తితిక్ష

2
3

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘తితిక్ష’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

[dropcap]‘శీ[/dropcap]తోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం తితిక్ష’ – తత్త్వ బోధ

~

స్వామీ బ్రహ్మ విద్యానంద సరస్వతీ వారిని శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు భిక్షకు ఆహ్వానించారు. స్వామిజీ తన నలుగురు శిష్యులతో కలసి వెళ్ళారు. అప్పటికే హాలులో కుర్చీలు వేసి వున్నాయి. ఇరుగూ పొరుగూ మహిళలు కూర్చుని సత్సంగం చేసుకుంటున్నారు. స్వామీజీని తగిన ఆసనం మీద కూర్చుండజేసి అందరూ వరుసగా పాదాభివందనం చేశారు. స్వామీజీ అనుగ్రహ భాషణం చేయడం ప్రారంభించారు.

“దివ్యాత్మ స్వరూపులార! బంధు గణాః! అందరికీ ఈశ్వరుడు మేలు చేయు గాక! ఈ జగత్తు నామ రూపాత్మకం. అన్నీ ద్వంద్వాలే! చలి – వేడి, సుఖం – దుఃఖం, ప్రేమా – ద్వేషం, లాభం – నష్టం! ఇట్లాంటి అనేక ద్వంద్వాలతో ఈ జగత్తు నిండి వుంటుంది! అవి రెండూ ప్రక్క ప్రక్కనే కలసి వుంటాయి. ఒకటి ఎప్పుడు వెళుతుందా అని రెండోది ఎదురు చూస్తుంటుంది. వీటితో మనమే మమేకమై బాధలను భయాలను తెచ్చుకుంటాము. వాటిని నిర్లక్ష్యం చేయడం అలవర్చుకుంటే వాటంతట అవే తొలగిపోతాయి! నిజాన్ని నిజం కాని దానిని కలగాపులగం చేయుటే జీవితంలోని దుఃఖానికి హేతువు అవుతుంది. నిజానికి ఈ సుఖదుఃఖాలు సృష్టిలో వుండవు. అవి మన మనసుల్లో వుంటాయి. మీరందరూ సరైన పద్ధతిలో ధ్యానం చేయండి. ఆ ధ్యానం మీ నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలను తీసివేసేదై వుండాలి. మంచం మీద పడుకొన్న వాడే క్రింద పడతాడు కానీ క్రిందే పరున్న వాడు క్రింద పడే అవకాశమే లేదు. ఎప్పుడూ విషయాల నుండి వచ్చే సుఖాలు దుఃఖాన్నే మిగులుస్తాయి. ఆ దుఃఖానికి మందు తితిక్ష (సహనం). ఈ శరీరం మనకు సృష్టి క్రమంలో వచ్చింది. ఏది వచ్చినా అది పోక తప్పదు. ఒక ఎండిన ఆకు చెట్టు నుండి రాలినంత సులభంగా జీవి మరణించాలి! మరణాన్ని సంక్షోభంగా తయారు చేసుకోరాదు. ఇట్ ఈజ్ ఆల్సో యాన్ ఈవెంట్ లైక్ అదర్ ఈవెంట్స్ ఆఫ్ ద లైఫ్!

తక్కువగా మాట్లాడడం ‘దమ’. తక్కువగా ఆలోచించడం ‘సమ’. సమ – దమాదులను పాటించడం ద్వారా మనం ద్వంద్వాలను అధిగమించవచ్చు!” స్వామీజీ అనుగ్రహ భాషణం ముగించారు.

దొంగల భారతమ్మ గారు “స్వామిజీ! ఈ ద్వంద్వాల నివారణ ఉపాయం ఏమిటి? ఏ దేవతలను ఆరాధించాలి? ఏ గుడులను సందర్శించాలి? ఏ నోములు, వ్రతాలూ చేయాలి” అని అడిగారు.

“అస్పర్శ యోగం అందరూ అలవర్చుకుంటే ద్వంద్వాల సమస్యే కాదు, మరే సమస్యా మనల్ని బాధించదు, భయ పెట్టదు!” చెప్పారు స్వామిజీ.

“అదేమిటి? వ్రతమా? నోమా? ఎలా చెయ్యాలి?” అడిగారు అన్నపూర్ణమ్మ గారు.

“నోము కాదు. వ్రతమూ కాదు. ఏమీ చెయ్యక పోవడమే ఆ యోగం! దేనితోనూ కలవక పోవడం, దేనికీ స్పందించక పోవడం ఈ యోగం ప్రత్యేకత! ‘డోంట్ అటాచ్ టు ఎనీ థింగ్ అండ్ కీప్ ఎంఫ్టినెస్ వితిన్ యూ’ అనేది దీని నిర్వచనం. దేనినీ అంటుకోకుండా, అంటించుకోకుండా ఆకాశంలా ఎవరు వుంటారో వారు అనుష్ఠించే యోగం ‘అస్పర్శ యోగం’. వస్తువులను వున్నవి వున్నట్టుగా చూడగలిగితే అద్భుతమైన ‘సత్యం’ మీ ముందు ఆవిష్కృతం అవుతుంది. మీరు చేయాల్సిందంతా ‘అప్రయత్న ప్రయత్నం’ మాత్రమే!

ఈ యోగం ఆత్మ సత్యాను బోధ! ఉత్తమ సాధకులకు మాత్రమే సాధ్యం! భయం ఒకడిని బానిసను చేస్తుంది. భయం లేకపోవుటే ‘మోక్షం’. రెండోది ఉన్నప్పుడే భయానికి ఆస్కారం వుంటుంది. ‘ద్వితీయాద్ భయం భవతీ’! కానీ సంసారులు ఒంటరిగా వుండటానికి భయపడతారు. ఈ సంసారులు గృహస్థుల్లోనే కాదు, బ్రహ్మచారుల్లో, సన్యాసులలో కూడా వుంటారు!

ఆత్మ ‘అసంఘ’ అనేది అస్పర్శ యోగం యొక్క దృష్టి కోణం. జ్ఞాని సుఖం గానూ వుండడు దుఃఖం గానూ వుండడు. ఒక పువ్వును లేదా ఒక పసిపాప బోసి నవ్వును చూడగానే ఆ పువ్వు అందంగా వుందనీ, ఆ పాప నవ్వు ఆనందం కలిగించిందనీ సంసారుల మనస్సుకు తోస్తుంది. అదే ఈ యోగాన్ని అనుష్ఠించే యోగి అందమని గానీ, వికారమని గానీ, ఆనందమని గానీ భావించడు. ఏ భావ వికారములు లేకుండా వున్నది వున్నట్టుగా చూస్తాడు అంతే! తమ జ్ఞానులు స్వరూప కారణమైన బ్రహ్మానందంలో రమిస్తూ వుంటారే గానీ ఈ జగత్తు కల్పించే తాత్కాలిక భ్రమలతో మమేకం కారు. ఒక చిన్న సంగతి బరువు నెత్తి మీద మొయ్యడం తేలికా? లేక బరువును దించుకోడం తేలికా?” అంటూ భాషణ ముగించారు స్వామీజీ.

“మనకు సమకాలికులైన అస్పర్శ యోగులు ఎవరైనా వున్నారా స్వామీజీ?” అన్నపూర్ణ గారు అడిగారు.

“వున్నారు. సికింద్రాబాద్ డైమండ్ పార్క్ సర్కిల్‌లో వున్న బ్రహ్మ విద్యాకుటీరంలో వేదాంతం పాఠాలు చెప్పే స్వామీ విద్యానంద సరస్వతీ, తోటపల్లి కొండలలోని శాంతి ఆశ్రమంలో స్వామిని వినమ్రానంద సరస్వతీ, అదే ఆశ్రమ వీధుల్లో తిరుగుతూ ఈ మధ్యనే శరీర త్యాగం చేసిన అవధూత బాబా రామ్‌సింగ్‌లు నాకు స్వయంగా పరిచయం వున్న అస్పర్శ యోగులు!” చెప్పారు స్వామీజీ.

సత్సంగం ముగిసింది. భిక్ష మొదలయ్యింది. ఏదోటి మాట్లాడాలని స్వామి “అమ్మా! బెంగుళూరులో వున్న మీ పెద్దమ్మాయి కాపురం ఎలా సాగుతుంది?” అని అడిగారు. వెయ్యి వాట్స్ బల్బ్ వెలిగి నట్టు అన్నపూర్ణ గారి మోహం చాటంతయింది.

“స్వామీజీ! వాళ్ళ సంసారం చాలా బావుంది. అల్లుడు అమ్మాయి మాట జవదాటడు. మనవలు బాగా చదువుకొంటున్నారు. అల్లుడు తన జీతం మా అమ్మాయి బాంక్ అకౌంట్‌లో జమ చేసేస్తున్నాడు. మా అమ్మాయి ఇష్టం! వాళ్ళ సంసారం చూస్తుంటే ముచ్చట వేస్తుంది. అత్త, మామలు కూడా చాలా సౌమ్యులు. వారి ఇంటి కంటే స్వర్గం బావుంటుందంటే నేను నమ్మను!” చాలా ఆనందంగా ఆపకుండా చెప్పుకుపోతున్నారు.

టాపిక్ మార్చడం కోసం “మరి ముంబై లో వున్న మీ చిన్న అమ్మాయి సంగతులేమిటి?” అడిగారు స్వామీజీ. అన్నపూర్ణమ్మ గారి మొహంలో రంగులు మారిపోయాయి. కత్తి వేటుకు నెత్తురు చుక్క లేనట్టు మొహం పాలిపోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అనవసరంగా అడిగాననిపించింది స్వామీజీకి.

“ఏం చెప్పమంటారు స్వామీజీ! కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారు. అలా వుంది నా పరిస్థితి. అల్లుడు త్రాగుబోతు. బార్లు, నైట్ క్లబ్‌లే ఆటగాడి గమ్యాలు. అత్తగారు పరమ గయ్యాళి. నా కూతుర్ని నానా బాధలూ పెట్టేస్తున్నారు. అల్లుడు ఇంట్లో సరిగా డబ్బులు ఇవ్వడు. ఇల్లు గడవడం కష్టమౌతుంది. నేను ఆర్థికంగా కొంత సహాయం చేస్తుంటాను. అన్ని బాధలూ మౌనంగా భరిస్తుంది నా కూతురు. దాని సంసారాన్ని తల్చుకుంటే గుండె చెరువై పోతుంది” అన్నారు బొటబొటా కన్నీరు కారుస్తూ. ఆ దుఃఖం ఒక నదీ ప్రవాహంలా వుంది. అక్కడ వున్నవారికి ఆమెను ఎలా వూరడించాలో తెలియడం లేదు.

భిక్ష పూర్తయ్యింది. రిలాక్స్‌డ్‌గా కూర్చున్నారు.

“చూడండి అన్నపూర్ణమ్మ గారూ! సుఖ దుఃఖాలు అలానే వుంటాయి. పక్కపక్కనే అలాగే వుంటాయి. అవి సహజంగా మీలోపల వున్నవి కావు. బాహ్యం నుండి స్వీకరించినవి. బాహ్యం నుండి ఏమీ స్వీకరించకుండా నిర్వికారంగా వుంటే అవి మిమ్ము బాధించవు. ఈ ద్వంద్వముల స్వభావం అంతే! వాటిని వేరు చేయలేము. వస్తాయి – పోతాయి! మనం చేయాల్సింది వాటి స్పర్శను మనం స్వీకరించకుండా మన స్వరూపాన్ని మనం ఆవిష్కరించుకోవాలి. మన స్వరూపం ఆనందం అవదుల్లేని ఆనందం! అది తెలుసుకొంటే మీరే బ్రహ్మ! ఆనందో బ్రహ్మ!” అంటూ సాంత్వన వచనాలు పలకడంతో అన్నపూర్ణమ్మ గారు శాంతవదనులైనారు.

స్వస్తి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here