఆతృతగా అడిగేను.

“పొద్దున్న ఆన్‌లైన్‌లో చీరలు తెప్పించుకుంటూ ఏ రంగులు బాగుంటాయని మీ అన్నయ్య నడిగితే ‘ఆమధ్య ఆన్‌లైన్‌లో చీరలు తెప్పించుకుని, బట్ట బాగులేదని ఎవరికో అంటగట్టేసేవు కదా. ఇప్పుడు మటుకు బట్ట బాగుంటుందని నమ్మకం యేంటీ!’ అన్నారు.

పైగా ‘అసలిప్పుడు చీర లెందుకు… బైటకే వెళ్ళటంలేదు కదా! అయినా బీరువాలో బోల్డు చీరలు కట్టకుండా అలాగే వున్నాయికదా… అంతా సద్దుకున్నాక చక్కగా షాప్‌కి వెళ్ళి బట్టా, రంగూ చూసుకుని కొనుక్కుందువుగానీ’ అన్నారు. కానీ స్వర్ణా, నువ్వే చెప్పు.. అసలీ యేడాది పైనుంచీ బైటకి వెళ్ళటం లేదన్న మాటే కానీ మనం యేది మానేం చెప్పూ.. అన్ని మీటింగులూ జూమ్ లోనే చేసుకుంటున్నాం కదా.”

“అవును కదా!”

“మరి ఆ మీటింగులకి వున్న చీరలన్నీ కట్టేసేం కదా..”

“కదా!”

“సాహిత్యం మీటింగులకీ, సంగీతం క్లాసులకీ, స్కూల్‌మేట్స్ మీటింగ్‌కీ, కాలేజీ రీయూనియన్‌కీ, రాణీ జూమ్‌లో చేసిన పుస్తకావిష్కరణకీ, చుట్టాల కలయికకీ, కుటుంబం మీట్‌కీ, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లకీ, అత్తలు చేసిన సత్సంగానికీ, పెద్దమ్మవాళ్ళూ చేసిన లలితా సహస్రానికీ, మొత్తం ప్రపంచమంతా కలిసి చేసిన హనుమాన్ చాలీసా పారాయణానికీ…యింకా యింకా యెన్నింటికో కట్టుకున్నామా లేదా..”

ఊపిరాడకుండా వదిన చెప్పింది వింటూ “ఊ..” అన్నాను.

“ఆ మాటే చెప్పేను మీ అన్నయ్యకి. అబ్బే.. ఎంత చెప్పినా వినరే.. జూమ్ మీటింగుల్లో చీరలేం కనిపిస్తాయీ అంటారేంటీ.. అసలు మనకి ముందు కనిపించేవి అవే కదా..”

“అవును కదా.”

“అబ్బే, ఎంత చెప్పినా మీ అన్నయ్య వినిపించుకోకుండా నన్ను బీరువాముందు నిలబెట్టి ముందు ఈ చీరలన్నీ కట్టుకో అన్నారు.”

“అంటే నువ్వు సరేనన్నావా?”

“నేనా.. హబ్బే.. ఈ ఉప్పాడ చీర సాహిత్యసభకి కట్టేసేనూ, ఈ గద్వాల మొన్న పిన్నికూతురు యెంగేజ్‌మెంట్ కి కట్టేసేనూ, ఈ ఇక్కత్ చీర లలితాసహస్రానికి కట్టేసేనూ అంటూ విడమర్చి మరీ చెప్పేను. ఎంత చెప్పినా వినిపించుకోరే. పైగా అయితే ఇప్పుడీ ఇక్కత్ చీర సాహిత్యసభకీ,. గద్వాల్ లలితాసహస్రానికి అలా ఇటూ అటూ మార్చి కట్టుకోమంటారు. అన్ని చీరలూ అందరూ చూసేసేరని చెపితే గద్వాల్ కట్టుకుని ఉప్పాడచీర అని చెప్పూ, పోచంపల్లి కట్టి కంచిదని చెప్పూ అంటూ వితండవాదం మొదలెట్టేరు. అయినా ఈ మగవాళ్లకి మన చీరల సంగతులేం తెలుస్తాయి చెప్పూ..”

“నిజవే..మరన్నయ్యకి వివరంగా ఆ మాట చెప్పేవా?” అడిగేను ఆసక్తిగా.

“ఊహు.. అలా చెపితే వాళ్ళకి అర్ధం అవదు. ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి.” అంది గంభీరంగా.

“అంటే ఎలా చెప్తావ్?”

“చూస్తావుగా..” అంటూ ఫోన్ పెట్టేసిన వదిన యేం చేస్తుందా అని యిప్పటిదాకా ఆలోచిస్తున్న నాకు ఇప్పుడు ఇలా అన్నయ్య ఫోన్ చేసి అంత ఆనందంగా చెపుతుంటే ఆ ఆనందం ఎంతసేపుంటుందా అని భయమేసింది.

రాత్రి తొమ్మిదిగంటలకి వదిన దగ్గర్నించి నాకు ఒక వీడియో లింక్ వచ్చింది. అది వదిన యూ ట్యూబ్ చానల్ లింక్. అంటే మళ్ళీ యేదో వీడియో తీసి పెట్టేసిందన్నమాట అనుకుంటూ ఆ లింక్ క్లిక్ చేసేను.

ఆ షార్ట్ ఫిల్మ్ పేరు “టిట్ ఫర్ టాట్”.

టైటిల్స్ పూర్తవగానే స్క్రీన్ మీద ఒక డైనింగ్ టేబుల్, రెండు కుర్చీలూ కనిపించేయి. అక్కడ ఒకబ్బాయి కూర్చుని భోంచేస్తుంటే పక్కనున్న అమ్మాయి వడ్డిస్తోంది.

ప్లేట్లో వడ్డించిన అన్నం చూసి ఆ అబ్బాయి బిక్కమొహం పెట్టేసేడు.

“ఇప్పుడూ అన్నమేనా..” అన్నాడు ఏడుపు గొంతుతో.

పక్కనున్నమ్మాయి వడ్డిస్తూ,

“అబ్బే.. ఇది అన్నం కాదు. చపాతీలు. ఇదిగో ఇది ఆలూ కూర..” అంటూ గరిటతో మజ్జిగ వడ్డించింది.

“ఇదన్యాయం. పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్‌కి అన్నం వడ్డించి ఆవకాయేసి ఇడ్లీ సాంబారన్నావు. మధ్యాహ్నం లంచ్‌కి మళ్ళీ అన్నమే వడ్డించి పెరుగు చెంచా చెంచా వడ్డిస్తూ ‘ఇది పప్పు, ఇది గుత్తివంకాయకూర, ఇది ముక్కలపులుసు, ఇది పెరుగూ’ అంటూ చెప్పేవు. ఇంక సాయంత్రం కాసిన్ని అటుకులు ఓ కప్పులో వేసి అందులో ఓ నూన్చుక్కా, ఓ స్పూన్ పప్పులపొడీ వేసి ‘ఇదిగో స్నాక్’ అంటూ ముద్దుగా చేతిలో పెట్టేవు” అంటున్న ఆ అబ్బాయి మాటలని మధ్యలోనే ఆపి ఆ అమ్మాయి

“అదేంటీ…చిన్నప్పుడు అటుకులకోసం మీరు కిందపడి దొర్లుతూ ఏడ్చేవారని మీ అమ్మగారు చెప్పేరూ..” అంది దీర్ఘం తీస్తూ.

దానికా అబ్బాయి మొహం ఓ పక్కకి తిప్పేసుకుని నెమ్మదిగా తనలో తనే అనుకున్నాడు.

‘హూ…ఈ అమ్మలేమిటో…వట్టి వెర్రివాళ్ళు. పెళ్ళవగానే పెళ్ళానికి మా అబ్బాయి కిదిష్టం, ఇదిష్టంలేదూ అంటూ వాళ్ళు చేసిన అల్లర్లతో సహా చెప్పేస్తారు. చిన్నతనంలో తెలిసీ తెలీకా బోల్డు అల్లర్లు చేస్తాం. కానీ ఈ పెళ్ళాలు మటుకు అందులో యేది వెక్కిరించాలో దాన్ని మాత్రవే తీసుకుని యిలా టార్చర్ పెట్టేస్తారు.’

“ఏవిటీ.. ఏదో గొణుక్కుంటున్నారూ!” ఆ అమ్మాయి గట్టిగానే అడిగింది.

“హబ్బే… హేవీలేదూ.. ఆలూకూర చాలా బాగుందీ…ఇంకొంచెం వెయ్యీ..అంటున్నాను..” అన్నాడు యేడుపు మొహంతో.

“తొందరగా తినండి. నాకు మళ్ళీ జూమ్ మీటింగ్ వుంది. ఇదివరకు సంగీతం క్లాసుకి కట్టుకున్న గద్వాల్ చీర కట్టుకుని సాహిత్యసభకి వెళ్ళాలి..” తొందరపెట్టిందా అమ్మాయి.

ఆ మజ్జిగా అన్నాన్ని ఏడుపుమొహం పెట్టుకుని గుటుకూ గుటుకూ మింగేస్తున్నాడా అబ్బాయి వీడియోలో..

అది చూసిన నాకు పాపం అన్నయ్యకి ఈరాత్రి నీళ్ళమజ్జిగా అన్నమేనని అర్ధమైపోయింది.

వెంటనే వదినకి ఫోన్ చేసి “వదినా, ఈ వీడియో అన్నయ్య చూసేడా..” అనడిగేను.

“చూడకేం.. చూసేరు కనకే ఆన్‌లైన్‌లో చీరలకి వరసగా ఆర్డర్లు పెట్టేస్తున్నారు..” అంది పకపకా నవ్వుతూ.

హమ్మ వదినా.. అనుకున్నాను నవ్వుకుంటూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here